ఆరు రాష్ట్రాలలోని 100 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ ఇండియా  ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం, మైక్రోసాఫ్ట్ తన స్థానిక భాగస్వామి సంస్థ Crop Dataతో కలిసి పని చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. ప్రాజెక్టు వ్యయాన్ని ఇరుపక్షాలు సమానంగా భరిస్తాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంచుకున్న 100 గ్రామాలలో రైతుల శ్రేయస్సు కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వివిధ సదుపాయాలను అందిస్తారు. అవి వారి ఆదాయాన్ని పెంచేవిగా ఉంటాయి. పంటల తాలూకు ఉత్పాదకాల ఖర్చులను తగ్గించడంతో పాటు వ్యవసాయాన్ని ఈ ప్రాజెక్టు సులభతరం చేస్తుంది. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 10 జిల్లాల్లో ఈ ప్రాజెక్టును చేపడతారు. సాగుతో పాటు పంటకోతలు, వాటి మార్కెటింగ్ వంటి అంశాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశంలో ఇలాంటి మరిన్ని పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.
అస్థిర గణాంక సమాచార అవరోధాలను తొలగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. జాతీయ రైతు డేటాబేస్ ఆధారంగా వ్యవసాయ నిధుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా రైతుల భూమి రికార్డులను అనుసంధానించడం ద్వారా ప్రభుత్వం రైతు డేటాబేస్‌ను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ద్వారా అమలయ్యే పీఎం కిసాన్, సాయిల్ హెల్త్ కార్డ్, ప్రధాన్ మంత్రి పంటల బీమా పథకాలకి సంబంధించిన డేటాను ప్రభుత్వం క్రోడీకరిస్తోంది. దీంతో పాటు ఇతరత్రా కూడా మరింత డేటాను సమకూర్చుకునే ప్రక్రియ కొనసాగుతోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పథకాల ద్వారా సృష్టించే సంపత్తిని జియో ట్యాగింగ్ చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమార్ ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, సహాయ మంత్రులు పర్‌షోత్తం రూపాలా, కైలాష్ చౌదరి, వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, అదనపు కార్యదర్శి వివేక్ అగర్వాల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అనంత్ మహేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవతేజ్ బాల్, డైరెక్టర్ (స్ట్రాటజిక్ సేల్స్) నందినీ సింగ్, క్రాప్‌ డేటా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ సూరి, డైరెక్టర్ రమాకాంత్ ఝా ఇతర అధికారులు ఈ MoU కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here