Site icon V.E.R Agro Farms

కష్టం తక్కువ కలిసి వచ్చేది ఎక్కువ

సువాసనలు వెదజల్లే దవనం లేదా మాచీపత్రి భారతదేశానికే చెందిన ప్రత్యేకమైన మొక్క. దీని ఆకులు, పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. దవనం మొక్క శాస్త్రీయనామం ఆర్టెమిసియా పల్లెన్స్‌. దవనం ఆకుల, పువ్వులతో తయారు చేసిన ఆయిల్‌ మనిషికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతత తీసుకువస్తుంది. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. దవన ఆయిల్‌లో యాంటీ ఏజింగ్‌, యాంటీ ఆక్సిడెంట్‌, చర్మానికి రక్షణ కలిగించే గుణాలు ఉన్నాయి. కామోద్దీపనను ప్రేరేపించేందకు దవన ఆయిల్‌ పనికివస్తుంది. చర్మానికి వచ్చే మంట, చికాకులను తొలగించేఏందుకు ఉపయోగపడుతుంది.దవన నూనె శక్తివంతమైన ఎక్స్‌పెక్టరెంట్‌. ఇది కఠినమైన దగ్గులను, శ్వాసకోశ నాళాల్లోని అడ్డంకిలను తొలగిస్తుంది. జలుబు వల్ల వచ్చే కీళ్లు, తలనొప్పులను తగ్గిస్తుంది. దవన ఆయిల్‌ మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. తిమ్మిరి, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మూత్రనాళాలు, మూత్రపిండాలు, శరీరంలోని ఇతర భాగాలకు సంక్రమించే అంటువ్యాధులతో పోరాడేందుకు దవనం నూనె చక్కగా పనిచేస్తుంది. సువాసన వస్తుంది కాబట్టి దవనం ఆకులను పూలహారాల్లో కలిపి కడతారు.ఎక్కువగా సువాసనలు వెదజల్లే దవనం ఆకులు, పువ్వుల ఆయిల్‌ను క్రీములు, ఫేస్ ఆయిల్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. దవనం నూనె యాంటి సెప్టిక్‌, క్రిమిసంహారకంగానూ ఉపయోగపడుతుంది. దవనం మొక్కలను వాణిజ్యపరంగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రైతులు దవనం పంట సాగుచేస్తున్నారు. ఎకరం నేలలో దవనం పంట సాగు చేసేందుకు సుమారు రూ.35 నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.దవనం లేదా మాచీపత్రిని సాగు చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. దవనం సాగుకోసం నీరు కూడా చాలా తక్కువే అవసరం అవుతుంది. నష్టపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సువాసన వెదజల్లే దవనం మొక్కలను పశువులు తినవు. దవనం సాగుచేసే పొలానికి కంచె వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనుషులు కూడా దవనం మొక్కల జోలికి రాదు. దవనం పంటను మూడు నెలల్లోనే కోత కోసుకోవచ్చు. మార్కెటింగ్ కూడా చాలా సులువు. మార్కెటింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటే.. పంట పెట్టుబడిలో అత్యధిక శాతం అంటే విత్తనాలు, దానికి అవసరమయ్యే మందులను అదే సరఫరా చేస్తుంది. దవనం పంటను ఏజెన్సీకి అప్పగించే సమయంలో ముందుగానే కుదుర్చుకున్న ప్రకారం ధర కడుతుంది. పంట సాగుకు ఏజెన్సీ పెట్టిన పెట్టుబడి తీసుకుని, మిగతా డబ్బులు రైతుకు చెల్లిస్తుంది. దవనం పంట టన్నుకు రూ.15 నుంచి రూ.20 వేలు ధర కడుతుంది ఏజెన్సీ. ఒక ఎకరంలో దవనం పంట 15 టన్నులు వచ్చిందనుకుంటే.. 