విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఉద్యోగాల నుంచి రిటైర్‌ అయిన వారు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించవచ్చు. కశ్మీర్‌లో మాత్రమే కుంకుమపువ్వు పండుతుందని అందరికీ తెలిసిందే. అక్కడి శీతల వాతావరణం, నేల స్వభావం దీనికి సరిగ్గా సరిపోతాయి. కశ్మీర్‌ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పండించవచ్చని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఉద్యోగి శ్రీనిధి, ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన గృహిణి శైలజ, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థి లోహిత్ నిరూపించారు.

ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమపువ్వు. దీనిలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే సుమారు రెండు లక్షల పువ్వులు కావాలి. కుంకుమపువ్వు అనగానే మన దేశంలో ముందుగా గుర్తొచ్చేది కశ్మీర్‌. కశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలో పండుతుంది. అయితే.. అక్కడి వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కొందరు ఔత్సాహికులు పండిస్తున్నారు. అక్టోబర్‌- నవంబర్ నెలల మధ్య కాలంలో కుంకుమపువ్వు పూస్తుంది. దీని ధర గ్రాముకు సుమారు రూ.600 వరకు పలుకుతుంది.

రంగు, రుచి, సువాసన కోసం వంటలలో కుంకుమపువ్వును వినియోగిస్తారు. గర్భిణులు, పిల్లల ఎదుగుదలకు, కొన్ని రోగాలను నిరోధించేందుకు కుంకుమపువ్వును వాడతారు. దీనిలో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఆందోళనను, నిరాశను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించడానికి, 50 ఏళ్ల వయస్సు పైబడ్డ వారిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గర్భిణులకు పాలలో కలిపి కుంకుమపువ్వు ఇస్తే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా, మంచి రంగులో ఉంటారని అనేక మంది నమ్ముతారు. నిద్ర సమస్యను కుంకుమపువ్వు తగ్గిస్తుంది. దీన్ని తేనెలో కలిపి వాడితే దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. మెదడుకు పదును పెడుతుంది. గుండెపోటును నివారిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపునొప్పిని తగ్గించడంలో, ముక్కు సంబంధ వ్యాధులకు పనిచేస్తుంది. చర్మం, జుట్టు సంరక్షణ కోసం కుంకుమపువ్వును వినియోగిస్తారు. తాంబూలంలో కూడా కొందరు కుంకుమపువ్వును వాడతారు. అయితే.. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.తెలుగు రాష్ట్రాల్లో కుంకుమపువ్వును ఆరు బయట కాకుండా ఇంటి గదులలో మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. కశ్మీర్‌ మాదిరిగా ఉష్ణోగ్రతను గదిలో సృష్టించి ఈ పంట సాగు చేయొచ్చు. అయితే.. కుంకుమపువ్వు సాగు చేయాలంటే తొలిసారి ఖర్చు కాస్త ఎక్కువే అవుతుంది. నాణ్యమైన కుంకుమపువ్వు విత్తనాల ఖరీదు కిలోకు వెయ్యి రూపాయలకు అటూ ఇటూగా ఉంటుంది. విత్తనాలను తొలిసారి కశ్మీర్‌ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి విత్తనాలు ఎవరికి వారే తయారు చేసుకోవచ్చు.

ఇక కుంకుమపువ్వు సాగుచేసే గదికి కృత్రిమ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలి. ఆ గదికి సూర్యరశ్మి తగిలే అవకాశం ఉంటే అప్పుడప్పుడూ కిటికీలను ఓ గంటపాటు తెరిచి ఉంచవచ్చు. గదిలో ఉష్ణోగ్రత ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 16, 17 డిగ్రీలు, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 10 డిగ్రీలు మెయింటెన్‌ చేయడానికి 24/7 చిల్లర్‌ ఆన్‌లో ఉంచాలి. చిల్లర్‌ ఏర్పాటుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది.తొలిసారి సీడ్‌ కొనేందుకు వెండర్లనే పూర్తిగా నమ్మొద్దని శైలజ సలహా. కుంకుమపువ్వు విత్తనాలు పెద్దగా ఉంటేనే దానికి పువ్వులు వస్తాయి. చిన్నవైతే పనికిరావు. అందుకే విత్తనాలు కొనేటప్పుడు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కశ్మీర్‌ వెళ్లి విత్తనాలు తెచ్చుకోగలితే మేలు. కశ్మీర్‌ వెళ్లినప్పుడు విత్తనాలను మొక్క నుంచి మన ముందే తీసి ఇవ్వాలని అడగాలి. అలా తీసిన విత్తనాలను రెండు మూడు రోజులు ఆరబెట్టి, జల్లెడ పట్టించి, పెద్దసైజు విత్తనాలు మాత్రమే తీసుకోవాలి. అంతకు ముందుగానే గదిలో హ్యుమిడిఫయర్‌, చిల్లింగ్‌ యూనిట్‌, కూలింగ్ బయటికి పోకుండా పూర్తిగా రక్షణ చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాతే విత్తనాలు తెచ్చుకోవాలి. ఒక విత్తనం కనీసం 7 గ్రాముల బరువు ఉంటేనే ఫ్లవర్‌ ఇస్తుంది. అందుకు వాటిని గ్రేడింగ్ చేసుకోవాలి.

