రుతువులు, కాలాలు, వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలు పండిస్తుంటారు. సాంప్రదాయ పంటలకు కాస్త భిన్నంగా ఆలోచించే అన్నదాతలు మరికొంత ముందుచూపుతో లాభసాటిగా ఉంటుందో ఆలోచించి మరీ ఆయా పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పుడు జనవరి నెలాఖరులో ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలోగా ఎలాంటి కూరగాయల సాగు ప్రారంభిస్తే రైతు చేతిలో రొక్కం దండిగా పడుతుందో చూద్దాం.

 

ఎండాకాలంలో ఎలాంటి కూరగాయకైనా సాధారణంగా ధరలు ఎక్కువే పలుకుటుంటాయి. లేకపోయినా మామూలుగా మినిమమ్‌ రేటుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 4వ తేదీలోపు బెండ విత్తనాలు నాటుకుంటే పంట చేతికి వచ్చేసరికి మంచి ఫలితం ఉంటుంది. అయితే.. బెండ విత్తనం ఎంపిక చేసుకునే సమయంలో కాయ సైజు, ఎంత పచ్చగా ఉంటుంది.. స్థానిక మార్కెట్‌లో ఎలాంటి బెండకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందనే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.బెండలో సస్యరక్షణ చర్యలను బట్టి దిగుబడి ఉంటుంది. బెండమొక్కల నుంచి రోజు విడిచి రోజు కాయలు కోతకు వస్తాయి. దిగుబడి ఎక్కువ ఇచ్చే బెండ మొక్కకు మొదళ్లలో వేసే ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్టాయి. బెండ విత్తనాలు నాటుకునే ముందే భూమిని తయారు చేసుకునే సమయంలో పశువుల ఎరువులు కానీ, డీఏపీ, యూరియా లాంటివి తప్పనిసరిగా వేసుకుని సారవంతంగా తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.ఫిబ్రవరి నెలలోనే పచ్చిమిర్చి సాగు కూడా అన్నదాతకు లాభాలు పండిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారం లోగానే పచ్చిమిర్చి నారు నాటుకోవాలి. ఆ తర్వాత ఎండలు ఎక్కువ అవుతాయి కాబట్టి మనం నాటిన నారు బతికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నారు. అంతకు మించి ఆలస్యం చేస్తే.. పచ్చిమిర్చిలో పూత, కాత సరిగా రాదు. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఎండాకాలంలో పంట చేతికి వస్తుంది కాబట్టి కాస్త దిగుబడి తగ్గినా ధర ఎక్కువ ఉంటుంది కనుక రైతుకు లాభసాటిగానే ఉంటుంది. అయితే.. ఎండాకాలాన్ని తట్టుకునే రకాలు మాత్రమే వేసుకోవాలంటున్నారు నిపుణులు. వేసవిలో పచ్చిమిర్చి కొద్దిగా తక్కువ దిగుబడి వచ్చినా ఇబ్బంది ఉండదు. ఎండాకాలంలో ఎలాగూ ధర ఎక్కువ వస్తుంది. పైగా 8 నెలల వరకు పంట చేతికి వస్తూనే ఉంటుంది. జూన్‌, జులై నెలలలో ఒకటి రెండు వర్షాలు కురిసినప్పుడు కూడా మిర్చికి మంచి ధరే పలుకుతుంది.మిర్చి నారు నాటిన 40 నుండి 50 రోజుల మధ్య నుంచి దిగుబడి వస్తుంటుంది. ఫిబ్రవరిలో నాటుకునే పచ్చిమిర్చిలో జెర్సీ 56, కలశ 1628, కృష్ణ లాంటి రకాలు మంచి దిగుబడులు ఇస్తున్నాయి. ఫిబ్రవరిలో విత్తనాలు నాటుకుంటే పంట రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి నారు నాటుకుంటే మేలు అంటున్నారు వ్యవసాయ నిపుణులు. అయితే.. పచ్చిమిర్చి సాగు చేసే రైతులు ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి తప్పనిసరిగా పురుగుల మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మిర్చిని కోయడానికి కూలీలు అవసరం ఉంటుంది. కూలీలు అందుబాటులో ఉన్నారో లేదో చూసుకుని పచ్చిమిర్చి సాగుచేసుకోవచ్చని చెబుతున్నారు. కొత్తగా పచ్చిమిర్చి సాగుచేయాలనుకునే రైతులు ఎవరైనా ఒకేసారి పెద్దమొత్తంలోకి వెళ్లకుండా ముందుగా అర ఎకరంలో మొదలు పెడితే మంచిది.