Site icon V.E.R Agro Farms

వరి-చేప సహసాగుతో అధికాదాయం

ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం, భూవనరులు తగ్గిపోతుండడం వాతావరణంలో నాణ్యత బాగా తగ్గిపోతోంది.

ప్రపంచ జనాభాలో దాదాపుగా 50 శాతం మందికి బియ్యం ప్రధాన ఆహారం. అయితే.. వరిపంట సాగు చేయాలంటే నీటి వనరుల్ని ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా తీసుకోవడమే కాకుండా వరి పొలాలు గ్రీన్ హౌస్ గ్యాస్ మిథేన్ ను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో వరి సేద్యం నిర్వహణ సరైన మార్గాలు అన్వేషించాల్సిన అవసరం వచ్చింది. ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఆసియా ఖండంలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండలాల్లో ఈ సహ వ్యవసాయ విధానాన్ని ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఒకే పొలంలో ఏకకాలలో వరి పంట- చేపల పెంపకం చేయాల్సిన ఆవశ్యకతను ప్రపంచవ్యాప్తంగా రైతులు గుర్తిస్తున్నారు. ధాన్యం-చేపల పెంపకానికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందనే చెప్పాలి. ఒకే పొలంలో రెండు పంటల (సహ పంటల) విధానంతో ఆదాయం పెంచుకోవచ్చు. గ్రీన్ హౌస్ గ్యాస్ ల ప్రమాదం నుంచీ తప్పించుకోవచ్చు. తద్వారా గ్రామీణ పేదలు, ప్రగతిశీల రైతుల జీవనం విధానం మెరుగవుతుంది.

ప్రస్తుత వ్యవసాయ ఉత్పత్తి విధానం నుంచి వ్యవసాయ సంస్ర్కుతి వైపు ప్రపంచం అడుగులు వేయడానికి ఇంకెంతో సమయం పట్టకపోవచ్చు. వరి సాగుతో పాటు చేపలు, నత్తలు, పీతలు, రొయ్యలు, బాతులు లాంటి నీటిలో పెరిగే జీవుల్ని పెంచితే ఆదాయం పెరుగుతుంది.. వరికి వినియోగించే నీటితోనే సహ పంటనూ రైతేలు తీయవచ్చు.

వరి సాగు కారణంగా ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్ సమస్యతో పాటు ప్రపంచ వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. వ్యవసాయ విధానం వల్ల ప్రధానంగా రెండు రకాల గ్లోబల్ హౌస్ గ్యాస్ లు మిథేన్ (CH4), నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉన్న చోట ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. వ్యవసాయంలో పచ్చిరొట్ట మొక్కలు, సేంద్రీయ ఎరువులను వినియోగించడం ద్వారా మిథేన్ ను తగ్గించవచ్చు.

ప్రపంచ వాతావరణంలో ఉన్న మొత్తం మిథేన్ లో 10 నుంచి 20 శాతం వరి పొలాల నుంచే వస్తోందని ఒక అంచనా. దీని వల్ల భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ఎక్కువవుతోందని అంచనా. కార్బన్ డై అక్సైడ్ కంటే మిథేన్ వల్ల 25 రెట్ల ఎక్కువగా భూతాపం పెరుగుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. సహ పంటలుగా ధాన్యం- చేపల్ని పెంచడం ద్వారా వాతావరణంలోకి వ్యవసాయం నుంచి విడుదలయ్యే మిథేన్, ఇతర గ్రీన్ హౌస్ గ్యాస్ లను తగ్గించ వచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. నేల మీద తిరుగుతూ, లేదా ఆహారం కోసం మట్టిని తవ్వే పీతలు, నీటి చేపలు మీథేన్ ఉత్పత్తి కాకుండా నివారిస్తాయని అధ్యయనాలు తేల్చాయి. ఏకపంటగా వేసే వరి పంటతో వచ్చే మిథేన్ కన్నా వరి- చేపల సహ వ్యవసాయం వల్ల 34.6 శాతం తగ్గినట్లు పరిశోధకులు అంచనా వేసి చెప్పారు. వరి- చేపల సహ సాగు భూసారాన్ని పునరుద్ధరిస్తుంది. భూసారం తగ్గిపోకుండా కాపాడే మంచి విధానం వరి- చేపల సహ సాగు.

వరి- చేపల సహ సాగు వద్ద రైతుల ఆదాయం ఏకైక వరి సాగు విధానం కన్నా 50 శాతం అధికంగా నికర ఆదాయం వచ్చిందని బంగ్లాదేశ్ నివేదిక పేర్కొంది. ఒకే పంట వరి విధానం కన్నా వరి- చేప సహ పంట విధానం వల్ల 27 శాతం అధిక నికర ఆదాయం లభించినట్లు ఇండోనేషియాలో జరిగిన అధ్యయనం తెలిపింది.

భూతాపాన్ని తగ్గించడంతో పాటు అధిక ఆదాయం కూడా ఇచ్చే వరి- చేప సహ సాగు విధానం పట్ల అనేక మంది రైతులు ఆసక్తి చూపుతుండడం విశేషం.

Exit mobile version