బావిస్టా అనే ఫంగిసైడ్‌ పౌడర్‌ 2 మిల్లీ గ్రాములను 2 లీటర్ల నీటిలో కలిపి, విత్తనాలను 10 నిమిషాల పాటు ఉంచాలి. విత్తనాలను బయటికి తీసి, ఒక బట్టపై గదిలో ఫ్యాన్‌ కింద ఒక రోజు ఆరబెట్టాలి. ఎండలో పెట్టకూడదు. తర్వాత విత్తరాల పరిమాణం వైజ్‌గా వాటిని ట్రేలలో ఉంచి, స్టాండ్‌లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్‌ అంతా జులై నెలాఖరు లేదా ఆగస్టు తొలి వారం లోపల పూర్తిచేసుకోవాలి. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, జాబ్‌ నుంచి రిటైర్‌ అయిన మహిళలు, పురుషులు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించేందుకు అనువైనది కుంకుమపువ్వు.ఏరోఫోనిక్‌ విధానంలో కుంకుమపువ్వు సాగు చేస్తే.. విత్తనాలకు మట్టి, నీరు అవసరం ఉండదు. ఎరువులు అవసరం ఉండదు. కుంకుమపువ్వు పంట చేతికి వచ్చే వరకు కేవలం ఉష్ణోగ్రతలను కశ్మీర్‌లో ఎప్పటికప్పుడు మారే విధంగా సెట్‌ చేసుకుంటూ ఉండాలి. సెప్టెంబర్‌ నెలలో మొక్క మొదలై నెల రోజుల్లో మూడు నాలుగ అంగుళాల వరకు ఎదుగుతుంది. అక్టోబర్‌ నెల మధ్యలో ఫ్లవరింగ్‌ ప్రారంభం అవుతుంది. కుంకుమపువ్వు మొగ్గ పువ్వుగా విచ్చుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. ఆ పువ్వులను వెనువెంటనే మొక్క నుంచి తీసుకోవాలి. లేదంటే పువ్వు కాండం మీద కొద్దిగా నీరు వచ్చి పువ్వు వడిలిపోతుంది. దాంతో పువ్వుకు ఫంగస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కుంకుమపువ్వు విత్తనాలను ట్రేలలో పెట్టుకోవాలి. ఒక గదిలో కుంకుమపువ్వు సాగు చేయాలంటే తొలిసారి రూ.5 లక్షలు ఖర్చు వస్తుంది. ర్యాక్‌లు, ట్రేలు, పరికరాలు, స్ట్రక్చర్‌, యువీ లైటింగ్‌, కోల్డ్‌ గదికి ఉండే డోర్‌కు, గదిని పూర్తిగా కప్పి ఉంచేందుకు, చిల్లర్‌ యూనిట్‌కు లక్షా 30 వేలతో కలిపి రూ.3 లక్షలు అవుతుంది. అయితే.. ఈ ఖర్చు కుంకుమపువ్వు విత్తనాలు నాటిన ప్రతిసారీ ఉండదు. విత్తనాలు కొనేందుకు తాను రూ.2 లక్షలు వెచ్చించినట్లు విద్యార్థి లోహిత్‌ వివరించాడు. విత్తనాలు ఉంచిన గదిలో 12 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తున్నట్లు తెలిపాడు. కుంకుమపువ్వు విత్తనాలు ఉంచే ట్రే 3 అంగుళాల లోతు, ఒకటిన్నర, రెండు అడుగుల పొడవు, వెడల్పువి వాడుతున్నాడు. విత్తనాల జర్మినేషన్‌ కోసం వాడే ట్రేలు కాస్త ఎక్కువ లోతు ఉండాలి. కిటికీలకు ఎక్సెల్‌పీఈ షీట్లు కానీ, థర్మాకోల్‌ గాని వాడవచ్చు.

