చీడ పీడల బెడద ఉండదు. ఏడాది లోపే పంట వస్దుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎరువులు, పురుగు మందుల గోల ఉండదు. ఏడాదిలో మూడు కాలాల్లో మూడు సార్లు తైవాన్ నిమ్మ పంట దిగుబడి వస్తుంది. దిగుబడికి దిగుబడి.. ఆదాయానికి ఆదాయం.. లాభానికి లాభం.. ఇవి తైవాన్‌ నిమ్మ సాగుతో రైతన్నకు వచ్చే లాభాలు.సాధారణ నిమ్మ జాతులైతే.. మూడు నాలుగేళ్ల వరకు పంట దిగుబడి మొదలు కాదు. అదే తైవాన్‌ నిమ్మ అయితే.. మొక్క నాటిన ఏడాదిలోనే పంట వచ్చేస్తుంది. సరైన సాగు పద్ధతులు అనుసరిస్తే.. మరో రెండు నెలల ముందు కూడా పంట వచ్చే అవకాశాలు తైవాన్ నిమ్మలో ఉన్నాయి. తైవాన్ నిమ్మకాయపై తొక్క మామూలు కన్నా కాస్త ఎక్కువ మందం ఉంటుంది. అయితే.. కాయ సరిగా పక్వానికి వచ్చేసరికి దాని మందం తగ్గుతుంది.  మామూలు నిమ్మ చెట్లు పంట మొదలైన ఏడెనిమిది ఏళ్లలో చనిపోతాయి. తైవాన్ నిమ్మ రకం పంట మొదలైనప్పటి నుంచి మరో 20 ఏళ్ల దాకా కూడా కాపు ఇస్తూనే ఉంటుంది.చీడ పీడల బెడద ఉండదు కనుక తైవాన్ నిమ్మ మొక్కలకు రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం అంతగా ఉండదు. మామూలుగా పశువుల ఎరువు వాడినా సరిపోతుంది. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంట వాడుకుంటే బాగ్గా పనిచేస్తుంది. అంటే.. పోషకాల కోసం పెద్దగా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం రాదు. ఒకసారి తైవాన్ నిమ్మ వాడిన వారు.. మళ్లీ మళ్లీ దాన్నే కావాలని కోరుకుంటారు. మామూలు నిమ్మలో మాదిరిగా రసం ఎక్కువగా ఉంటుంది. పైగా పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడం తైవాన్ నిమ్మ ప్రత్యేకత. తైవాన్ నిమ్మ పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న జాతి. ఏడేళ్ల క్రితమే తైవాన్ నిమ్మ మన దేశంలోకి వచ్చింది.తైవాన్ నిమ్మ జాతి మొక్కలు తూర్పు గోదావరి జిల్లా కడియంలోని శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీలో లబిస్తాయి. రెండు మూడేళ్లుగా ఈ నర్సరీలో తైవాన్ నిమ్మ రకాన్ని అభివృద్ధి చేసి ఔత్సాహిక రైతులకు సరఫరా చేస్తున్నారు.. మామూలుగా అయితే.. నిమ్మ సాగుచేసే రైతులు ఎక్కువగా బాలాజీ నిమ్మ రకమేం పండించేవారు. సాధారణ నిమ్మ రకాలు కాపు రావడానికి నాలుగైదేళ్లు పట్టేస్తుంది. దాంతో పాటు సాధారణ నిమ్మ రకాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక 50 కిలో మీటర్ల రేంజ్‌ లోనే దాన్ని అమ్ముకోవాల్సి ఉంటుంది. కానీ.. ఏడాది లోగానే కాపు రావడం, చీడపీడల సమస్య లేకపోవడం, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల దూర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. దీంతో రైతులు ఇప్పడు తైవాన్‌ నిమ్మ సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.తైవాన్ జాతి నిమ్మ మొక్కల్ని ఎకరా నేలలో 280 నుంచి 300 వరకు నాటుకోవచ్చు.  తైవాన్‌ నిమ్మ ఏ వయస్సు నుంచి అయినా పెంచుకోవచ్చు.  