రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ ఎరువులు వాడరు. పైరు ఎదుగుదలను క్రమబద్ధీకరించేందుకు కృత్రిమ పదార్థాలను అసలే వినియోగించరు. క్రిమి సంహారకాలను ఏమాత్రం చల్లరు. పశువుల ద్వారా వచ్చే ఎరువులే ఉపయోగిస్తారు. పంట మార్పిడి విధానం అవలంబిస్తారు. పచ్చి ఆకులతో తయారుచేసిన ఎరువునే వాడతారు. వ్యవసాయ సేంద్రీయ వ్యర్థాలను వినియోగిస్తారు. ఇలాంటి పద్ధతుల్లో పంటలు పండించడాన్నే ఆర్గానిక్‌ వ్యవసాయం అంటారు. లేదా సేంద్రీయ లేదా సహజసిద్ధ వ్యవసాయం అంటారు. ఆర్గానిక్‌ విధానంలో చేసే సాగు కారణంగా భూమిలో సారం పెరుగుతుంది. పంటలకు కావాల్సినంత పోషకాలు అందుతాయి. పంటలను క్రిమి కీటకాలు ఆశించవు. ఇవన్నీ సహజసిద్ధ వ్యవసాయ విధానంలో సాధ్యమయ్యే గొప్ప విషయాలివి. ప్రకృతి సిద్ధ విధానంలో వ్యవసాయం చేస్తే వ్యవసాయోత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభించినట్లవుతుంది. దశాబ్దాలుగా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పారదోలవచ్చు. మరిన్ని ఎక్కువ చిన్న చిన్న రైతు కుటుంబాలు ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చేలా అనుసంధానం చేయవచ్చు. తద్వారా ఆహార భద్రతకు భరోసా కల్పించవచ్చు. సరిగ్గా ఇలాంటి విధానంలోనే సహజసిద్ధంగా పంటలు పండిస్తూ నెలకు రూ.3 లక్షల దాకా ఆదాయం సంపాదిస్తున్న తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన యువ రైతు వాసు విషయాలు తెలుసుకుందాం.ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్న ఈ యువ రైతు వాసు పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అయితేనేం.. ఆర్గానిక్‌ కూరగాయలు పండించే వాసు అంటే మంచిర్యాల మొత్తంలో అందరికీ బాగా తెలుసు. ఆర్గానిక్‌ విధానంలో పంటలు పండించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. రసాయనాలు వాడి పండించిన కూరగాయల్ని పలువురు ఇష్టపడకపోవడాన్ని తాను పలుమార్లు గమనించానన్నాడు. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు పంటల నాణ్యతపై చెడు ప్రభావం చూపుతాయి. అదే సహజసిద్ధ విధానంలో పండే పంటలు నాణ్యంగా ఉంటాయని.. అదే తాను ఆర్గానిక్‌ పంటలు ప్రారంభించడానికి కారణం అన్నాడు. రసాయనాలతో పండించే పంటల నిర్వహణ, వాటికి ఖర్చు కూడా ఎక్కువ అవుతాయి. పైగా వాటికి మార్కెట్లో క్రమంగా డిమాండ్ కూడా తగ్గిపోవడాన్ని గమనించానన్నాడు వాసు. రసాయనాలతో పండించే పంటలకు నాణ్యత తగ్గడం, రుచిగా లేకపోవడంతో ప్రజలు వాటిని ఇష్టపడడం లేదన్నాడు. అలాంటి పంటలకు డిమాండ్‌తో పాటు వ్యాపారమూ తగ్గిపోతోందన్నాడు. ఈ విషయాలన్నీ రైతు కుటుంబానికి చెందిన తాను తన చిన్నప్పటి నుంచీ గమనిస్తూనే ఉన్నానన్నాడు. అందుకే లాభసాటిగా వ్యాపారం చేయడంతో పాటు ప్రజలకు కూడా ఉపయోగం ఉండేలా కొత్తగా ఏదైనా చేయాలని వాసు నిర్ణయించుకున్నాడట.