Site icon V.E.R Agro Farms

శ్రీవారి సేవకు దేశీ ఆవు నెయ్యి

గో ఆధారిత పంటలకు మద్దతుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవకు, శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు, స్వామివారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన దేశవాళి ఆవు నెయ్యి ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డి వెల్లడించారు. శ్రీవారి సేవకు వినియోగించే స్వచ్ఛమైన నెయ్యి కోసం తిరుమలలోనే దేశవాళి గోవులను ఏర్పాటుకు చేస్తామని ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించే పంటలతోనే శ్రీవారికి టీటీడీ నైవేద్యం సమర్పిస్తోంది. తాజాగా ఇప్పడు స్వచ్ఛమైన దేశీ ఆవునెయ్యిని స్వామివారి సేవలో సమర్పించాలని టీటీడీ నిర్ణయించిందని ఈఓ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

తిరుమలలో శ్రీవారి అభిషేకోత్సవాలు, దీపారాధనల్లో టీటీడీ పూర్వకాలం నుంచీ ఆవునెయ్యినే వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ నెయ్యిని సరఫరా దారుల నుంచి సేకరించేవారు. ఇప్పుడు తిరుమలతోనే స్వయంగా దేశీ ఆవుల్ని ఏర్పాటు చేసుకుని స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

గో ఆధారిత పక్రుతి పంటలకు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం ఏర్పడుతున్న క్రమంలో టీటీడీ నిర్ణయం హర్షణీయం. ‘గుడికో గోవు‘ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చాలా రోజుల క్రితమే ప్రారంభించింది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు ఒక గోమాత, ఓ లేగదూడను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది.

Exit mobile version