Site icon V.E.R Agro Farms

కంపోస్టుతో కోటి రూపాయలు!

తనకి ఉన్న భూమి కేవలం ఎకరం మాత్రమే. కానీ సనా ఖాన్ అక్కడ ప్రతి నెలా 150 టన్నుల వర్మి కంపోస్ట్‌ను తయారు చేసి విక్రయిస్తారు. ఇవాళ తన వార్షిక టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది. అసలు అదెలా సాధ్యపడిందో ఇప్పుడు చదవండి.
సేంద్రియ ఎరువును తయారు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సనా ఖాన్ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అది 2014వ సంవత్సరం. తను అప్పటికి బయో-టెక్నాలజీలో డిగ్రీ చదువుతున్నారు. తన ఆలోచన విన్నాక ఆమె సహచరులు కొంత కలవరపడ్డారు. తన తల్లిదండ్రులు కూడా ఇంత చిన్న వయసులో ఎందుకులెమ్మన్నారు. అయితే దర్జీగా పని చేసే సనా తండ్రి ఆ తర్వాత కూతురి ఇష్టాన్ని కాదనలేక తోడుగా నిలిచారు. సన్నివేశాన్ని 2021కు కట్ చేస్తే…
సనా ఇప్పుడు యుపిలోని మేరఠ్ దగ్గర ఒక ఎకరం భూమి సంపాదించి ప్రతి నెలా 150 టన్నుల వర్మి కంపోస్ట్‌‌ను విక్రయిస్తున్నారు. ఆమె వార్షిక టర్నోవర్ ఇప్పుడు అక్షరాలా 1 కోటి రూపాయలు. ఆమె దగ్గర 60 మంది దాకా పనిచేస్తున్నారు కూడా. ఖతార్ నుండి ఈ మధ్య ఒక కాంట్రాక్టు రావడంతో ఆమె ప్రస్తుతం చాలా బిజీ అయిపోయారు. తన సాఫల్యం గురించి అడిగితే సనా వినమ్రంగా చిరునవ్వు నవ్వుతారు.
“యూరియాతో పాటు ఇతర రసాయన ఎరువులు ఎంతో విషపూరితమైనవని నేను చదువుకున్నాను. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం అవి దారితీస్తాయనీ, మనలోని జన్యు నిర్మాణాన్ని అవి ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయనీ నేను నా కోర్సు చదువుతున్నప్పుడు తెలుసుకున్నాను. సేంద్రియ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాలని నేను నిర్ణయించుకుంది అప్పుడే” అని ఆమె చెప్పారు. యుపి టెక్నికల్ యూనివర్శిటీ పరీక్షలలో సనా 45వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమె ట్యూషన్ ఫీజు మాఫీ అయింది. చదువు పూర్తయిన వెంటనే ఆమె పొలం బాట పట్టారు. “భవిష్యత్తు అంతా వర్మి కంపోస్ట్దుదే. అందుకే నేను దాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను” అని సనా చెబుతారు.

వర్మీకంపోస్టులో మహిళలకు శిక్షణనిస్తున్న సనా ఖాన్

2014లో సనా తన సోదరుడు జునైద్ ఖాన్ సహాయంతో SJ Organics సంస్థను ప్రారంభించారు. సేంద్రియ ఎరువు వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, సనా కొన్ని డెయిరీలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి యూనిట్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ప్రత్యేకమైన తన వర్మి కంపోస్టింగ్ కోసం ఉపయోగించుకోవాలని భావించారు. అయితే, ఈ మోడల్ పని చేయలేదు. దీంతో సనా డెయిరీలతో పాటు బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఘాజియాబాద్, మేరఠ్ తదితర ప్రాంతాల నుండి తన వర్మి కంపోస్టు సైట్ అయిన ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీ మైదానానికి తీసుకురావడానికి కొందరు కాంట్రాక్టర్లను నియమించుకున్నారు. అక్కడ ఆ వ్యర్థాలను ఎర్రలకు ఆహారంగా వేయడం మొదలుపెట్టారు. వ్యర్థాలను అలా వర్మి కంపోస్టుగా మార్చే మొత్తం ప్రక్రియకు నెలన్నర సమయం పడుతుంది. ఈ కంపోస్టు తయారీలో వారు గోమూత్రం కూడా వాడతారు. ఆవు మూత్రం సహజమైన క్రిమిసంహారకంగాను, ఎరువుగానూ పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ కంపోస్టును జల్లెడ పడతారు ఈ సైట్‌లో తయారయ్యే వర్మి కంపోస్టు ప్రతి బ్యాచ్‌ను అది ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చూసేందుకు ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఆ తరువాతే ప్యాక్ చేసి మార్కెట్‌కు పంపుతారు. సనా తయారు చేసే వర్మి కంపోస్ట్‌ను రైతులతో పాటు రిటైల్ షాపులవారు, నర్సరీ నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. కొన్నిసార్లు రైతులు వారి పొలం మట్టికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులను తీసుకువస్తారు. వాటిని పరిశీలించి ఆయా నేలలకు అనుగుణంగా వర్మి కంపోస్ట్‌ను అదనపు పోషకాలతో సమృద్ధిగా తయారు చేసి అందిస్తారు సనా.
ఇలా 2015 నాటికి సనా కంపెనీ లాభాలను సంపాదించడం ప్రారంభమైంది. వ్యాపార కార్యకలాపాలు బాగా పెరిగాయి. 2020 నాటికి కంపెనీ ఏకంగా 500 టన్నుల వ్యర్థాలను కంపోస్టుగా మార్చే స్థాయికి చేరుకుంది.

