Site icon V.E.R Agro Farms

అర్గానిక్ సాగుపై ఒప్పందం

ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చర్యలు చేపడుతోంది. ఆర్గానిక్ సాగుకు సంబంధించిన పరిశోధనల నిర్వహణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్గానిక్ ఇండస్ట్రీ (AIOI) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి 1న ఇందుకు సంబంధించిన ఎంఓయుపై సంతకాలు జరిగాయి. ఆర్గానిక్ సాగు పద్ధతులపై సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించడంతో పాటు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడం, ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటివి కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి. అలాగే AIOI సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన నైపుణ్యాల అభివృద్ధిలో ఒక సర్టిఫికేట్ కోర్సు కూడా నిర్వహిస్తుంది. ఆర్గానిక్ పంటల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, పంటకోతల తర్వాత వాటిల్లే తగ్గించడం, గిడ్డంగుల సాంకేతికతను అభివృద్ధి పరచడం వంటి అంశాలకు సంబంధించి ఈ ఒప్పందం దోహదపడుతుందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్స్‌లర్ వి ప్రవీణ్ రావు మాట్లాడుతూ, పౌల్ట్రీ, డెయిరీ, పిగ్గరీ వంటి ఇతర రంగాల్లోనూ ఆర్గానిక్ పద్ధతులను అనుసరించవలసి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్గానిక్ సాగు విధానాలపై త్వరలో ఒక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎస్ సుధీర్ కుమార్, AIOI సీఈఓ పి వి ఎస్ ఎం గౌరి, 24 మంత్రా సీఈఓ రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version