కలుపు మొక్కలు లేదా పిచ్చిమొక్కలతో పంటలకు నష్టం అనుకుంటారు రైతులు. వరిచేలో గాని, తోటలో కానీ కలుపుగడ్డి మొలిచిందంటే పీకిపారేస్తాం.. మరీ ఎక్కువగా ఉంటే నాగలితో గానీ, ట్రాక్టర్‌తో గానీ దున్నేసి, ఆపైన కాల్చేస్తాం. కానీ కలుపుమొక్కలు ప్రధాన పంటకు సహాయకారులు అని, భూమిలో పోషకాలు, ఖనిజాల లోపాన్ని సరిచేసేందుకు భూమి తయారుచేసుకునేవి అని ఎంతమందికి తెలుసు? కలుపుమొక్కలు రైతులకు ఒక వరం లాంటివని, వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే ప్రధాన పంట నుంచి మరింత అధిక దిగుబడి వస్తుందని రైతులు తెలుసుకోవాలంటారు నోమాడిక్‌ కోటి రైతు రామ్‌.

ఎండాకాలంలో పొలంలో ఎంత గడ్డి, లేదా కలుపు ఉంటే ఆ భూమికి అంత విలువ ఉంటుంది.  ఇదే పశువులకు కడుపు నింపే మేత అవుతుంది. ప్రధాన పంటలో కలుపుమొక్కలు, లేదా గడ్డి వస్తే.. దాన్ని వేస్ట్‌గా భావిస్తాం కానీ, మన పశువులకు ప్రధాన ఆహారంగా మారుతుంది. కలుపు కూడా ఒక క్రాపే అంటారు రామ్‌.కలుపు లేదా గడ్డిని ఎందుకు తీసేస్తున్నారో రైతుల దగ్గర సరైన కారణం కనిపించదంటారు. కలుపును నాశనం చేయడానికి రైతుల వద్ద ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. మెయిన్ క్రాప్‌ నుంచి కలుపుమొక్కలు శక్తిని లాగేసుకుంటాయని అంటారు. అంటే.. కలుపు మొక్కలు ప్రధాన పంటకు వేసే పోషకాలు, లవణాలు, ఖనిజాలను లాగేసుకుంటాయనేది రైతుల్లో ఉన్న ప్రధాన అవగాహనా లోపం. ఆ అభిప్రాయం తప్పు అని శాస్త్రీయంగా తేలిందని చెప్పారాయన. ఒక ఔత్సాహికుడు చేసిన ప్రయోగాన్ని వివరించారు రామ్‌. ఒక మొక్క ఒక గ్రాము ఎరువు తీసుకొని ఐదేళ్లలో 12 నుంచి 13 వందల జీవుల నుంచి వచ్చే సేంద్రీయ పదార్థాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆ మొక్క ఐదేళ్లలో 60 గ్రాముల ఎరువు మాత్రమే వాడుకుని చెట్టుగా ఎందిగిందన్నారు. అంటే భూమి నుంచి ఆ మొక్క చాలా తక్కువ ఎరువు వినియోగించిట్లు స్పష్టం అయింది. పొలంలోని కలుపుమొక్క కూడా ఒక్క గ్రాము ఎరువు తీసుకొని 1.2, లేదా 1.3 సేంద్రీయ పదార్థాన్ని తయారుచేస్తుందన్నారు. ఇలా చూస్తే.. పొలంలో ఎక్కువగా గడ్డి కనిపిస్తుంది. గడ్డి బరువు ఎంత? దానికి కావాల్సిన పోషకాలు ఎంత తక్కువో ఇట్టే అర్థం అవుతుందన్నారు రామ్‌. అంటే.. ప్రధాన పంటకు వేసే ఎరువు అంతా కలుపుమొక్కలు లాగేసుకుంటాయనే రైతుల ఆలోచనలో నిజం లేదని స్పష్టం చేశారు.ఇక రెండో అపోహ గురించి తెలుసుకుందాం. కలుపు మొక్కలు నీటిని ఎక్కువగా తీసుకుంటాయనేది రైతుల అపోహే. భూమిని మనం ఆచ్ఛాదన చేసి ఉంచకపోతే.. దానిలోని సూక్ష్మ జీవులు చచ్చిపోతాయి.  భూమి లోపల ఉండే నీళ్లు కూడా పై పొరల్లోకి వచ్చేస్తాయి. దీంతో భూగర్భ జలాల మట్టం తగ్గిపోతుంది. ఈ రెండు ప్రమాదాల నుంచి భూమిని కలుపుమొక్కలు కాపాడతాయి. భూమిపై కలుపు మొక్కలు లేకుండా పూర్తిగా తీసేస్తే.. భూసారం దెబ్బతింటుంది. నీళ్లను కాపాడుకోవడం కోసం కలుపు తీస్తున్నామని మనం భావిస్తే.. ఫలితం దానికి వ్యతిరేకంగా వస్తుంది. భూగర్భ జలాలు తగ్గిపోతాయి. తద్వారా ఆ నేలలో పంటల సాగు కష్టంగా మారుతుంది. కలుపు మొక్కలు, గడ్డి ఉంటే భూమిలో తేమ ఎక్కువ ఉంటుంది. భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు జీవించి ఉంటాయి. కలుపుమొక్కలు, గడ్డి నీళ్లు లాగేసుకుంటాయనే అభిప్రాయం కూడా తప్పు అని తేలింది.