Site icon V.E.R Agro Farms

కేంద్ర బడ్జెట్‌లో వ్యవ’సాయం’

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన కేంద్ర వార్షిక బడ్జెట్ 2021-22లో ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50 పైసలు, డీజిల్‌పై రూ. 4 చొప్పున కేంద్రం వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ (Agriculture Infrastructure and Development Cess (AIDC) విధించింది. అయితే ఈ సెస్‌ భారం వినియోగదారులపై పడకుండా బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. కాగా, పత్తి, బఠానీ, యాపిల్, ఆల్కహాల్ బెవరేజెస్ వంటివాటిపై కూడా ప్రభుత్వం డెవలప్‌మెంట్ సెస్ విధించింది. ఈ సెస్ ద్వారా సమకూరే నిధులను వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తారు.
ఇక 2022లో వ్యవసాయ పరపతి లక్ష్యాన్ని ప్రభుత్వం రూ. 16.5 లక్షల కోట్లకు పెంచింది. దీని వల్ల సన్నకారు, చిన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ లభ్యత పెరుగుతుంది. అలాగే ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని రూ. 30 వేల కోట్ల నుండి రూ. 40 వేల కోట్లకు పెంచింది. సూక్ష్మ నీటిపారుదల రంగం బడ్జెట్‌ను రెట్టింపు చేసి రూ.10 వేల కోట్లుగా ప్రతిపాదించింది. 22 రకాల వ్యవసాయ పెరిషబుల్ ప్రాడక్టులకు ఆపరేషన్ గ్రీన్ స్కీమ్‌ను వర్తింపజేసింది. దీని వల్ల అదనంగా శీతల గిడ్డంగి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
ఏపీఎంసీ (Agricultural produce market committee)లకు వ్యవసాయ మౌలిక వసతుల నిధి ద్వారా ప్రయోజనం చేకూర్చే వెసులుబాటు కల్పిస్తారు. ఈ నిధి ద్వారా ఏపీఎంసీలు మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన చేపట్టే వీలు కలుగుతుంది. ఇదిలావుండగా, ప్రభుత్వం పత్తి రైతులకు, పట్టు పెంపకందారులకు ప్రయోజనం కలిగించే ఉద్దేశ్యంతో కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేరకు పెంచింది. ముడిపట్టు, పట్టుదారాలపై 15 శాతం సుంకాలను పెంచింది. ఇది వస్త్రపరిశ్రమ అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు కనీస మద్దతు ధర పథకం కింద 2020-21లో గోధుమ సేకరణకు సంబంధించి రూ. 75,060 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బియ్యానికి సంబంధించి 2020-21 సీజన్‌లో కనీస మద్దతు ధర కింద రైతులకు రూ. 172,752 కోట్లు చెల్లించామని ప్రభుత్వం వెల్లడించింది. పప్పుదినుసులకు సంబంధించి రూ. 10,530 కోట్ల మేరకు చెల్లింపులు జరిగాయని వివరించింది. ఎంఎస్‌పి కింద 2020-21లో అన్ని వ్యవసాయోత్పత్తులపై 1.5 శాతం అధికంగా చెల్లింపులు చేశామని ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version