తీగజాతి, గుబురు మొక్కలు, ఆకుకూరలు, దుంపలు, బొప్పాయి లేదా మునగ ఇలాంటి ఐదు రకాల పంటలు ఒకే బెడ్‌పై ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తే.. రైతుకు రొక్కం చేనుకు చేవ. కేవలం పావు ఎకరం నేలలో ఇద్దరు మనుషులు (భార్య భర్త) అతి తక్కువ కష్టంతో వ్యవసాయం చేసుకునే మోడల్‌ ఇది. ఒకే బెడ్‌పై ఈ ఐదు రకాల పంటలతో నెలకు కనీసం రూ.30 వేలు ఆదాయం చేతికి వస్తుంది. ఈ మోడల్‌ వ్యవసాయాన్ని ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో రైతు పిట్టల శ్రీశైలం ఆర్గానిక్ ఫామ్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టి విజయాలు సాధించారు. శ్రీశైలం ఆర్గానిక్‌ విధానంలో ముందుగా తమ ఇంటి కూరలు, పండ్ల అవసరాల కోసం చేపట్టారు. అనంతరం ఆయన తమ బంధువులు, స్నేహితులకు కూడా ఆరోగ్యాన్నిచ్చే ఈ విధానంలో పంటలను అందించారు. ఇప్పుడాయన సేంద్రీయ విధానంలో ఒకే బెడ్‌పై ఐదు రకాల పంటలు పండించే విధానాన్ని మరింత విస్తృతం చేశారు. ఔత్సాహికంగా ముందుకు వచ్చే ఇతర రైతులకు కూడా ఒకే బెడ్‌పై ఐదు రకాల పంటల సాగు విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.ఈ ఆధునిక సమాజంలో రోగాలు లేని ఇల్లు లేని వైనాన్ని శ్రీశైలం పరిశీలించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడిన ఆహార పంటలు తినడం వల్లే అనేక రోగాలు మనలను పీడిస్తున్నాయన్నారు. రోగాల నుంచి తప్పించుకోవాలనే భావనతో తాను ఆరోగ్యాన్నిచ్చే ఇతర అంశాలలో సహజసిద్ధ పంటల ఆహారం ఒకటని గ్రహించి ఈ విధానం చేపట్టినట్లు చెప్పారు. గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తమ భూములు వదిలిపెట్టి, పట్టణాణలకు వెళ్లి కూలీలుగా, వాచ్‌మెన్‌లుగా, తానీపనివారిగా, ఆటోలు నడుపుతూ జీవితం వెళ్లదీస్తున్నారన్నారు. తమ సహజ పంటల విధానం వల్ల రివర్స్‌ మైగ్రేషన్‌ వస్తుందనే ఆశాభావాన్ని శ్రీశైలం వ్యక్తం చేశారు. పావు ఎకరం భూమిలో తమ మోడల్‌ వ్యవసాయాన్ని కేవలం భార్య, భర్త చేసుకున్నా సరిపోతుందన్నారు. కనీసంలో కనీసం నెలకు రూ.30 వేలు ఆదాయం తీసుకోవచ్చన్నారు.పిట్టల ఆర్గానిక్ ఫామ్‌లో శ్రీశైలం పావు ఎకరంలో కూరగాయలు, పండ్లు, మరో పావు ఎకరంలో ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నారు. ఏకపంట విధానంలో రైతులకు సరైన ఆదాయం రావడం లేదని, అందుకే మోనోక్రాప్‌ విధానానికి గుడ్‌బై చెప్పాలన్నారు. ఏక పంట విధానంలో పంట ఉత్పత్తులను మార్కెట్‌ చేయడానికి దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది.అదే బహు పంటల విధానంలో కొద్ది కొద్దిగానే పంటలు నిత్యం చేతికి వస్తాయి కనుక స్థానికంగానే అమ్ముకోవచ్చన్నారు.పంటలు సాగుచేసే బెడ్లను 4 అడుగుల వెడల్పు, 75 అడుగుల పొడవు కొలతలతో శ్రీశైలం బెడ్లు తయారుచేశారు. ఇలా పావు ఎకరంలో ఇలాంటి 20 బెడ్లు ఏర్పాటు చేశారు. వాటిపై తన మోడల్‌ వ్యవసాయం చేపట్టారు. అన్ని బెడ్లపైనా మళ్లీ ఒకే పంట కాకుండా ఒకదానిపై కాకర, మరోదానిపై సొర, ఇంకో బెడ్‌పై చిక్కుడు, మరో బెడ్‌పై దొండపాదు ఇలా రకరకాల తీగజాతి మొక్కలను పెంచుతున్నారు. గుబురు మొక్కల జాతిలో టమోటా, బెండ, పది రకాల వంగమొక్కలు, గోరుచిక్కుడు, చిక్కుడు లాంటివి వేశారు. కొత్తిమీర, పుదీనా, పాలకూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు నాటారు. ఒక బెడ్‌పై బొప్పాయి, మరో దానిపై మునగ మొక్కలు వేశారు.