కిలో వంద రూపాయలకు పైన ఎంత ధర పలికితే అంత లాభం చామంతిపూలు సాగుచేసే రైతన్నలకు. అయితే.. కిలో రూ.190కి హోల్‌సేల్‌గా అమ్మిన రైతుకు ఎంత లాభం వస్తుందో అంచనా వేసుకోవచ్చు. సుమారు ఎకరం పొలంలో తొలిసారి హార్వెస్ట్‌లో ఆ యువ రైతు దాదాపు 650 కిలోల చామంతిపూల పంట దిగుబడి సాధించాడు. ఇలా వారం రోజులకు ఒకసారి చొప్పున చామంతి పూలు హార్వెస్ట్‌ చేస్తున్నాడు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా తిమ్మసంద్రంలో యువరైతు హరీష్‌ ఐదేళ్లుగా చామంతి సాగు చేస్తున్నాడు. చామంతి సాగులో ఈ రైతు అనుభవాలేంటో తెలుసుకుందాం.

నిజానికి ఒక రకం చామంతి మొక్కలు సాగు చేసిన రైతు మళ్లీ అదే రకం మొక్కలు పెంచితే ఖర్చు పెరుగుతుంది. దిగుబడి తగ్గుతుందని హరీష్‌ చెప్పాడు. సెంట్‌ ఎల్లో రకంతో పాటు చాకొలెట్, పర్పుల్‌, ఐశ్వర్య అనే నాలుగు రకాల చామంతిపూలను ఈ యువరైతు సాగు చేస్తున్నాడు. వ్యవసాయ రైతు కుటుంబానికి చెందిన హరీష్‌ బీఎస్సీ ప్లాంట్‌ బయోటెక్‌ చదివాడు. సాగునీటి సమస్య ఉండడంతో హరీష్ తల్లిదండ్రులు కేవలం రాగులు పండించేవారు. ఇప్పుడు ఆ పొలంలో హరీష్‌ బోరు వేసి చామంతితో పాటు పలురకాల పంటలు సాగు చేస్తున్నాడు. చామంతి మొక్కలను డ్రిప్‌ వేసి, మల్చింగ్‌ చేసి హరీష్‌ పండిస్తున్నాడు.పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వచ్చే ముందు చామంతిపూలకు డిమాండ్‌తో పాటు మంచి ధర కూడా పలుకుతుంది కాబట్టి పంటకు విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేస్తామన్నాడు. లైట్లు వేస్తే పంట త్వరగా వస్తుంది. కాకపోతే పువ్వుల సైజు, దిగుబడి తగ్గుతుంది. ఎక్కువ ధరకు అమ్ముతాడు కాబట్టి లాభదాయకంగా ఉంటుందన్నాడు. లైటు వేయకపోతే హార్వెస్ట్‌ మరింత ఆలస్యం అవుతుందని, పువ్వు సైజు ఎక్కువ ఉంటుందని, దిగుబడి కూడా పెరుగుతుందన్నాడు. చామంతి మొక్కలకు లైట్ వేస్తే.. నాలుగుసార్లు మాత్రమే పూల దిగుబడి ఉంటుంది. లైట్ వేయకపోతే 7 సార్లు కూడా దిగుబడి తీసుకోవచ్చు.ఎకరం భూమిలో 8 నుంచి 9 వేల చామంతి మొక్కలు నాటుకోవచ్చు. భూమిలో రెండు అడుగుల వెడల్పు బెడ్‌లు వేసుకొని, వాటిపై రెండు వైపులా మొక్కలను జిగ్‌జాగ్‌ విధానంలో నాటుకోవాలి. మొక్కల మధ్య అర అడుగు దూరం ఉండేలా నాటుకోవాలి. బెడ్‌కు బెడ్‌కు మధ్య 4 అడుగుల దూరం పెట్టుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడు ఒక్కో మొక్క ఖరీదు 2 నుంచి 3 రూపాయలు ఉంటుంది. దీని ప్రకారం ఎకరం నేలలో చామంతి మొక్కలకు రూ.18 నుంచి రూ.24 వేలు వరకు అవుతుంది. లేదంటే 40 లేదా 50 పైసలకే నర్సరీలలో లభిస్తాయి. ఆ మేరకు మొక్కలపై పెట్టుబడి తగ్గుతుంది. డిసెంబర్ నుంచి మేనెల వరకు చామంతి మొక్కలను తాము నాటుకుంటామన్నాడు హరీష్.