సోలిగా గిరిజన తెగ. కర్ణాకలోని చామరాజనగర్‌ జిల్లాలోని బిలిగిరి అటవీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ కాఫీ గింజలు పండిస్తుంటారు ఆ గిరిజన తెగ ప్రజలు.. ప్రతి ఏటా డిసెంబర్‌ నెలలో వారు పండించే కాఫీ పంట చేతికి వస్తుంది. తమ కాఫీ గింజల పంటకు సరైన ధర లభించాలంటూ బిరిగిరిలో రంగనాథస్వామి ఆలయంలో ప్రతి ఏటా పూజలు చేస్తుంటారు. అయినా.. ఆ అమాయక సోలిగా గిరిజన తెగవారు మధ్యవర్తుల చేతిలో మోసపోతూనే ఉంటారు. ఎందుకంటే.. ప్రతి ఏటా జూన్‌ నెలలో దళారుల నుంచి పంట పెట్టుబడికి కొంత డబ్బు తీసుకుంటారు. దాంతో తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వారు తమ పంటను దళారులు కట్టే అతి తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండేవారు. సోలిగా తెగ వారు పండించిన పంట తూకంలో మధ్య దళారులు మోసం చేస్తూ ఉంటారు. లేదా మార్కెట్‌లో ఎంత రేటు ఉన్నా కిలో కాఫీ గింజలకు కేవలం 20 నుంచి 30 రూపాయల రేటు మాత్రమే కట్టి దోపిడీ చేస్తుంటారు. అలా మధ్య దళారులకు ఎవరైనా తమ కాఫీ పంటను అంత తక్కువ ధరకు ఇవ్వొద్దని అనుకుంటే. ఆ పంటను నెత్తిన పెట్టుకుని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌కు కష్టనష్టాలకు ఓర్చి తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఇదంతా 2010కి ముందరి మాట.ఇప్పుడు సోలిగా తెగ గిరిజన రైతులు తాము పండించే ఆర్గానిక్‌ కాఫీ గింజల పంటను కిలో 130 నుంచి 150 రూపాయలకు అమ్ముకోగలుగుతున్నారు. దాంతో ఆ గిరిజన రైతుల జీవితం మారిపోయింది. ఆర్థిక ఇబ్బందులూ తొలగిపోయాయి. మధ్య దళారుల నుంచి వ్యవసాయం చేసేందుకు ముందుగా డబ్బులు వాడుకునే పరిస్థితి నుంచి బయటపడ్డారు. తమ పంటను తామే ప్రపంచస్థాయి మార్కెట్లకు తీసిపోని విధంగా స్వేచ్ఛగా అమ్ముకోగలుగుతున్నారు. సోలిగా తెగ గిరిజన రైతుల కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇదంతా వారు బీఆర్‌టీ సోలిగా కాఫీ ప్రాజెక్ట్‌లో సభ్యులుగా చేరడంతో సాధ్యమైంది. దీంతో వారికి మధ్య దళారుల దోపిడి తప్పిపోయింది. ‘అడవి’ బ్రాండ్‌ పేరుతో కర్ణాటక వ్యాప్తంగా వారు తమ పంటను విక్రయించుకోగలుగుతున్నారు. బిరిగిరి ప్రాంతంలో ప్రస్తుతం దాదాపు 360 సోలిగా గిరిజన కుటుంబాలు ఆర్గానిక్‌ విధానంలో కాఫీ గింజల పంట పండిస్తున్నాయి.సోలిగా గిరిజనుల జీవితాలు ఇంతలా మారిపోవడానికి ప్రధాన కారణం ATREE అంటే అశోకా ట్రస్ట్‌ ఫర్‌ ఎకోలొజీ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ. 2018లోనే ఈ సంస్థ ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్‌ విధానంలో కాఫీ పండించడంపై సోలిగా గిరిజన రైతులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. దాంతో పాటుగా ఆ రైతులు పండించిన పంటకు కచ్చితమైన, సరసమైన ధర లభించేలా తోడ్పాటు అందించింది. దాంతో పాటుగా భారతీయ కాఫీ బోర్డుతో సోలిగా గిరిజనులకు సంబంధాలు ఏర్పాటు చేసింది. దీంతో బిలిగిరి ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజనుల జీవితాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా చేసింది. భారతీయ కాఫీ బోర్డు కూడా సోలిగా గిరిజనులకు కాఫీ గింజల మొలకలు, కాఫీ గింజలను పొడిగా చేసే యంత్రాలను