మల్బరీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? పట్టుపురుగులకు మల్బరీ ఆకులు ఆహారంగా వేస్తారని, అందుకే మల్బరీ చెట్లు పెంచుతారని. అయితే.. మల్బరీ పండ్లతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మల్బరీ పండ్లు, మల్బరీ బెరడు చేసే మేలు అంతా ఇంతా కాదు. మల్బరి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంశాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్ల చికిత్సలో మల్బరీ బెరడు ఉపయోగపడుతుంది. మల్బరీ పండ్లు ఎంతో రుచిగా కూడా ఉంటాయి.
ఫైబర్ ఎక్కువగా ఉండే మల్బరీ పండు తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం పోతుంది. మల్బరీలో విటమిన్ సీ, విటమిన్ కే, విటమిన్ బీ ఉంటాయి. మల్బరీ ఫ్రూట్ తిన్నవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మల్బరీ ఫ్రూట్‌లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని తింటే కడుపు నిండిన భావన వస్తుంది. తద్వారా ఆకలి నియంత్రలో ఉంచడమే కాకుండా బరువును తగ్గిస్తుంది. మల్బరీ తిన్న వారి చర్మం మెరుస్తుందని, చర్మ ఆరోగ్యం బాగవుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.తెలంగాణలో బొంత పండ్లుగా పిలుచుకునే మల్బరీ పండ్లను రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ పరిసరాల్లో ఔత్సాహిక మహిళా రైతులు చాలా ఏళ్లుగా పండిస్తున్నారు. చిన్న చిన్న కమతాల్లో కూడా మల్బరీ మొక్కలు పెంచవచ్చు. మల్బరీ పండ్లకు ధర, డిమాండ్ బాగా ఉంటాయి. కిలో 100 రూపాయలకు రైతుల వద్ద దళారీలు కొనుగోలు చేస్తుంటారు. మల్బరీ పంట ఏడాది పొడవునా వస్తుంది.
సరస్వతిగూడకు చెందిన అరుణ, పలువురు ఇతర రైతులు తమ ఇళ్లకు సమీపంలో చాలా ఏళ్లుగా మల్బరీ పండ్ల సాగు చేస్తున్నారు. అరుణ పావు ఎకరంలో 40 మల్బరీ చెట్లు వేశారు. మల్బరీ చెట్ల మధ్య 15 అడుగుల దూరం పెట్టారు. కొన్ని మల్బరీ చెట్లకు నెల రోజుల సమయం గ్యాప్ ఇచ్చి నాటుకుంటే వాటి నుంచి పంట కూడా ఒకేసారి కాకుండా విడతలుగా చేతికి వస్తుంది. ఒక్కో చెట్టు నుంచి 20 రోజుల వరకు విరామం లేకుండా ఎక్కువగా పండ్లు కోతకు వస్తాయి. మరో పది రోజుల పాటు తగ్గుతూ వస్తాయి. పండ్లు కోసుకున్న తర్వాత చెట్టు ఆకులు, కొమ్మలు ప్రూనింగ్ చేయాలి. మరో నెల రోజుల్లో మళ్లీ పంట వస్తుంది. మేఘాలు ఉన్నప్పుడు, వాన కురిసినప్పుడు 15 రోజులకే మల్బరీపండ్లు కోతకు వచ్చేస్తాయని అరుణ చెప్పారు. ఎండ ఉంటే కాస్త ఆలస్యంగా పంట వస్తుందన్నారు.
పావు ఎకరం మల్బరీ తోటలో పనికి ఇద్దరు మనుషులు సరిపోతారు. భార్యా భర్త కలిసి చేసుకుంటే కూలీలకు డబ్బులు ఇచ్చే ఖర్చు తగ్గుతుంది. వాతావరణం మారిపోయి, త్వరగా పండ్లు వచ్చినప్పుడు వాటిని కోసేందుకు మాత్రం ఒకరిద్దరు మనుషుల అవసరం ఉంటుంది. మల్బరీ చెట్ల మొదళ్ల చుట్టూ పాదులు చేసి, పశువుల ఎరువు వేసి, నీటి సౌకర్యం కల్పించాలి. ఎండాకాలంలో అయతే.. ప్రతిరోజూ నీరు సరఫరా చేయాలి. కనీసం రోజు విడిచి రోజు అయినా తప్పకుండా చెట్లకు నీరు అందించాల్సి ఉంటుంది.
మల్బరీ పండ్ల ధర సాధారణంగా కిలోకు రూ.100 ఉంటుంది. వర్షాకాలంలో అయితే.. అవి రూ.70 నుంచి 80 వరకు పలుకుతాయి. ప్రతిరోజూ దళారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. అంటే మార్కెటింగ్ చేసుకోవాల్సిన కష్టం రైతుకు తప్పుతుంది. సాగు యాజమాన్యం సరిగా చేసుకుంటే ఏడాది పొడవునా మల్బరీ పండ్లు వస్తాయి. చలికాలంలో మల్బరీ పంట తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలోనే వీటికి ధర ఎక్కువ వస్తుందన్నారు అరుణ. దళారులు ఎప్పటికప్పుడు ధర చెల్లించి పండ్లు తీసుకెళ్తారు. ఒక రోజు ఇవ్వలేకపోతే మరుసటి రోజు మొత్తం చెల్లిస్తారని అరుణ చెప్పారు.
మల్బరీ చెట్లకు పశువుల ఎరువులు వేయాలి. వర్షాకాలంలో పురుగు వస్తే మందులు కొట్టాల్సిన ఖర్చు ఉంటుంది. మల్బరీ చెట్లకు పశువుల ఎరువు ఏడాదికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఆరు నెలలకు ఒకసారి ఎరువు వేసినా మంచిది. చెట్టు మొదట కలుపు లేకుండా ఎప్పటికప్పుడు తీసేయాలి. లేదంటే కలుపులో ఉండే పురుగులు చెట్టుపైకి ఎక్కి, పంటను పాడుచేస్తాయని అరుణ అన్నారు. వర్షాకాలంలో పండ్లు మురిగిపోతాయి. వాటికి బూజు పడుతుంది. ఒక్క రోజు తెంపకపోయినా చెట్టు నుంచి రాలిపోతాయి. మల్బరీ పండ్లు ఒక్క రోజు మాత్రమే నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో పెట్టినా పాడైపోయే గుణం మల్బరీ పండ్లది. పండ్లు చెట్టు మీదే నలుపు రంగు వచ్చాక మాత్రమే తెంపాలి.
మల్బరీ కొమ్మలను కత్తిరించి, నాటుకుంటే నెల రోజుల్లో మొలుస్తుంది. కొమ్మ నాటిన ఆరు నెలల నుంచి కాపు మొదలవుతుంది. మల్బరీ మొక్కకు కాస్త ముందుగా కాయలు వచ్చినా తెంపకుండా వదిలేస్తే.. చెట్టు మరింత బలంగా ఎదుగుతుంది. అప్పటి నుంచి పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. చెట్టుకు కాస్త గాలి తగిలేలా దగ్గర దగ్గరగా ఉన్న కొమ్మలను కత్తిరిస్తే పండ్లు లావుగా తయారవుతాయి. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్నది కాదు కాబట్టి మల్బరీ పండ్ల సాగు మంచిదే అంటున్నారు నిపుణులు. పైగా ఏడాది పొడవునా ఆదాయం కూడా ఇస్తుంది మల్బరీ