Site icon V.E.R Agro Farms

సహజసాగులో ‘టెర్రా గ్రీన్‌’ అద్భుతాలు

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ఎక్కువ మందికి అవగాహన కల్పించడంలో, సహజసిద్ధంగా పండించే ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో ఈ తల్లి కూతుళ్ల కృషి ప్రశంసలు పొందుతోంది. హైదరాబాద్‌ కు చెందిన లిఖిత, ఆమె తల్లి పద్మజ భాను 2013లో ‘టెర్రా గ్రీన్‌’ సంస్థ ప్రారంభించారు. ఇప్పుడు ఆ సంస్థ కోసం దేశ వ్యాప్తంగా 4,500 మంది రైతులు పండిస్తున్న 92 రకాల ఆర్గానిక్‌ పంటలను ఆన్‌ లైన్‌, ఆఫ్‌ లైన్‌ స్టోర్ల ద్వారా విక్రయిస్తోంది.

భారతదేశంలో ఆర్గానిక్‌ సాగును ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్రప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ బయోటెక్‌ ఇంజనీర్‌ లిఖిత భాను వ్యవసాయ రంగాన్ని వృత్తిగా స్వీకరించేలా చేసింది. లిఖిత భాను సహ విద్యార్థులు బయోటెక్నాలజీలో కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాల అన్వేషణలో తలమునకలై ఉండగా లిఖిత భాను ఆర్గానిక్‌ సేద్యంలో అవకాశాలను వెతికేందుకు నడుం బిగించడం విశేషం.నిత్యం పచ్చదనం పరిచినట్లు ఉండే ఆంధ్రప్రదేశ్‌ లో లిఖిత భాను తన బాల్యాన్ని గడిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ శివార్లలోని తమ వ్యవసాయ క్షేత్రంలో తల్లి పద్మజ భాను ఆర్గానిక్‌ విధానంలో పంటలు పండించే విధానాన్ని చిన్నప్పటి నుంచే లిఖిత భాను గమనిస్తూ పెరిగారు. అప్పటి నుంచి ఆర్గానిక్‌ సాగులో రోజు రోజుకూ కొత్తగా వస్తున్న విధానాలను అమలు చేస్తూ టెర్రా గ్రీన్‌ సంస్థను పూర్తి స్థాయిలో వృద్ధి చేశారామె. లిఖిత భాను ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

