పర్యావరణ ఉద్యమంలో తరచు వినిపించే పేరు వందనా శివ. సామాజిక ఉద్యమాల్లో కూడా ఆమె ముందువరుసలో ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో బీటీ కాటన్ వంటి జీఎం విత్తనాల వ్యతిరేకోద్యమానికి వందనా శివ సారథ్యం వహించారు. వేలాది దేశీ వంగడాలను సేకరించి ఆమె కాపాడుతూ వస్తున్నారు. ఆమె ప్రారంభించిన “నవధాన్య” దేశీ విత్తనాల నిధిగా పేరొందింది. అమెరికన్ బహుళజాతి కంపెనీలు మన వేపను, పసుపును మేధాహక్కుల పేరుతో సొంతం చేసుకునేందుకు చేసిన కుతంత్రాలను వందనా శివ వమ్ముచేశారు. అమెరికా కోర్టుల్లో బలమైన వాదన వినిపించి పరంపరాగతమైన మన వృక్షసంపద కార్పొరేట్ తోడేళ్ల బారిన పడకుండా కాపాడగలిగారు.
వందనా శివ 1952 నవంబర్ 5న డెహ్రూడూన్‌లో జన్మించారు. వారిది రైతు కుటుంబం. తండ్రి అటవీశాఖ అధికారి (కన్సర్వేటర్‌) గా ఉండేవారు. తల్లి వ్యవసాయం పనులు చూసుకునేవారు. వందనా శివ పైచదువుల కోసం విదేశాలకు వెళ్లారు. కెనడాలోని ఆంటేరియోకు చెందిన గ్వెల్ఫ్ యూనివర్సిటీ నుండి ఆమె 1976లో ‘ఫిలాసఫీ ఆఫ్ సైన్స్‌’లో పీజీ చేశారు. “Hidden Variables and Non-locality in Quantum Theory” అంశంపై ఆమె సమర్పించిన సిద్ధాంతవ్యాసానికిగాను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆంటోరియో నుండి ఆమెకు డాక్టరేట్ (Ph.D) లభించింది. విదేశాల్లో చదువు ముగించుకుని స్వదేశం తిరిగి వచ్చిన వందనాశివ Indian Institute of Science, Indian Institute of Managementలలో పని చేశారు. మన దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆమె గమనించారు. డెహ్రాడూన్‌లో యాపిల్ తోటలు పెంచడం కోసం అడవిలోని చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం, ఒక ఏరును సైతం పూర్తిగా ఎండించి వేయడం ఆమె కళ్లారా చూశారు. మరోవేపు, హిమాలయాల్లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన “చిప్కో” ఉద్యమం ఆమెను విశేషంగా ప్రభావితం చేసింది. వృక్షాలను నరికివేయొద్దంటూ ప్రజలు చెట్లను ఆలింగనం చేసుకుంటూ జరిపిన ఆ ఉద్యమం దేశంలో ఒక సంచలనం.

“నవధాన్య” స్థాపనతో దేశీ విత్తనాల పరిరక్షణ

ఈ ఘటనలు వందనా శివను ఆలోచింపజేశాయి. సుస్థిర వ్యవసాయ విధానాలకు సంబంధించిన పరిశోధన కోసం 1982లో ఆమె Research Foundation for Science, Technology, and Natural Resource Policy (RFSTN)ను కూడా ప్రారంభించారు. ఆమె దీన్ని ప్రారంభించింది డెహ్రాడూన్‌లోని తన తల్లికి చెందిన ఒక గోశాలలో కావడం విశేషం. భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన పలు ఉద్యమాల్లో ఆమె చురుకుగా పాల్గొన్నారు. దేశంలో హరిత విప్లవం పేరుతో సాగిన రసాయన వ్యవసాయాన్ని ఆమె గట్టిగా వ్యతిరేకించారు. “గ్రీన్ రివల్యూషన్” వచ్చి దేశంలో దేశీ వంగడాలను మింగిందనీ, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి కాలుష్యాన్ని పెంచిందనీ ఆమె ఘాటుగా విమర్శిస్తారు. హరిత విప్లవం వల్లే రైతులు సంప్రదాయ వ్యవసాయ మెళకువలకు దూరమై కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడడం మొదలుపెట్టారంటారు. ఈ క్రమంలోనే వందనా శివ సీడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. 1991లో ఆమె “నవధాన్య” పేరుతో ఒక విత్తన నిధిని స్థాపించారు. ఇది ఆ తర్వాత దేశంలో 40 సీడ్ బ్యాంకులుగా విస్తరించింది. ఇవాళ “నవధాన్య”లో 630 రకాలైన దేశీ వరివంగడాలను, 150 గోధుమ రకాలను సాగు చేసి సజీవంగా ఉంచి సంరక్షిస్తున్నారు. ఇతర పంటలకు చెందిన వంగడాలను కూడా ఇక్కడ భద్రపరుస్తున్నారు. అంతా కలిపి దేశవ్యాప్తంగా వందనాశివ 3 వేల రకాలైన వరి వంగడాలను ఆమె సంరక్షించగలిగారు.

