బెండకాయ కూరను అనేక మంది ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, సాంబారులో బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఇష్టపడే బెండకాయలో పలు రకాల న పోషకాలు ఉంటాయి. క్యాన్సర్, డయాబెటీస్ ఉన్నవారు బెండకాయ ఆహారంగా తీసుకుంటే మేలు జరుగుతుందని ఆరోగ్య నిఫుణులు అంటారు. బెండలో విటమిన్ సీ, విటమిన్ డీ, ఫోలిక్ యాసిడ్ సహా ఎన్నో పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఫైబర్ అధికం. దీంతో పొట్ట బాగా నిండినట్టయి, ఎక్కువగా ఆకలి వేయదు. ఇన్సులిన్ ను మెరుగుపరుస్తుంది. బెండకాయ చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది. బెండలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తద్వారా వారిలో కొలెస్ట్రాల్ నియంత్రణ అవుతుంది. ఒత్తిడిని నియంత్రించడంలో బెండ చక్కని పాత్ర పోషిస్తుంది.మన జీవితానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే బెండ సాగుకు ఎండకు లింకేంటో చూద్దాం. ఎండాకాలంలో బెండ సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. వర్షాకాలం కూడా బెండ సాగుకు అనువైన సమయమే కానీ ఎండా కాలం కన్నా కొద్దిగా తక్కువ ఫలితాలు ఇస్తుందని వ్యవసాయ నిపుణులు, అనుభవజ్ఞులైన అన్నదాతలు చెబుతున్నారు. జనవరి రెండో వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం దాకా బెండ విత్తనాలు నాటుకుంటారు. రైతులు ఈ సమయాన్నే ఎంచుకోవడానికి కారణం.. బెండ సాగుకు అనువైన కాలం అనేది గమనార్హం. మేలు రకం సస్యరక్షణ చర్యలు పాటిస్తే.. మరింత లాభదాయకంగా ఉంటుందని ఏపీ ఉద్యానవన అధికారి జ్యోతి చెబుతున్నారు.
అలాంటి వేసవి బెండ సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. బెండ సాగుకు వేడి వాతావరణ అనుకూలమైనది. చల్లని వాతావరణంలో బెండ మొక్క సరిగా పెరగదు. అందుకే వర్షాకాలంలోనూ, వేసవి కాలంలోనూ బెండసాగును ఎక్కువగా చేసుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రైతులు ఎక్కువ దిగుబడినిచ్చే హైబ్రీడ్ బెండ రకాలు అధికంగా వేస్తుంటారు. బెండ పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది.వేసవిలో బెండ సాగు చేసే వారు.. మొక్కల మధ్య సాంధ్రత ఎక్కువగా ఉండే విధంగా వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తనాలు నాటుకోవాలని ఉద్యానవన అధికారిణి జ్యోతి చెప్పారు. తద్వారా బెండ పంట దిగుబడి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. మొత్తం నాలుగు నెలలు పెరిగి పంట ఇచ్చే కాలం పెరుగుందని అన్నారు.
