నాన్‌వెజ్ ప్రియులు ఇప్పుడిప్పుడే కౌజుపిట్ట మాంసం తినేందుకు బాగా ఇష్టపడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. కౌజుపిట్ట నాలుగు నుంచి ఐదు వారాల్లోనే వినియోగానికి వచ్చేస్తుంది. కౌజుపిట్ట మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. కౌజుపిట్ట. కోడి మాంసం కన్నా కౌజు మాంసంలో అధికంగా ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయి. దీని మాంసం వృద్ధాప్యానికి చెక్ పెడుతుంది. కౌజుపిట్ట మాంసం దగ్గు, ఆస్తమాలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. క్షయ వ్యాధి నివారణకు దీని మాంసం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. కొవ్వు తక్కువ ఉంటాయి కాబట్టి గుండె జబ్బులు, హైబీపీ, ఆర్థరైటిస్, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. కౌజుపిట్ట మాంసం తినేవారికి వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది.
కిడ్నీ, లివర్, గాల్ బ్లేడర్‌లోని రాళ్లను కౌజుపిట్ట గుడ్లు కరిగిస్తాయి. కోడిగుడ్ల కన్నా కౌజుపిట్ట గుడ్డు చిన్నగా ఉంటుంది. అయితేనేం.. కోడిగుడ్డు కన్నా 30 శాతం ఎక్కువ పోషకాలు ఇస్తుంది. లైంగిక సమస్యలను దూరం చేస్తుంది. నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. డిప్రెషన్, కంగారు లాంటి వాటిని తగ్గిస్తాయి. కౌజుపిట్ట గుడ్లు అలర్జీలు, కడుపులో మంటలను తగ్గిస్తాయి. ఈ గుడ్లలో విటమిన్ బీ 12, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డీ, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి. కౌజుపిట్ట గుడ్లు పిల్లల ఎదుగుదలకు, వారి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు కౌజుపిట్టల గుడ్లు చక్కగా పనిచేస్తాయి. 100 గ్రాముల కౌజుపిట్ట గుడ్లలో 74 గ్రాముల నీరు, 158 కేలరీల శక్తి ఉంటుంది. అలాగే 13 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల కొవ్వు ఉంటాయి. కౌజుపిట్ట గుడ్లు తిన్నవారికి హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. రోజుకు 4 గుడ్ల తింటే నెల రోజుల్లో 3 నుంచి 4 పాయింట్లు పెరుగుతుందని కృష్ణారెడ్డి అనుభవంతో చెప్పారు.కౌజుపిట్టలను తక్కువ స్థలంలోనే ఎక్కువ సంఖ్యలో పెంచుకునే వీలుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ గుడ్లు, మాంసం ఉత్పత్తి అవుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. కౌజుపిట్టలను భారీ స్థాయిలో పెంచి లాభాలు ఆర్జిస్తున్నారు సిద్దిపేట జిల్లా మద్దూరుకు చెందిన కృష్ణారెడ్డి. కౌజుపిట్టలను పెంచడం, అమ్మడం, మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు ఆయన ఎగుమతి చేస్తున్నారు. కృష్ణారెడ్డి సుమారు 80 వేల కౌజుపిట్టలను తన ఫాంలో పెంచుతున్నారు. ప్రతి నెలా 60 వేల కౌజుపిట్టల మాంసం అమ్ముతుంటారు. కృష్ణారెడ్డి అనుభవాలేంటో తెలుసుకుందాం.
కృష్ణారెడ్డి 2018లో కౌజుపిట్టల ఫాం ప్రారంభించారు. ముందుగా తమ మామిడితోటలో నాలుగైదు షెడ్లలో ఆర్గానిక్ విధానంలో కౌజుపిట్టల సాగు ప్రారంభించారు. నాటుకోళ్లు, గొర్రెలు, రాబిట్ లాంటివన్నీ పెంచేవారు. అయితే.. వాటిలో ఒక జాతి డిసీజ్ మరో జాతికి వచ్చి నష్టం వచ్చినట్లు చెప్పారు. దీంతో తాను కౌజుపిట్టల సాగునే పూర్తిస్థాయిలో చేపట్టినట్లు తెలిపారు. కౌజుపిట్ట ఫార్మింగ్ చేయాలనుకునే వారు ముందుగా మార్కెటింగ్‌ను అధ్యయనం చేయాలన్నారు. కౌజుపిట్టల ఫార్మింగ్ కేవలం లైవ్ మీద ఆధారపడితే పెద్దమొత్తంలో చేయలేం అని చెప్పారు. కౌజుపిట్ట మాంసాన్ని తయారుచేసి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తేనే లాభదాయకం అన్నారు. దీంతో తాను మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కౌజుపిట్టల ఫార్మింగ్ విధానాలు, పెంపకం, మాంసం తయారీ విధానాలపై అధ్యయనం చేశానన్నారు. కేరళ రైతులు 20 ఏళ్ల ముందు నుంచే కౌజుపిట్టల ఫార్మింగ్‌పై మంచి పట్టు సాధించారని చెప్పారు.
కౌజుపిట్టను 30 రోజుల లోపల మార్కెటింగ్ చేసుకుంటే లాభాదాయకం అని కృష్ణారెడ్డి అన్నారు. అంతకు మించితే పిట్టల ఫీడ్ ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు. అందుకే కౌజుపిట్టల మాంసం తయారీ యూనిట్ కూడా తానే ఏర్పాటు చేసుకున్నానన్నారు. కౌజుపిట్ట మాంసాన్ని ఫ్రిజ్‌లలో పెట్టి ఫ్రోజెన్ చేస్తానన్నారు. ఆ మాంసాన్ని విజయవాడ, నెల్లూరు, కడప, కర్నూలు, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఢిల్లీ, చెన్నై, హర్యానా లాంటి పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి నాలుగు రోజులకోసారి ఒక బ్యాచ్ కౌజుపిట్టల మాంసం మార్కెట్‌కు పంపిస్తామన్నారు. ఎన్ని కౌజుపిట్టలను కటింగ్ చేస్తే.. అన్ని కౌజుపిల్లలు తయారై షెడ్లలోకి వచ్చేలా సైకిలింగ్ విధానం అవలంబిస్తున్నట్లు చెప్పారు. తక్కువ మొత్తంలో పెంచుకునే రైతులు కూడా తమ వద్ద 4 లేదా 5 వేల పిట్టలను తీసుకెళ్తున్నారన్నారు. అలా నెలకు 20 వేల కౌజుపిల్లలను బయటికి అమ్ముతామన్నారు. అయితే.. కౌజుమాంసం ఉత్పత్తి, మార్కెటింగ్ పైనే తాను ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలోనే అతిపెద్ద కౌజుపిట్టల ఫార్మింగ్‌గా గుర్తించి రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయమే కాకుండా సుమారు 13 రాష్ట్రాల నుంచి అధ్యయనం చేసేందుకు వచ్చారన్నారు.
కృష్ణారెడ్డి కౌజుపిట్టల ఫాంలో నెలకు సుమారు 6 నుంచి 7 టన్నుల మాంసం అమ్ముతున్నారు. కౌజుపిట్ట 170 నుంచి 180 గ్రాముల బరువు వచ్చేసరికే మాంసం తయారికి వాడుకోవాలన్నారు. ఒక కిలో ప్యాకెట్‌కు పది కౌజుపిట్టలు సరిపోతుందన్నారు. డ్రెస్సింగ్ చేసిన తర్వాత కౌజుపిట్ట 100 గ్రాములు వస్తుందన్నారు. మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కృష్ణారెడ్డి రూ.400కు ఒక ప్యాకెట్ అమ్ముతారు. స్థానికంగా వాడుకునేవారు వస్తే ఒక ప్యాకెట్ రూ.500కు ఇస్తామన్నారు. లైవ్ కావాలన్నవారికి ఒక పిట్టను రూ.50కి అమ్ముతామని చెప్పారు. వెయ్యి, రెండు వేలు పెంచుకునే రైతులు ఒక పిట్టను రూ.70 నుంచి రూ.80కి అమ్ముతున్నారన్నారు.
కౌజుపిట్టకు మందులు వాడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ కూడా వేయక్కరలేదు. నిజమైన ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇదే అంటారు కృష్ణారెడ్డి. కౌజుపిట్ట ఫార్మింగ్ చేయడం చేతకాని వారు మాత్రమే రిస్క్ అని, నష్టాలు వస్తున్నాయంటారు కృష్ణారెడ్డి. ఇంట్లో కూర్చుంటే మార్కెటింగ్ అవదని, మార్కెట్‌ను మనమే సృష్టించుకోవాలన్నారు. నెట్‌వర్క్ తయారుచేసుకుంటే ఫోన్ల ద్వారానే కౌజుపిట్ట మాంసం బిజినెస్ అయిపోతుందన్నారు. కౌజుపిట్ట మాంసం వేడి కాబట్టి శీతాకాలంలో ఎక్కువ ధర పలుకుతుందన్నారు. ఢిల్లీ లాంటి చలి ప్రదేశంలో కౌజుపిట్టల మాంసం వినియోగం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు.
పిట్టలను 8 రోజులు బ్రూడింగ్ చేయాలి. మనుషుల మీద ఆధారపడి రింగ్ బ్రూడింగ్ చేస్తే 50 శాతం పిల్లలు చనిపోయాయన్నారు. దాంతో కేరళలో అవలంబిస్తున్న సెల్ఫ్ విధానం ప్రారంభించానన్నారు కృష్ణారెడ్డి. 4X4 సెల్ఫ్‌లు తయారు చేయించుకొని, ఒక్కో సెల్ఫ్‌లో 250 నుంచి 300 పిల్లలను పెంచుతామన్నారు. ఒక్కో సెల్ఫ్‌లో రెండు 100 ఓల్టేజ్ బల్బులు పెట్టుకోవాలన్నారు. దీంతో ఒకటి నుంచి 3 లేదా అత్యధికంగా 4 శాతానికి మించి నష్టం ఉండదన్నారు. గుడ్డు నుంచి పిల్ల వచ్చిన తొలిరోజే సెల్ఫ్‌లోకి మార్చాలన్నారు. అలా పిల్లలను 8 రోజులు సెల్ఫ్‌లో ఉంచి, వాటి షెడ్‌లోకి మార్చాలన్నారు. రింగ్ విధానంలో పిల్లలను పెంచాలంటే రైతు మూడు నాలుగు రాత్రులు కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే చాలా పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని కృష్ణారె్డ్డి చెప్పారు.
కౌజుపిట్ట కోతకు వచ్చినప్పుడు దాన్ని స్కిన్‌తో సహా ఈకలను తీసేస్తారు. ఇలా ఒక్క జోడీ రోజుకు 800 పిట్టలను కట్‌చేసి, మాంసానికి సిద్ధం చేస్తారన్నారు. కృష్ణారెడ్డి ఫాంలో 8 వేల పిట్టలను ఒక గ్రూప్‌గా పెంచుతారు. ప్రతిరోజూ ఒక గ్రూప్ కటింగ్ అయితే.. మరో కొత్త గ్రూపు షెడ్‌లోకి వస్తుందన్నారు. ఒక రోజు వయస్సున్న కౌజుపట్ట పిల్లను రూ.9కి కృష్ణారెడ్డి తమ ఫార్మ్ వద్ద అమ్ముతారు. పిల్లలను ట్రాన్స్‌పోర్ట్ చేసే పనిని ఆయన పెట్టుకోలేదు. తమది పిల్లలను అమ్మే కాన్సెప్ట్ కాదని, మొత్తం మీట్ అమ్మకం, ఎగుమతి పైనే తమ దృష్టి అన్నారు. కరోనా తర్వాత చాలా మందిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిందని, కౌజుపిట్టలు, ర్యాబిట్ వినియోగం పెరిగిందన్నారు. రోజు రోజుకూ కౌజుపిట్టల వ్యాపారం పెరుగుతోందన్నారు. కొవ్వు ఉండని కౌజుపిట్టను బోన్‌తో సహా తినవచ్చు. మొత్తం ఆహారంగా ఉపయోగపడుతుంది. కౌజుపిట్ట గుడ్డు కూడా అడిగిన వారికి 5 లేదా 6 రూపాయలకు అమ్ముతున్నారు.
ఇన్‌క్యుబేటర్‌లో పెట్టిన కౌజుపిట్ట గుడ్ల నుంచి 17 రోజులకు పిల్లలు బయటికి వస్తాయి. వాటిని హ్యాచరీలో వేస్తారు. నెలకు లక్ష కౌజుగుడ్లను పొదిగే విధంగా కృష్ణారెడ్డి ఏర్పాట్లు చేశారు. ఇన్‌క్యుబేటర్ ఖరీదు సుమారు రూ.5 లక్షలు ఉంటుంది. కౌజుపిట్టల ఫార్మింగ్‌ను ముందుగా మార్కెటింగ్ చూసుకోవాలని కృష్ణారెడ్డి చెప్పారు. అత్యాశకు పోయి ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా ముందు కొద్దిమొత్తంలో పిట్టలన పెంచుకోవాలని, మార్కెటింగ్ చేసుకునే సత్తాను బట్టి వాటి పెంపకాన్ని పెంచుకోవాలని సలహా ఇచ్చారు. కౌజుపిట్ట మాంసానికి 365 రోజులూ డిమాండ్ ఉంటుంది. లైవ్ బర్డ్ అమ్మాలనుకుంటే మాత్రం ఎండాకాలంలో కొద్దిగా తగ్గుతుంది. రైతులు ఎవరు కౌజుపిట్టలను పెంచుకున్నా లాభసాటిగా ఉంటుందన్నారు కాకపోతే కాస్త ఓపికతో కష్టపడి చేసుకోవాలని కృష్ణారెడ్డి సలహా.