Site icon V.E.R Agro Farms

ఆరోగ్యానికి శ్రీరామరక్ష రామాఫలం

సీతాఫలం గురించి అందరికీ తెలిసిందే. కానీ రామాఫలం పండు గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇండియన్ చెర్రీ అని పిలుచుకునే రామాఫలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. రామాఫలంలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ లక్షణాలు ఉన్నాయి. మలేరియా, క్యాన్సర్‌ కారక కణాల నివారిస్తుంది రామాఫలం. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్‌, డైటరీ ఫైబర్‌, కొవ్వు, విటమిన్‌ బీ1, బీ2, బీ3, బీ5, బీ6, కాల్షియం, సోడియం, ఐరన్‌, పొటాషియం లాంటి ఖనిజాల గని రామాఫలం. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. వీటిలో లభించే బీ కాంప్లెక్స్‌, విటమిన్ సీ, పిడాక్సిన్‌లు మొటిమలను తగ్గిస్తాయి. మెదడు కణాలలో కావాల్సిన రసాయనాలను స్థిరంగా ఉంచడంలో పిరిడాక్సిన్ సహాయపడుతుంది.

రామాఫలం పేస్టు తలకు రాసుకుంటే పేలు, చుండ్రు, జుట్టు రాలకుండా రక్షిస్తుంది. అలసిపోయినప్పుడు రామాఫలం తీసుకుంటే శరీరాన్ని వెంటనే ఉత్తేజ పరుస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ పండు మంచి ఔషధం. రామాఫలాలు ఉత్తరాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోను, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బాగా పండుతాయి. అలాగే మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లోనూ రామాఫలం ఎక్కువగా పండుతుంది. తియ్యని వాసన, రుచితో రామాఫలం ఉటుంది. పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తుంది.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని అవని ఫాంలో సేంద్రీయ వ్యవసాయ విధానంలో అనేక పంటలు పండిస్తున్నారు. సునంద ఈ అవని ఫాం నిర్వహిస్తున్నారు. సీతాఫలం సీజన్ పూర్తయిన చలికాలం- ఎండాకాలం మధ్య రామాఫలం పంట వస్తుంది. రామాఫలంలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. విత్తనాలు సీతాఫలం కన్నా చాలా తక్కువగా ఉంటాయి. సీతాఫలం కన్నా రామాఫలంపై ఉండే తొక్క చాలా పల్చన. రామాఫలం చెట్టు పెరిగిన దాన్ని బట్టి  20 నుంచి 30 కిలోలు వస్తాయి. చెట్టు బాగా కాస్తే.. 50 నుంచి 100 కిలోలు కూడా దిగుబడి రావచ్చు.రామాఫలం చెట్ల మొదళ్లలో ఏడాదికి ఒక్కసారి డీకంపోజ్ చేసిన ఆర్గానిక్ ఎరువునే వేస్తామని సునంద తెలిపారు. మిగతా అన్ని చెట్లు, మొక్కల మాదిరిగానే ఆర్గానిక్‌ పద్ధతిలో తయారు చేసిన క్రిమిసంహారకాలనే వినియోగిస్తామన్నారు. ఆవుపేడ, కోడి పెంట, ఆయిల్‌ కేక్‌లు, బయోచార్ బాగా కలిపి కుళ్లిన తర్వాత చెట్ల మొదళ్లకు వేస్తారు. నిజానికి రామాఫలం చెట్టుకు పురుగు పట్టడం చాలా తక్కువ. రామాఫలంలో ప్రత్యేక ఏమిటంటే.. చెట్టుకు మంచి పోషకాలు అందిస్తే.. ప్రతి పువ్వు కాయగా తయారవుతుంది. రామాఫలం చెట్టు నుంచి ఒకేసారి కాకుండా నాలుగు నెలల పాటు విడతల వారీగా పండ్లు లభిస్తాయి. రామాఫలం చెట్లకు ప్రూనింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదు.రామాఫలం అంటుకట్టిన మొక్క నాటిన రెండేళ్ల తర్వాత నుంచి కాపు మొదలవుతుంది. ఈ మొక్కలు చాలా వేగంగా ఎదుగుతాయి. రామాఫలం కాండం చాలా బలంగా ఉంటుంది. గాలులు వేగంగా వచ్చినా చెట్టు నుండి అంత సులువుగా తెగిపడిపోదు. రామాఫలం చెట్టు మొండిది. పెంచుకోవడం చాలా సులువు. నీళ్లు పోయకపోయినా బతికేస్తుంది. రైతులు రామఫలం సాగును కమర్షియల్‌గా పెద్దగా చేయరు కానీ.. ఇతర పండ్ల తోటలలో వీటిని కూడా పెంచుకోవడానికి అద్భుతమైనదనే చెప్పాలి. కిచెన్ గార్డెన్‌లో పెంచుకునేందుకు అనువైనది రామాఫలం చెట్టు.

Exit mobile version