మూడో అపోహ గురించి చూస్తే.. క్రిమి కీటకాలు. కలుపు మొక్కలే కాదు ప్రతి మొక్కా కొన్ని రకాల కీటకాలను ఆకర్షిస్తాయి. మరికొన్నింటిని తిప్పికొడతాయి. పంటలను నాశనం చేసేందుకు వచ్చే శత్రు కీటకాలకు కలుపు నివాసంలా మారుతుంది. అలాటే అనేక మిత్ర కీటకాలను కూడా బాగా ఆకర్షిస్తుందంటారు రామ్‌. పచ్చగా ఉండి, కీటకాలకు నీడనిస్తుంది కలుపుమొక్క. ఒక శత్రు కీటకం వస్తే.. 14 నుంచి 15 మిత్ర కీటకాలు కూడా కలుపు ఉన్న పొలంలోని వస్తాయి. కలుపు లేకపోతే తేనెటీగలు, సీతాకోక చిలుకలు రావని, ఇవి రాకపోతే చాలా రకాల పక్షులు కూడా రావని రామ్‌ వివరించారు. దీంతో పరపరాగ సంపర్కం లేక ప్రధాన పంటకు పూత వచ్చినా కాయలు, పండ్లు ఎక్కువగా రావు అన్నారు.ఈ మూడు విశ్లేషణల ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే.. కలుపు వల్ల ప్రధాన పంటకు చాలా మేలు జరుగుతుంది. నష్టం చాలా తక్కువ అని గ్రహించాలంటారు రామ్‌. అయితే.. కలుపు వల్ల వచ్చే ప్రధానమైన ఇబ్బంది ఒకటి ఉంది. ఎక్కువ ఎత్తు ఎదిగితే.. ప్రధాన మొక్కలకు నీడ వస్తుంది. తద్వారా సూర్యరశ్మి సరిగా తగలదు. దీంతో ప్రధాన పంటకు సంబంధించిన మొక్కలు బాగా ఎదగవు. లేదా చనిపోతాయి. కాబట్టి ప్రధాన పంట మొక్కల కన్నా కలుపు మొక్కలను ఎక్కువ ఎత్తుకు ఎదగనివ్వకుండా కత్తిరించుకుంటే సరిపోతుంది. కానీ వేళ్లతో సహా పీకేయడం, లేదా దున్నేసి, తగలబెట్టడం సరికాదంటారు రామ్‌. ప్రధాన పంట మొక్కలు ఎక్కువ ఎత్తు ఎదిగితే.. అంతకు కింద ఏమి జరిగినా సమస్యే కాదన్నారు.ప్రధాన పంటకు కలుపు మొక్కలు ఎంతో మేలు చేస్తాయని రామ్‌ వివరించారు. భూమి లోపల ప్రధాన పంట మొక్కల వేరు వ్యవస్థ కొంతవరకే పరిమితం అవుతుంది. ఆ వేర్లను మరింత దూరం కొనసాగించేందుకు మైక్రో రైజల్ ఫంగై కలుస్తుంది. భూమి లోపల వేరు వ్యవస్థ ఉంటుంది. ఆ వేర్లు ఒకదానికి ఒకటి సహాయకారిగా మారతాయి. ఒక చెట్టును కొట్టేస్తే.. మిగిలి మొదలుకు చెందిన వేర్లకు భూమి లోపల ఉండే ఇతర మొక్కల వేర్లు పోషకాలు, ఖనిజాలు, నీరు అందిస్తాయన్నారు. ప్రధాన పంటకు సంబంధించిన వేర్ల వ్యవస్థ చుట్టూ ఎన్ని ఎక్కువ కలుపు మొక్కల వేర్లు ఉంటే అంత లాభం ఉంటుంది.కలుపు మొక్కల మధ్య ఉన్న ఒక కాకరపాదు, కలుపు మొత్తం శుభ్రంగా తీసేసిన కాకరపాదు మధ్య ఉన్న తేడాను రామ్‌ సోదాహరణంగా వివరించారు. పాదు మొదలులో కలుపు మొక్కలు లేని చోట ఉన్న కాకరతీగ చాలా బలహీనంగా ఉంది. చాలా ఆకులు పసుపురంగులోకి మారాయి. ఈ పాదుకు వచ్చిన చాలా పువ్వులు కాయలుగా మారడం లేదన్నారు. ఒకే ఒక్క కాకరకాయ ఆ పాదుకు కాసింది. ఇందుకు కారణం పువ్వుల్లో ఉండే తేనె కోసం సీతాకోక చిలుకలు, తేనెటీగలు రాకపోవడం, పరపరాగ సంపర్కం జరగకపోవడమే అన్నారు.రెండో కాకరపాదు మొదలు చుట్టూ ఎన్నో కలుపు మొక్కలు ఉన్నాయి. ఆ పాదు పచ్చగా, ఏపుగా ఎదిగింది. పువ్వులు చాలా వరకు కాయలు అవుతున్నాయి. చుట్టూ ఉండే కలుపు మొక్కల కారణంగా తేనెటీగలు, సీతకోక చిలుకలు రావడంతో పరపరాగ సంపర్కం బాగా జరిగి కాయలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పాదును ఎవరూ పట్టించుకోలేదు. కలుపు పీకి పారేయలేదు. సహజసిద్ధంగా కలుపుమొక్కల మధ్యే అది అంత ఆరోగ్యంగా ఎదిగింది. కలుపుమొక్కల మధ్య ఉన్న చోట కాకరపాదుకు, కలుపుమొక్కలు లేని చోట ఉన్న పాదుకు మధ్య తేడా కళ్లకు కట్టినట్టు చూపించారు. కలుపుమొక్కలను నాశనం చేయొద్దని, అవి ప్రధాన పంటకు ప్రయోజనం కలిగించేవే అన్నారు. ప్రధాన మొక్కల కన్నా ఎక్కువ ఎత్తు లేకపోతే.. కలుపు మంచిదే అన్నారు రామ్‌. కలుపుమొక్కలు ప్రధాన పంటకు వరం అంటారాయన.

రైతు రామ్‌ సౌజన్యంతో..