కుంకుడు రసం.. కొద్దిగా ఆముదం.. నేల లోపలి మట్టి… ఇదేంటి ఏవేవో కొన్నింటి పేర్లు చెబుతున్నానేంటనేదేగా మీ డౌట్… అయితే తరువాత చెప్పే విషయం జాగ్రత్తగా ఫాలో అవండి ఔత్సాహిక రైతన్నలూ…! సీవీఆర్ చెప్పిన మట్టి ద్రావణం వాడుకి పద్ధతికి ఇది మరికాస్త అడ్వాన్స్‌డ్ విధానం అన్నమాట. ఈ మూడింటితో చేసిన మిశ్రమ ద్రావణాన్ని ఏ మొక్కపైన, లేదా పైరు పైన స్ప్రే చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. మొక్కలను ఆశించే పురుగులు నివారణ అవుతాయియి. మొక్కల ఆకులు వేగంగా, నిగనిగలాడుతూ, బలంగా, వెడల్పుగా వస్తుండడం ఈ ద్రావణం ప్రత్యేక ఫలితం. తద్వారా పంట దిగుబడులు కూడా అదే స్థాయిలో అధిక మొత్తంలో వస్తాయని రైతు పడాల గౌతమ్ తన అనుభవంతో చెప్పారు.రెండు వందల లీటర్ల ద్రావణం తయారు చేయడానికి కేవలం అర కిలో కుంకుడు కాయలు, పావు లీటర్ ఆముదం, నేల లోపలి పొరల నుంచి తీసిన పది కిలోల మట్టి మాత్రమే అవసరం అవుతుంది. ముందుగా అరకిలో కుంకుడు కాయలను గింజలతో సహా చితక కొట్టాలి. దాన్ని నాలుగైదు పొంగులు వచ్చే వరకు బాగా ఉడకబెట్టాలి. అలా ఉడికిన దాన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన కుంకుడు గుజ్జును మరుసటి రోజు బాగా పిసికి, తుక్కును తీసేయాలి. సీవీఆర్ విధానంలో చెప్పినట్లు నేల లోపలి పొరల నుంచి తీసి ఎండబెట్టి, మెత్తగా చేసుకున్న 10 కిలోల మట్టిలో బాగా కలిసిపోయేలా పావు కిలో ఆముదాన్ని కలుపుకోవాలి. మట్టి, ఆముదం మిశ్రమంలో అంతకు ముందు బాగా ఉడకబెట్టిన కుంకుడు కాయల రసాన్ని వడగట్టి మట్టి మిశ్రమంలో బాగా కలిసేలా తిప్పాలి.ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 200 లీటర్ల డ్రమ్ములో నీరు పోసి, దాంట్లో బాగా కలపాలి. ఇలా కలిపిన ద్రావణాన్ని గంట రెండు గంటలు ఆగితే.. మట్టి అడుగుభాగంలోకి చేరుతుంది. నీరు పైకి తేరుకుంటుంది. ఆ నీటిని స్ప్రేయర్ నాజల్‌కు అడ్డు పడని విధంగా వడకట్టుకోవాలి. స్ప్రేయర్‌లో ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేలా మరోసారి బాగా వడకట్టాలి. దీన్ని ఏ మొక్కలపైన అయినా స్ప్రే చేసుకోవాలి. మొక్క మొత్తం తడిసేలా, ఆకులు పైభాగంలో, కింది భాగంలో కూడా ద్రావణం పడేలా పవర్ స్ప్రేయర్‌తో జల్లుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది.అయితే.. ఈ ద్రావణాన్ని నిల్వ చేయకూడదు. కుంకుడు రసం, ఆముదం కలిసిన మట్టి ద్రావణాన్ని కలిపిన ఐదు లేదా ఆరు గంటల్లోపలే మొక్కలకు స్ప్రే చేయాల్సి ఉంటుందని గౌతమ్ వివరించారు. పత్తి, మిరప, జొన్న ఇతర పంటలకు కూడా కుంకుడు రసం, మట్టి, ఆముదం ద్రావణం స్ప్రే చేసుకోవచ్చని చెప్పారాయన.ఈ ద్రావణాన్ని జామ, నిమ్మ, అరటి, ఆపిల్, పియర్స్, బొప్పాయి, కొబ్బరి, పనస, నేరేడు, మామిడి, అవకాడో, మకడేమియా, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్ ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలపైన, పూలమొక్కల పైనా, మునగ, పామాయిల్, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, సజ్జ, రాగి, వరిపై కూడా స్ప్రే చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్‌లోని మొక్కలు, కిచెన్ గార్డెన్‌లోని మొక్కలకు కూడా ఈ ద్రావణం వాడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ ద్రావణం చల్లిన పది రోజుల్లో ఆయా మొక్కలు చక్కని చిగుర్లు, బలంగా ఆరోగ్యంగా వస్తాయి. ఆకులు వెడల్పుగా తయారవుతాయి. అంతకు ముందే మొక్కల్ని ఆశించిన పురుగులు మటాష్ అయిపోతాయి. అయితే.. ఈ ద్రావణాన్ని మొక్కలు నాటిన పది నుంచి పదిహేను రోజుల్లోపల స్ప్రే చేసుకోవాలని గౌతమ్ తెలిపారు.అత్యంత తక్కువ ఖర్చుతో, చాలా సులువుగా తయారు చేసుకోగల కుంకుడు, ఆముదం, మట్టి ద్రావణాన్ని మొక్క నాటిన పది రోజుల తర్వాత స్ప్రే చేస్తే.. చిగుర్లు వారం రోజుల్లోనే ఆరోగ్యంగా వస్తాయి. ఈ ద్రావణం వాడిన మొక్కలకు పూత కూడా చాలా ఎక్కువగా, ఆరోగ్యంగా వస్తుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల కోసం వేలాది రూపాయల ఖర్చు వస్తుంది. అయితే.. ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకునే ఈ ద్రావణంతో ఖర్చు చాలా తక్కువ అవుతుంది.