15X15 వేసుకున్నా.. రూ.2.25 లక్షల ఆదాయం వస్తుంది. దవనం సాగుచేసిన మూడు నెలల్లోపెట్టుబడి పెట్టిన రూ.50 వేలు తీసేస్తే.. కీనం లక్షా 75 వేల నికర ఆదాయం రైతు చేతికి అందుతుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఏజెన్సీయే ఇస్తుంది కాబట్టి చేను దుక్కి దున్నేందుకు ట్రాక్టర్‌, మొక్కలు నాటేందుకు, కోత కోసేందుకు కూలీల ఖర్చు మాత్రమే రైతు భరించాల్సి ఉంటుంది. దవనం మొక్కలు బాగా ఎదిగితే రెండు లేదా మూడు మొక్కలే కిలో బరువు తూగుతాయి. దవనం మొక్కలకు మొగ్గ వచ్చినప్పుడే కోసేయాలి.మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్లు ఉచితంగా ఇచ్చిన విత్తనాలను నారుమడిగా పోసుకోవాలి. నారు వచ్చిన తర్వాత మొక్కలను తీసుకుని, పొలాన్ని అడుగు దూరంలో బొదెలుగా చేసి, నాటి, నీరు సరఫరా చేసి, మదులు వేస్తే సరిపోతుందని అన్నమయ్య జిల్లా రైతులు తెలిపారు. ఎకరానికి రెండు కిలోల దవనం విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను చిన్న చిన్న మడులుగా పోసి, ఎండ తగలకుండా వైర్ నెట్‌ కట్టాలి. మొక్కలు సుమారు ఒకటిన్నర, రెండు అడుగుల ఎత్తు వచ్చేసరికి కోత కోవాల్సి ఉంటుంది. దవనం మొక్కలను కోసినవి కోసినట్లు లారీలకు ఎత్తి ఏజెన్సీ ఫ్యాక్టరీకి తలరించాలి. దవనం మొక్క ఎండిపోతే సువాసన రాదు కాబట్టి పచ్చిగానే దాన్ని ఫ్యాక్టరీకి అప్పగించాలి. దవనం మొక్కలకు క్రమపద్ధతిలో నీళ్లు కడితే.. దాని వంక చూసే పనే ఉండదని రైతు చెప్పాడు.దవనం మొక్కకు పేను పడుతుంది. పేను నివారణకు కావాల్సిన పురుగుమందులు కూడా ఏజెన్సీయే ఇస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో దవనం మొక్కలకు డ్రిప్‌ ఇరిగేషన్ విధానంలో సాగు చేస్తున్నారు. తద్వారా ఎక్కువ నీరు వాడాల్సిన అవసరం ఉండదు. డ్రిప్‌ ద్వారానే ఎరువులు కూడా మొక్కలకు సరఫరా చేయడం సులువుగా ఉంటుంది. దవనం సాగుకు అవసరమైన ఎరువులను కూడా ఏజెన్సీవారే ఇస్తారని రైతు తెలిపాడు. వర్షాలు ఎక్కువగా కురిస్తే మాత్రం దవనం పంట కుళ్లిపోతుందని అన్నాడు. దవనం పంటను పగటిపూట కోస్తే వాడిపోతుంది కాబట్టి అప్పుడు కోయకూడదని రైతు చెప్పాడు. తెల్లవారు జామున మంచులో దవనం మొక్కల్ని కోయాలన్నాడు.దవన పంట మంచు కాలంలో అంటే ఏడాదికి ఒకసారే వేసుకోవాలని అన్నమయ్య జిల్లా రైతు తెలిపాడు. పొలానికి నీరు పెడతాం కాబట్టి ఎండాకాలంలో, శీతాకాలంలో బాగా సాగవుతుందన్నాడు. వర్షాకాలంలో దవన పంట సాగు చేస్తే కుళ్లిపోయి, నష్టం వస్తుందన్నాడు. దవనం మొక్కలు ఎర్రనేలలో బాగా ఎదుగుతాయి. నేలలో ఎక్కువ తేమ లేనిచోట పంట బాగా పండుతుంది. దవన మొక్కకు ఏదైనా చీడ ఆశిస్తే.. ఏజెన్సీ వాళ్లు స్వయంగా వచ్చి, చూసి అవసరమైన పురుగుమందులు ఇస్తారన్నాడు. దవన పంటను ముందుగానే కొనుగోలు ఒప్పందం చేసుకున్న ఏజెన్సీ వారు వారానికి ఒకసారి వచ్చి, పంట తీరును పరిశీలస్తుంటారు. ఎలాంటి తేడా గమనించినా ఏమి చేయాలో సూచనలు, సలహాలు ఇస్తారన్నాడు.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఆదాయం వచ్చే దవనం పంటను సాగు చేసిన రైతులకు నష్టాలు తక్కువగా ఉంటాయి. ఆదాయం, లాభం ఎక్కువనే చెప్పాలి.

Exit mobile version