పచ్చని వృక్ష సంపద.. పక్షుల కిలకిలారావాలు.. రకరకాల పాములు, రంగురంగుల కీటకాలు..కనుల విందు చేసే పంటలు.. అన్నింటికీ మించి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న సహజ పంటలు.. ఇవీ కవితా మిశ్రా నిర్వహిస్తున్న పంటలతోటలో మనకు కనిపించే సుందర దృశ్యాలు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లా మాన్వి తాలూకాలో కవిత ప్రకృతి పంటల్ని మనం కళ్లారా చూడొచ్చు. ఈ ప్రగతిశీల ప్రకృతి రైతు లాభదాయకమైన పంటలు దండిగా పండిస్తున్నారు. కవితా మిశ్రా వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంతో పాటు చందనం చెట్లు కూడా పెంచి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నారు.

సైకాలజీలో ఎం.ఏ చేసిన కవితా మిశ్రా కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా పట్టా అందుకుని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగం చేయాలని కలగన్నారు. అయితే.. కవితా మిశ్రా భర్త ఉమాశంకర్‌ మాత్రం ఉద్యోగం కోసం తమ గ్రామం విడిచి బయటకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. ఎందుకంటే తమ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కవిత మీదే పెట్టారాయన. ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ నుంచి కవితకు మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చినా గ్రామం విడిచి వెళ్లేందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకున్న 45 ఎకరాలలో 8 ఎకరాలను మంచి వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని కవితను ఉమాశంకర్‌ ప్రోత్సహించారు.భర్త ఉమాశంకర్‌ మాటలతో కవితా మిశ్రా ఏమాత్రం నిరుత్సాహం చెందలేదు. భర్త మాటల్ని సవాల్‌గా తీసుకున్నారు. తమ 8 ఎకరాల భూమిని ఆర్గానిక్‌ వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంగా తయారుచేసేందుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన బంగారు ఆభరణాలను అమ్మేశారు. వినియోగంలో లేని భూమిలో లాభదాయక వ్యవసాయం ఏలా చేయాలో నిపుణులతో సంప్రదించి చక్కని అవగాహన తెచ్చుకున్నారు. కవిత ముందుగా తమ పొలం ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలో పండ్లు, హార్టీకల్చర్‌ పంటలు వేశారు. క్రమేపీ ఆమె రకరకాల పండ్ల చెట్లు, చందనం చెట్లు పెంచడం ప్రారంభించారు. ఇక కవిత వ్యవసాయం నుంచి ప్రతినెలా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.

కవితా మిశ్రా తమ వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకూడదని గట్టిగా సంకల్పించుకున్నారు. కూలీల సాయంతో పొలంలోనే ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్‌ను కవిత గోమూత్రం, గొర్రెల పెంటతో సొంతంగా తయారు చేయిస్తుంటారు. తమ ఆర్గానిక్‌ వ్యవసాయ క్షేత్రంలో కవితా మిశ్రా 8 మంది మహిళలకు, ఇద్దరు పురుషులు మొత్తం 10 మందికి ఉపాధి కల్పించారు. వీరితో పాటు ఇంకా పలువురికి కూడా అవకాశం, అవసరాన్ని బట్టి ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. ప్రకృతి అనుకూల వ్యవసాయం చేస్తున్న కవితా మిశ్రాకు పలువురి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాకుండా మాన్వి తాలూకాలో పలువురు పేద రైతులు సాధికారత సాధించేలా ఆమె సహకారం అందిస్తున్నారు.కవిత వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న లెక్కకు మించిన చెట్లపై వందలాది పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఎలాంటి పురుగుమందులు వాడని కవిత వ్యవసాయ క్షేత్రంలో పంటలపై పురుగులు, కీటకాలు రాకుండా పాములు, పక్షులు పూర్తి సంరక్షణ కల్పిస్తున్నాయి. తమ క్షేత్రంలో ఉన్న పాములు, పక్షులను డిస్టర్బ్‌ చేయొద్దని పనివారికి, సందర్శకులకు కవిత చెబుతారు. పాముల్ని మనం డిస్టర్బ్‌ చేయనంతకాలం మన జోలికి అవి రావని అంటారు.

కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి కారణంగా దేశంలోనే అత్యంత విజయవంతమైన చందనం రైతుగా కవితా మిశ్రా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా చందనం మొక్కల్ని కూడా ఆమె సరఫరా చేయగలుగుతున్నారు. కర్ణాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్‌ (కేఎస్‌డీఎల్‌)కు కావాల్సిన చందనం చెట్లు సరఫరా చేసేందుకు కవితా మిశ్రా ఒప్పందం చేసుకున్నారు.కవితా మిశ్రా వ్యవసాయ క్షేత్రంలో వేలాది చందనం, దానిమ్మ, మామిడి, నిమ్మ, జామ, గూస్‌బెర్రి, మునగ, కరివేపాకు, కొబ్బరి, సీతాఫలం చెట్లు, మల్లె మొక్కలు పెంచుతున్నారు. వీటితో పాటుగా బత్తాయి, సపోటా, అరటి చెట్లు, కాఫీ, మిరియాలు, పసుపు పంటలు కూడా పండిస్తున్నారు. కవితా మిశ్రా చేస్తున్న ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాల గురించి తెలుసుకునేందుకు, ప్రకృతి వ్యవసాయంలో అవగాహన కోసం ప్రతి ఆదివారం సందర్శకులు ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అలా తమ ప్రాంతం నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులతో కవితా మిశ్రా చక్కగా కలిసిపోయి పలు విషయాలను వారితో పంచుకుంటారు.

చందనం చెట్ల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య దొంగతనాలు. అయితే.. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వుడ్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన మైక్రోచిప్‌ను చెట్లకు అమర్చడం ద్వారా మనం ఎక్కడి నుంచి అయినా నిశితంగా గమనించవచ్చంటారు కవిత. మైక్రో చిప్‌లు అమర్చడంతో పాటు తన క్షేత్రంలో 8 కాపలా కుక్కల్ని (వాచ్ డాగ్స్)ను కూడా పెంచుతున్నట్లు తెలిపారు.సమీకృత పంటల విధానంలో వ్యవసాయం చేస్తున్న కవితను ఎన్నో అవార్డులు వరించాయి. కవితా మిశ్రా యుఏఎస్‌ రాయ్‌చూర్‌ సంస్థ నుంచి 2013లో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. 2014లో ఇక్రిశాట్‌ నుంచి గోల్డ్ అవార్డు దక్కించుకున్నారు. 2015లో ఇల్‌కల్‌ శివశక్తి పీఠం నుంచి కిసాన్‌ జ్యోతి పురస్కారం పొందారు. 2016లో నేషనల్‌ ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ అవార్డు కూడా కవితను వరించింది. బెస్ట్‌ హార్టీకల్చర్‌ ఫార్మర్‌ అవార్డు కూడా ఆమె అందుకున్నారు.

చూశారుగా రైతన్నలూ.. ఉన్నత చదువులు చదివినా కవితా మిశ్రా ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలో ఆరితేరిన వైనం.. అవార్డులు అందుకుంటున్న తీరు.. ఆర్గానిక్‌ పద్దతితో పాటు సమీకృత వ్యవసాయం చేస్తూ లక్షలు ఆర్జిస్తున్న కవితా మిశ్రా మనకు ఆదర్శం.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here