బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి ఇచ్చినా.. దాన్ని పదిరెట్లు చేసి మరీ తన బిడ్డలైన మనకే అందిస్తుంది. వెంటనే తిరిగి ఇస్తుందా? లేక కొద్దిరోజుల తర్వాతా? అనేది మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. సరిగ్గా ఇదే అంశాన్ని అర్థం చేసుకున్నారు అమెరికాలో 17 ఏళ్లు జాబ్ చేసి, తిరిగి మాతృభూమికి తిరిగి వచ్చి పదేళ్లుగా ఇన్నోవేటివ్‌గా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతు దేవరపల్లి హరికృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో ఈ రైతు ఇన్నోవేటివ్ వ్యవసాయం చేస్తున్నారు.
అగ్గిపుల్ల గీస్తే కాలిపోయే ప్రతి వస్తువూ కుళ్లబెడితే భూమికి బంగారంతో సమానం అనేది రైతు హరికృష్ణ చెప్పిన సాగు సూత్రం. అందుకే కాలబెట్టే వ్యవసాయ వ్యర్థాలను కుళ్లబెట్టి మళ్లీ మన భూమికే ఎరువుగా ఇవ్వాలంటారు హరికృష్ణ. వ్యవసాయం మొత్తం వ్యర్థాలతోనే చేస్తున్నారాయన. సుమారు 40 ఎకరాలలో పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఒకే నేలలో ఒకేసారి రెండు మూడు రకాల పంటలు పండిస్తున్నారు. పది ఎకరాల్లో కొబ్బరి, అంతర పంటలుగా కోకో, వక్క పండిస్తున్నారు. ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు.హరికృష్ణ 20 ఎకరాల్లో గత 20 ఏళ్లుగా ఆయిల్ ఫామ్ చేస్తున్నారు. ఆయిల్ ఫామ్‌లో అంతరపంటలు పండిస్తున్నారు. తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఆయిల్‌ఫామ్ పెట్టినట్లు హరికృష్ణ తెలిపారు. అంతకు ముందు ఉన్న మామిడి తోట తీసేసి ఆయిల్ ఫామ్ పెట్టినట్లు చెప్పారు. అప్పట్లో బోరు, నీటి సౌకర్యం సరిగా లేనప్పుడు తమ పొలంలో మామిడి, జీడి తోటలు పెంచినట్లు వెల్లడించారు. సరిగా చేస్తే ఆయిల్ ఫామ్ నుంచి 20 నుంచి 30 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందని హరికృష్ణ తెలిపారు. 20 ఏళ్ల తర్వాత దిగుబడి తగ్గుతూ వస్తుందని, ఆయితే.. గిట్టుబాటు ధర ఉంటే 30 ఏళ్లు వరకు ఉంచుకోవచ్చన్నారు.
హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో మూడు ఆవులను పోషిస్తున్నారు. వాటితో తమకు కావాల్సిన పాడి లభిస్తోందని, వ్యవసాయానికి అవసరమైన జీవామృతం తయారు చేస్తున్నట్లు చెప్పారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడ చూసినా భూమిపై చెత్తా చెదారం ఉంటుంది. ఆయిల్ ఫామ్ నుంచి వచ్చి వ్యర్థాలను కుప్పలు కుప్పలుగా పోసి ఉంచుతారు. ఇలాంటివన్నీ కుళ్లిపోయి భూమికి చక్కని సారం అందిస్తాయన్నారు. ఈ వ్యర్థ పదార్థాలు ఆరు నెలలు అయ్యేసరికి వర్మి కంపోస్ట్‌గా మారుతుందని, దాన్ని మొక్కలు, చెట్లకు వేస్తామని చెప్పారు. వ్యర్థపదార్థాలపై స్ప్రింక్లర్‌తో నీరు సరఫరా చేస్తామని, దీని వల్ల వ్యర్థాలు వర్మి కంపోస్ట్‌గా మారడమే కాకుండా నేలతో తేమ నిలిచి ఉంటుందన్నారు. అలాగే వ్యర్థాల చుట్టూ కలుపు కూడా తగ్గిపోతుంది.
ఆరు ఏడు ఏళ్ల నుంచి హరికష్ణ తమ వ్యవసాయంలో బయోమాస్‌నే వినియోగిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడడం లేదు. జీవామృతం, వర్మీ కంపోస్ట్‌తోనే చక్కని దిగుబడులు సాధిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరి వైపు నుంచి తాత ముత్తాతలు వ్యవసాయ కుటుంబాలే కావడంతో తనకు సాగు పట్ల మొదటి నుంచీ ఇష్టం ఉందన్నారు. అమెరికాలో జాబ్ చేస్తూ.. తమకు ఉన్న భూమితో పాటు మరికొంత భూమిని తాను కొనుగోలు చేసినట్లు చెప్పారు. తాను అమెరికాలో ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా ప్రతిరోజూ తండ్రికి ఫోన్ చేసి, వ్యవసాయం, పశువుల గురించి వివరాలు తెలుసుకోవడం తనకు అలవాటు అన్నారు. వ్యవసాయాన్ని ఇష్టపడి కష్టపడుతున్నానని చెప్పారు.
అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాలు పామాయిల్ పంటకు ప్రసిద్ధి చెందాయని హరికృష్‌ణ చెప్పారు. తెల్లదోమ లాంటి తెగుళ్లు లేనప్పుడు ఎకరానికి 15 నుంచి 16 టన్నుల దిగుబడి తీసినట్లు తెలిపారు. తెల్లదోమ, వాతావరణ మార్పులతో ఇటీవలి కాలంలో కొద్దిగా దిగుబడి తగ్గి 11 నుండి 12 టన్నులు వస్తోందన్నారు. తమ ప్రాంతంలో రాని పంట లేదని, కోనసీమ కన్నా అధికంగా దిగుబడి తమ ప్రాంతంలో వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్‌లో అంతర పంటలుగా కోకో పంటను 2012లో హరికృష్ణ వేశారు. కోకో పెట్టిన మూడో ఏట నుంచే దిగుబడి వస్లోందన్నారు. ఎనిమిది, తొమ్మిదేళ్లకు దాని దిగుబడి పూర్తిస్థాయిలో ఉంటుంది. ఒక ఎకరంలో అంతర పంటగా వక్క వేశారు. మరో ఎకరం నేలను కోళ్లు, ఆవుల పెంపకం కోసం కేటాయించారు.
హరికృష్ణ వ్యవసాయం మొత్తం కోకో కానీ, కొబ్బరి కానీ, పామ్ ఆయిల్ తోట గానీ తమ క్షేత్రంలో వచ్చిన వ్యర్థాలతోనే చేస్తున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన వ్యర్థాలను డీకంపోజ్ చేసి పొలానికి ఎరువుగా వాడుతున్నారు. ప్రకృతి మనకు ఒక చక్కని పాఠం చెబుతుందన్నారు హరికృష్ణ. గడ్డివాము కింద నేల చాలా గుల్లగా ఉంటుందని, అక్కడ ఏ మొక్క మొలిచినా చాలా ఏపుగా, ఆరోగ్యంగా వస్తుందన్నారు. వ్యర్థాలు బాగా కుళ్లిన ప్రాంతంలో ఉండే మొక్కలు గానీ, చెట్లు గానీ ఎక్కువ దిగుబడి ఇవ్వడాన్ని గమనించినట్లు చెప్పారు. దాంతో పంటల సాగును అదే విధంగా చేస్తున్నట్లు చెప్పారు. అడవుల్లో చెట్ల నుంచి రాలిన ఆకులే కదా బోల్డంత ఆర్గానిక్ మేటర్ అంటారాయన. ఆకులు కుళ్లి, ఎరువుగా మారడం వల్లే కదా మొక్కలు, చెట్లు అక్కడ ఎదుతాయన్నారు. తాను చేస్తున్న వ్యవర్థాలతో వ్యవసాయం విధానాన్ని ఇప్పుడు తమ ప్రాంతంలోని రైతులు అనేక మంది అనుసరిస్తున్నారన్నారు. వ్యర్థాలతో వ్యవసాయం చేసినప్పుడు పంటలకు నీటి అవసరం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఈ వ్యర్థాలు భూమిలో తేమను పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంచుతుండడంతో నీటి అవసరం తగ్గుతోందన్నారు. ఈ విధానం భూమిని సారవంతం చేస్తుందని, రైతుకు దిగుబడి పెంచడంతో పాటు పర్యావరణ హితం కూడా అన్నారు. నేల బలం పెరిగితే పంటలకు రోగ నిరోధక శక్తి వస్తుంది.
కొత్తగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఎకరం పామ్‌ఆయిల్ తోట నుంచి ఏడాదికి లక్షల రూపాయలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని హరికృష్ణ చెప్పారు. రైతు స్వయంగా జాగ్రత్తగా సాగుచేసుకుంటే, రేటు బాగున్నప్పుడు లక్షన్నర వరకు ఆదాయం వస్తుందన్నారు. కోకో, కొబ్బరి నుంచి కూడా అన్ని ఖర్చులూ పోగా ఏడాదికి లక్ష రూపాయలు కచ్చితంగా వస్తుంది. వ్యవసాయం పట్ల ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్లు ఇందులోకి రావాలన్నారు. చెట్టును చూస్తే సంతోషం, పశువును చూస్తే ఆనందం కలిగే గుణం ఉన్నవారికి వ్యవసాయం అనుకున్నదాని కంటే ఎక్కువ ప్రయోజనం ఇస్తుందని హరికృష్ణ చెప్పారు.
ఇతర వివరాల కోసం దేవరపల్లి హరికృష్ణను 9885858616 నెంబర్‌లో సంప్రదించవచ్చు.