అందజేసి ప్రోత్సహించింది. సోలిగా గిరిజనులను మార్కెట్లతో అనుసంధానం చేయడంతో పాటుగా వారు కంపోస్ట్‌ ఎరువులు తయారు చేసుకునే విధానంపైన, కలుపు నివారణపైన, నీటిని వినియోగంపైన వారికి అవగాహన ‌కల్పించింది. ఎంత నేలలో ఎన్ని మొక్కలను నాటాలో వివరించి, సహజ వనరులు వినియోగించి అధిక పంట దిగుబడి సాధించడంపైన వారికి అవగాహన కల్పింది. సోలిగా గిరిజన తెగకే చెందిన మాదెగౌడ ‘అడవి కాఫీ’ ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవహారాలను చూస్తున్నారు. రసాయనాలు వాడకుండా ఆర్గానిక్‌ విధానంలో పంటలు పండిస్తుండడంతో తమ తెగలోని వారికి ఆరోగ్యంపైన ఎంతో అవగాహన వచ్చిందన్నారు. సోలిగా తెగ గిరిజనుల సరాసరి వార్షిక ఆదాయం ఒకప్పటి 10 వేల నుంచి ఇప్పుడు 50 వేలకు పెరిగిందని మాదెగౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.స్థానికంగా ఉండే పెద్ద చెట్ల నీడలో కాఫీ మొక్కలు పెరుగుతాయి. ఆ చెట్ల నుంచి రాలిన ఆకులతోనే సోలిగా తెగ రైతులు కంపోస్ట్‌ ఎరువు తయారు చేసుకుంటున్నారు. బిలిగిరి అడవిలో చెట్లకు కొదవే లేదు. ఆ ప్రాంతం వన్య ప్రాణుల అభయారణ్యం కావడంతో సోలిగా తెగ రైతుల్లో 5 శాతం మంది మాత్రమే పశువులను పెంచుకుంటున్నారు. పశువులు ఉన్న వారు వాటి నుంచి ఎరువులు తయారు చేసుకోగలుగుతున్నారు. మిగిలిన వారంతా రాలిన చెట్ల ఆకులతోనే కంపోస్ట్‌ ఎరువు తయారు చేసుకుంటారని మాదెగౌడ్ వెల్లడించారు.

కాఫీ మొక్క నాటిన తర్వాత పండ్లు రావడానికి మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. వాటిని కాఫీ చెర్రీ అని పిలుస్తారు. కాఫీ పండ్లు ముదురు ఎరుపు రంగులోకి మారిన తర్వాత కోతకు వస్తుంది. యంత్రాల సాయంతో కాఫీ పండ్లపై ఉండే తొక్క, పొట్టు తొలగించి గింజలను వేరుచేస్తారు. ఆ తర్వాత కాఫీ చెర్రీలను ఎండలో ఆరబెడతారు. అలా బాగా ఎండిన కాఫీ చెర్రీలను గోనెసంచుల్లో నింపి బెంగళూరు పంపిస్తారు. అక్కడ ఆ కాఫీ గింజలను బీఆర్‌టీ సోలిగా కాఫీ ప్రాజెక్టులో గ్రేడింగ్‌ చేయిస్తారు. ఆ తర్వాత ఆ గింజలను ‘అడవి కాఫీ’ బ్రాండ్‌ సంచుల్లో నింపు రిటైల్‌ షాపుల ద్వారా విక్రయిస్తారు.భారతదేశం మొత్తంలో కర్ణాటక రాష్ట్రంలో కాఫీ ఉత్పత్తి అత్యధికంగా ఉంటుంది. 2019-20 సంవత్సరం కర్ణాటకలో 2,99,300 మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగింది. ప్రపంచంలో అత్యధిక కాఫీ ఉత్పత్తిలో భారతదేశం ఆరో స్థానంలో నిలుస్తుంది. అదే ఆసియా ఖండంలో అయితే మూడో స్థానంలో ఉంది. భారతదేశంలో పండే మొత్తం కాపీ ఉత్పత్తిలో 30 శాతం మాత్రమే దేశీయంగా వినియోగిస్తారు. మిగతా 70 శాతం కాఫీని విదేశాలకు ఎగుమతి అవుతుంది. తద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం మన దేశానికి లభిస్తుంది. అంతకు ముందు రోజుల్లో పండించిన కాఫీ పంటను అమ్మేవారు కాదని, స్థానికంగానే వినియోగించేవారని మాదెగౌడ చెప్పారు. ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు పెరగడంతో మధ్య దళారుల ప్రమేయం లేకుండా తమ తెగ రైతులు స్వేచ్ఛగా అమ్ముకోగలుగుతున్నారని అన్నారు. తద్వారా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకున్నారని మాదెగౌడ హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here