మామిడిమొక్క నాటి, అది ఎదిగి, ఫలాలు ఇచ్చే వరకు ఎదురు చూస్తుంటాం. మామిడిపంటను వాణిజ్యపరంగా పెంచే రైతులైతే కాస్త శ్రద్ధ పెట్టి దాని ఆలనా పాలనా చూస్తారు. ఏ సమయంలో ఎలాంటి ఎరువులు వేయాలో.. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో జాగ్రత్తగా చూసుకుంటారు. మామిడి మొక్కల పెంపకాన్ని కాస్త ఆసక్తిగా చేస్తే ఫలసాయం ఎక్కువ ఉంటుంది. ఆదాయమూ అలాగే పెరుగుతుంది. ఇందుకు రైతులు ప్రధానంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే.. మామిడిమొక్కకు శిక్షణ ఇవ్వడం. మొక్కకు శిక్షణ ఏమిటనే ఆశ్చర్యం కలుగుతోందా? కానీ ఇది వాస్తవం.మామిడిమొక్క నాటిన నాలుగేళ్లలో లేదా అంతకు కొంచెం ముందుగా చెట్టుగా ఎదిగి కాయలు కాస్తుంది. మొక్క ఇష్టం వచ్చినట్టు ఏపుగా.. ఎత్తుగా ఎదిగిపోతే పూతా, కాతా రావచ్చేమో. కానీ అధిక దిగుబడి మాత్రం తీసుకోలేం. అందుకే మామిడి మొక్క పైపైకి కాకుండా భూమికి సమాంతరంగా గొడుగు మాదిరిగా ఎదిగేలా శిక్షణ ఇవ్వాలంటారు నల్గొండ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి. దాంతో మామిడిచెట్టు విశాలంగా పెరుగుతుంది. గాలి, వెలుతురు చెట్టు కింది వరకు కావాల్సినంత అందుతుంది. తద్వారా మామిడిచెట్టుకు వచ్చిన పూత అత్యధికశాతం పిందెలుగా మారి, కాయలు కూడా చక్కని సైజులో వస్తాయి. అంటే కొమ్మలను నిటారుగా కాకుండా చెట్టు చుట్టూ వీలైనంత మేరకు అన్నివైపులా ఆవరించేలా కాపు వచ్చే వరకు దానికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మామిడిమొక్కకు ప్రతిఏటా ఒకటి రెండుసార్లు శిక్షణ ఇవ్వాలని అనంతరెడ్డి వివరించారు.మామిడిమొక్కకు మూడు కణుపులు వచ్చిన తర్వాత నర్సరీ నుంచి తెచ్చుకుని నాటుకోవాలి. నాటిన తర్వాత కొన్ని రోజులకు దానికి కొత్త చిగురు వస్తుంది. ఆ చిగురు కొమ్మను కణుపునకు అర అంగుళం వరకు వదిలిపెట్టి, కత్తిరించిన చోట నీరు నిల్వ ఉండకుండా ఏటవాలుగా కత్తించాలి. కొమ్మను కత్తిరించిన చోట ఫంగస్‌సోకకుండా యాంటీ సెప్టిక్ బోడోపేస్ట్, లేదా మైలతుత్తం పెట్టాలి. ఇలా చేసిన తర్వాత కొమ్మకు పక్కల నుంచి కొత్త కొమ్మలు రెండు లేదా మూడు వస్తాయి. కొత్తగా వచ్చిన కొమ్మలను కూడా మూడు కణుపులు వచ్చిన తర్వాత అర అంగుళం విడిచి కత్తిరించాలి. కొమ్మలు కనీసం పెన్సిల్ లావు మందంలో ఉన్నప్పుడే కత్తిరించాలి. దాన్నుండి కూడా మరో రెండు మూడు కొత్త కొమ్మలు వస్తాయి. అలా మొక్కను నిటారుగా కాకుంగా, గొడుగు మాదిరిగా పెరిగేలా చేయడాన్నే ట్రైనింగ్ అంటారు. ఎదిగిన చెట్టుకు ఉన్న ఎండు కొమ్మలు, వ్యాధి సోకిన, అడ్డదిడ్డంగా పెరిగిన, పనికిరాని, సూర్యరశ్మికి అడ్డుపడే కొమ్మలను కత్తిరించడాన్ని ప్రూనింగ్ అంటాం. మామిడిచెట్టు ఆరు అడుగుల ఎత్తుకు మించి ఎదగకుండా చూసుకోవాలి. శిక్షణ ద్వారా పెరిగిన మామిడిమొక్క చుట్టుపక్కలకు బాగా విస్తరిస్తుంది. పూత, కాతా కూడా అదే విధంగా వస్తుంది.
