Site icon V.E.R Agro Farms

ఎన్నో విశేషాల ‘అద్వైత్ లివింగ్’

మధుర- ఆగ్రా నగరాల మధ్య అందమైన యమునాతీరంలో ఉన్న అద్వైత్ లివింగ్‌ (Advait Living Farms) వ్యవసాయక్షేత్రం సుస్థిర వ్యవసాయ విధానాలకు ఒక చిరునామా. అక్కడి 40 ఎకరాల పచ్చని పొలం ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతంలో తొలి తరం సేంద్రియ మహిళారైతు మీనాక్షి కిశోర్‌ను (పై ఫోటో) మీరు ఇక్కడ కలుసుకోవచ్చు. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆసక్తితో ఆర్గానిక్ వ్యవసాయంలోకి ప్రవేశించారు. అక్కడ మీనాక్షి చేసే వ్యవసాయం ప్రధానంగా గో-ఆధారితం కావడం చెప్పుకోవలసిన విశేషం.
మీనాక్షి తన జీవితంలో ఎక్కువ భాగం ఆగ్రాలోని తన కుటుంబానికి దూరంగా గడిపారు. ఆమె ఒక బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆపై పుణేలోని సింబియోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఆమె MBA చేశారు. చదువు పూర్తయ్యాక 15 సంవత్సరాల పాటు ఆమె హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డీసీఎం శ్రీరామ్ వంటి పలు కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీలు, వెంచర్ క్యాపిటల్ సంస్థలలో సీనియర్ స్థాయి కార్పొరేట్ పదవులు నిర్వహించారు. అయితే కార్పొరేట్ ఉద్యోగాలు ఆమెకు విసుగు తెప్పించాయి. నెమ్మదిగా, నింపాదిగా సాగే జీవనశైలిని ఆమె మనసారా కోరుకున్నారు. అది కూడా అర్థవంతంగా ఉండాలనీ, ప్రకృతితో మమైక్యమై జీవించాలనీ భావించారు. ఈ తపనే అద్వైత్ లివింగ్ ఫార్మ్ ఏర్పాటుకు దారిచేసింది.
యమునా నది ఒడ్డుకు సమీపంవో మూడు దశాబ్దాలుగా మీనాక్షి కుటుంబం ఆవ, గోధుమ వంటి పంటలను సాగుచేస్తూ వచ్చింది. ఎరువులతో, క్రిమిసంహారక మందులతోనే ఆ వ్యవసాయం సాగుతూ వచ్చింది. 2016లో ఉద్యోగం వదిలేసి తిరిగి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు, మీనాక్షి కూడా అక్కడ మామూలు వ్యవసాయ పద్ధతులనే అనుసరించారు. కానీ తను తినే ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ప్రారంభించినప్పుడు, ప్రాసెస్ చేసిన ఆహారంతో పోలిస్తే నాణ్యతలో ఉన్న పెద్ద వ్యత్యాసాన్ని ఆమె గ్రహించారు. అంతే, అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అద్వైత్ లివింగ్ స్టోర్‌లో లభించే సహజమైన నూనెలు

సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు

తమ వ్యవసాయ క్షేత్రంలో సాగు విధానాన్ని మార్చాలని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నారు. “నేను ఇంటికి తిరిగి వచ్చినప్పటి తొలిరోజుల్లో నిమ్మచెట్లు ఉన్న ఓ ప్రదేశానికి వెళ్లి 25 కిలోల దాకా నిమ్మకాయలు కోసి ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా అమ్మ ఆశ్చర్యపోయింది. ఇన్ని నిమ్మకాయలతో ఏం చేస్తావని అడిగింది. ఒక చెట్టుకు ప్రత్యేకించి అలా చాలా నిమ్మకాయలు కాయడం నేను గమనించాను. ప్రకృతితో జీవించడం ఎలాగో ఇది నాకు నేర్పింది. ప్రకృతి మనకు అవసరమైన దాని కంటే ఎక్కువే ఇస్తుంది… అని వివరిస్తారు మీనాక్షి. సుస్థిర వ్యవసాయం అనే భావన ఆమెలో అలా తటిల్లతలా మెరిసింది. షరా మామూలు వ్యవసాయం నుండి జీవవైవిధ్యంతో కూడిన సుస్థిర వ్యవసాయానికి మారాలని మీనాక్షి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి ఆమె తండ్రి అశోక్ కిశోర్, సోదరి సోమ్య కిశోర్ నుండి కూడా సమర్థన లభించింది. అప్పటి నుంచి మీనాక్షి తమ పొలాన్ని సుస్థిర వ్యవసాయానికి సిద్ధం చేస్తూ వచ్చారు. కానీ సాంప్రదాయ వ్యవసాయం నుండి ఒక్కసారిగా మారడం అంత సులభమేం కాదు. పైగా వ్యవసాయంలో తనకి పెద్దగా అనుభవం లేకపోవడం ఒక అవరోధం. తన కార్యక్షేత్రంలో ఆచరణాత్మక శిక్షణతో పాటు అలవాటు లేకపోవడం వంటి లోపాలున్నాయని మీనాక్షి గ్రహించడం ప్రారంభించారు.
“సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించేటప్పుడు భారతదేశంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లలో ఒకటి.. ఆచరణాత్మకంగా శిక్షణ పొందిన నిపుణుల కొరత. మన నిపుణులు సాధారణంగా విద్యాపరంగా మాత్రమే శిక్షణ పొందుతారు, కానీ క్షేత్రపరిజ్ఞానం విషయానికి వస్తే అవసరమైన ఆచరణాత్మక జ్ఞానం వారికి ఉండదు ” అని మీనాక్షి వివరిస్తారు.


కొత్త వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఆగ్రా, ఆ చుట్టుపక్కల రైతులను ఆమె కలుసుకున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి మరింత తెలుసుకోవాలనే తపనతో చండీగఢ్‌‌లోని తమ బంధువుల వ్యవసాయ క్షేత్రాలను కూడా సందర్శించారు. రెండేళ్ల పాటు తిరుగుతూ పెర్మాకల్చర్, పునరుజ్జీవ వ్యవసాయ విధానాలను ఆమె పరిశోధించి ఎంతో నేర్చుకున్నారు. అలా ఈ పద్ధతుల వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఆమె ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ అనుభవం తమ అద్వైత్ లివింగ్‌ పొలంలో పెర్మాకల్చర్‌, రీజనరేటివ్ సాగు ప్రారంభించేందుకు తోడ్పడిందని ఆమె చెబుతారు. మీనాక్షి తమ పొలంలో గోమూత్రం, గోమయంతో ఎరువులు తయారుచేసి వాడడం నేర్చుకున్నారు. భూసారాన్ని పెంచేందుకు బయో ఫెర్టిలైజర్లకి మించినవి లేవని తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ప్రాణీ పాత్ర పోషిస్తుందని గ్రహించారు.
రీజనరేటివ్ ఫార్మింగ్ అంటే అత్యధిక పోషకాలు కలిగి ఉండే ఆహార దినుసులను ఉత్పత్తి చేసే విధానం. అలాంటి సాగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకు సహజమైన భూసారం అవసరం. అక్కడ పండేవాటిని పాలిష్ పట్టరు. ప్రాసెసింగ్‌లో హోర్మోన్లు ఉపయోగించరు. సహజంగా చెట్లపై పండిన పండ్లు, కూరగాయలనే వినియోగిస్తారు. స్థూలంగా ఇదీ పునరుత్పత్తి వ్యవసాయ విధానంలోని ప్రత్యేకత.
“పెర్మాకల్చర్ అనేది భవిష్యత్ తరాలు కూడా ఉపయోగించుకునే విధంగా భూవినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే ప్రయత్నం. ఇక పునరుత్పత్తి వ్యవసాయం (రీజనరేటివ్ ఫార్మింగ్) అనేది మరో అడుగు ముందుకు వెళుతుంది. ఇది భూమికి ఎటువంటి హానీ చేయదు. ఇది భూమిని, పర్యావరణాన్ని పునరుజ్జీవింపచేసే సమగ్ర భూనిర్వహణ పద్ధతి. దీంతో భూసారం పెరుగుతుంది. దీంతో ఆహార దిగుబడి పెరుగుతుంది. ఫలితంగా రైతుల ఆదాయం సైతం పెరుగుతుంది…” అని మీనాక్షి వివరిస్తారు.
ఈ సుస్థిర వ్యవసాయంలోని విశేషమేమిటంటే, ఇందులో పొలం దున్నడం అంటూ ఉండదు. కెమికల్ ఎరువులు, పురుగు మందుల వాడకం అసలే ఉండదు. నీటి వినియోగ సహజ పద్ధతులతో జీవవైవిధ్యసూత్రాన్ని అనుసరిస్తూ ఇక్కడ సాగు జరుగుతుంది.

