పోషకాల గని ముల్లంగి అంటారు. దీనిలో నీటిశాతం అధికం. కేలరీలు కొద్దిగానే ఉంటాయి. ముల్లంగిని ఆహారంగా తీసుకునేవారి శరీరానికి ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సీ, బీ సమృద్ధిగా అందిస్తాయి. ముల్లంగిని చలికాలంలో తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జలుబు, దగ్గులు మన దరి చేరవని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు. ముల్లంగిలో ఉండే ఆంత్రాసిన్ గుండె జబ్బుల ఇబ్బందిని తగ్గిస్తుంది. వరుసగా ఆరు రోజులు ముల్లంగిని ఆహారంలో తీసుకుంటే రక్తనాళాలు టీనేజ్‌కుర్రాడిలో ఉన్నట్లు మారుస్తుంది. శీతాకాలంలో వచ్చే జీర్ణ సంబంధ ఇబ్బందులను ముల్లంగి తొలగిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.డయాబెటిక్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ముల్లంగి తగ్గిస్తుంది. అయితే.. రక్తంలో ఎక్కువ చెక్కెర స్థాయిలు ఉన్నవారు మాత్రం ముల్లంగి జోలికి వెళ్లకపోతేనే మేలు అంటారు నిపుణులు. బాగా అలసిపోయినప్పుడు, నిద్ర సమస్య ఉన్నవారు ముల్లంగి తింటే మంచి ఫలితం ఇస్తుంది. కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలను ముల్లంగి దృఢంగా మారుస్తుంది. ముల్లంగిని తరచుగా తింటే కిడ్నీ, లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని ముల్లంగి పెంచుతుంది.ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ముల్లంగి సాగు చాలా సులువు, తక్కువ ఖర్చుతో కూడి వ్యవసాయం అంటారు 15 సంవత్సరాలుగా పండిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచంపల్లి రైతు నాగరాజు. ఆకుకూరల సాగుతో పాటుగా నాగరాజు ముల్లంగిని కూడా పండిస్తున్నారు. ముల్లంగి 50 రోజుల పంట. విత్తనం వేసిన రోజు నుంచి 50 రోజుల్లో దీని దిగుబడి చేతికి వస్తుంది. 300 గ్రాముల ముల్లంగి విత్తనాలు 10 సెంట్లకు సరిపోతుంది. కుంచంపల్లిలోనే విత్తనాల షాపుల్లో ముల్లంగి విత్తనాలు దొరుకుతాయి. 300 గ్రాముల ముల్లంగి విత్తనాలు వెయ్యి నంఉచి 11 వందలకు దొరుకుతాయి. పది సెంట్లలో ముల్లంగి సాగు చేస్తే.. 50 రోజుల్లో రూ.10 వేలు వరకు ఆదాయం ఉంటుందని రైతు నాగరాజు తెలిపారు.ముల్లంగి సాగులో ముందుగా భూమిని దుక్కి దున్నుకొని, సాళ్లుగా ఏర్పాటు చేసుకోవాలి. సాళ్ల పైన కొంచెం దూరం దూరంగా విత్తనాలు నాటుకోవాలి. విత్తనాలు నాటిన తర్వాత పొలానికి నీరు సరఫరా చేయాలి. మూడో రోజున పులక వేసుకోవాలి. దీంతో విత్తనం నుంచి మొలిచిన ప్రతి మొక్క భూమిపైకి వస్తుంది. విత్తనాలు నాటిన మూడు రోజులకు ముల్లంగి మొలకలు వస్తాయి. విత్తనాలు నాటిన తర్వాత సహజ సిద్ధ ఎరువులు గానీ, రసాయన ఎరువులు గానీ ఏవైనా వేసుకోవచ్చు. మొక్కలకు దోమకాటు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.ముల్లంగిని శీతాకాలంలో సాగుచేస్తే దిగుబడి బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుందని నాగరాజు తెలిపారు. ఎండల్లో ముల్లంగి దిగుబడి కాస్త తక్కువ ఉంటుంది. ముల్లంగి పంటలో దుంపలు పెద్దగా పాడయ్యే ఛాన్స్ ఉండదు. పైరు బాగా వత్తుగా ఉన్నప్పుడు కానీ, నీళ్లు ఎక్కువ అయినప్పుడు కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఈ రెండింటినీ జాగ్రత్తగా పద్ధతిగా చూసుకుంటే బాగుంటుంది. నేల ఆరిపోయినప్పుడు నీరు సరఫరా చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒకసారి నీరు ఇస్తే ముల్లంగి పంటకు సరిపోతుంది. అంటే 50 రోజుల పంట కాలంలో ఐదారు సార్లు నీరు పెట్టుకుంటే చాలు.ముల్లంగి పంట సాగు కోసం దుక్కి దున్నడం, సాళ్లు వేసుకోవడం, విత్తనాలు నాటడం, నీరు సరఫరా చేయడం, దుంపల్ని తీసేందుకు, రవాణా చార్జీలు అన్నీ పోగా 10 సెంట్లలో నాలుగైదు వేలు లాభం వచ్చే అవకాశం ఉంది. పెద్దగా మందులు,పురుగు మందుల అవసరం ఉండదు. కాబట్టి పెట్టుబడి ఎక్కువ ఉండదు.