అలా చేయడం ఎలా అనే సందిగ్ధ పరిస్థితి తొలుత వాసుకు కలిగిందట. పురుగుమందులు, రసాయన ఎరువులు లేకుండా జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ చేయడంపై ప్రకృతి వ్యవసాయం పితామహుడు సుభాష్ పాలేకర్‌ రాసిన వ్యాసాలను చూశాడట. సుభాష్ పాలేకర్‌ రాసిన వ్యాసాలే తాను సహజసిద్ధ వ్యవసాయం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వాసు చెప్పాడు. దాంతో తన తండ్రికి ఉన్న 10 ఎకరాల పొలంలో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. అది మొదలు తమ పొలంలో ఒక్క మిల్లీ లీటర్‌ పురుగుమందు కానీ, ఒక్క చెంచాడు రసాయన ఎరువు కానీ వాడకుండా సహజ వ్యవసాయం చేస్తున్నట్లు వాసు తెలిపాడు. సహజ వ్యవసాయం అయితే వాసు ప్రారంభించాడు కానీ.. అనుభవం లేకపోవడంతో తొలి రోజుల్లో కాస్త వెనకడుగు వేశాడట. అయితే.. ఒక సంవత్సరం తర్వాత తన తప్పులేంటో తెలుసుకున్నాడట. అప్పటి నుంచి ఆర్గానిక్‌ విధానంలో కూరగాయలు పండించడం ప్రారంభించానని వాసు చెప్పాడు. ఆర్గానిక్‌ కూరగాయలు అమ్మడం ద్వారా వాసుకు బాగా లాభాలు వచ్చాయట. ఆరేళ్లుగా వాసు ఆర్గానిక్‌ పంటలే పండిస్తున్నాడు. ప్రకృతిసిద్ధ వ్యవసాయంలో ఈ ఆరేళ్ల తన అనుభవంతో వాసు ఇప్పుడు తనదైన ప్రత్యేక శైలిలతో మరింత అధికంగా పంట దిగుబడులు సాధిస్తున్నాడు.వాసు తమ పొలంలో ఆర్గానిక్‌ విధానంలో ప్రధానంగా వరి, మామిడి పంటలు పండిస్తున్నాడు. వాటితో పాటు కంది, మొక్కజొన్న పంటల సాగు కూడా చేస్తున్నాడు. బుద్ధేశ్వర్‌, కాలాబట్టి, రత్నచోడి, రాణికంగా, డిల్లీ బాస్మతి రకం వరి ధాన్యాలు పండిస్తున్నాడు. నాలుగు ఎకరాల్లో మామిడి పంట వేశాడు. ఇంకా పుచ్చకాయలు కూడా పండిస్తున్నాడు. వ్యాపార మెళకువలు తెలిసిన వాసు వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు తమ వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల పంటలు పండిస్తుంటాడు. అదే తనకు లాభాలు కూడా తెచ్చిపెట్టేందుకు ఉపయోగపడిందంటాడు.వాసు తన ఆర్గానిక్‌ వ్యవసాయానికి నీటి సరఫరా కోసం డ్రిప్ ఇరిగేషన్‌ విధానం వినియోగిస్తున్నాడు. డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో పంటలకు తక్కువ నీటి వినియోగం అవుతుంది. ఒక్క చుక్క నీరు కూడా వృథా అవదు. దాంతో వాసు పొలంలో మరిన్ని ఎక్కువ మొక్కలకు నీటి సదుపాయం కలుగుతోందంటాడు. పది ఎకరాల క్షేత్రంలో మొక్కలకు డ్రిప్‌ విధానంలో నీటిని సరఫరా చేసేందుకు వాసు కేవలం ఒకే ఒక్క మోటార్ వినియోగిస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్‌ పద్ధతిలో వాడే పైపులు కొని, అమర్చడానికి తొలుత కాస్త ఖర్చు ఎక్కువైనా.. దీర్ఘకాలం ఒనగూరే ప్రయోజనాలను బేరీజు వేసుకుంటే అంతగా లెక్క చేయాల్సిన పనిలేదంటాడు. పైగా డ్రిప్ ఇరిగేషన్‌ నిర్వహణ చాలా సులువు అంటాడు. పైగా డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవసాయానికి కూలీలు, వారికి అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గిపోతుందని