బెండ విత్తనాలు సాధారణంగా ఎకరానికి రెండు కిలోల విత్తనం సరిపోతాయి. వేసవి సాగులో మొక్కల సాంధ్రత ఎక్కువ ఉంటే మరింత దిగుబడి పెరుగుతుంది కనుక 3 కిలోల విత్తనాలు వేసుకోవచ్చని ఉద్యానవన అధికారిణి జ్యోతి వివరించారు. భూమిలో విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి చేసుకుంటే రసం పీల్చే పురుగుల బాధ చాలా వరకు తగ్గిపోతుంది. కిలో బెండ విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ను పట్టించాలి. అలాగే కిలో విత్తనాలకు 100 గ్రాముల యజోస్పైరిలమ్ పట్టించి ఉంచితే.. విత్తన శుద్ధి బాగా జరుగుతుంది.శుద్ధి చేసుకున్న బెండ విత్తనాలను పొలంలో సాళ్లు దున్నుకున్న తర్వాత.. సాళ్లలో బెండ విత్తనాలు నాటుకోవాలని జ్యోతి చెప్పారు. యజోస్పైరిలమ్ లో జీవన ఎరువులు నత్రజని, పీఎస్ బీ ఫాస్పరస్ ఉంటుంది, దీన్ని 100 కిలోల పశువుల ఎరువులో గాని, వర్మీ కంపోస్టులో గాని కలిపి 15 రోజుల పాటు మగ్గబెట్టాలి. తర్వాత సాళ్లలో, కానీ, బెడ్ల మీద కానీ వేసుకుంటే.. సీంద్రీయ పదార్థం నేలలోకి చేరుతుంది. తద్వారా బెండ మొక్కలు ఎదుగుదల ఏపుగా వస్తుంది. అంతే స్థాయిలో పంట దిగుబడి కూడా పెరుగుతుంది. అదే డ్రిప్ ఇరిగేషన్ విధానం పాటించే రైతులైతే.. మడులు ఎత్తులో చేసుకుని నాలుగు అడుగుల వెడల్పు, ఒక అడుగు ఖాళీ ఉంచుకుని, బెడ్ మీద డ్రిప్ లైన్ వేసుకోవాలని జ్యోతి వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో అయితే.. పొలం మొత్తం ఒకే విధంగా నీరు పారించుకునే వీలుంటుంది. మొక్కలకు ఎరువులను కూడా డ్రిపి ఇరిగేషన్ విధానంలో అందించవచ్చని తెలిపారు.
బెండ విత్తనాలు నాటిన తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఫ్లూక్లోరాలిన్ ఒక హెక్టారుకు కిలో చొప్పున పిచికారి చేసుకుంటే.. విత్తనం మొలకెత్తే ముందు కలుపు మొక్కలు నివారణ అవుతాయి. బెండ సాగులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే.. హెక్టారుకు 200 కిలోల నత్రజని, 100 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్ సిద్ధం చేసుకోవాలని, ప్రతి 30 రోజులకోసారి పంటకు వేసుకోవాలని ఉద్యానవన అధికారిణి జ్యోతి వివరించారు. ఈ ఎరువులను కూడా డ్రిప్ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చన్నారు.
ఇక తేలిక నేలల్లో బెండ సాగు చేస్తే.. అధిక ఉష్ణోగ్రతలకు నేల త్వరగా తడి ఆరిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి నాలుగైదు రోజులకోసారి తప్పకుండా నీటి సరఫరా చేసుకోవాల్సి ఉంటుంది. అదే బరువు నేలల్లో అయితే.. వారం పది రోజులకోసారి నీటి తడి అందించినా సరిపోతుంది. విత్తనం నాటిన 45 రోజుల దాకా బెండపొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు బెండలో పోషక లోపాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే ఎరువుల యాజమాన్యం సక్రమంగా పాటించాల్సి ఉంటుంది. నేలతో తడి తగ్గినప్పుడు బెండ మొక్కలపై రసం పీల్చే పురుగుల దాడి చేస్తాయి. ప్రధానంగా తెల్ల దోమ వల్ల పల్లాకు వైరస్ తెగులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తెల్ల దోమ నివారణ కోసం లీటరు నీటిలో డైమిథోయేట్ మందు 2 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ను 1.5 గ్రాములు కలిపి వారం లేదా పది రోజుల వ్యవధిలో రెండు సార్టు పిచికారి చేయాలి. జీవ శిలీంద్ర నాశనిలను అందిస్తే.. బెండ మొక్కలు అత్యధిక వ్యాధి నిరోధక శక్తితో పెరుగుతాయని ఉద్యానవన అధికారిణి జ్యోతి వెల్లడించారు.