ప్రకృతి వ్యవసాయంలో ఎవరి విధానంలో వారు పోషకాలు, క్రిమి కీటక నాశనులు తయారు చేస్తున్నారు. ఏ విధారంలొ దేనిని తయారు చేసినా దేశీ ఆవు మూత్రం మాత్రం అత్యంత ప్రధానం. ఆవు మూత్రంతో తయారు చేసిన కషాయం ఎక్కువ సమయం సమర్ధవంతంగా పనిచేస్తుందని గుర్తుంచుకోవాలని నిపుణులు, అనుభవజ్ఞులు చెబుతున్నారు. దేశీ ఆవు మూత్రం కలిపి తయారు చేసిన కషాయం ఏడాది కాలమైనా అంతే సమర్థంగా పనిచేస్తుందని రెండు దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న జీవీ రాంప్రసాద్‌ చెప్పారు. ఫ్రూటానిక్‌, ఫిష్‌, కోడిగుడ్లతో ఎమినో యాసిడ్‌, నవధాన్యాల కషాయం, పాలు, ద్రవ జీవామృతం, జల జీవామృతాలను ఆయన ఎంతో కాలంగా తయారు చేస్తున్నారు. పశువులు ఈనే సమయంలో ముందుగా వచ్చే ద్రవాన్ని జలజీవామృతం అంటారన్నారు. వీటిలో పైరుకు ఏది కావాలో ఎంపిక చేసుకొని రైతులు వినియోగించవచ్చు.బొప్పాయికాయ కిలో, గుమ్మడికాయ కిలో, తోలుతో సహా బాగా పండిన అరటిపళ్లు కిలో తీసుకొని ముక్కలుగా కోసి, గ్రైండర్‌ వేసి, ఒక్కొక్క కిలోకు మూడు లీటర్ల ఆవు మూత్రం, పావు లీటర్‌ వేపనూనెను 400 లీటర్ల నీటిలో కలిపి 45 రోజులు మురగబెట్టాలి. ఆ మిశ్రమాన్ని రోజు కర్రతో కుడివైపు తిప్పుతూ కలపాలి. ఇలా తయారు చేసిన ద్రవ మిశ్రమాన్ని మొక్కలు, లేదా పంటలకు వాడితే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. క్రిమి కీటకాలేవీ పైరు జోలికి రమ్మన్నా రావు. ఒకవేళ వచ్చినా అవి పైరు పైన దూరంగా ఎగురుతాయి కానీ దగ్గరకి రావు. ఈ మిశ్రమం వాసనకు వెళ్లిపోతుంది. అంతకు ముందుగానే పైరులో క్రిమి కీటకాల గుడ్లు ఉంటే అవి కూడా ఈ ద్రావణంలో ఉన్న ఘాటుకు నాశనం అయిపోతుందని రాంప్రసాద్‌ తెలిపారు.పన్నెండు రకాల ఆకులతో తయారు చేసే దశపర్ణి కషాయం గురించి ప్రకృటి వ్యవసాయం చేసే రైతులకు తెలిసే ఉంటుంది. అంత కంటే ఎక్కువ ఫలితాన్నిచ్చే ద్వాదశ పర్ణి కషాయం గురించి రైతు రాంప్రసాద్‌ వివరించారు. ఈ కషాయానికి ముఖ్యంగా వినియోగించేవి 12 రకాల విత్తనాలు. వాటిని మొలకలు వచ్చిన తర్వాత తయారు చేసుకునేది ద్వాదశ పర్ణి కషాయం. ఈ కషాయం తయారీకి పన్నెండు రకాల విత్తనాలను మొలకలు వచ్చే వరకు నానబెట్టాలి. మినుములు, పెసలు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, తైదలు, నువ్వులు, ఆవాలు, వేరుసెనగలు, దనియాలు, మెంతులు మొలకలు వచ్చేదాకా నానబెట్టాలి. వీటితో పాటు ఎండు కొబ్బరిని కూడా ద్వాదశ పర్ణి కషాయం తయారీలో వినియోగించాలి. నానబెట్టిన విత్తనాల్లో ముందుగా మొలకలు వచ్చే మినుములు, పెసలను గ్రైండర్ వేసి ఒక టబ్‌లో పోసుకోవాలి. ఆ తర్వాత మొలకలు వచ్చే నువ్వులు, ఆవాలను కూడా గ్రైండ్‌ చేసి అదే టబ్‌లో వేసుకోవాలి. ఇలా ఏ విత్తనాలు ముందుగా మొలకలు వస్తాయో వాటిని గ్రైండ్‌ చేసి టబ్‌లో పోసుకుంటూ ఉండాలి. చివరాఖరిలో మొలకలు వచ్చే వేరుసెనగలు గ్రైండర్‌లో నలగవు. కాబట్టి మిక్సీలో