చెప్పాడు. వాసు తన వ్యవసాయానికి అవసరమైన వాననీటిని నిల్వచేసుకునేందుకు 75 సెంట్లలో ఓ చెరువు తవ్వాడు. వాననీరు శుద్ధంగా ఉంటుంది. బ్యాక్టీరియాలు అతి తక్కువ ఉంటాయి. వాననీటిని పంటలకు వినియోగించినప్పుడు అవి చాలా ఆరోగ్యంగా ఎదుగుతాయని వాసు అనుభవ పూర్వకంగా చెబుతున్నాడు. దాంతో పంట దిగుబడులు కూడా అధికంగా వస్తున్నాయంటాడు. పొలం గట్లపైన వాసు వేప, మలబారు చెట్లు పెంచుతున్నాడు. వాటి నుంచి కూడా వాసు అదనపు ఆదాయం రాబట్టుకుంటున్నాడు.ఆర్గానిక్‌ సాగులో ఇంత అనుభవం సంపాదించిన వాసు ఔత్సాహిక యువ రైతులకు ఓ సలహా ఇస్తున్నాడు. ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలనుకునే వారు ముందుగా తక్కువ పొలంలో సాగు చేయాలని సూచిస్తున్నాడు. ముందుగా ఆర్గానిక్ విధానంలో కూరగాయలు పండిస్తే.. ఇంటి అవసరాలకు సరిపోతాయంటున్నాడు. దాంతో ఆర్గానిక్‌ సాగులో చేయకూడనివి, చేయాల్సిన పనులేంటో స్పష్టంగా అవగాహన వస్తుందంటున్నాడు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభాల పంట పండుతుందంటున్నాడు.

ఆర్గానిక్‌ పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పట్టణాలు, నగరాల్లో నివసించే అనేక మందిలో ఆర్గానిక్‌ ఉత్పత్తుల పట్ల అవగాహన పెరిగింది. దాంతో ఆర్గానిక్‌ పంటలను వినియోగించేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్గానిక్‌ పంట ఉత్పత్తును హోల్‌ సేల్‌ వ్యాపారులకు కాకుండా స్వయంగా వినియోగదారులకు విక్రయించుకుంటే లాభాలు మరింతగా ఉంటాయని వాసు వివరించాడు. మనం పండించే ఆర్గానిక్‌ పంట ఉత్పత్తుల్లో నాణ్యత ఎక్కువగా ఉంటే విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మరిన్ని ఎక్కువ లాభాలు పొందవచ్చని చెబుతున్నాడు వాసు. వాసు తాను పండిస్తున్న ఆర్గానిక్‌ వరి ధాన్యం ద్వారా ఎకరాకు రూ.30 వేలు చొప్పున నాలుగు ఎకరాల్లో రూ.1.20 లక్షలు, మామిడి ద్వారా ఎకరాకు రూ.40 వేలు చొప్పున మరో నాలుగు ఎకరాల నుంచి రూ.1.60 లక్షల లాభం సంపాదిస్తున్నాడు. మరో 8 ఎకరాల్లో వాసు ఆర్గానిక్‌ కూరగాయలు పండిస్తున్నాడు. వీటన్నింటి ద్వారా వాసు నెలకు దాదాపు రూ.2.80 లక్షల లాభాలు సంపాదిస్తున్నాడంటే ఎవరైనా ఊహించగలమా?! జాగ్రత్తగా ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు రావడం ఖాయం అని ఔత్సాహిక యువ రైతులకు వాసు చెబుతున్నాడు. ఆర్గానిక్‌ వ్యవసాయానికి ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తే మరింత ఎక్కువగా ఆర్గానిక్‌ ఉత్పత్తులు సాధించడం సాధ్యమవుతుందని చెబుతున్నాడు వాసు. ఆర్గానిక్‌ పంటల సాగుపై ఎక్కువ మంది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు మరింత ముందుకు రావాలని వాసు సూచిస్తున్నాడు. ఆ విధంగా మరింతగా కృషి జరిగితే.. భవిష్యత్‌లో ఆరోగ్య భారతదేశాన్ని మన కళ్లారా చూడగలం అంటున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here