ఎస్ జె ఆర్గానిక్స్ నిర్వహించిన విరాట్ కిసాన్ సమ్మేళన్ సందర్భంగా…

మొదటి రోజుల్లో ‘స్వచ్ఛ భారత్ మిషన్’ సనా ప్రయత్నాలకు తోడ్పడింది. “కంపోస్టింగ్ కోసం నేను ఒక ప్రభుత్వ ఇంటర్ కాలేజీ ఒక మైదానాన్ని ఎంచుకున్నాను. ఎరువు కోసం ఆవు పేడ కొనుగోలు చేశాను. కానీ అంతలోనే స్థానికుల వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే దుర్వాసనకు ఏమాత్రం తావు లేకుండా సాగే మా పరిశుభ్రమైన పని తీరు చూసిన తరువాత, స్థానికులు మాకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు మేము నెలకు 150 టన్నుల వర్మి కంపోస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్నాము. దీనికి డిమాండ్ కూడా పెరుగుతోంది” అని సనా వివరించారు. సనా ఇప్పుడు పూర్తిగా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సనా భర్త సయ్యద్ అక్రమ్ రాజా, ఆమె సోదరుడు జునైద్ ఖాన్ మార్కెటింగ్ పనులు చూసుకుంటారు. వారు సనాకు తోడుగా ఉండడం కోసం వారి ఉద్యోగాలను కూడా విడిచిపెట్టారు.
“ఆమె శక్తిసామర్థ్యాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె మొదటి నుంచీ దీనిపై దృష్టి సారించింది. ఈ రోజు, మేమంతా తనతో కలిసి ఉత్సాహంగా పని చేస్తున్నాము. దాని వల్ల ప్రయోజనం కూడా పొందుతున్నాము”అని సనా సోదరుడు జునైద్ ఖాన్ చెప్పారు.
ప్రస్తుతం, సనా టీమ్ తయారు చేసే వర్మి కంపోస్టు ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా అమ్ముడవుతోంది. ఇటీవల ఆమె ఖతార్‌కు వర్మివాష్ (ద్రవ రూపంలోని కంపోస్టు) సరఫరా చేసేందుకు ఒక కాంట్రాక్టును కుదుర్చుకున్నారు. “మేము ఒక ట్రేడర్ ద్వారా ఎగుమతి చేయడానికి పెద్ద మొత్తంలో వర్మివాష్‌ను సిద్ధం చేస్తున్నాము. దీన్ని సంవత్సరానికి కనీసం 2,000 టన్నుల మేరకు ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము” అని సనా చెప్పారు.

వర్మి కంపోస్టు తయారీ విధానాన్ని వివరిస్తున్న సనా

ఇప్పుడు తమ వార్షిక టర్నోవర్ రూ ఒక కోటి రూపాయలకు చేరుకుందని, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి 60 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నామని సనా తెలిపారు. ఆమె ఇటీవల మేరఠ్ శివార్లలోని అబ్దుల్లాపూర్ వద్ద ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశారు కూడా.
అంతేకాదు, వర్మి కంపోస్టింగ్ కోసం సైట్లు ఏర్పాటు చేయడానికి సనా మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని ఇతర మహిళలకు కూడా సహాయం చేస్తున్నారు. అవసరమైనవారికి vermicomposting లో సనా కంపెనీ SJ Organics శిక్షణనిస్తోంది కూడా. ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, వర్మి కంపోస్టింగ్‌ ప్రాచుర్యం పొందటానికి కూడా ఎస్.జె. ఆర్గానిక్స్ సహాయపడింది. మేరఠ్ నగరంలో 104 పాఠశాలలు ఎస్.జె.ఆర్గానిక్స్ కన్సల్టెన్సీ కింద వర్మి కంపోస్టింగ్ సైట్లను ఏర్పాటు చేశాయి. వర్మి కంపోస్టింగ్ గురించి తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఉత్తర ప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశం అంతటా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ప్రాచుర్యానికి ఇతర పారిశ్రామికవేత్తలకు సహాయపడగలనని సనా భావిస్తున్నారు. సేంద్రియ ఎరువుల రంగంలో తన కృషికిగాను సనా పలు అవార్డులను సైతం అందుకోవడం విశేషం. “ఈ పని ద్వారా మనమందరం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం, ఇది ప్రస్తుత తరుణంలో అవసరం” అని సనా అంటారు. ఇంత చిన్నవయసులో తన వ్యాపార కుశలతతో రైతులకు, తోటి మహిళలకు, పర్యావరణానికి ప్రయోజనం కలిగే విధంగా సనా సేంద్రియ ఎరువును అందిస్తుండడం అభినందనీయం.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
SJ Organics
093194 14562
sjvermicompost@gmail.com

Exit mobile version