కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ఇంకా మానవ ప్రపంచంపై తన ప్రభావం చూపిస్తూనే ఉంది. అదే సమయంలో కరోనా ఈ ప్రపంచానికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించింది. బతికేయడమే కాదు ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ ఖర్చు లేకుండా ఎలా జీవించాలో నేర్పించింది. మనం తినే ఆహారంలో ఎలాంటి పోషకాలున్నాయో.. మనం ఏమేమి తినాలో, ఇంకేవి తినకూడదో కూడా మానవాళికి పాఠం చెప్పింది. రసాయనాలతో జీవావారణాన్ని సర్వనాశనం చేసుకున్న మనిషిని ఇప్పుడు ఎలా మంచి జీవితాన్ని గడపాలో హితబోధ చేసింది.

తిని ఊరికే ఖాళీగా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయనే సామెతకు కరోనా మనకు ప్రత్యక్షంగా సార్థక నిర్వచనం చెప్పింది. రసాయనాలతో ఇల్లు.. వళ్లు గుల్ల చేసుకుంటున్న ఆధునిక మనిషిని పాతకాలపు అలవాట్ల వైపు నడిపించింది. ప్రకృతికి దగ్గరగా ఎలా బతకాలో చెప్పింది. ప్రకృతి వ్యవసాయంతో ఎలా మేలు జరుగుతుందో అనుభవపూర్వకంగా అర్థమయ్యేలా చేసింది. పురుషులు సంపాదించి తెస్తుంటే.. ఇంటిని చక్కదిద్దడంలో మహిళలు ఎంతటి ప్రధాన పాత్ర పోషించేదీ పూర్వకాలం నుంచీ వస్తున్న సంప్రదాయమే. గ్రామాల్ని వదిలి బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వలసపోయిన లక్షలాది మందికి కరోనా కాలం ఓ మంచి గుణపాఠమే నేర్పింది. ఇలాంటి పాఠం నుంచి పుట్టుకొచ్చిందే ‘పోషణ్ వాటిక’ (‘పోషణ తోట’) కాన్సెప్ట్‌..పోషణ తోట విధానం ఎలా పుట్టింది.. ఎక్కడ ఉంది.. ఈ విధానంలో ఏం జరుతోంది.. ఎవరు ఈ తోట పోషణ విధానం అవలంబిస్తున్నారు.. ఎలాంటి లాభం పొందుతున్నారు చూద్దాం..

‘పోషణ తోట’ విధానాన్ని ‘ప్రభాత్‌ జల్‌ సరక్షణ్‌ యోజన’ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. గత ఏడాది మొదలైన కరోనా మన దేశంలోని అనేక గ్రామాల ప్రజలను, వారి జీవితాలను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. గ్రామీణులు కనీస ఆహారం కూడ లేక ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా మనకు కావాల్సిన మోతాదులో పోషకాహారం అందించే పప్పులు, కూరగాయాలు లాంటి వాటిని కూడా తగినంతగా తీసుకునే పరిస్థితి లేకపోయింది. లేదా అతి తక్కువ పోషకాహారం మాత్రమే గ్రామీణులకు దొరికింది. అలాంటి సమయంలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని ఓ 12 గ్రామాల మహిళలు ఓ విలక్షణమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. ఎందుకు పనికిరాకుండా పడి ఉన్న భూమిని చాలినంత పోషకాహార పంటల్ని అందించే చక్కని క్షేత్రంగా రూపొందించాలని భావించారు. అయితే.. వారికి సరైన మార్గదర్శనం చేసేవారు లేకపోవడం, ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం వల్ల వారు తాము అనుకున్న పనిని విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ గ్రూపులోని 12 గ్రామాల ప్రజల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే గిరిజనులే ఎక్కువ మంది ఉన్నారు. పేదరికం, జీవించేందుకు సరైన అవకాశాలు లేకపోవడం గ్రామీణులను వలసబాట పట్టేలా చేశాయి. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కరోనా లాక్‌డౌన్‌ వలస కార్మికులు బలవంతంగా తమ తమ సొంతూళ్లకు వెళ్లేలా చేసింది. సొంతూళ్లకు అయితే వెళ్లారు గానీ.. అక్కడ ఏం పని చేయాలి? ఏమి తిని బతకాలో తెలియని అమోమయ పరిస్థితి నెలకొంది. దానికి తోడు ఆదాయం కూడా లేకపోవడంతో అయోమయంలో పడిపోయారు. అసలే పేదలైన వారు మరింత కడు పేదరికంలోకి కూరుకుపోయారు. ఆదాయం సమకూర్చుకునే ప్రత్యామ్నాయ మార్గాలేవీ వారికి కనుచూపు మేర కనిపించకుండా పోయాయి.

సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలో నడుస్తున్న ఓ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ఆ గ్రామీణుల ముందు ఆపద్బాంధవుడిలా ప్రత్యక్షమైంది. ప్రభాత్‌ జల్‌ సరక్షణ్‌ యోజన పేరుతో ఆ సంస్థ నిర్వాహకులు చింద్వారా జిల్లా మెండ్కీ తాల్‌ గ్రామంలోని మహిళలకు తక్కువ నేలలో ప్రకృతి వ్యవసాయం పట్ల, పోషకాహార పంటలపైన, కొద్దిపాటి నేలలో వివిధ రకాల పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు పండించడంపై అవగాహన, ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. ‘పోషణ్‌ వాటిక’ (Nutrition Garden- పోషణ తోట)ను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు.