తొలిసారి చామంతి పంటా సాగు చేసే రైతుకు ఎకరాలో బెడ్‌ వేయడానికి, మొక్కలకు, డ్రిప్‌, మల్చింగ్‌, గెడబొంగులు వేయడం, పూల కోతకు అయ్యే కూలీలు, ఎరువులు, పురుగుమందుల కోసం కనీసం రూ. లక్షా 50 వేలు వరకు ఖర్చు వస్తుంది. తర్వాత మళ్లీ వేసుకునే చామంతి మొక్కల కోసం ఇంత పెట్టుబడి అవసరం ఉండదు. కనీసం రూ.50 వేలు ఖర్చు తగ్గుతుంది. తొలిసారి డిసెంబర్ నుంచి మేనెల మధ్యలో మొక్కలు నాటితే.. నాలుసార్లు హార్వెస్ట్‌ అయ్యాక, మొక్కలు పూర్తిగా తీసేసి, భూమిని బాగా దున్ని, మూడు నెలల పాటు సూర్యరశ్మిలో ఎండనిస్తామన్నాడు. ఆ తర్వాత కాలీఫ్లవర్‌ పంట వేస్తే దిగుబడి పెరుగుతుందని చెప్పాడు. పంట అయిపోయాక కాలీఫ్లవర్‌ మొక్కలను భూమిలో దున్నేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి.చామంతిమొక్కలకు విల్ట్‌ తెగులు సమస్య ఉంటుంది. ఈ తెగులు ఒక మొక్కకు వస్తే.. మిగతా మొక్కలకు కూడా విస్తరిస్తుంది. మొక్క మొదలు భాగం ఎండిపోతుంది. ఈ సమస్యకు నివారణ లేదు. మందులతో 40 నుంచి 50 శాతం మాత్రమే నివారించవచ్చు. తల్లి మొక్కకు విల్ట్‌ తెగులు ఉంటే.. దాని పిల్ల మొక్కలకు కూడా తెగులు వచ్చేస్తుంది. అయితే.. ఈ తెగులు సోకకుండా ఉండాలంటే ముందుగానే ప్రివెంటివ్‌గా ఫంగిసైడ్స్‌ను చామంతి మొక్కలకు వాడాల్సి ఉంటుందని హరీష్‌ వివరించాడు. చామంతిమొక్కలకు వారానికి ఒకసారి తప్పకుండా పురుగు మందులు వాడాలి. ఎకరం తోటకు ఒకసారికి 400 లీటర్ల పురుగుమందులు వాడాల్సి వస్తుంది. ఎక్కువ ఖరీదు మందు వాడితే ఒకసారికి రూ.4 నుంచి రూ.5 వేలు అవుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూలు కోసుకుంటే.. సాయంత్రం తప్పకుండా పురుగుమందులు స్ప్రే చేయాలి. దీని వల్ల మొక్కలకు సెప్టిక్‌ కాదు, తెగుళ్లు సోకవు.సెంట్ ఎల్లో చామంతిమొక్కలు భూమిల నాటిన తర్వాత వేళ్లకు బలం ఇచ్చేలా హీమిక్‌ యాసిడ్‌, వేళ్లు కుళ్లిపోకుండా ఉండేందుకు బలమైన ఫంగిసైడ్‌ వాడితే భవిష్యత్తులో మొక్కలు బలంగా ఏపుగా ఎదుగుతాయి. బెడ్‌లు వేసుకునేటప్పుడే భూమిలో డీఏపీ, నీమ్‌కేక్‌, పుంగమ్‌కేక్‌ వేస్తామని హరీష్‌ తెలిపాడు. ఇవన్నీ వేళ్లు పాడవకుండా కాపాడతాయి. ఆవుల ఎరువు, బయోసెమ్‌ గ్రాన్యూల్స్‌, వర్మీ కంపోస్ట్‌ అన్నీ కలిపి ఒకేసారి బెడ్‌పై వేస్తామన్నాడు.చామంతిసాగులో ఎకరానికి సగటున 6 నుంచి 7 టన్నుల దిగుబడి తీసుకోవచ్చు. పండుగలు, పెళ్లిళ్ల కాలంలో చామంతిపూలకు ధర ఎక్కువ వస్తుంది. అన్‌ సీజన్‌లో అయితే.. కిలోకు రూ.60 నుంచి రూ. 70 పలుకుతుంది. అందుకే పండుగల సీజన్‌లో ఎక్కువగా దిగుబడి వచ్చేలా రైతులు ప్రణాణిక వేసుకొని సాగు చేయాలంటాడు యువరైతు హరీష్‌. చామంతిపంటకు రెండు క్రాప్‌లలో లాభం వస్తుందని, మరో రెండు క్రాప్‌లలో నష్టం కూడా వస్తుందని చెప్పాడు. లాభం వచ్చినప్పుడు ఎకరం పంటలో రూ.6.5 లక్షల వరకు లాభం ఉంటుందన్నాడు. సెంట్ ఎల్లో చామంతిని వరుసగా రెండు సార్లు వేస్తే అవి సరిగా పెరగవన్నాడు.చెన్నై, రాయికోట మార్కెట్లలో హరీష్‌ చామంతిపూలు అమ్ముతుంటాడు. హోసూరు, బెంగళూరు తమకు కొద్దగా దగ్గరే అయినా.. తమకు రవాణా సమస్య ఉంటుందన్నాడు. చెన్నై వ్యాపారులు తమ వద్దకే స్వయంగా వాహనాలు తెచ్చుకుని, చామంతిపూలు కొనుగోలు చేస్తారన్నాడు.  సరిగా సీజన్‌ చూసి, చామంతి మొక్కలు నాటుకుంటే లాభదాయకంగా ఉంటుంది. చామంతి సాగులో ఖర్చులు మరింత తగ్గించుకుంటే ఆ మేరకు లాభం పెరుగుతుంది.