తీగజాతి పంట కనీసం నాలుగు నెలలు దిగుబడి ఇస్తుంది. ఒక్కో బెడ్‌పై 35 తీగజాతి మొక్కలను శ్రీశైలం పెంచుతున్నారు. ఒక్కో తీగకు నెలకు కిలో కాయగూరలు వచ్చినా 35 మొక్కల నుంచి 35 కిలోల పంట దిగుబడి వస్తుందన్నారు. కిలో తీగజాతి కాయగూరలకు కనీసం రూ.20 రూపాయలు ధర వచ్చినా నెలకు రూ.700 ఆదాయం తీగజాతి నుంచి వస్తుంది. టమోటా, వంకాయ, బెండకాయ మొక్కలు కూడా నాలుగు నెలలు పంట ఇస్తాయి. ఒక్కో మొక్క నుంచి నెలకు కనీసం కిలో దిగుబడి వచ్చినా ఒక బెడ్‌పై 35 మొక్కలు పెట్టినా 35 కిలోల కూరగాయలు వస్తాయి. ఈ కాయగూరలను కూడా కిలో రూ.20కి అమ్మినా నెలకు రూ.700 చేతికి వస్తుంది. ఒక బెడ్‌పై ఆకు కూరలు కనీసం 75 మొక్కలు నాటారు. ఒక్కో ఆకుకూర బంచ్‌కు రూ.10 వచ్చినా 750 రూపాయలు వస్తాయి.దుంపకూరలలో ఒక బెడ్‌లో అల్లం, మరో దానిపై పసుపు మొక్కలు వరుసకు నాలుగు చొప్పున 75 వరుసలు వేశారు. ఒక్కో వరుసలోని నాలుగు మొక్కల నుంచి కనీసం కిలో పంట దిగుబడి వచ్చినా ఒక బెడ్‌పై కనీసం 75 కిలోలు పండుతుంది. ఈ పంటలకు తక్కువలో తక్కువ ధర రూ.100 వచ్చినా రూ.7,500 ఆదాయం ఉంటుంది. ఒక బెడ్‌పై మునగ, మరో బెడ్‌ మీద ఏడు మొక్కల చొప్పున బొప్పాయి నాటారు. బొప్పాయి నుంచి నెలకు 2 కిలోలే దిగుబడి వచ్చినా రూ.40 వస్తుంది. అలా చూసిన బొప్పాయి నుంచి ఒక్కో బెడ్‌పై నెలకు రూ.2,800 లభిస్తుంది. ఇలా ఒక బెడ్‌పై ఐదు పంటలకు గాను నెలకు కనీసం రూ.3 వేల రూపాయలు ఆదాయం వస్తుంది. పావు ఎకరంలో వేసిన 20 బెడ్ల నుంచి రూ.60 వేలు వస్తుంది. సాగుబడి ఖర్చు, విత్తనాలు, దుక్కి, సహజ ఎరువులు, క్రిమిసంహారకాలు, కూలి ఖర్చులు అన్నీ కలిపి రూ.30 వేలు అయినా కూడా నెలకు రూ.30 వేలు నికర లాభవం వస్తుందని శ్రీశైలం వివరించారు.రెండో విధానంలో పావు ఎకరంలో 20 బెడ్లలో ఆకుకూరలు పండిస్తున్నారు శ్రీశైలం. ఆకు కూరల సాగు విధానంలో బెడ్లపై మల్చింగ్ షీట్‌ వేసుకోవాలి. ఒక్కొక్క అడుగు విస్తీర్ణంలో 12 రంధ్రాలు వేసుకోవాలి. ఇలా ఒక్కో బెడ్‌కు 900 రంధ్రాల్లో 900 మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కో హోల్‌లో మొక్కను ఒక బంచ్‌గా తీసుకుంటే తక్కువలో తక్కువ ఖరీదు రూ.5 వచ్చినా మొత్తం రూ.4,500 ఆదాయం వస్తుంది. ఒక్కో రకం ఆకు కూరకు ఒకో రకం ధర పలికినా సగటున రూ.3 వేలు ఒక్కో బెడ్‌ నుంచి వస్తుంది. ఇలా 20 బెడ్ల నుంచి నెలకు కనీసం రూ.60 వేలు ఆదాయం ఉంటుంది. ఈ రూ.60 వేలలో కూడా సాగు, పెట్టుబడి, కూలి ఖర్చులను సగం తీసేసినా నెలకు రూ.30 వేల ఆదాయం కచ్చితంగా వస్తుందని శ్రీశైలం వివరించారు. కూలీలు లేకుండా పావు ఎకరంలో భార్య, భర్త కలిసి పనిచేసుకుంటే కూలి ఖర్చులు కూడా వారికే మిగులుతాయి. పావు ఎకరంలో ఆకు కూరలు, లేదా కాయగూరలు పండించుకోవడం కుటుంబంలోని ఇద్దరికి అంత కష్టం కాకపోవచ్చనేది శ్రీశైలం చెబుతున్న మాట. పంటల సాగు కోసం కనీసం పావు ఎకరం భూమి లేని వారు కూడా తమ ఇంటి పెరట్లోనో, లేదా టెర్రస్‌ పైన కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తే.. కనీసం తమ ఇంటి అవసరాలకు పంటలు పండించవచ్చు. ఆరోగ్యాన్ని అందుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం 7013784740లో సంప్రదించవచ్చు