ఇక.. ఎండాకాలంలో పంట చేతికి వచ్చేందుకు ఫిబ్రవరిలోనే టమాటా సాగు ప్రారంభిస్తే ఫలితం బాగుంటుంది. ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు కూడా టమాటా నాటుకోవచ్చు. ఆ తర్వాత టమాటా సాగు మొదలు పెడితే ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చు. పైగా ఎండలు ఎక్కువ అయితే.. నారు బతికే అవకాశాలు తక్కువ ఉంటాయి. మొక్క ఎదుగుదల కూడా అంతగా ఉండదు. ఒకవేళ ఎండాకాలంలో టమాటాకు ఎక్కువ ధర వచ్చినా రాకపోయినా.. వర్షాకాంలో మాత్రం మంచి రేటు పలుకుతుంది. టమాటాను ఒకేసారి ఎక్కువ మొత్తంగా కాకుండా కొంచెం కొంచెంగా విడతలవారీగా నాటుకుంటే.. ఏడాది పొడవునా ఆదాయం చేతికి వస్తుంది. టమాటా సాగు చేయాలనుకునే రైతులకు తప్పకుండా దానికి వచ్చే తెగుళ్ల గురించి అవగాహన ఉండాలి. టమాటా మొక్కకు డిసీజ్ సోకితే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి గురించి తెలియడమే కాకుండా నివారణ చర్యలపై అవగాహన ఉండాలి.ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలోనే వంకాయ సాగు ప్రారంభిస్తే వేసవికాలంలో ఫలితం బాగుంటుంది. వేసవిలో వంకాయ దిగుబడి ఎక్కువగా రాకపోయినా వర్షాకాలంలో దిగుబడి బాగుంటుంది. ఏడాదిపాటు వంగ పంట చేతికి వస్తూనే ఉంటుంది. అయితే.. వంగతోట పెట్టాలనుకునే రైతులు గ్రాఫ్టింగ్‌ విధానం ఎంచుకుంటే మేలు అని వ్యవసాయ నిపుణుల సూచన. ఏడాది నుంచి రెండేళ్ల వరకు కూడా మంచి దిగుబడి ఇస్తుందన్నారు. వంకాయలో అనేక వెరైటీలు ఉంటాయి. వాటిలో స్థానిక మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఎక్కువ ఉంటుందో తెలుసుకుని వేసుకోవాలి. ఏ కూరగాయల పంట సాగు చేసినా ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా అనుభవం వచ్చే వరకు కొద్ది మొత్తంలో చేసుకుంటే మేలు.బీర కూడా ఫిబ్రవరిలో వేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఫిబ్రవరిలో వేసిన బీరకు వేసవిలో పంట వస్తుంది. దీనికి కూడా తెల్లదోమ లాంటి తెగుళ్ల బెడద ఉండవచ్చు. వాటికి వాడాల్సిన మందులు ఇతర విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే సమ్మర్‌లో కాకర కూడా మంచి ఆదాయమే ఇస్తుంది. ఈ రెండు పంటలకు పందిరి వేసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. పుచ్చకాయ పంట కూడా ఇదే సమయంలో వేసుకుంటే లాభసాటిగా ఉంటుంది. ఇది వేసిన 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీనికి బూడిద తెగులు, త్రిప్ట్స్‌ లాంటివి సోకే అవకాశం ఉంది. బోరాన్ లోపం ఉంటే పుచ్చకాయకు పగుళ్లు వస్తాయి. ఇలాంటి విషయాలు ముందుగానే అవగాహన పెంచుకోవాలని నిపుణుల సూచన.

ఫిబ్రవరి నెలలోనే మొక్కజొన్న వేసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చే రకాలు ఉన్నాయి. మొక్కజొన్నకు బైబ్యాక్ ఒప్పందంతో కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వాటితో ముందే ఒప్పందం చేసుకుంటే నష్టాల మాటే ఉండదు. పక్షులు తినడం తప్ప మొక్కజొన్న పంటకు రిస్క్ తక్కువ ఉంటుంది.వేసవిలో దిగుబడి వచ్చేలా కూరగాయలు, పుచ్చ, మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు ముందుగానే వాటికి వచ్చే తెగుళ్లు, వాడాల్సిన మందులకు సంబంధించిన అవగాహన పెంచుకోవాలి. యూట్యూబ్‌లో ఇప్పుడు ఈ సమాచారం అనేక వీడియోలలో లభిస్తుంది. వాటిని చూసి కూడా తెలుసుకోవచ్చు.

ఇతర వివరాలను. వాట్సాప్‌ నెంబర్‌ 8328658415 కు మాత్రమే మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు.