ఖర్చు తక్కువ, దిగుబడి, వినియోగం, లాభం ఎక్కువ ఉండాలి. అందరిలా ఒకే పంట విధానం కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తక్కువ నీటి లభ్యత ఉన్న చోట ఏ పంట వేస్తే.. లాభదాయకంగా ఉంటుందో అని తెలుసుకున్నారు. సెమీ ప్రకృతి సాగు విధానంలో పంట పండించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆరుతడి పంటగా కంది సాగు చేస్తున్నారు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మహబూబ్‌పల్లి ఉపాధ్యాయుడు అలోత్‌ ప్రతాప్‌.ఆరోగ్యం కోరుకునేవారు ముందుగా కందిపప్పును ఆహారంగా తీసుకోవాలి. ఇది సూపర్‌ఫుడ్‌. కందిపప్పులో ఉండే ఖనిజాలు ఎముకలను గట్టిపరుస్తాయి. కందిపప్పు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కందిలో ప్రొటీన్‌, పీచు పదార్థం ఉంటుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ని సమర్తంగా బయటికి పంపిస్తుంది. కందిపప్పులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. దీనిలోని ఫైబర్ కారణంగా బ్లోటింగ్ సమస్య రాదు. కందిపప్పులో బీ కాంప్లెక్స్‌, ఫాస్పరస్‌, మెగ్నీసియం, పొటాషియం కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. కందిపప్పు శరీర బరువును నియంత్రిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను చక్కబరుస్తుంది. కందిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది, కందిపప్పు రక్తహీతను తగ్గిస్తుంది. చాలా సులువుగా జీర్ణం అయ్యే కందిపప్పును గర్భిణులు ఆహారంలో తినవచ్చు. గర్భధారణ సమయంలో అవసరమయ్యే ఫోలిక్‌ యాసిడ్‌, కార్బోహైడ్రేట్లు ఇందులో లభిస్తాయి.ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ప్రతాప్‌ది వ్యవసాయ కుటుంబం. తాత, తండ్రి రైతులు. వ్యవసాయం అంటే అందులోనూ ప్రకృతి వ్యవసాయం అంటే తనకు ఇష్టం అన్నారాయన. అందుకే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే వ్యవసాయంతో మక్కువతో సాగు రంగంలోనూ కొనసాగుతున్నట్లు తెలిపారు. ముందుగా తాను ప్రకృతి వ్యవసాయంపై గుంటూరు రైతు నేస్తం ఫౌండేషన్‌ ఇచ్చిన శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు. వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం ఉన్న ఆయన తమ ఇంటి టెర్రస్‌పై పలు రకాల కూరగాయల మొక్కలు పెంచారు. తనకు ఉన్న ఆసక్తే తనను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకొచ్చిందన్నారు ప్రతాప్‌.