ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పంటల్లో వేరుశనగ ఒకటి. దీంట్లో రోగనిరోధక వ్యవస్థను పెంచే 20 అమైనో ఆమ్లాలు ఉంటాయి. అనేక ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. ఇతర గింజలతో పొలిస్తే వేరుశనగలో ఖనిజాలు, సూక్ష్మ, స్థూల పోషకాలు, విటమిట్లు అత్యధికంగా ఉంటాయి. మనుషులకు వేరుశనగ పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.వేరుశనగ గింజల పొడితో మొక్కలకు కూడా ఎన్నెన్నో పోషకాలు అందించవచ్చు. మొక్కలు ఏపుగా ఎదిగేందుకు వేరుశనగ పిండి ఎంతగానో దోహదం చేస్తుంది. కాయలు, పూలు, పండ్లు పెద్దగా ఎదిగేలా చేస్తుంది. వేరుశనగ పిండితో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్‌ మొక్కలకు వాడితే చాలా పచ్చగా, ఏపుగా ఎదుగుతాయి. పూత రాలిపోకుండా నివారిస్తుంది. దిగుబడి అధికంగా వస్తుంది. క్రిమి కీటకాలను కూడా కంట్రోల్‌ చేస్తుంది. మొక్కలు, పాదులు చాలా ఆరోగ్యం ఉంటాయి. ఎండాకాలంలో కూడా మొక్కలు ఎంతో పచ్చగా ఎదిగేలా చేస్తుంది. అలాంటి అత్యంత వక్తివంతమైన ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్‌ను వేరుశనగపిండితో తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.ఈ ఫెర్టిలైజర్‌ తయారీ కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు… 100 గ్రాముల వేరుశనగలు, 100 గ్రాముల ఆవాలు, 25 గ్రాముల టీపొడి. అరటిపండ్ల తొక్కలు నాలుగు. రెండు అరటిపండ్లు. పల్లీలను మిక్సీ పట్టిన పౌడర్‌ను, ఆవాల పొడి. టీపొడిని ఒక బకెట్‌లో వేసుకోవాలి. అరటిపండ్ల తొక్కలు, పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అందులో వేసుకోవాలి. నువ్వులు కూడా కొద్దిగా వేసుకుంటే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. నువ్వుల వల్ల మొక్కలకు కాల్షియం కూడా అందుతుంది. వాటికి నాలుగు లీటర్ల నీరు కలుపుకోవాలి. బకెట్‌పై ఒక వస్త్రం కట్టి, ఐదు నుంచి ఏడు రోజుల పాటు పులియనివ్వాలి.ఐదు రోజులు పులియబెట్టిన తర్వాత మిశ్రమం రంగు మారుతుంది. పల్లీలు, ఆవాలు, టీపొడిలోని సారం అంతా నీటిలో కలిసిపోతుంది. ఈ మిశ్రమానికి 16 లీటర్ల నీరు కలుపుకోవాలి. దీంతో 20 లీటర్ల లిక్విడ్‌ తయారవుతుంది. ఈ లిక్విడ్‌కు మరో 20 లీటర్ల నీరు కూడా కలపాలి. ఆవాల పిండిలో ఉండే ఘాటు వాసన కారణంగా మొక్కల దరికి పురుగులు చేరవు. మొక్కలకు వేరుపురుగులు రాకుండా కాపాడుతుంది. ఈ లిక్విడ్ ఎరువును వేసే ముందుగా మనం మొక్కలకు కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి. లిక్విడ్‌ను పెద్దమొక్కలకు అరలీటరు, మరీ పెద్దమొక్కలైతే లీటరు, చిన్న మొక్కలకు పావు లీటర్ చొప్పున పోసుకోవాలి. ఈ లిక్విడ్‌ ఎరువును పూలు, పండ్లు, కూరగాయల మొక్కలకు వాటి సైజును బట్టి పోసుకోవాలి. ఇదే మిశ్రమాన్ని పౌడర్ రూపంలో కూడా వాడవచ్చు. కాకపోతే.. రెండు స్పూన్ల పౌడర్‌ను మొక్క మొదళ్లకు కాస్త దూరంలో వేసుకోవాల్సి ఉంటుంది.ఈ శక్తివంతమైన ఫెర్టిలైజర్‌ ద్వారా చాలా రకాల పోషకాలు మొక్కలకు అందుతాయి. మొక్కల వేళ్లు బాగా అభివృద్ధి చెందేందుకు లిక్విడ్ ఫెర్టిలైజర్‌ దోహదం చేస్తుంది. మొగ్గలు, పువ్వులు, కాయలు రావడానికి, కాయల సైజు పెరిగేందుకు పల్లీ ఫెర్టిలైజర్‌ ఉపయోగపడుతుంది. పోషకాలను పల్లీ ఫెర్టిలైజర్‌ నెమ్మది నెమ్మదిగా మొక్కలకు అందిస్తుంది కాబట్టి మొక్కలు ఎప్పుడు చూసినా ఆరోగ్యంగా, పచ్చగా ఉంటాయి. నెల రోజులకు ఒకసారి లేదా రెండుసార్లు పల్లి ఫెర్టిలైజర్‌ను మొక్కలకు ఇచ్చినా సరిపోతుంది. వర్షాకాలంలో కూడా పల్లీ ఫెర్టిలైజన్‌ను వాడవచ్చు. పల్లి ఫెర్టిలైజర్‌ వాడిన మొక్కలకు పూత ఎక్కువగా వస్తుంది. వచ్చిన ప్రతి పువ్వూ పిందెగా మారుతుంది. పిందెలు రాలకుండా ప్రతీదీ కాయగా, పండుగా అవుతుంది.అరటిపండ్లు, తొక్కల వల్ల పొటాషియం ఎక్కువ అందుతుంది. ఆవాలు, పల్లీల పిండి పాస్పరస్‌, పొటాష్‌, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, నైట్రోజన్‌ను మొక్కలకు పూర్తిస్థాయిలో అందిస్తాయి. ఇవన్నీ మొక్కలు బాగా ఎదగడానికి సహాయపడతాయి. పల్లి ఎరువు నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి చెట్లకు వేస్తే.. కాయలు పిందెగా ఉంన్నప్పుడే పసుపురంగులోకి మారి రాలిపోకుండా కాపాడుతుంది. చిన్న చెట్లకు కూడా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. ఆవాల పిండి కారణంగా మొక్కలకు పూత ఎక్కువ వస్తుంది. పూత రాలకుండా రక్షిస్తుంది. దీంతో దిగుబడి ఊహించని విధంగా పెరుగుతుంది.మస్టర్డ్‌ కేక్‌, నీమ్‌ కేక్‌, వేరుశనగ కేక్‌ దొరకకపోయినా సరే పల్లీ లిక్విడ్‌ ఫెర్టిలైజర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మామాలుగా అయితే.. మస్టర్డ్‌ కేక్‌, నీమ్‌ కేక్‌, వేరుశనగ కేక్‌లను ఆయిల్ తీసేసి వాడతాం. అందుకే ఆయా కేక్‌లు పావుకిలో వేసుకుంటే ఎంత ప్రయోజనమో మనం తయారుచేసుకునే పల్లీ ఫెర్టిలైజర్ కోసం కేవలం 100 గ్రాముల పల్లీలు వేసుకుంటే కూడా అంతే ఉపయోగం ఉంటుందని ఈ ఫెర్టిలైజర్‌ తయారీ గురించి వివరిస్తూ బొడ్డేపల్లి అరుణ తెలిపారు.