లిఖిత భాను కుటుంబం గతంలో హైదరాబాద్‌ నుంచి అసోంకు మకాం మార్చాల్సి వచ్చింది. లిఖిత, ఆమె కుటుంబానికి అలా అసోం వెళ్లడం ఎలాంటి సంతోషమూ లేదు. ఎందుకంటే అసోం వెళ్లిన తర్వాత సొంతూరిలో ఆర్గానిక్‌ విధానంలో తాజాగా పండించుకునే ఆర్గానిక్‌ కూరగాయల్ని వారి కుటుంబం బాగా మిస్సయింది. అయితే.. వారి కుంటుంబం అసోం వెళ్లేటప్పుడే లిఖిత తల్లి పద్మజ భాను తమ వ్యవసాయ క్షేత్రం నుంచి కొన్ని విత్తనాలు వెంట తీసుకెళ్లి, తమపెరట్లో పెంచడం ప్రారంభించారు. పంటలకు అసోం వాతావరణం చాలా అనుకూలం. దీంతో పద్మజ భాను అరటి నుంచి ఆంధ్రుల అభిమాన ఆకుకూర గోంగూర వరకు పలు రకాల పంటల్ని ఆర్గానిక్‌ విధానంలో సాగుచేసేవారని లిఖిత భాను గుర్తుచేసుకున్నారు.లిఖిత కుటుంబం అసోం నుంచి మళ్లీ హైదరాబాద్‌ తిరిగి వచ్చినప్పుడు పద్మజ భాను తమ రెండు  ఎకరాలే కాకుండా ఆర్గానిక్‌ పంటల సాగును మరింత విస్తీర్ణంలో విస్తరించాలని నిర్ణయించారు. దాంతో పాటు పర్యావరణ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వహించాలని తన తల్లి భావించారని, దాంట్లో భాగంగానే తమ క్షేత్రంలో ఆర్గానిక్‌ సాగుతో పాటు పశువులను కూడా పెంచామని లిఖిత చెప్పారు. ఆర్గానిక్‌ సాగును తన తల్లి పద్మజ వ్యాపారంగా అభివృద్ధి చేయాలని ఏనాడూ అనుకోలేదన్నారు. అయితే.. ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని కొందరు రైతులను ప్రోత్సహించి తానే వ్యాపారంగా అభివృద్ది చేసినట్లు లిఖిత వివరించారు. ఆర్గానిక్‌ సాగును వ్యాపారంలా మార్చాలనే ఆలోచన కాలేజి చదువు పూర్తిచేసిన తర్వాత వచ్చిన విరామ సమయంలో తనకు వచ్చిందన్నారు.లిఖిత భాను తాతగారు స్థాపించిన ‘టెర్రా ఫ్రిమా’ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను టెర్రా గ్రీన్‌ బ్రాండ్‌ గా మార్చి ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారామె. రైతులతో కలిసి తన తల్లి పద్మజ మూడేళ్లు నిర్విరామంగా కృషిచేసి తమ సంస్థకు బ్రాండ్‌ నేమ్‌ తీసుకొచ్చారని వివరించారు. టెర్రా గ్రీన్‌ సంస్థకు సంబంధించినంత వరకు తన తల్లి సాగుబడి విషయాలను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారని, ఉత్పత్తి మొదలు ఆన్‌ లైన్‌, ఆఫ్‌ లైన్‌ రిటైల్‌, హోల్‌ సేల్‌ షాపులకు పంపిణీ చేసే వరకు అన్ని విషయాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని లిఖిత భాను తెలిపారు. మొదట్లో తాము 300 వందల మంది రైతులతో టెర్రా గ్రీన్‌ సంస్థను ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు 4,500 మంది రైతులు పనిచేస్తున్నారని లిఖిత సంతోషంగా చెబుతున్నారు. టెర్రా గ్రీన్‌ సంస్థ ఐదు రాష్ట్రాల్లోని స్పెన్సర్స్‌, హైపర్‌ సిటీ, హెరిటేజ్‌, ఫుడ్‌ హాల్‌, బిగ్‌ బాస్కెట్‌ సహా 500 రిటైల్‌ షాపులకు  తమ సంస్థ పప్పుదినుసులు, సుగంధ ద్రవ్యాలతో పాటు ఉదయం పూట వినియోగించే అల్పాహార మిశ్రమాలను సరఫరా చేస్తున్నామన్నారు.లిఖిత భాను టెర్రా గ్రీన్‌ స్థాపించినప్పటికి ఇప్పటికీ వినియోగదారుల్లో అవగాహన, ఆర్గానిక్‌ ఆహారం పట్ల ఎంతో అభిరుచి పెరిగినట్లు గమనించానని చెప్పారు. తమ సంస్థను ఏర్పాటు చేసే నాటికి ప్రజలకు ఆర్గానిక్‌ వ్యవసాయం అంటే తెలియదన్నారు. అలాంటి వారికి ఆర్గానిక్‌ వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే రైతులకు కూడా ఆర్గానిక్ సాగు టెక్నిక్‌ లు నేర్పించినట్లు వెల్లడించారు లిఖిత భాను. అలా అంతకంతకూ ఆర్గానిక్‌ సాగు పట్ల రైతులు మొగ్గుచూపడం పెరుగుతుండడంతో మార్కెట్‌ సరిహద్దులు దాటి విస్తరించిందని ఈ యువ పారిశ్రామికవేత్త లిఖత భాను తెలిపారు.ఆర్గానిక్‌ ఉత్పత్తుల వినియోగం గత రెండేళ్లలో 100 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించిందని లిఖిత వివరించారు. గతేడాది గణాంకాల కన్నా ఈ సంవత్సరం ఆదాయంలో 45 శాతం వృద్ధి సాధించినట్లు సంతోషంగా తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 10 వేల మంది రైతులను తమ టెర్రా గ్రీన్‌ సంస్థలో భాగస్వాములను చేయాలని తాను లక్ష్యంగా నిర్దేశించుకుని కృషిచేస్తున్నానన్నారు ఈ యువ పారిశ్రామికవేత్త లిఖిత భాను.

Exit mobile version