రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు ‘సదా బహర్’. ఈ మామిడికి సంవత్సరమంతా కాత రావడం విశేషం. ఇది పొట్టిరకం మామిడి జాతికి చెందిన వెరైటీ. సాధారణంగా మామిడిని ఆశించే తెగుళ్లేవీ దీనికి సోకవు. ఈ పండు రుచిలో తియ్యగా ఉంటుంది. దీన్ని ‘బనారసీ లంగ్డా’ రకం మామిడితో పోల్చవచ్చు. పొట్టి జాతి మామిడి కావడంతో ఇది పెరటి తోటలకు బాగా పనికివస్తుంది. అలాగే అధిక సాంద్రత కలిగిన తోటల పెంపకానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు దీన్ని కుండీలలో కూడా పెంచవచ్చు. ఈ పండు లోపలి కండ ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఈ కండలో చాలా తక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ మామిడిలో పోషకాలు అధికంగా ఉండటంతో ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఈ మామిడి రకాన్ని అభివృద్ధి పరచిన శ్రీకిషన్ సుమన్ నిరుపేద కుటుంబానికి చెందినవారు. పేదరికం వల్ల రెండవ తరగతి తరువాత బడికి వెళ్లడం మానేసి పనికి కుదురుకోవలసి వచ్చింది. అలా ఆయన చిన్నతనంలోనే వారి కుటుంబ వృత్తి అయిన తోటమాలి పనిలో చేరారు. శ్రీకిషన్‌కు మొదటి నుండీ పూలతోటలు, పండ్లతోటల పెంపకం పట్ల ఆసక్తి మెండు. అయితే వారి కుటుంబం గోధుమ, వరి సాగుపై దృష్టి పెట్టింది. గోధుమ, వరి వంటి పంటల సాగు వర్షపాతం, అడవి జంతువుల దాడి వంటి పలు బాహ్యకారకాలపై ఆధారపడి ఉంటుందనీ, రైతు ఆదాయం వాటి వల్ల దెబ్బతింటుందనీ శ్రీకిషన్ సుమన్ గ్రహించారు. దీంతో కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఆయన పూలసాగును ఎంచుకున్నారు. మొదట వివిధ రకాల గులాబీలను సాగు చేసి వాటిని మార్కెట్‌లో విక్రయించారు. అలాగే పూలతో పాటు మామిడి సాగు కూడా ప్రారంభించారు.
2000లో శ్రీకిషన్ సుమన్ మొదటిసారిగా సదా బహార్ మామిడి రకాన్ని గుర్తించారు. తన పండ్లతోటలో ఒక మామిడి చెట్టు విలక్షణంగా ఉన్నట్లు ఆయన గమనించారు. ముదురు ఆకుపచ్చరంగు ఆకులు ఎక్కువగా ఉన్న ఆ చెట్టు ఏడాది పొడవునా కాత కాస్తోందని ఆయనకు అర్థమైంది. ఈ లక్షణాలను గమనించిన తరువాత, ఆయన దానికి అంట్లు కట్టడం ద్వారా ఆ రకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. అందుకు శ్రీకిషన్ సుమన్ పదిహేను సంవత్సరాల పాటు శ్రమించారు. అంటు కట్టిన మొక్కలు రెండవ సంవత్సరం నుండే పండ్లు కాయడం ప్రారంభించడాన్ని ఆయన గమనించారు. శ్రీకిషన్ సుమన్ ఈ కొత్త మామిడికి ‘సదా బహార్’ అని పేరుపెట్టారు. ‘సదా బహార్’ అంటే నిత్య వసంతమని అర్థం. ఏడాది అంతా కాతకాసే మామిడికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది కదూ!
శ్రీకిషన్ సుమన్ అభివృద్ధి చేసిన కొత్త రకానికి ఉన్న వినూత్న లక్షణాలను భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (National Innovation Foundation – NIF) కూడా ధ్రువీకరించింది. ఇది కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఈ స్వయంప్రతిపత్తి సంస్థ బెంగళూరులోని ఐసీఏఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ (ఐఐహెచ్ఆర్), రాజస్థాన్‌లోని జాబ్నర్ (జైపూర్) లోని ఎస్కేఎన్ అగ్రికల్చర్ యూనివర్శిటీల ద్వారా సరికొత్త మామిడి వంగడంపై క్షేత్రస్థాయి పరిశోధనలు కూడా చేయించింది. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్‌లో ‘సదా బహర్’ మామిడి రకాన్ని నాటడానికి కూడా NIF తోడ్పడింది.

శ్రీకిషన్ సుమన్ అభివృద్ధి పరచిన ఈ సతత హరిత మామిడి రకానికి NIF’s 9th National Grassroots Innovation and Traditional Knowledge Award లభించింది. అలాగే అనేక ఇతర వేదికలపై కూడా ఇది గుర్తింపు పొందింది. శ్రీకిషన్ సుమన్ 2017- 2020 మధ్యకాలంలో భారతదేశం నుండేగాక విదేశాల నుండి కూడా ‘సదా బహార్’ మామిడి మొక్కలకు సంబంధించి 8000 పైగా ఆర్డర్లు పొందారు. ఆంధ్రప్రదేశ్, గోవా, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చండీగఢ్ రాష్ట్రాలకు చెందిన రైతులకు ఆయన 2018-2020 మధ్య 6 వేలకి పైగా ‘సదా బహార్’ మామిడి మొక్కలను అందించారు. కృషి విజ్ఞాన కేంద్రాలలో 500కి పైగా మొక్కలను ఆయన స్వయంగా నాటారు. అంతేగాక రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పరిశోధనా సంస్థలకు కూడా ఆయన 400కి పైగా అంటుకట్టిన ‘సదా బహార్’ మొక్కలను అందించారు. ఇలా ‘సదా బహార్’ క్రమంగా దేశమంతటా వ్యాప్తి చెందుతోంది. ఈ రకం మామిడి సాగు రైతులకు లాభదాయకమని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వివరాల కోసం ఈ క్రింది మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చు
Contact Shree Kishan Suman: 9829142509