మెత్తగా చేసుకొని అంతకు ముందు మొలకలు వచ్చిన మిశ్రమం ఉన్న టబ్‌లో కలపాలి. ఎండు కొబ్బరి ముక్కలు మెత్తగా చేసి విత్తనాల మిశ్రమంలో కలుపుకోవాలి. వేరుసెనగ, ఎండు కొబ్బరిలో పొటాష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతోనే సహజసిద్ధమైన ఈ రెండింటి మిశ్రమాన్ని నీటిలో కలిపి స్ప్రే చేస్తే ఎలాంటి పైరుకైనా ఖరీదైన పొటాష్‌ ఎరువు కొని పైరుకు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. పైరు కూడా పచ్చగా..  ఏపుగా ఎదుగుతుంది.ఈ ద్వాదశ పర్ణి కషాయాన్ని ఒక్కొక్క విత్తనం 100 గ్రాముల చొప్పున కలుపుకొని మిశ్రమ ద్రావణం తయారుచేసి ఎకరం పైరుకు స్ప్రే చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని రాంప్రసాద్‌ చెప్పారు. ఈ మిశ్రమ ద్రావణం స్ప్రే చేస్తే వరి, మినుము, పెసర, పసుపు, అరటి లాంటి ఎలాంటి పైరుకైనా.. ఎలాంటి తెగులు ఉన్నా 24 గంటల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుందని, మంచి దిగుబడి ఇస్తుందన్నారాయన. ద్వాదశ పర్ణి కషాయం చల్లిన 24 గంటల్లోనే అరటికాయలు నిగనిగలాడతాయని, వాటి సైజు పెరిగిందని దీన్ని వాడిన రైతు ఒకరు తనకు చెప్పారన్నారు. అరటికి వచ్చే పనామా తెగులు కూడా ద్వాదశ పర్ణి కషాయం వాడితే పూర్తిగా తగ్గిందన్నారు. పసుపు పైరుకు ఈ ద్వాదశ పర్ణి కషాయాన్ని రెండు సార్లు వాడితే మొక్కలు బాగా ఏపుగా మంచి ఎత్తు ఎదిగినట్లు చెప్పారు.పండ్ల మొక్కలు సాగు చేసే రైతులు వ్యవసాయ నిపుణులు చెప్పే పోషకాలన్నీ కొని వాడాలంటే భారీ ఖర్చు వ్యవహారం. అయితే.. జనుము, జీలుగు, నువ్వులు, ఆవాలు, పిల్లిపెసర్లు లాంటి పైర్లను పంట కోసిన తర్వాత భూమిలో బాగా దున్ని, రొటావేటర్ వేసుకుంటే అంతకు మించి సూక్ష్మపోషకాలు పంటలకు అందుతాయన్నారు రాంప్రసాద్‌. దిగుబడి అధికంగా వస్తుందన్నారు. ఆవాలు, నువ్వుల పైరులో జింక్‌ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పొలానికి జింక్‌ను ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం రాదు. పచ్చిరొట్టను భూమిలో దున్ని, పైరు వేసినప్పుడు క్రిమి కీటకాలు ఆశిస్తే.. వేపనూనె స్ప్రే చేస్తే చాలు. అదే దశపర్ణి కషాకం అయితే.. కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుందని, అందులో సీతాఫలం ఆకులు ఉంటే మరింత తొందరగా వాడేయావాలన్నారు రాంప్రసాద్‌. ఆవాలను పొలంలో కాస్త ఎక్కువగా చల్లితే కలుపు మొక్కలు రాకుండా నివారిస్తుందన్నారు. జనుములో పొటాష్‌, డీఏపీ, యూరియా లాంటి పోషకాలు ఉంటాయి. సరిగా దుక్కి దున్నితే భూమిలోని క్రిములు చాలావరకు పోతాయి.