అయితే.. మొక్క అడుగున్నర నుంచి రెండు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత పొలంలో నాటుకోవాలి. మొక్క నాటడం కోసం మొక్క సైజును బట్టి గొయ్యి తీసుకోవాలి. తైవాన్ నిమ్మ జాతి మొక్కకు అడుగున్నర లోతు, వెడల్పు గొయ్యి సరిపోతుంది. గొయ్యి నిండుగా పశువుల ఎరువు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంట వేసుకోవాలి. మొక్కకు మొక్కకు మద్య దూరం నాలుగు మీటర్లు పెట్టుకోవాలని శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీ యజమాని యర్రంశెట్టి శ్రీనివాస్‌ చెప్పారు. ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే.. తొలి ఏడాది నుంచీ కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇతర రకాల నిమ్మ మొక్కలకు కొట్టినట్టే క్రిమిసంహారకాలు కొట్టుకోవచ్చని శ్రీనివాస్‌ అన్నారు. పలానా జబ్బు వచ్చి తైవాన్‌ నిమ్మ మొక్క చనిపోతుందనే భయం ఉండదన్నారు. తైవాన్‌ నిమ్మకు ఎరువుల అవసరం ఉండదని, అయినా.. ఇతర నిమ్మ మొక్కలకు వాడినట్టే అతి తక్కువ ధరల్లో లభించే మందులు వాడినా ఇబ్బందేమీ ఉండదన్నారు.నర్సరీలో తైవాన్ మొక్కను అభివృద్ధి చేసి ప్యాకెట్‌ లో పెట్టిన నాలుగైదు నెలల్లో పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఒక అడుగు ఎత్తు పెంచేందుకు నర్సరీలకు నాలుగైదు నెలల సమయంపడుతుంది. తైవాన్‌ జామకు జబ్బులు ఎక్కువగా వస్తాయి. కానీ తైవాన్ నిమ్మ చాలా మొండిది. జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తైవాన్ నిమ్మ చెట్టుకు ఒక పక్కన కాయలు ఉండగానే మరో పక్కన కొత్తగా పూత వస్తూ ఉంటుంది. సరైన సస్య రక్షణ చర్యలు తీసుకుంటే దిగుబడి మరింత పెరుగుతుంది.తైవాన్ నిమ్మ చెట్టు ఒక గుబురు పొద మాదిరిగా ఎదుగుతుంది. మామూలు నిమ్మ జాతి చెట్లు 8 నుంచి 10 అడుగుల దాకా ఎదుగుతాయి. తైవాన్ నిమ్మచెట్టు నాలుగైదు అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. దాంతో కాయలు కోయడంసులువుగా ఉంటుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఎత్తు ఎదుగుతున్నట్లు అనిపిస్తే.. దాన్ని ప్రూనింగ్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేసినప్పుడు చెట్టుకు మరింత ఎక్కువగా చిగుర్తు వస్తాయి. దాంతో దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తైవాన్ నిమ్మ కాయలు వచ్చిన తర్వాత చెట్టు కొమ్మలు కిందికి వంగిపోయి ఒక పొద ఆకారంలో మారిపోతుంది. నాలుగైదు ఏళ్ల తర్వాత తైవాన్ నిమ్మ పొలం చెట్లతో నిండిపోతే.. కొమ్మలు కత్తిరించుకోవచ్చు. మామూలు నిమ్మ అయితే అలా కత్తిరిస్తే చెట్టు పాడవుతుంది. తైవాన్ నిమ్మలో ఈ సమస్య ఉండదు.తైవాన్ నిమ్మ చెట్టు ముళ్లు కాస్త పెద్దగా ఉంటాయి. అయితే.. మామూలు నిమ్మ మాదిరిగా ఎక్కువ ముళ్లు ఉండవు. దాంతో కాయలు కోసుకోవడం సులువుగా ఉంటుంది. ఇతర నిమ్మ రకాల మాదిరిగా తైవాన్ నిమ్మకు మందులు మాకుల కోసం నెలనెలా ఎరువులు, పురుగు మందుల ఖర్చు ఉండదు. ఎక్కువ కాలం పాటు అధిక పంట దిగుబడి కూడా వస్తుంది. కాయ చాలా రోజుల వరకూ నిల్వ ఉంటుంది. కనుక తైవాన్ నిమ్మను రైతులు సాగు చేసుకుంటే.. అధిక ఆదాయం, లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం శ్రీ లక్ష్మీ గణఫతి నర్సరీ యజమాని యర్రంశెట్టి శ్రీనివాస్‌ ను 9985747973, లేదా 8106142273 నెంబర్లలో సంప్రదించవచ్చు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here