చిన్న రైతులకు తోడ్పాటు

పునరుత్పత్తి వ్యవసాయం నేర్చుకోవటానికి తొలినాళ్లలో మీనాక్షి కొన్ని ఆటంకాలు ఎదుర్కోక తప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలు వ్యవసాయం చేయడం తక్కువ. ఆడవాళ్లు వ్యవసాయం చేయటమేమిటని ఎగతాళి చేయడమూ ఉంటుంది. ఇక్కడ లింగవివక్షతో పాటు మహిళలపై జరిగే నేరాలు కూడా ఎక్కువ. అయితే, తండ్రి అండదండలతో మీనాక్షి విజయవంతంగా తన సుస్థిర వ్యవసాయం కొనసాగించారు.
వ్యవసాయతో పాటు సుమారు ఏడాదిన్నర కిందట పండ్లు, కూరగాయలు విక్రయించడానికి ఆగ్రాలో అద్వైత్ లివింగ్ ఫార్మ్స్ (Advait Living Farms) అనే ఒ రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించారు మీనాక్షి. మొదట్లో కాస్త ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేవాటినే స్టోర్‌లో పెట్టేవారు. కానీ వినియోగదారుల డిమాండ్ గమనించాక స్టోర్‌ను విస్తరించడం మొదలుపెట్టారు. ఇందుకోసం చిన్న, సన్నకారు రైతులను సంప్రదించారు. వారు సరఫరా చేసే ఆహార ఉత్పుత్తులను తన స్టోర్‌లో విక్రయించడం ప్రారంభించారు. అద్వైత్ లివింగ్ ఫార్మ్స్‌ స్టోరును ఇలా విస్తరించడంలో మీనాక్షికి రెండు ఉద్దేశ్యాలున్నాయి. మొదటిది సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయం కల్పించడం. రెండవది పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.
“మార్కెట్ యాక్సెస్ ఎప్పుడూ రైతులకు, ముఖ్యంగా చిన్న రైతులకు పెద్ద సవాలుగానే ఉంటుంది. మండీల్లోలో సేంద్రియ వ్యవసాయానికి, సేంద్రియేతర సాగుకీ మధ్య తేడా ఏమీ ఉండదు. మీకు లభించేవి మండీ నిర్ణయించే రేట్లు మాత్రమే. రైతులు అక్కడ నష్టపోతున్నారు. అందుకే ప్రధానంగా చిన్నరైతులతో కలిసి పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం” అని మీనాక్షి చెబుతారు.
ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం చేసే 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగిన రైతులతో అద్వైత్ లివింగ్ కలిసి పనిచేస్తోంది. అలాగే అద్వైత్ పొలాల్లో కూడా రైతులు పని చేస్తారు. వారంతా సేంద్రియ వ్యవసాయ నైపుణ్యాలలో శిక్షణ పొందినవారే.

