మొక్క నాటిన ఏడాది లోపే పంట చేతికి వస్తుంది. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చీడ పీడల బాధ పెద్దగా ఉండదు. లేబర్ ఖర్చు తక్కువ. కాయలు తయారైన తర్వాత వారం రోజుల పాటు చెట్టు నుంచి తెంపకపోయినా ఇబ్బంది ఉండదు. పంట తొలి కాపులో కాస్త పెద్ద సైజు కాయలు కాస్తుంది. ఎక్కువ కాయలు కాసినప్పుడు మామూలు సైజులోనే కాయలు వస్తాయి. సాధారణ నిమ్మ కన్నా ఈ నిమ్మచెట్టుకు ముళ్లు బాగా తక్కువ ఉంటాయి. రైతన్నలకు లాభసాటిగా ఉంటుంది. అదే క్లోనింగ్ విధానంలో రూపొందించిన తైవాన్ నిమ్మ.ఎకరం నేలలో 475 నుండి 500 వరకు తైవాన్‌ నిమ్మమొక్కలు నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగులు, సాలుకు సాలుకు 10 అడుగుల దూరంలో తైవాన్ నిమ్మ మొక్కలు నాటుకుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది. నాటిన ఎడాదిలోనే 2 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. మొక్క ముదిరే కొద్దీ దిగుబడి మరింత పెరుగుతుంది. తైవాన్‌ నిమ్మ మొక్కల్సి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే.. మొక్కలు దగ్గరగా ఉన్నాయని సమస్యే రాదని అనుభవం ఉన్న రైతు, ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా నరసన్నపాలెంలో ప్రకృతి క్లోనల్‌ నర్సరీ నిర్వాహకుడు హనుమంతరావు తెలిపారు. మామూలు నిమ్మమొక్క నాటిన నాలుగేళ్ల తర్వాత కానీ పంట చేతికి రాదు. అదే తైవాన్ నిమ్మ అయితే ఏడాది లోనే దిగుబడి ఇస్తుంది.ఇతర నిమ్మ జాతుల మాదిరిగానే తైవాన్ నిమ్మమొక్కలకు కూడా తెల్లబూజు తెగులు కనిపిస్తుంది. దాని నివారణకు అవసరమైన మందులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయడం వల్ల ఈ నిమ్మమొక్కకు ఎండుపుల్ల సమస్య ఉండదు. కొన్ని తైవాన్ నిమ్మ పేరుతో సాధారణ నిమ్మ జాతుల్ని కొందరు అంటగ్టటే అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించుకుని తైవాన్ నిమ్మ మొక్కల్ని కొని సాగు చేస్తే లాభాలకు కొదవ ఉండదు.మామూలు నిమ్మకాయ కన్నా తైవాన్ నిమ్మరసంలో పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది. రసం కూడా ఎక్కువగా వస్తుంది. అయితే.. తైవాన్‌ నిమ్మకాయ కాస్త మెత్తబడిన తర్వాత మరింత అధికంగా రసం ఉంటుంది. మామూలు నిమ్మకాయలు తయారైన వెంటనే తెంపకపోతే మొక్క నుంచి కిందకు రాలిపోతాయి. కింద పడిన కాయ కుళ్లిపోతుంది. తైవాన్ నిమ్మలో ఈ సమస్య ఉండదు. మొక్క నుంచి అంత త్వరగా రాలిపడిపోదు. పైగా తైవాన్ నిమ్మ మొక్కను పెద్దగా ఎత్తు ఎదగకుండా ప్రూనింగ్ చేస్తూ చూసుకుంటూ ఉంటే కాయ కింద పడినా చెడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.తైవాన్‌ నిమ్మకాయలు ఒక మనిషి ఒక రోజులో సులువుగా రెండు క్వింటాళ్ల దాకా తెంపవచ్చు. అదే ఇతర జాతి నిమ్మకాయల్ని 70 కిలోలకు మించి తెంపలేరు. పంట పూర్తవగానే ప్రూనింగ్ చేస్తూ ఉంటే వచ్చే పంట మరింత ఎక్కువగా వస్తుంది. తైవాన్ నిమ్మ మొక్క నుంచి కాయలు కోసిన వెంటనే ప్రూనింగ్ చేసుకోవాలని రైతు హనుమంతరావు తెలిపాడు.తైవాన్ నిమ్మ పైకి పెద్దగా దాని నిమ్మ వాసన రాదు. అందుకని దాన్ని ముందుగా మార్కెట్‌ లో పెద్దగా ఇష్టపడరు. అయితే.. ఎక్కువ రోజులు అంటే సుమారు 20 రోజుల పాటు నిల్వ ఉండే గుణం ఉండడం వల్ల ఇప్పుడిప్పుడే తైవాన్ నిమ్మకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది.  సాధారణ నిమ్మకాయల కన్నా మార్కెట్లో తైవాన్ నిమ్మకు ధర కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. తైవాన్ నిమ్మలో దిగుబడి ఎక్కువ, ధర కూడా అధికమే కావడంతో రైతులకు మంచి లాభసాటి పంట అనే చెప్పొచ్చని అనుభవం ఉన్న రైతులు చెబుతున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here