ఏ పంటకు ఎలాంటి పోషకాలు కావాలో రైతులు అర్థం చేసుకోవాలని రాంప్రసాద్‌ అన్నారు. పైరుకు మనం వాడుకునే ద్వాదశ పర్ణి కషాయం తయారు చేసుకునే ముందు ఏ విత్తనాల్లో ఏమేమి పోషకాలు ఉన్నాయో తెలుసుకుని, దేనికి ఏ గింజల మోతాదు పెంచితే అధిక ఫలితం ఉంటుందో నిర్ణయించుకోవాలి. ఇలా అవగాహనతో ద్వాదశ పర్ణి కషాయం తయారు చేసుకుంటే మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. తద్వారా తక్కువ ఖర్చులోనే మొక్కలకు బలం అందుతుందన్నారు. పసుపు, కంద, పెండలం, బంగాళాదుంప, చిలగడదుంప, బీట్‌రూట్‌, చామ లాంటి దుంప జాతులు ఎక్కువ దిగుబడి ఇవ్వాలనే ఆశతో రసాయన ఎరువులు వేయొద్దని రాంప్రసాద్‌ కోరారు. భూమిలో ఉన్న పోషకాలను తీసుకుని దుంప జాతి సహజంగా పెరుగుతాయన్నారుభూమికి, పైరుకు ఎక్కువ బలాన్నిచ్చే మరో పద్ధతి ఉంది. ధాన్యం మిల్లు పట్టిన తర్వాత వచ్చే పొట్టును కానీ, ధాన్యం ఎగరపోయగా మిగిలిన పొల్లును కాని కాల్చకుండా.. పొలంలో చల్లుకోవాలి. ధాన్యం పొట్టులో, గడ్డిలో ఉండే సిలికాన్‌ పదార్థం ఎలాంటి వాతారణంలో అయినా పైరు నుంచి అధిక దిగుబడి వచ్చేలా చేస్తుందని సైంటిస్టులు చెప్పారని అన్నారు. మొక్కలు పూత, పిందె దశకు వచ్చినప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటాయి. ఆ సమయంలో ద్వాదశ పర్ణి కషాయం చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవసరాన్ని బట్టి మరోసారి ఇది వాడితే మరింత ఎక్కువగా కాపు వస్తుందన్నారు. ద్వాదశ పర్ణి కషాయం నల్లబడినా నిర్భయంగా వాడుకోవచ్చన్నారు. ద్వాదశ పర్ణి కషాయాన్ని రెండు మూడు రోజులు కలపకపోతే దాంట్లో పురుగు వచ్చే అవకాశం ఉంది. ఆ పురుగులను తీసేసి కషాయాన్ని పైర్లకు వాడుకోవచ్చని చెప్పారు.ఆకుకూరల రైతులు భూమిలో ఫ్రూటాన్‌ కానీ, ద్వాదశ పర్ణి కషాయం కాని ఉదయం 11 గంటల లోగా చల్లాలి. లేదా మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలుపెట్టి స్ప్రే చేయాలి. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చల్లితే కొంత వృథా అవుతుందని రాంప్రసాద్ చెప్పారు. వేరుసెనగ పిండి పైరుకు వేస్తే.. ఎక్కువకాలం నిల్వ ఉండి బలం ఇస్తుంది. ఇలా పంట పండిస్తే.. రైతు తన పంటకు ధరను తానే నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని రాంప్రసాద్ అన్నారు. ఇలాంటి ఆహారం తిన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. ఆదాయం ద్వారా రైతు, ఆహారం ద్వారా వినియోగదారులు క్షేమంగా ఉంటారు.ద్వాదశ పర్ణి కషాయాన్ని ఏ రైతు అయినా ముందుగా కొంత చేనులో ప్రయోగాత్మకంగా చల్లి చూడాలని రాంప్రసాద్‌ సూచించారు. ఈ కషాయం చల్లిన పైరు, మిగతా పైరుకు మధ్య తేడా తెలుస్తుంది. ఎకరానికి ఒక్క లీటర్ కొడితే సరిపోతుంది. ఒకవేళ మరోసారి చల్లాల్సి వస్తే.. వారం రోజుల తర్వాత మరోసారి వాడుకోవచ్చు. ద్వాదశ పర్ణి కషాయం లీటర్‌, వేపనూనె పావు లీటర్‌, మజ్జిగలో పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసి వేసి. నాలుగు రోజులు నిల్వ ఉంచి స్ప్రే చేస్తే తెల్లదోమ మటుమాయం అవుతుంది. తెల్ల ఉల్లిపాయ అయితే ఫలితం మరింత ఎక్కువ ఉంటుంది. రైతులు ఈ విధంగా చేస్తే పైరుకు కచ్చితంగా తెగుళ్లు రావని చెప్పారు.­