ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులను రైతులు అవలంబిస్తున్నారు. కొందరు జీవామృతాన్ని వాడుతుంటే.. మరి కొందరు ఫిష్‌ అమినో యాసిడ్‌ వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే మట్టి ద్రావణంతో సహజ పంటలు పండిస్తున్నారు. కొందరు ఇండిజెనిస్ మైక్రో ఆర్గానిజమ్‌ వాడుతున్నారు. కొంతమంది పంచగవ్యను పైర్లకు వేస్తున్నారు. సేద్యానికి ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ అవ్వాలనే ఆలోచనతో జిట్టా బాల్‌రెడ్డి మరో కొత్త ఆవిష్కరణ చేశారు. అదే ఎరువుకుంట. పశువుల పేడ, మూత్రాన్ని ఒక ట్యాంకులో నిల్వ చేసి, అది ఫర్మంటేషన్ అయిన తర్వాత డ్రిప్‌ ద్వారా పైర్లకు అందించడం ఆయన చేస్తున్న విధానం. పేడ ద్రావణం పైరుకు మరింత ఉపయోగంగా ఉంటుందని బాల్‌రెడ్డి అంటున్నారు.రెండు వేల లీటర్ల సామర్ధ్యం ఉన్న కుండీలో లేదా ట్యాంకులో 200 కిలోల పశువుల పెంట వేయాలి. దానికి అరకిలో ఈస్ట్‌ (ఇవి ఫంగస్‌ కుటుంబానికి చెందిన ఏకకణ సజీవ సూక్ష్మజీవులు. చక్కెర, పిండిని కార్బన్‌ డయాక్సైడ్‌, ఆల్కహాల్‌గా మారుస్తాయి)ను కలపాలి. ఈస్ట్‌ అనేది మేలు చేసే బ్యాక్టీరియా. దేన్నయినా ఈస్ట్ చాలా తొందరగా పులియబెటుడుతుంది. దాంట్లో 200 లీటర్ల పశువుల మూత్రం కూడా పోయాలి. వీటితో పాటు 2 కిలో బెల్లం వేయాలి. తర్వాత కుండీ నిండుగా నీరు నింపాలి. అయితే.. ఈ పెంట, మూత్రం ఆవుదైనా, ఎద్దులవైనా, గేదె, దున్న లేదా గొర్రె, మేకలవైనా దీంట్లో వాడవచ్చు అంటారు అమేయ కృషి వికాస కేంద్రం నిర్వాహకుడు బాల్‌రెడ్డి. ఈ ప్రక్రియకి కచ్చితంగా దేశీయ ఆవుల పేడ, మూత్రమే ఉండాల్సిన పని లేదంటారు.ఈ విధానంలో  తయారు చేసుకున్న రెండు వేల లీటర్ల ఎరువు ద్రావణాన్ని నేరుగా పాదులు, మొక్కలకు పోసుకోవచ్చు. లేదా.. దీన్ని వడగట్టి డ్రిప్‌ ద్వారా మొక్కల మొదళ్లకు సరఫరా చేయొచ్చు. ఎరువుకుంట ద్రావణం రెండు వేల లీటర్లను ఎకరం భూమిలోని పంటకు 15 రోజులకు ఒకసారి సరఫరా చేస్తే.. రసాయన ఎరువులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా పంట దిగుబడి ఇచ్చేలా చేస్తుంది. విష రసాయనాలతో నిండిపోయి నిస్సారం అయిపోయిన భూములను సహజసిద్ధ విధానంలో సారవంతం చేసుకోవడానికి కనీసం రెండు మూడేళ్లు సమయం పట్టొచ్చు. అదే ఎరువుకుంట ద్రావణం వినియోగిస్తే.. మరింత తొందరగా భూమి సారవంతంగా మారుతుందని బాల్‌రెడ్డి చెప్పారు. దీనిలో అధిక మొత్తంలో ఉండే బ్యాక్టీరియా భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగేలా చేస్తుంది. సేంద్రీయ కర్బనం భూమిలో పుష్కలంగా ఉంటే పంట దిగుబడి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. పంటకు రోగనిరోధక శక్తి కూడా వస్తుంది.