అన్నీ ఆర్గానిక్ దినుసులే…

ఇవాళ, అద్వైత్ లివింగ్ ఏటా రూ. 50 లక్షలు ఆర్జిస్తోంది. అలాగే 1000 మందికి పైగా వినియోగదారులకు చేరువైంది. వచ్చే ఏడాదినాటికి తమ కంపెనీ నాలుగు రెట్లు విస్తరిస్తుందని మీనాక్షి ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆగ్రాలోని బాగ్ ఫర్జానా వద్ద ఉన్న (Bagh Farzana) ఆద్వైత్ లివింగ్ స్టోర్‌లో సంప్రదాయ పద్ధతుల్లో తీసిన ఆవనూనె, కొబ్బరి నూనె, పాలిష్ చేయని పప్పులు, పొట్టుతో కూడిన గోధుమ పిండి, A2 ఆవు నెయ్యి, తేనె, బెల్లం, నాన్-జెనెటికల్లీ మోడిఫైడ్ దేశీ బియ్యం రకాలు, మసాలా దినుసులు వంటివి చక్కటి ప్యాక్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ లభించే ఆహార దినుసులన్నీ ఆర్గానిక్ పద్ధతుల్లో పండించినవే.
తాము అనుసరించే వ్యవసాయ పద్ధతి వాతావరణ అనుకూలమైనదేకాక ఆచరణాత్మకత కలిగినదని ఆమె వివరిస్తారు. ఈ తరహా సుస్థిర వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మీనాక్షి పలు పెద్ద కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. “పునరుత్పత్తి వ్యవసాయం రైతులకు, వారి ఆదాయాన్ని మూడు రెట్లు పెంచడానికి దోహదపడుతుంది. పునరుత్పత్తి వ్యవసాయం ప్రకృతితో అమరికలో పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా మన భూమండలానికిది ఎంతో అవసరం” అని ఆమె అంటారు.
‘అద్వైత్’ అంటే స్థూలంగా అంతా ఒకటే అని అర్థం. ప్రకృతి మనలో భాగం. మనం ప్రకృతిలో భాగం. కనుక ప్రకృతి మనపై ప్రభావం చూపినట్లే, మన చర్యలు ప్రకృతిని సైతం ప్రభావితం చేస్తాయి. అందుకే స్థిరమైన ఆహార జీవన శైలికి అవకాశం ఇవ్వాలని ఆమె వినియోగదారులను కోరుతున్నారు. తీరిక చిక్కినప్పుడు సుస్థిర వ్యవసాయ విధానాలపై ఆమె రైతుల్లోను, విద్యార్థుల్లోను అవగాహన కల్పిస్తున్నారు కూడా.
“ప్రకృతితో ప్రేమలో పడటం వల్ల ప్రపంచంలో లభ్యమయ్యేవాటికి మనం మరింత కృతజ్ఞులమై ఉండాలని అర్థమైంది. ప్రకృతిలో మనందరికీ కావలసినంత, సరిపడినంత ఆహారం ఉంది. అందుకు అవసరమైన వనరులు ఉన్నాయి. ఈ భావనే ఈ రోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది” అని సంతృప్తిగానూ, తాత్త్వికంగానూ చెబుతారు మీనాక్షి. కోవిడ్ 19 తర్వాత ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల పట్ల అవగాహన పెరిగిందనీ, ఇది సుస్థిర వ్యవసాయం మరింత ప్రాచుర్యం పొందేందుకు దోహదపడుతుందనీ మీనాక్షి అంటున్నారు. కార్పొరేట్ ప్రపంచం వదిలి, సేంద్రియ సేద్యంతో ఒక పోషకాహార వనాన్ని సృష్టించి, రైతన్నలకు సాయపడుతూ పదుగురికీ ఆదర్శంగా నిలచిన మీనాక్షి అభినందనీయురాలు.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Advait Living Farms
+91 90848 94625
advaitliving@gmail.com

Exit mobile version