భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న ఔషధ మొక్క పసుపు. దీనిని ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, వంటకాలలో వాడతారు. రంగులా వినియోగిస్తారు. హల్దీ అని పిలుకునే పసుపు అల్లం లేదా జింగిబెరేసి కుటుంబానికి చెందింది. పసుపు భారతీయులందరి వంట ఇంట్లో తప్పకుండా ఉంటుంది. పసుపు పంట తీసిన తర్వాత రైతులు దాని ఆకులను వృథాగా పడేస్తారు. లేదా కాల్చేస్తారు. ఆకులను గుట్టగా పోసి, కుళ్లిన తర్వాత తదుపరి పంటకు ఎరువుగా కూడా వేస్తారు. కానీ.. ఎండిన పసుపు ఆకుల నుంచి నూనె తీస్తారని చాలా మంది రైతులకు తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఆయిల్‌తో ఎలాంటి ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా అర్థం కాకపోవచ్చు.ఎండబెట్టిన పసుపు ఆకు నుంచి తీసే నూనెలో ఫెల్లాండ్రిన్‌, లిమోనెన్‌, సినియోల్‌, ఏ.టర్మెరోన్‌, బీ.టర్మెరోన్‌ ఉంటాయి. పసుపు ఆకుల ఆయిల్‌ క్రిములను నాశనం చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కామోద్దీపనకు బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మరింత మెరుగుస్తుంది. మసాజ్‌ చేసేందుకు వాడే లిక్విడ్‌లలో కూడా పసుపు ఆకు నుంచి తీసిన ఆయిల్‌ను వాడతారు. జుట్టు ఎదుగుదలకు పసుపు పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తలలో చుండ్రు రాకుండా నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలతో కూడిన పసుపు ఆయిల్‌ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. పసుపు ఆయిల్‌ తయారీలో ఈ పంటకు ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా గుమ్మిరాల రైతు రాజారెడ్డి నుంచి అనుభవాలేంటో చూద్దాం.పసుపు ఆకుల నుంచి నూనె తీసే ప్లాంట్‌ను రాజారెడ్డి గుమ్మిరాలలో సొంతంగా ఏర్పాటు చేసుకుని, నిర్వహిస్తున్నారు. పసుపు పంట కోసిన తర్వాత రైతులు ఆకులను కాల్చేస్తామని చెప్పారు. పసుపు ఆకులను కాల్చినప్పుడు ఒక రకమైన పొగ, వాసనను తాను గమనించినట్లు చెప్పారు. అప్పుడు పసుపు ఆకులో ఏదో విశేషం ఉందనే ఆలోచన వచ్చిందన్నారు. హైదరాబాద్‌ బోడుప్పల్‌లో ఉండే సీమ్యాప్‌ పరిశోధనా కేంద్రం (సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌) లో సంప్రదిస్తే.. పసుపు ఆకుకు ఆవిరి పట్టి, దాన్నుంచి వచ్చిన ఆయిల్‌ వారు తనకు చూపించారని అన్నారు. ఎండిన పసుపు ఆకు నుంచి ఆయిల్‌ ఎలా తీయాలో పరిశోధన కేంద్రం వారు ఒక రోజు శిక్షణ ఇచ్చారన్నారు.పసుపు ఆయిల్ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు రూ.15 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పారు. యూనిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన రెండు ట్యాంకులలో ఒక్కో దానిలో 500 కిలోల ఎండు పసుపు ఆకు పడుతుందన్నారు. సమీపంలో ఏర్పాటు చేసిన బాయిలర్‌లోని నీటిని వేడి చేస్తే.. దాన్నుంచి వచ్చే ఆవిరి పైప్‌ ద్వారా బాయిలర్లలోని ఆకును ఉడికిస్తుంది. పసుపు ఆకులలో నూనె గొట్టాల ద్వారా కండెన్సర్‌లోకి ఆవిరిగా వెళ్తుంది. కండెన్సర్‌లోని చల్లని నీరు ఆవిరిని చల్లబరుస్తుంది. దీంతో ఆవిరి నీరుగా మారుతుంది. ఈ నీరు మరో యంత్రంలోకి వెళ్లి, అక్కడ నీరు, ఆయిల్‌ విడిపోయి రెండు వేర్వేరు గొట్టాల ద్వారా బయటకు వస్తుంది. పసుపు పంట కోసిన తర్వాత 8 నుంచి 12 రోజులు ఎండిన తర్వాత నూనె తయారీ యూనిట్‌లో వేస్తే.. దిగుబడి బాగుంటుందని రాజారెడ్డి వివరించారు. పచ్చి ఆకు వేస్తే దాంట్లో ఎక్కువగా ఉండే తేమ వల్ల నీరు ఎక్కువ వస్తుంది.. ఆయిల్‌ తక్కువ వస్తుంది. ఎండిన పసుపు ఆకును ట్యాంకులో వేసిన తర్వాత ఆయిల్‌ రావడానికి మూడు మూడున్నర గంటల సమయం పడుతుంది. టన్ను ఎండిన పసుపు ఆకు నుంచి 8 లీటర్ల ఆయిల్ వస్తుంది.తమ పసుపు ఆయిల్‌ తయారీ యూనిట్‌లో రోజుకు 12 లీటర్ల ఆయిల్‌ వస్తుందని రాజారెడ్డి తెలిపారు. ఒక లీటర్ పసుపు ఆయిల్ ధర మార్కెట్లో రూ.600 ఉంటుంది. అంటే రోజుకు రూ.7,200 ఆదాయం లభిస్తుంది. 12 లీటర్ల ఆయిల్‌ తయారీకి రూ.2 వేలు వరకు ఖర్చు అవుతుంది. సీజన్‌లో ఖర్చులు పోగా రోజుకు రూ.5 వేలు నికర లాభం ఉంటుంది. ఇలా నెలకు లక్షా 50 వేలు వరకు మిగులుతుంది. అయితే.. పసుపు ఆకు జనవరి నుంచి మార్చి నెల వరకు మాత్రమే లభిస్తుంది. ఆ మూడు నెలల్లో మాత్రమే పసుపు ఆయిల్‌ తయారు చేసే అవకాశం ఉంటుందని గమనించాలి.పసుపు ఆయిల్‌ తయారు చేసిన తర్వాత రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది. పసుపు ఆయిల్‌తో పాటు వచ్చే పసుపు వాటర్‌ ఇళ్లు, ఆఫీసుల ఫ్లోర్‌ క్లీనింగ్‌కు ఉపయోగపడుతుంది. దీని ధర లీటర్‌కు రూ.15 వరకు పలుకుతుంది. ఆయిల్ తీసిన ఆకును మళ్లీ బాయిలర్‌లో మంట పెట్టేందుకు ఉపయోగపడుతుంది. అగర్‌బత్తిల తయారీకి పౌడర్‌గా కూడా ఆయిల్ తీసిన పసుపు ఆకు ఉపయోగపడుతుంది. పసుపు ఆయిల్‌ తయారు చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన దళారి ఒకరు కొనుగోలు చేస్తారని రాజారెడ్డి తెలిపారు.