సాధారణంగా తెలంగాణలో రైతులు పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న, జొన్న లాంటి పంటలే పండిస్తారు. గతంలో ఎప్పుడో నీటి సౌకర్యం లేని సమయంలో రైతులు కంది, పెసర పంటలు పండించేవారు. నీటి వనరులు కాస్త లభ్యం అవుతున్న ఈ కాలంలో వారు ఈ పంటలు వదిలేశారు. విపరీతంగా రసాయనాలు వాడి రైతులు చేస్తున్న వ్యవసాయ విధానాలను చూసి తనకు భయం వేస్తోందన్నారు ప్రతాప్‌. రసాయనాల వాడకంతో భూసారం నశించిపోతోందని ఆందోళన చెందారు. ఇతర రైతులు పత్తి, వరి మాత్రమే సాగుచేస్తున్న సమయంలో ఆయన కాస్త విభిన్నంగా ఆలోచించి, రిస్క్ ్తక్కువ ఉండే కంది పంట సాగు చేస్తున్నట్లు చెప్పారు. రసాయనాలు తక్కువ వాడాలి, ఎక్కువ లాభం కనిపించాలనే ఉద్దేశంతో తాను రెండున్నర ఎకరాల్లో కందిపంట వేసినట్లు తెలిపారు. ఎకరం పావులో భూమిలో కంది చేనులో పెసర పంటను అంతర పంటగా కూడా తీశారు.జూన్‌ తొలి వారంలో భూమిని దుక్కి దున్ని, చదును చేశారు ప్రతాప్‌. ఇలా చేస్తే భూమిలో ఉండే క్రిమి కీటకాలు, వాటి గుడ్లను పక్షులు తింటాయి. ఎండ తీవ్రతకు కూడా మరికొన్ని చనిపోతాయి. దీంతో పంటలకు హాని చాలా వరకు తొలగిపోతుంది. హనుమకొండ వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి విత్తనాలు తెచ్చి నాటినట్లు చెప్పారు.  పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల సలహా మేరకు డబుల్ ఆర్జీ 255 రకం విత్తనాలు నాటినట్లు తెలిపారు. తేలికపాటి నేలల్లో మొక్కల వరసల మధ్య 3 అడుగుల దూరం ఉండేలా విత్తనాలు నాటాలని సైంటిస్టులు చెప్పారన్నారు. నల్లరేగడి లేదా బరువైన నేలలైతే 4 అడుగులు అంతకంటే కాస్త ఎక్కువ దూరంలో నాటినా మంచి దిగుబడి వస్తుంది. సైంటిస్టులు 3 అడుగుల దూరంలో విత్తనాలు నాటమని చెప్పినా తాను రెండున్నర అడుగుల దూరంలో నాటినట్లు చెప్పారు. మొక్కలు బాగా వచ్చాయని, కానీ దగ్గర దగ్గరగా దట్టంగా ఉన్నాయన్నారు. మూడు అడుగుల దూరం తగ్గకుండా కంది విత్తనాలు నాటుకుంటేనే మంచిదని ప్రతాప్‌ అన్నారు.కంది మొక్క 45 రోజులు వచ్చేసరికి చిగుర్లు కత్తించుకోవాలని మాస్టర్ ప్రతాప్ తెలిపారు. మొక్కలకు పక్క నుంచి వచ్చే చిగుర్లను మరో 25 నుంచి 30 రోజులకు కత్తిరించాలన్నారు. మరో నెల రోజుల తర్వాత పక్కన వచ్చే చిగుర్లను కూడా కత్తిరిస్తే.. మొక్క తక్కువ ఎత్తులో భూమికి సమాంతరంగా ఎదుగుతుంది. దీంతో పూత, కాయ విపరీతంగా వస్తాయి. కందిపంట 170 రోజుల పంట. దీంట్లో అంతర పంటగా 70 నుంచి 75 రోజుల్లో దిగుబడి వచ్చే పెసర, మినుము, ఉలవలు వేసుకోవచ్చు. ఎకరంబావులో తాను వేసిన పెసరపంటలో ఒకటిన్నర క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. తర్వాత వర్షాలు విపరీతంగా కురవడంతో రెండు, మూడు కోతలు దిగుబడి తీసుకోలేకపోయినట్లు చెప్పారు. లేదంటే.. నాలుగున్నర క్వింటాళ్ల పైచిలుకు దిగుబడి వచ్చిఉండేదన్నారు.రసాయన వ్యవసాయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే తాను ప్రకృతి వ్యవసాయ విధానంపై శిక్షణ తీసుకున్నట్లు ప్రతాప్‌ తెలిపారు. అయితే.. ఒక్కసారిగా రసాయనాలు మానేసి, ప్రకృతిసిద్ధ ఎరువులు వాడితే సరైన దిగుబడి రాదని ఆయన చెప్పారు. అందుకే తాను రసాయన ఎరువులతో పాటు సహజ ఎరువులు కూడా కలిపి పాక్షిక నేచురల్ ఫార్మింగ్ చేశానన్నారు. భూమిని చదును చేసిన తర్వాత జీవన ఎరువులు ఫాస్పో బాక్టీరియా, అజితో బాక్టీరియా, రైజో బీయం కల్చర్‌ను ఎరువులతో కలిపి చల్లినట్లు చెప్పారు. కందికి సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎకరానికి 125 కిలోలు, నత్రజని అందించే 20 కిలోల యూరియా కలిపి దుక్కిలో చల్లారు. భూమిని సాళ్లు చేసుకొని మొక్కల మధ్య 10 అంగుళాలు, వరుసకు వరుసకు మధ్య మూడు అడుగుల దూరంలో విత్తనాలు నాటారు. ప్రధాన పంటకు కలుపు సమస్య నివారణ కోసం ఐదున్నర ఆరు నెలల కాలంలో చాలా తక్కువ మోతాదులో గడ్డిమందు రెండుసార్లు కొట్టినట్లు చెప్పారు. రసాయన ఎరువులతో చేసే వ్యవసాయంలో కంది విత్తనాలు నాటిన 48 గంటల్లో పిండిబితాల్‌ అనే కలుపు మందు ఎకరానికి లీటర్‌ చొప్పు ముందుగా స్ప్రే చేయాలని నిపుణులు చెప్పారన్నారు. దీంతో విత్తు నాటిన 30 నుంచి 35 రోజుల వరకు కలుపు రాకుండా అది నియంత్రిస్తుందన్నారు. అప్పటికి కంది మొక్క పైకి వస్తుందని, ఆ తర్వాత వచ్చే కలుపు నివారణకు ఇమాజిత ఫైర్‌ మందు స్ప్రే చేస్తే.. మరో 30 నుంచి 35 రోజుల వరకు కలుపు రాదని చెప్పారు. కలుపు మందు ఎక్కువసార్లు స్ప్రే చేస్తే.. కంది మొక్క ఎదుగుదల ఆగిపోయే ప్రమాదం ఉందని ప్రతాప్ తెలిపారు. అంతరపంటగా వేసిన పెసర, మినుము మొక్కలు కూడా కలుపు నివారణకు ఉపయోగపడతాయన్నారు.కంది మొక్కకి ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. తమ కంది పైరులో వచ్చిన పొగాకు లద్దెపురుగు నివారణకు తాను ఫ్లూ బెండమైడ్‌, 13045 రసాయనాలు కలిపి స్ప్రే చేసినట్లు తెలిపారు. వీటి కంటే ముందు తాను వేపనూనె, మోనో స్ప్రే చేసినట్లు చెప్పారు. కంది మొక్కలకు ఐదు, ఆరు నెలల వరకు అంటే పూత దశ వచ్చే వరకు ఎలాంటి పై మందులు చల్లాల్సిన అవసరం ఉండదు. భూమిలో మందులు కూడా ఇవ్వక్కరలేదు. దుక్కిలో వేసుకున్న సింగిల్ ఫాస్పేట్‌, నత్రజని సరిపోతుందన్నారు. కందిమొక్కకు పూత వచ్చిన ఒకటిన్నర రెండు నెలల కాలం చాలా కీలకం అని చెప్పారు ప్రతాప్‌. ఈ సమయంలో పంటను జాగ్రత్తగా కాపాడుకుంటే మంచి దిగుబడి వస్తుందన్నారు. ఫ్లవరింగ్ స్టేజ్‌లో మార్కా మచ్చల పురుగు, లద్దెపురుగు లాంటి నాలుగైదు రకాల పురుగులు ఆశిస్తాయన్నారు. ఎండు తెగులు సోకిన మొక్కను వెంటనే పీకేసి, ధ్వంసం చేయాలి. పత్తి, వరి పంటలకు ఉన్నంత రిస్క్‌  కందిచేనుకు ఉండదని ప్రతాప్ తెలిపారు.