సీమపంది మాంసంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు పనిచేస్తుంది. దీనిలో 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. జింక్‌, సెలీనియం, విటమిన్‌ B12, B 6 కూడా లభిస్తాయి. ఐరన్‌, భాస్వరం లాంటి పోషకాలు ఉన్నాయి. కాకపోతే కొవ్వు, సోడియం స్థాయిలు ఎక్కువ కాబట్టి పరిమితంగా తింటే మంచిదని ఆరోగ్య నిపుణుల సలహా.

సీమపందుల పెంపకం పరిశ్రమగా భావిస్తే.. డజన్ల కొద్దీ పిల్లల్ని ఉత్పత్తి చేసే ప్రధాన యంత్రం ఆడపంది అని చెప్పొచ్చు. నంద్యాల జిల్లా డోన్‌ మండలం సోమాపురంలో యువరైతులు రమేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ విజయవంతంగా లార్జ్‌ వైట్‌ యార్క్‌షైర్‌ సీమపందులను వాసుదేవ ఫార్మ్స్‌ పేరిట నిర్వహిస్తున్నారు. తొలుత వీరు మూడు యూనిట్ల సీమపందులతో ఫార్మ్‌ ప్రారంభించారు.

సీమపందుల ఒక్కో యూనిట్‌ కొనుగోలుకు వారికి రూ.3.70 లక్షలు ఖర్చు అయింది. పందుల పెంపంకం కోసం 80 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో షెడ్లు వేశారు. తక్కువ ఖర్చు అయ్యేలా ప్లాట్‌ఫాంకు,షెడ్ల చుట్టూ గోడలుగా నాపరాళ్లు వేశారు. నున్నగా ఉండా నాపరాళ్లను ఫ్లోరింగ్‌కు వేస్తే.. పందులు జారిపడే ప్రమాదం ఉటుంది. కాస్త గరుకు నాపరాళ్లనే వాడాలి. షెడ్లకు ఇనుప కంచె వేస్తే.. పందులు ఎండ, వాన, చలి వల్ల ఇబ్బంది పడతాయన్నారు రమేష్‌రెడ్డి. షెడ్‌పైన రేకులు వేసి, వాటి కింద తడికెలతో పాటు పట్టాలు వేశారు. రేకుల నుంచి ఎక్కువ వేడి కిందికి దిగి, పందులకు అనారోగ్య సమస్యలతో పాటు ఎబార్షన్లు అయ్యే ప్రమాదం ఉందన్నారు. షెడ్ల చుట్టూ గ్రీన్ మ్యాట్‌ కట్టి వాన, ఎండ, చలి ఉన్నప్పుడు వాటిని కిందికి దింపుతామన్నారు. షెడ్ల ఏర్పాటు, వాటిలో ఎలక్ట్రికల్‌ వర్క్‌, ప్లంబింగ్‌కు సుమారు 8 లక్షలు ఖర్చయిందన్నారు రమేష్‌రెడ్డి. ఒడిశాలో పందులు యూనిట్లు కొనేందుకు, రవాణా ఖర్చులు కలిపి రూ.12 లక్షలు అయింది. ఒకసారి షెడ్లు నిర్మించి, సీమపందుల పెంపకం ప్రారంభిస్తే వాటికి అయ్యే దాణా, మందులు, నిర్వహణ ఖర్చు మాత్రమే ఉంటుంది. తాము పందులకు CP ఫీడ్‌ వాడతామన్నారు. అదే కంపెనీ ఫీడ్‌ను పెద్దవాటికి ఒక రకం, ఎదుగుతున్న పిల్లలకు మరో రకం పెడతామని చెప్పారు.రమేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ పందుల సీమపందుల పెంపకం చేపట్టిన ఏడాదిలో ఒక లాక్టేషన్‌ పూర్తయి, రెండో లాక్టేషన్‌ మొదలైంది. సీమపందుల ఫార్మ్‌ ప్రారంభించిన తొలి ఏడాది పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నుంచి అలాంటి కష్టాలు ఉండవన్నారు. ఏడాది తర్వాత సీమపందుల ఫార్మ్‌ నుంచి ఆదాయం రావడం మొదలవుతుందితొలి లాక్టేషన్‌లో ఒక్కో ఆడపంది 8 పిల్లలకు జన్మనిచ్చింది. రెండో లాక్టేషన్‌ నుంచి 10 కానీ 12 నుంచి 15 వరకు పిల్లలు పుడుతున్నాయి. మూడు యూనిట్ల నుంచి తొలి లాక్టేషన్‌లో 200 వరకు వారి ఫార్మ్‌లో పిల్లలు వచ్చాయి. అయితే.. పిల్లలు తక్కువగా ఉంటేనే తల్లిపాలు బాగా సరిపోయి పుష్టిగా.. ఆరోగ్యంగా తయారవుతాయి. ఫార్మ్‌ ప్రారంభించిన ఏడాదికి 8 యూనిట్ల పందులను అమ్మినట్లు వారు తెలిపారు. ఒక్కో యూనిట్‌ను రూ.3.70 లక్షలకు కొన్ని రూ.3.60 లక్షలకు మరికొన్ని యూనిట్లు అమ్మినట్లు చెప్పారు. యూనిట్‌ సగటున రూ.3.60 లక్షలకు అమ్మినా తొలి ఏడాదికే వారికి రూ.28 లక్షల 80 వేలు ఆదాయం వచ్చింది. వాటికి అందించిన ఆహారం, మందులు, నిర్వహణ ఖర్చులు అన్నీ కలిపి చూసుకున్నా తొలిసారిగా పెట్టిన పెట్టుబడి దాదాపు చేతికి వచ్చేసింది. రెండో లాక్టేషన్‌ నుంచి మరో 8 యూనిట్లు అమ్మేందుకు వచ్చాయన్నారు.