ఎండాకాలంలో బెండ మొక్కలు మొలకెత్తిన 15 నుంచి 20 రోజుల్లో పోషకాహార లోపాలు వస్తుంటాయి. రసం పీల్చే పురుగు బెడద కూడా ఎక్కువ ఉంటుంది. పురుగుల రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు పాలిపోతాయి. ఈ రెండు బెడదలను అధిగమిస్తే.. ఎండాకాలంలో బెండ సాగుకు తీరుగే ఉండదని జ్యోతి చెప్పారు. ఈ రెండు సమస్యలు రాకుండా చేయాలంటే.. ట్రైకో డెర్మా, సుడోమోనాస్ అనే జీవ శిలీంద్ర నాశనిలను వినియోగించాలన్నారు. ఎకరం బెండ సాగుకు ఒక లీటర్ సుడోమోనాస్, అరకిలో బెల్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి, ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారి చేసుకోవాలన్నారు. సుడో మొనాస్, బెల్లం పిచికారి చేయడం ద్వారా రెండు రకాల ఉపయోగాలుంటాయి. వేరు వ్యవస్థలో కానీ కాండంలో కానీ, ఇంటా మొక్కల లోపల ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా వాటిని క్లియర్ చేస్తాయి. తద్వారా మొక్కలు మరింగా బాగా పెరుగుతాయన్నారు. బెండ మొక్కలకు మనం ఇచ్చే న్యూట్రిషియన్లు ఎండ వేడికి తొందరగా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. మొక్కలు అవి అందే లోపే గాలిలో కలిసిపోవడం, నీటి ద్వారా వెళ్లిపోయి త్వరగా ఇగిరిపోయే ఛాన్స్ ఉందని జ్యోతి వెల్లడించారు. అందువల్ల మైక్రో న్యూట్రియంట్స్ 19:19:19 లీటర్ నీటికి రెండు గ్రాములు, సూక్ష్మ పోషకాలు ఒక గ్రాము చొప్పున కలిపి ప్రతి 15 రోజులకోసాని పిచికారి చేసుకోవాలన్నారు. దీని వల్ల మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుంది. మొక్క బలంగా తయారవుతుంది. తద్వారా రసం పీల్చే పురుగు బెడద తప్పుతుంది. పోషక పదార్థాల లోపం కూడా కనిపించదు.
లేత బెండ ఆకుల మీద ప్రధానంగా వైరస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతి హెచ్చరించారు. అలా వైరస్ సోకిన మొక్కని పొలం నుంచి తీసేయాలి. అలా తీసేస్తూ ఉంటే మొక్కల సంఖ్య తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గుతుంది. దీని నివారణకు సుడోమోనాస్, మైక్రో న్యట్రియంట్, 19:19:19 అప్పడప్పుడూ వేసుకుంటే ఫలితం ఉంటుందన్నారు. లేత ఆకుల మీదనే ఎక్కువగా రసం పీల్చే పురుగు వస్తుంటుంది. ఆ లేత ఆకుల్సి సుడోమోనాస్, మైక్రో న్యూట్రియంట్లు, 19:19:19 లతో బలోపేతం చేస్తే.. రసం పీల్చే పురుగులు రాకుండా నివారన అవుతాయన్నారు.
బెండ మొక్కల నుంచి పంట కోత 45 రోజుల నుంచి మొదలవుతుంది. ఆ 45 రోజుల లోపల మొక్కను ఎంత బలంగా పెంచుతారో.. అంత అధికంగా పంట దిగుబడి వస్తుందని జ్యోతి వివరించారు. ఎప్పుడైనా మధ్య మధ్యలో కలుపు వస్తే తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. ఎండాకాలంలో బెండ సాగుతో అత్యధికాదాయం, అధిక లాభాలు పొందవచ్చన్నారు.
బెండ పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. దిగుబడి బాగా పెరుగుతుంది. ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు బెండ దిగుబడి సాధించవచ్చు. బెండ సాగులో 100 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులు కూడా కొందరు ఉన్నారు. మిగతా కాయగూరల ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే.. బెండకాయల ధరలు మాత్రం చాలా వరకు స్థిరంగా ఉంటాయి. ఎండా కాలంలో కిలో బెండకాయలకు కనీసం 30 నుంచి 40 రూపాయల ధర రైతుకు పలికే అవకాశం ఉంటుంది. అన్ని కోతలకు ఇంత ధర ఉండకపోయినా.. రెండు మూడు కోతలు కలిసి వచ్చినా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పురుగుతుంది. నీటి వసతి ఉన్న పొలాల రైతులకు వేసవిలో బెండ సాగు ఎంతో ప్రయోజనకరం, లాభదాయకం.