ప్రతి ఒక్కరి జీవన విధానం పాడి, పంటలతో ముడిపడి ఉంది. పశువులు లేని రైతుల పొలాల్లో పంటలు పండవంటారు. పశువు- భూమి రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పశువులు తిరిగిన పొలంలో సహజసిద్ధంగా బంగారు పంటలు పండుతాయి. రసాయనాలు లేని పచ్చగడ్డి తిన్న పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. సమృద్ధిగా పాలు ఇస్తాయి. పంటకు పంటకు మధ్య పశువులు పచ్చగడ్డి మేస్తూ పొలంలో వేసే పేడ ద్వారా భూమి సారవంతం అవుతుంది. వాటి మూత్రంలో ఉండే యూరిక్ యాసిడ్ ప్రభావంతో కలుపుమొక్కల పూర్తిగా నాశనం అవుతాయి. భూమిలో రసాయన ఎరువులు గానీ, పురుగు మందులు కానీ వాడే అవసరం ఉండదు. పశువులు అంటే గోవులు, ఎద్దులే కాకుండా గేదెలు, దున్నలైనా, మేకలు, గొర్రెలైనా పరవాలేదు.
ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని సీతంపేట రైతు గద్దె సతీష్‌బాబు 1990వ దశకం నుంచి ఆయన కుటుంబం పశు ఆధారిత వ్యవసాయమే చేస్తోంది. తండ్రి నుంచి పశు ఆధారిత వ్యవసాయ విధానం నేర్చుకున్న సతీష్‌బాబు 16 ఎకరాల్లో కొబ్బరి, ఇతర మొక్కలు పెంచుతున్నారు. మరో 19 ఎకరాల్లో వరిపంట సాగును విజయవంతంగా చేస్తున్నారు. సతీష్‌బాబు సాధించిన విజయాలు తన కుటుంబ సభ్యులనే కాకుండా, అనేక మంది ఇతర రైతులను కూడా ఆకర్షించాయి. సతీష్‌బాబు మాదిరిగా వారంతా వ్యవసాయ ఆధారిత వ్యవసాయమే చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. గద్దె సతీష్‌బాబు కృషికి గుర్తింపుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్స్ (ICAR), హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సంస్థలు ‘ఉత్తమ పశు ఆధారిత ఆర్గానిక్ వ్యసాయ విధానం’ అవార్డు అందజేశాయి.ఆర్గానిక్ వ్యవసాయంలో పశువులు ఒక భాగం అంటారు సతీష్‌బాబు. పశు ఆధారిత వ్యవసాయ విధానాన్ని సతీష్ తన తండ్రి నుంచి నేర్చుకున్నారు. ఇదే అత్యుత్తమమైన, అతి తక్కువ పెట్టుబడితో, అత్యంతా అధిక లాభాలు తెచ్చే సాగు విధానం అంటారు సతీష్. పశువులు నడిచిన నేలలో పండించే వ్యవసాయానికి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడనక్కరలేదు. దీంతో పంటల సాగులో ఖర్చు చాలా తగ్గిపోతుంది. వరి కోత కోసిన తర్వాత గడ్డి, ఇతర మిగులు పదార్థాలను పొలంలోనే వదిలేస్తారు సతీష్‌బాబు. దీంతో భూమిలో సేంద్రీయ పదార్థంగా బాగా పెరుగుతుంది. తద్వారా భూమిలో మంచి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు, ఆల్గే, ప్రోటోజోవా లాంటి సూక్ష్మజీవులు ఆరోగ్యంగా పెరిగి, నేల సారవంతం చేస్తాయి. పశు ఆధారిత పంటలకు తెగుళ్లు, పురుగుల బెడద తప్పుతుంది.
ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే నేలలోని పచ్చిగడ్డిని మేసిన పశువులు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవకుండా ఆరోగ్యంగా ఉంటాయి. పశువులు గర్భధారణ, పునరుత్పత్తి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పశువుల పాలు పూర్తిగా వాటి పిల్లలకే వదిలేస్తే… అవి కూడా ఆరోగ్యంగా, బలిష్టంగా ఎదుగుతాయి. అలాంటి పశువులు 24 నెలల వయస్సు వచ్చేసరికే గర్భధారణకు వస్తున్నట్లు సతీష్‌బాబు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు, యానిమల్ హజ్బెండరీ విభాగం అధికారులతో సతీష్‌బాబు చక్కని సంబంధాలు కల్పించుకున్నారు. అలాగే వ్యవసాయ సంబంధమైన అనేక సెమినార్లలో పాల్గొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయంలో సతీష్‌బాబుకు ఉన్న గొప్ప అవగాహన కారణంగా ఆయన ‘ప్రోగ్రెసివ్ రైతు’గా గుర్తింపు పొందారు. తన అనుభవాన్ని ఇతర రైతులతో పంచుకోవడానికి ఆయన అస్సలు ఆలోచించరు. ఆర్గానిక్ వ్యవసాయ విధానంలో భూమికి బలాన్నిచ్చే ఇతరాలపై ఆధారపడనక్కరలేదు. కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఆధునిక కాలంలో మనుషుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యంపై ప్రజల్లో మారుతున్న జీవన విధానం కారణంగా ఆర్గానిక్ పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
చాలా సంవత్సరాలుగా తన పశు ఆధారిత వ్యవసాయంలో ఏనాడూ పురుగులు, రోగాల బెడద రాలేదన్నారు సతీష్‌బాబు. ఆర్గానిక్ బియ్యంను తాను కిలో రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నట్లు చెప్పారు. పశువుల ఆధారంగా పండించి, ఏడాది పాటు నిల్వ చేసిన వరిధాన్యాన్ని ఆర్గానిక్ బియ్యంగా ఆడించి అమ్మితే.. మామూలు బియ్యం కన్నా అధిక ధర వస్తుంది. ఇలా పండించిన బియ్యంలో పోషక విలువలు అదనంగా ఉన్నాయని, చాలా రుచిగా కూడా ఉన్నట్లు సతీష్‌బాబు గుర్తించారు.
భవిష్యత్తులో ఆగ్రో టూరిజం, డెయిరీ టూరిజం ద్వారా ఔత్సాహిక రైతులకు అవగాహన కల్పిస్తానన్నారు పశువుల ఆధారిత వ్యవసాయం చేసేవారికి లభాల సంగతి ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టమైతే రాదని సతీష్‌బాబు చెప్పారు. విష రసాయనాలతో పంటలు పండించి, భూసారాన్ని, మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు.. పశు ఆధారిత వ్యవసాయం చేసేందుకు మరింత ఎక్కువ మంది రైతులు ముందుకు రావాలని సతీష్‌బాబు ఆకాంక్షించారు. అలా అయితే.. విష రసాయలతో కాకుండా ప్రకృతిసిద్ధమైన పంట ఉత్పత్తులు బాగా పెరుగుతాయని సతీష్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
MANAGE సౌజన్యంతో…