రసాయన ఎరువుల అవసరం లేదు…

దేశీ విత్తనాలను కాపాడుకోవాలని ఆమె ఇచ్చిన పిలుపుకు రైతులు పెద్దసంఖ్యలో స్పందించారు. వారి సహకారంతో నవధాన్య వేలాది రకాల విత్తనాలను భద్రపరచగలిగింది. ఈ దేశీ వంగడాలు ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణమైనవని ఆమె వివరిస్తారు. ఈ పంటల సాగుకు కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారకాలు అవసరమే లేదంటారు. కార్పొరేట్ కంపెనీల విత్తనాలను కొనుగోలు చేసి పంట వేస్తే తర్వాతి సంవత్సరం కూడా విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడవలసి ఉంటుందని ఆమె చెబుతారు. దేశీ వంగడాలను ధ్వంసం చేసే World Trade Organization’s (WTO’s), Trade-Related Intellectual Property Rights (TRIPS) Agreementను ఆమె వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వందనా శివ Diverse Women for Diversity పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ‘నవధాన్య’కు మహిళావిభాగంగా పని చేస్తుంది. 2001లో ఆమె డెహ్రాడూన్‌లో “బీజ విద్యాపీఠ్” కూడా ఏర్పాటు చేశారు. ఇది ఆర్గానిక్ సాగును నేర్పే విద్యాసంస్థగా పని చేస్తుంది. ఇక్కడ నెల రోజుల కోర్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ కోర్సులు జరుగుతున్నాయి. 2021 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో బయోడైవర్సిటీ అండ్ రైట్స్ ఆఫ్ సీడ్స్ అంశంలో ఒక ఆన్‌లైన్ కోర్సును నిర్వహించనున్నారు.

దేశీ వంగడాల పరిరక్షణోద్యమం, పర్యావరణోద్యమాల్లో భాగంగా వందనా శివ పలు పుస్తకాలు వ్రాశారు. 1997లో Biopiracy: The Plunder of Nature and Knowledge, 1999లో Stolen Harvest: The Hijacking of the Global Food Supply, 2000లో Tomorrow’s Biodiversity, 2001లో Patents: Myths and Reality, 2002లో respectively. Water Wars: Privatization, Pollution, and Profit, 2005లో Globalization’s New Wars: Seed, Water, and Life Forms, 2005లోనే Earth Democracy: Justice, Sustainability, and Peace, 2007లో Manifestos on the Future of Food and Seed వంటి పుస్తకాలను వందనా శివ వెలువరించారు. 1993లో ఆమె ప్రతిష్ఠాత్మకమైన Right Livelihood Awardకు ఎంపిక అయ్యారు.
అసలు అడవుల ప్రాముఖ్యత ఏమిటో మహిళలకే బాగా తెలుసునంటారు వందనా శివ. కలప, జిగురు వంటి వ్యాపార ప్రయోజనాల వనరుగా అడవిని చూడరాదని ఆమె చెబుతారు. అడవులు భూసారాన్ని కాపాడతాయనీ, నీటిని నిలిపి ఉంచుతాయనీ, జీవవైవిధ్యానికి దోహదపడతాయనీ ఆమె వివరిస్తారు. తన “బీజ విద్యాపీఠ్” ఒక భూమి విశ్వవిద్యాలయమనీ, అది పృథ్వీ ప్రజాస్వామ్యాన్ని నేర్పుతుందనీ వందనా శివ అంటారు. భూమిని మృతప్రాయం చేసే గ్లోబలైజేషన్ నుండి మనం ప్రకృతిని పునరుజ్జీవింపజేసే జీవవైవిధ్య పర్యావరణం దిశగా సాగాలని ఆమె పిలుపునిస్తారు. Regenerative Agriculture (Jaivik Kheti) ఆమె నినాదం. వేలాది దేశీ వంగడాలను కాపాడుతున్న వందనా శివ అక్షరాలా భారతీయ సంప్రదాయ వ్యవసాయ జ్ఞాన సంపదకు ప్రతీక.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Navdanya – Earth University (Bija Vidyapeeth) / Biodiversity Conservation Farm
Village Ramgarh / Shishambara
Old Shimla Road, P.O Sherpur
Dehradun, Uttaranchal
Phone : 91-135-2693025 / 2111015
Email: earthuniversity@navdanya.net

Navdanya Office – Delhi
A-60, Hauz Khas
New Delhi – 110 016
Phone : 91-11- 26968077 / 26532561/ 26532124
Fax: 91-11-26856795
Email: navdanya@gmail.com
navdanya.org/site

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here