కుంకుమపువ్వు మొక్కలకు ఫ్లవరింగ్‌ టైమ్‌, స్లీపింగ్‌ సమయం, జెర్మినేషన్‌ టైమ్‌ అని మూడు దశలు ఉంటాయి. విత్తనం నుంచి ఉల్లిపాయకు వచ్చిన విధంగా మొక్క వస్తుంది. ఒక విత్తనం నుంచి ఒకసారి మాత్రమే పువ్వు వస్తుంది. అయితే… మొక్క నుంచి వచ్చే ఇతర శాఖల నుంచి కొత్తగా విత్తనాలు తయారవుతాయి. కశ్మీర్‌లో కుంకుమపువ్వు మొక్కలు మట్టిలో నాటుకుంటారు. కానీ కృత్రిమ వాతావరణంలో మట్టి, నీళ్లు లేకుండా వీటిని ఔత్సాహికులు పెంచుతున్నారు. గాలిలో తేమనే మొక్క తీసుకుంటుంది. తేమ మెయింటెన్‌ చేసేందుకు డివైస్‌లు పెట్టాలి..కుంకుమపువ్వు రేకులను వేరేగా తీసుకొని, వాటిని కాస్మొటిక్స్‌లో సుగంధం వెదజల్లేందుకు వినియోగిస్తారు. వీటిని మొక్క నుంచి తీసిన తర్వాత ఆరబెట్టాలి. లేకపోతే ఫంగస్‌ వస్తుంది. పువ్వు మధ్యలో ఉండే పసుపురంగు కేసరి (స్టిగ్మా)లను కాస్మొటిక్స్‌లో వాడతారు. దాంట్లో ఎర్ర రంగులో ఉండే కేసరిని మాత్రమే కుంకుమపువ్వు అంటారు. స్టిగ్మా కింది భాగంలో తెలుపు రంగు ఉంటే దాన్ని తక్కువ నాణ్యత గలదిగా పరిగణిస్తారు. పువ్వు మొత్తం రెడ్‌ కలర్‌లో ఉంటే అత్యంత నాణ్యమైనది అంటారు. పువ్వులో ఉండే తెలుపు రంగు భాగాన్ని, ఎర్రరంగు భాగాన్ని వేరుచేసుకోవాలి. తెల్లగా ఉన్నదాన్ని థర్డ్‌ గ్రేడ్‌ రకం అంటారు. గదిలో ఉష్ణోగ్రతను మెయింటెయిన్‌ చేయడాన్ని బట్టి కుంకుమపువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. ప్రతి పువ్వును చాలా జాగ్రత్తగా చేతితో తీయాల్సి ఉంటుంది. పువ్వులు తీసేందుకు ఇంతవరకు యంత్రాలు లేవు. 100 పువ్వులలోని స్టిగ్మా నుంచి కేవలం ఒక గ్రాము లభిస్తుంది.స్లీపింగ్‌ సమయంలో మాత్రమే విత్తనాలను రవాణా చేయాల్సి ఉంటుంది. ఫ్లవరింగ్ సమయంలో కశ్మీర్‌ రైతులు కూడా మనకు విత్తనాలు ఇవ్వరు. విత్తనాలు వేసిన తర్వాత వాటికి ఎలాంటి ఎరువులు, రసాయనాల అవసరం ఉండదు. కేవలం విత్తనాల జెర్మినేషన్‌ సమయంలో మాత్రమే NPK, యూరియా కొద్దిగా ఇవ్వాల్సి ఉంటుంది. విత్తనాల జెర్మినేషన్ కోసం కొద్దిగా రాళ్లతో కలిసిన ఎర్రమట్టి వాడొచ్చు. నీరు పోసిన వెంటనే ట్రే నుంచి బయటికి వెళ్లిపోవాలి. ఇలా నెలకు మూడు సార్లు మాత్రమే ఎర్రమట్టిలో నీల్లు పోయాలి. తేమ ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి నల్లమట్టిని అస్సలు వాడకూడదు

కుంకుమపువ్వు విత్తనం పెట్టిన తర్వాత ఉదయం, సాయంత్రం తప్పకుండా పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా విత్తనం కింది భాగంలో ఫంగస్‌ వచ్చిందంటే దాన్ని వెంటనే తీసేసి బయట వేసేయాలి. లేదంటే మిగతా విత్తనాలకు కూడా బూజు పట్టే అవకాశం ఉంటుంది. నిజమైన కుంకుమపువ్వును నీళ్లలో వేస్తే.. దాని రంగు చాలా నెమ్మదిగా నీటిలో కలుస్తుంది. అదే నకిలీదైతే రెండు మూడు సెకండ్లలోనే నీటిలో రంగు కలిసిపోతుంది. కుంకుమపువ్వు నాణ్యతను, అసలుదా? నకిలీదా తెలుసుకోవడానికి ఇదొక పరీక్ష. అలాగే నకిలీ పువ్వు అయితే.. పసుపు, ఎరుపు రంగుల్లో కలగలిసి ఉంటుంది. స్వీట్‌ కార్న్‌ పొత్తుకు ఉండే పీచుకు రంగులు వేసి నకిలీ కుంకుమపువ్వు తయారు చేసే అవకాశాలు ఉన్నాయని వినియోగదారులు గ్రహించాలి.

శ్రీనిధి నెంబర్: 9148749057 లోహిత్‌ నెంబర్‌: 8179933817 లలో సంప్రదించవచ్చు.