కంది విత్తనాలు నాటుకోవడానికి జూన్‌, జులై నెలలు లేదా సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్ నెలలు అనుకూలం అన్నారు ప్రతాప్‌. జూన్‌,  జులైలో విత్తుకుంటే వర్షంతోనే పంట పండుతుంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్ నెలల్లో విత్తుకుంటే నీటిని మనమే సరఫరా చేయాల్సి వస్తుంది. మొక్కలకు పూతపూసినప్పుడు ఒక తడి ఇవ్వాలి. పూత 60 శాతం కాతగా మారినప్పుడు రెండోది, ఆఖరి తడి ఇవ్వాలి. తమ పొలంలో ఎకరానికి 9 నుండి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారన్నారు. కందిచేను పూర్తి పూత దశలో ఉన్నప్పుడు మబ్బులు, మేఘాలు, వర్షం ఉంటే కొద్దిగా రాలిపోయే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎకరానికి ఆరు నుండి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ప్రతాప్ ధీమాగా చెప్పారు. వరంగల్ మార్కెట్‌లో కందులు అమ్ముకోవచ్చన్నారు. అయితే.. తాను స్థానికంగా అమ్ముతానని అన్నారు. తాను పండించిన పంటను తానే మార్కెటింగ్ చేసుకున్నప్పుడే .. రైతుకు లాభం అంటారాయన.ఎప్పుడూ మూస పద్ధతిలో ఒకే పంట వేస్త.. భూమిలోని సారం తగ్గిపోతుందని ప్రతాప్ చెప్పారు. వర్షాకాలం పంట అయిపోగానే.. నీటి సౌకర్యం లేని రైతులు రెండో పంట వేయడం లేదన్నారు. అయితే.. మొదటి పంట కాగానే.. ఆరుతడి పంటలు పెసర, నువ్వులు, అక్టోబర్‌ నెల అయితే.. సెనగపంటకు చాలా అనుకూలం అంటారు. సారవంతమైన భూమి ఉన్నవాడే ధనవంతుడని ఆయన చెబుతారు. కందిమొక్కల నుంచి రాలిన ఆకులు పంట తర్వాత దున్నినప్పుడు మట్టిలో కలిసిపోయి, భూమికి మంచి ఎరువుగా మారతాయన్నారు. కందిమొక్కల వేర్లు, ఆకుల్లో నత్రజని స్థిరీకరణ ఎక్కువగా ఉంటుందన్నారు. రెండో పంటగా పప్పుజాతి మొక్కలు పెంచితే భూసారం పెరుగుతుందన్నారు.ఇతర రైతుల మాదిరిగా తాను కూడా పంటలకు రసాయనాలు వాడినా వారికన్నా చాలా తక్కువ వినియోగించానన్నారు. ఎందుకంటే భూసారాన్ని కాపాడడం తన లక్ష్యం అన్నారు. రైతులు విపరీతంగా గడ్డిమందు స్ప్రే చేసి, భూమిలోని సారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ప్రతాప్ చెప్పారు. అన్నం పెట్టే రైతన్న తన పంటల ద్వారా విషాన్ని కూడా మనుషులకు అందిస్తున్నాడని ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతు శ్రమ తక్కువ ఉండాలి, భూసారం పెరగాలంటే కందిపంట సాగుచేసుకోవాలని ప్రతాప్ సూచించారు. ఆరుతడి పంటలు పండిస్తే.. భావి తరాలకు నీటిని అందించినట్లు అవుతుందన్నారు. పంట మార్పిడి చేసిన రైతు భవిష్యత్తు తరాలకు సారవంతమైన భూమిని ఇచ్చినట్లు అవుతామన్నారు. వరి, పత్తితో పోల్చినప్పుడు కంది సాగుకు పెట్టుబడి చాలా తక్కువ, నీటి అవసరం కూడా తక్కువ, భూసారం కూడా పెరుగుతుంది కాబట్టి కందిని ఆరుతడి పంటగా, రెండో పంటగా రైతులు చేస్తే మేలు జరుగుతుంది.