మామిడిమొక్క మూడేళ్లు ఎదిగిన తర్వాత చెట్టుపైన మధ్యలో ఉన్న కొన్ని కొమ్మలను కత్తిరించి, నేల వరకు వెలుతురు, గాలి పడేలా చేయాలి. అలాగే.. ఎండిన, డ్యామేజ్ అయిన, వ్యాధిసోకిన, కిందికి వంగి ఉండే కొమ్మలను ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ కానీ, కాయలు కాచే చెట్టుకు ప్రూనింగ్ కానీ మే, జూన్ మాసాల్లో మాత్రమే చేసుకోవాలి. వర్షాకాలంలో చేస్తే.. ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి కొమ్మలు ఎప్పుడూ పైకి 45% కోణంలో ఎదగాలని అనంతరెడ్డి సూచించారు. ఇలాంటి కొమ్మలకే ఆరోగ్యవంతమైన మొగ్గలు, పూత, కాయలు, పండ్లు వస్తాయి. మామిడిమొక్క ఎదుగుతున్న కొద్దీ కాండం మొదలులో ఉండే ముదిరిన ఆకులు, కొమ్మలను తీసేయాలి. దీంతో ఎరువు నుంచి పోషకాలు కావాల్సిన కొమ్మలు, ఆకులకు మాత్రమే అందుతాయి. పోషకాలు వృథా అవకుండా ఉంటాయి.మామిడిచెట్టు గొడుగు మాదిరిగా ఎదిగి, మంచి ఫలసాయం ఇవ్వాలంటే యాజమాన్య పద్ధతులు పాటించడం తప్పనిసరి. మొక్కలు నాటడానికి ముందే భూమిలో పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఏడాదికి ఒకసారి తప్పకుండా వేయాలి. భూమిలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ లేదా నీమ్ కేక్, కిచెన్ వేస్ట్ వేస్తే మొక్క ఆరోగ్యంగా, ఏపుగా ఎదుగుతుంది. మామిడిమొక్క నాటిన తర్వాత భూసారాన్ని బట్టి మైక్రో న్యూట్రియంట్లు అందించాలి. ఏడాదికి ఒకసారైనా నత్రజని, పొటాషియం, ఫాస్పరస్ భూమిలో వేయాలి. ఆకు తినే పురుగులు లాంటివి మొక్కను ఆశిస్తే మోనోక్రోటోఫాస్ గానీ, క్లోరోపైరిపాస్ గాని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మామిడిలో అక్కడక్కడా మాల్ ఫార్మేషన్ వస్తుంటుంది. పోషకాహార లోపం వల్ల ఆకులు సరిగా ఎదగకపోవచ్చు, గిడసబారవచ్చు, పూగుత్తిలా ఉండే వాటిని కత్తిరించేయాలి.మామిడిమొక్కకు మొక్కకు మధ్య దూరం 5 మీటర్లు, వరసకు వరసకు మధ్య 5 మీటర్లు ఉండేలా నాటుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయంటారు వ్యవసాయ అధికారి అనంతరెడ్డి. ఈ విధంగా నాటితే ఎకరం నేలలో 160 మొక్కలు వస్తాయి. అల్ట్రా డైన్సిటీ విధానంలో కొందరు 2X2, 1.5X1.5 మీటర్ల దూరంలో కూడా నాటుకుంటారు. అయితే.. ప్రూనింగ్, ట్రైనింగ్ ఈ అల్ట్రా డెన్సిటీ విధానంలో చాలా కీలకం అవుతాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎకరం భూమిలో 500 మామిడి మొక్కలను కూడా నాటిస్తున్నారన్నారు. ఇలా చేయాలంటే అత్యంత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మామిడి మొక్కకు శీతాకాలం, ఎండాకాలంలో నేల తీరును బట్టి రోజుకు 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. చెట్టు కాపు ఉన్న సమయంలో రోజుకు 250 నుంచి 300 లీటర్ల నీరు ఇవ్వాలి. వర్షాకాలంలో అయితే.. అంత అవసరం ఉండదు. తక్కువ నీరు ఉన్నా తట్టుకునే శక్తి మామిడిమొక్కకు ఉంటుంది. కాబట్టి రోజు విడిచి రోజు నీరు ఇచ్చినా ఇబ్బంది ఉండదు. మామిడిమొక్క సైజును బట్టి మొదలుకు ఒకటి నుంచి రెండు అడుగుల దూరంలో నీరు ఇవ్వాలి. అంటే రూట్ జోన్‌లో మాత్రం తడిగా ఉంటే సరిపోతుంది.
ఈ విధంగా మామిడిమొక్కను చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చి, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. అధిక ఫలసాయం, ఆదాయం లభిస్తాయి.