స్థిరమైన ఆదాయం ఉన్నప్పుడే అన్నదాత నిలదొక్కుకోగలుగుతాడంటారు బాల్‌రెడ్డి. దీనికోసం బాల్‌రెడ్డి ఒక విధానం రూపొందించారు. పొలం సరిహద్దు గట్టు లోపల కందకం తవ్వి మహాగని మొక్కలు పెట్టారు. ఈ కందకం పొలంలోకి వచ్చే నీరు భూమి లోపల ఇంకడానికి, భూగర్భ జలమట్టం పెరిగేందుకు ఉపయాగపడుతుంది. పదేళ్లలో మహాగని ఒక ఆదాయ వనరు అవుతుంది. అప్పటి వరకు పొలం మీదకు వచ్చే అధిక గాలులు, కీటకాలను అడ్డుకోవడానికి తెరలా అడ్డుకుంటాయి. మహాగని కలప క్యూబిక్ మీటర్‌ కనీస రూ.2,500 ఉంటుంది. పోనీ అంత ఆశ వద్దనుకుంటే క్యూబిక్ మీటర్‌ కలప కేవలం రూ.500 అనుకున్నా.. ఒక చెట్టు నుంచి 50 ఘనపు మీటర్ల కలప వచ్చినా.. రైతుకు 50X500 రూ.25 వేల ఆదాయం తప్పకుండా వస్తుంది. పొలం గట్టు చుట్టూ వంద మహాగని మొక్కలు నాటుకుంటే పదేళ్లలో 25000X100 రూ.25 లక్షల లభిస్తుంది. అంటే రైతుకు వృద్ధాప్యం వచ్చేసరికి భవిష్య నిధిగా ఈ ఆలోచన పనికి వస్తుంది.బాల్‌రెడ్డి తమ అమేయ కృషి వికాస కేంద్రంలో సుమారు 227 రకాల మామిడి చెట్లు పెంచుతున్నారు. వాటిలో 24 మామాడి చెట్లు ఏడాది పొడవునా పంట ఇస్తాయి. ఏడాదిలో తక్కువలో తక్కువగా మూడు పంటలు ఇస్తాయి ఆ చెట్లు. ప్రతి రుతువులోనూ మామిడి కాయలు బాల్‌రెడ్డి క్షేత్రంలో లభిస్తాయి. రైతులందరికీ ఒకేసారి మామిడిపంట వస్తే ధరలో ఒడుదుడుకులు సహజం. అలాగే ప్రకృతి సిద్ధంగా వచ్చే ఇబ్బందులు రావచ్చు. అదే ఏడాది పొడవునా మామిడి పంట తీసుకుంటే.. ఇలాంటి ఇబ్బందులు తక్కువ ఉంటాయి. తద్వారా ఏడాది పొడవునా రైతుకు ఆదాయం చేతికి వస్తూనే ఉంటుంది.అంతకు ముందు రాయల్ స్పెషల్‌, బొబ్బలి పునాస రకాలు మాత్రమే ఏడాదిలో రెండుసార్లు పంట ఇచ్చేవి. అయితే వీటి పండు నాణ్యంగా ఉండేవి కావు. బారీ లెవెన్ రకం పండు నాణ్యంగా ఉంటుంది. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలైనది. దీన్ని బంగ్లాదేశ్‌ అగ్రికల్చర్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందించింది, దీని కాయ బరువు అరకిలో కంటే ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడవునా పంట వచ్చే మామిడి రకాలతో రైతుకు ఒక పంట పోయినా మరో పంటతో నిలదొక్కుకుంటాడు. అలాగే ఆఫ్‌ సీజన్‌లో వచ్చే పంటకు ధర ఎక్కువ పలుకుతుంది. అలాంటి వాటిలో క్యాటిమోని, థాయ్‌ ఆల్‌టైమ్‌ స్వీట్‌, కచ్చామీటా ఆల్‌టైమ్, బెంగాల్‌ ఆల్‌టైమ్‌ లాంటి ఏడెమిది రకాలను బాల్‌రెడ్డి పెంచుతున్నారు. తోట పంటలు వేయాలనుకునే రైతులు అధిక ఆదాయం ఇచ్చే రకాలను రైతులు వేసుకోవచ్చన్నారు.నిమ్మజాతిలో 26 రకాలను బాల్‌రెడ్డి తమ అమేయ కృషి వికాస కేంద్రంలోపెంచుతున్నారు. వీటిలో వెల్లన్సియా ఆరెంజ్‌, ఆస్ట్రేలియన్ ఆరెంజ్‌, డార్జింలింగ్‌ జెయింట్ ఆరెంజ్‌ రకాలు ఉన్నాయి. వాటితో నిరంతరం పంట ఇచ్చే వియత్నా మాల్టా లాంటి రకాలు కూడా ఆయన పెంచుతున్నారు. ఇది పూర్తిగా అటు బత్తాయి కాదు ఇటు కమలా కూడా కాదు. ఈ రెండింటి మధ్యలో ఉండి ఎక్కువ రసాన్ని ఇచ్చే పండు. ఇది చాలా తియ్యగా ఉంటుంది. సుమారు 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది. వియత్నాం మాల్టా నిరంతరం కాపు కాస్తూనే ఉంటుంది. జఫా మాల్టా, మిసోరి మాల్టా, ఆఫ్రికన్ మాల్టా రకాలు కూడా బాల్‌రెడ్డి తోటలో ఉన్నాయి. వాణిజ్య పరంగా చూసుకుంటే బెంగాల్ నిమ్మ, థాయ్‌ నిమ్మ రకాలు నిరంతరం దిగుబడి ఇస్తాయి. అలాగే బాల్‌రెడ్డి తమ వ్యవసాయ క్షేంత్రం లోసీతాఫలం, జామలో పలు రకాలను పెంచుతున్నారు.