సంతాన ఉత్పత్తి కోసం తల్లి పందులను వాటి ఎత్తు, పొడవును బట్టి ఎంపిక చేస్తారు. వాటిని బ్రీడింగ్‌కు, మిగతా వాటిని కటింగ్‌కు పంపిస్తారు. సీమపందులు 50 కిలోల బరువు పెరిగిన తర్వాత బ్రీడింగ్‌కు, కటింగ్‌ కోసం ఎంపిక చేస్తామన్నారు. సీమపంది చూలు కట్టిన తర్వాత 4 నెలలకు పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లల్సి పెట్టిన తర్వాత 10 నుంచి 15 రోజులు విడిచిపెట్టి మళ్లీ క్రాసింగ్‌కు వదులుతామన్నారు రమేష్‌రెడ్డి. మరో 10 రోజులకు ఆ పంది గర్భం ధరిస్తుంది. తర్వాత మరో 4 నెలలకు మళ్లీ పిల్లల్ని పెడుతుంది. ఇలా ఏడాదిలో రెండుసార్లు ఒక్కో పంది పిల్లలకు జన్మనిస్తుంది. క్రాసింగ్‌కు పంపే పందులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైజినిక్‌ గదుల్లో పెట్టి, మరింత ప్రత్యేకంగా చూస్తామన్నారు.పిగ్ ఫార్మింగ్ చేసే రైతులకు మార్కెటింగ్‌ ఎలా అనే ప్రశ్న వస్తుంది. కటింగ్‌కు పంపే పందుల విక్రయానికి మీడియేటర్లు చాలా మంది ఉన్నారని, మార్కెట్‌ గురించి భయం అక్కరలేదన్నారు రమేష్‌రెడ్డి. ఇక బ్రీడింగ్ పందులను కొనేందుకు ఔత్సాహిక రైతులే వస్తారన్నారు. పందుల మార్కెటింగ్‌ విషయంలో ఇతర రైతులకు తాము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఏడాది పాటు సీమపందిని పెంచినా గొర్రెలు, మేకల మాదిరిగా ముదిరిపోదు. నవంబర్‌, డిసెంబర్ నెలల నుంచి మేనెల వరకు పందులకు మంచి గిరాకీ ఉంటుంది. వర్షా కాలంలో మాత్రం కొంచెం రేటు తగ్గుతుంది.ఇక నల్గొండ జిల్లా కనగల్‌ మండలం రామచంద్రపురం వాసి పురుషోత్తంరెడ్డి కూడా చాన్నాళ్లుగా సీమపందుల ఫార్మింగ్‌ చేస్తున్నారు. 10 ఆడపందులు, 2 మగపందులను ఒక యూనిట్‌గా తీసుకుంటే.. వాటి కోసం 120 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో షెడ్‌ వేశారు. షెడ్‌ చుట్టూరా 4 అడుగుల ఎత్తుతో గోడ నిర్మించారు. షెడ్‌ పొడవునా రెండు వైపులా పందులను ఉంచేందుకు చిన్న చిన్న గదులు నిర్మించారు. రెండు వైపుల గదుల మధ్య 4.5 అడుగుల వెడల్పు బాట ఉంచి పెంచుతున్నారు.సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మున్నేపల్లిలో ఔత్సాహిక రైతు శ్రీనివాస్‌ సీమపందుల ఫార్మ్‌ నిర్వహిస్తున్నారు. పందుల ఫార్మింగ్ ప్రారంభించే ముందు మార్కెట్‌ను బాగా అధ్యయం చేస్తే మంచిదని రైతులకు సూచించారు. కష్టపడి నిర్వహించుకుంటే సీమపందుల ఫామ్‌తో లాభం ఉంటుందన్నారు. సీమపందులకు ప్రతినెలా డీవార్మింగ్ తప్పకుండా చేయాలన్నారు. డీవార్మింగ్ అయిన తర్వాత మూడు రోజుల పాటు లివర్‌ టానిక్‌ తప్పనిసరిగా వేయాలి.వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని శివారెడ్డి కూడా సీమపందుల ఫార్మింగ్‌ చేస్తున్నారు. సీమపందులను శాస్త్రీయ విధానంలో పెంచితే లాభసాటిగా ఉంటుందన్నారు. లార్జ్‌వైట్‌ యార్క్‌షైర్‌ జాతి పందులు మన వాతావరణానికి సరిపోతాయని, త్వరగా పెరుగుతాయన్నారు శివారెడ్డి. ఈ జాతి మరణాల సంఖ్య 1 లేదా 2 శాతం మాత్రమే ఉంటుంది. వాటికి క్రాసింగ్ చేసేందుకు డ్యూరాక్‌ మగపందులను పెంచుతున్నట్లు చెప్పారు. బ్రీడింగ్ పందులు ఎక్కువ బరువుంటే, కొవ్వు ఎక్కువై చూలి కట్టే అవకాశం తగ్గిపోతుందని శివారెడ్డి తెలిపారు.

సీమపందుల పెంపకం లాభదాయకమే కానీ, రిస్క్‌ ఉండదని రమేష్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వివరాల కోసం.. వాసుదేవ ఫామ్స్‌ రమేషర్‌రెడ్డిని ఫోన్‌: 8885350459, పురుషోత్తంరెడ్డి ఫోన్‌: 9160105208, శ్రీనివాస్‌ ఆగ్రో ఫామ్స్‌ శ్రీనివాస్‌ను: 9705077277, 7095624117 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.