కేవలం 1,600 చదరపు గజాల భూమిలో ఇలా వివిధ రకాల పంటలు పండించే విధానంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం మొదలెట్టిన కేవలం మూడు నెలల్లోనే ఆ మహిళల కష్టానికి చక్కని ఫలితాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మెండ్కీ తాల్‌ గ్రామం చుట్టు పక్కల ఉండే మరో 11 గ్రామాల మహిళలు కూడా పోషణ తోట వ్యవసాయం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. వారికి కూడా పోషణ్‌ వాటిక స్వచ్ఛంద సంస్థ శిక్షణ ఇచ్చిన తర్వాత వారంతా ఒక్కటిగా ఏర్పడి తమకు అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలాల్లోనే ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.

పోషణ తోట వ్యవసాయ కార్యక్రమంలో ఇప్పుడు 144 మంది మహిళలు పాల్గొంటున్నారు. చక్కని పోషకాలున్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలను తమ కుటుంబాలకు ఆహారంగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఆయా గ్రామాల మహిళలు అదనంగా ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు.

ముందుగా మెండ్కీ తాల్‌ గ్రామ రైతుకు చెందిన సవితా కుస్‌రామ్‌ అనే మహిళ ఇచ్చిన కొద్దిపాటి భూమిలో పోషణ తోట కార్యక్రమం మహిళలు ప్రారంభించారు. భూమి ఇచ్చినందుకు గాను సవితా కుస్‌రామ్‌కు ఏడాదికి 10 వేల రూపాయలు చెల్లించాలని కూడా నిర్ణయించారు. తమ భూమిలోనే పరంజా ఏర్పాటు చేసి, వ్యర్థ పదార్థాలను ఓ గోతిలో నిల్వ చేసి ఆర్గానిక్‌ విధానంలో కంపోస్ట్‌ ఎరువు తయారు చేసుకుంటున్నామని సవితా చెప్పారు.సవితా కుస్‌రామ్‌ ఇచ్చిన భూమిలో ప్రాజెక్టులో భాగంగా పంటలు వేసేందుకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు విత్తనాలు సరఫరా చేశారు. సంస్థ నిర్వాహకుల పర్యవేక్షణ, సలహాలతో ఆ కొద్దిపాటి భూమిలో మహిళలు మొదటి విడతగా 6 వేల మొక్కలు నాటారు. ‘గత ఆరు నెలల్లో నేను ఇన్ని కూరగాయల్ని ఎప్పుడూ తినలేదు. పోషణ తోట కార్యక్రమంలో పండించిన ఎన్నో రకాల ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు తింటున్నాం’ అంటూ పెళ్లి చేసుకుని 35 ఏళ్ల క్రితం మెండ్కీ తాల్‌ గ్రామానికి కోడలిగా వచ్చిన రత్నియ కుస్‌రామ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ‘పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిపోయాక మేం సంతృప్తికరమైన భోజనం చేసి ఎరుగం. పోషణ తోట కార్యక్రమం పుణ్యమా అని మా కుటుంబం మొత్తం ఇప్పుడు పోషక విలువలున్న ఆహారం కడుపునిండా తింటోంది’ అని రత్నియ ఆనందంగా చెబుతోంది. పోషణ తోట వల్ల తమ గ్రామంలోని గర్భిణులు, పిల్లలకు సరైన పోషకాహారం లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తోంది రత్నియ. ఇదంతా గత కొన్ని నెలలుగా తమ పోషణ తోట గ్రూపులోని మహిళల అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం వల్లే సాధ్యమైందని రత్నియ చెబుతోంది. ఇళ్లల్లో ఉండే మహిళలు ఊరికే కూర్చోకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలతో కలిసి ఇలాంటి ప్రకృతి వ్యవసాయంతో మమేకం అయితే.. మన గ్రామం, రాష్ట్రం, మన దేశం, మన సమజమే ఆరోగ్యవంతంగా మారుతుందని చిరునవ్వుతో చెప్పింది రత్నియ.

పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిపోతే గ్రామాల్లోని నేల అంతా నిస్సారం అవుతుందని, గ్రామాల్లోనే ఉండి పోషణ తోట లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత సారవంతం అవుతుంది. పట్టణాల్లో సంపాదించిన సొమ్ము మొత్తం ఏ రోజుకు ఆ రోజు తినేందుకు మాత్రమే సరిపోతుందని, ఇక డబ్బు ఆదా చేసే అవకాశమే ఉండదని అనుభవపూర్వకంగా పోషణ తోట మహిళలు చెప్పారు. 2020 డిసెంబర్‌ నుంచి 2021 మే నెల వరకు 12 పోషణ తోట గ్రూపుల్లో పనిచేసిన ఒక్కో మహిళ 30 నుంచి 35 వేల రూపాయల వరకు ఆదా చేశారని ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ చండీ ప్రసాద్‌ పాండ్య వెల్లడించారు.

మెండ్కీ తాల్ మహిళలతో పాటుగా చింద్వారా జిల్లాలోని పిపరియా బిస్రా, రామ్‌గర్హి, సర్నా, సియోని మెఘా, బన్‌గావ్‌, ఖేరి భుటాయ్‌, సర్గీ, సహజ్‌పురి, మల్హన్‌వాడ, అటర్‌వాడ, గరాయ్‌ గ్రామాల్లోని మహిళలు ఇప్పుడు పోషణ్ తోట ప్రాజెక్టుతో అనుసంధానమై ప్రకృతి పంటలు పండిస్తున్నారు.

చూశారుగా రైతన్నలూ.. పోషణ తోట కథా కమామిషు.. పోషణ తోట విధానంలో తక్కువ నేలతోనే ఎక్కువ రకాల పంటలు, పోషకాలు సమృద్ధిగా ఉండే పంటలు పండించుకుందాం. ఆరోగ్యవంతమైన, ఆర్థిక స్వావలంబన గల సమాజాన్ని తయారు చేసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here