చెట్టు నిండా ఫలాలు. నోటి నిండా మధురమైన రుచి. నోరూరిస్తుంది. కనువిందు చేస్తుంది. చక్కని పంట. ఇదే కొత్త రేగు.. లేదా కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బేర్. ఇతర రేగు రకాల కన్నా రెండు రెట్లు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ వెరైటీ రైతులను, వినియోగదారులను ఆకర్షిస్తోంది. మార్కెట్‌లో కిలో ధర రూ.100 పలుకుతోంది. ఎకరానికి 10 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. ఈ పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి
ఎకరం నేలలో కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ మొక్కలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో 600 మొక్కలు సరిపోతాయి. చెట్టు కొమ్మల కణుపు కణులోనే ఒకటి నుంచి ఐదారు కాయల వరకు కాస్తుంది. ఈ పండు సైజు ఒక్కొక్కటి 40 నుంచి 60 గ్రాముల వరకు వస్తుంది. కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బేర్ చెట్టు చాలా బలంగా ఉంటుంది. చెట్టుకు ఎంత ఎక్కువగా కాయలు కాచినా తట్టుకుంటుంది. దీని కొమ్మలు విరిగిపోవడం చాలా అరుదు. ఈ కాయ పండినా చెట్టు నుంచి రాలిపోదు. కొమ్మకు ఉన్న రెమ్మలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇందు వల్ల దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది.కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ మొక్కకు మొక్కకు మధ్య 5 అడుగులు, సాళ్ల మధ్య 8 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి. పశువుల ఎరువు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మొక్క ఎదుగుదలను బట్టి నీటిలో కరిగే ఎరువులు ప్రతి 10 రోజులకు అందిస్తే దాని పెరుగుదల చాలా బాగుంటుంది. రేగు సాగులో సమయం ప్రకారం చేపట్టే మేనేజ్‌మెంట్ చాలా ప్రధానం. పూత సమయం ఎంతో కీలకం. ఒకవేళ పూత రాలిపోతే.. వెంటనే ప్రూనింగ్ చేసి, గ్రోత్ ప్రమోటర్ హ్యూమిక్ యాసిడ్ అందిస్తే మొక్కలు మళ్లీ త్వరగా చిగురించి, పూత వస్తుంది. పదిహేను రోజుల్లోనే పూత అంతా పిందెలుగా మారుతుంది.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో ఔత్సాహిక మహిళా రైతు బోయపాటి సౌజన్య ఆదర్శంగా నిలిచారు. పామ్ పంటను ఆమె 30 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఈ పామ్ సాగు మధ్యలో సౌజన్య కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బేర్‌ను ఆర్గానిక్ విధానంలో పండిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానం పండించడం వల్ల ఈ పండ్లు మరింత రుచిగా, తియ్యగా ఉన్నాయని తెలిపారు. ఈమె చేసే సాగు విధానంలో ఆరు నెలల్లోనే కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బేర్ తోట ఏడాది కాలం అయినట్లుగా కనిపిస్తోంది. కాయల సైజు కూడా మామూలుగా కన్నా కాస్త ఎక్కువగా ఉన్నాయి. రసాయనాలు కాకుండా పూర్తిగా ఆర్గానిక్ విధానంలో చేయడం వల్ల ఈ ఫలితం కనిపిస్తోందని సౌజన్య సంతోషంగా వెల్లడించారు. పశువుల ఎరువు, ఆర్గానిక్ ఎరువులను సమృద్ధిగా వాడడం వల్లే తమ రేగు పంట ఈ స్థాయిలో వస్తోందన్నారు.
బవేరియా, మెటరైజియం, వర్టిసెల్లం, బి.డి.500 లాంటి జీవ శిలీంద్రాలు, బ్యాక్టీరియాలను స్యయంగా అభివృద్ధి చేసుకుని పామాయిల్ తోటలో సమస్యలు లేకుండా చేసుకున్నారు. ఇవే ఆర్గానిక్ విధానలను కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బేర్ సాగులోనూ చేస్తున్నారు. పక్షుల తాకిడి నుంచి రేగు పంటను రక్షించేందుకు నైలాన్ వలను మొక్కల పైన ఏర్పాటు చేశారు. వెదురుగెడలు 10 అడుగుల ఎత్తు కట్‌చేసి, మధ్యమధ్యలో పాతి వాటిపై నైలాన్ వల ఏర్పాటు చేశారు. కశ్మీరీ రెడ్ గోల్డ్ రేగుచెట్టు కొమ్మలు వంగిపోయే అవకాశం లేకుండా భూమికి రెండు అడుగులు, 3 అడుగులు, 5 అడుగులకు ఒకటి చొప్పున జీఏ వైర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్గానిక్ విధానంలో చేస్తే రేగు చెట్టు అంత ఎత్తు ఎదగదనేది అపోహ మాత్రమే అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పెంచుతున్న తమ తోటలో రేగు చెట్లు బలంగా, ఏపుగా ఎదిగాయన్నారు. మొక్క నాటిన నాలుగు నెలలకు కాయలు వచ్చాయని చెప్పారు.
కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ చెట్టు నుంచి తొలి ఏడాదే 10 నుంచి 12 కిలోల దిగుబడి వస్తుంది. తమ తోటలో పండిన రేగు పండును తిన్న ప్రతిఒక్కరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని సౌజన్య తెలిపారు. ఈ రేగు పండుకు ఉండే రెడ్ కలర్ స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందని చెప్పారు. చల్లని వాతావరణం ఉంటే కాయ చుట్టూ ఎర్రరంగు బాగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే రెడ్ కలర్ కాస్త తగ్గుతుంది. అయితే.. కాయ ఎలా ఉన్నా రుచి, తియ్యదనంలో ఏమాత్రం మార్పు ఉండదని అన్నారు.
బోయపాటి సౌజన్య తమ క్షేత్రంలో కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బేర్ మొక్కల మధ్య 6 అడుగుల దూరం పాటించారు. వరుసల మధ్య 12 అడుగుల ఖాళీ ఉంచారు. ఈ తోటకు మొత్తం డ్రిప్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. మొక్కలు నాటినప్పుడే తామే తయారు చేసుకున్న ఫంగిసైడ్, బ్యాక్టీరియా ఇచ్చినట్లు తెలిపారు. వీటి వల్ల పీహెచ్ లెవెల్స్ పెరుగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారన్నారు. కశ్మీరీ రెడ్ గోల్డ్ యాపిల్ బేర్ పంట గురించి వినియోగదారులకు చెప్పి మార్కెటింగ్ చేసుకోవడంలోనే రైతు తెలివి, ఉత్సాహం తెలుస్తుందన్నారు. ఈ పండు రుచి గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలిసేలా చెప్పుకోవాలన్నారు. ఈ ఫ్రూట్‌ను ఒకసారి తిన్న వారు మళ్లీ మళ్లీ తినేందుకు ఆసక్తి చూపిస్తారన్నారు.
బోయపాటి సౌజన్య ఫోన్: 9347512933