పులుపు, వగరు రుచుల కలబోత వాక్కాయ. పులుపు ఎక్కువగా ఉండే వాక్కాయలో విటమిన్ సి అధికం. వాక్కాయలు ఆహారంలో తీసుకునే వారి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వాక్కాయ రసం తాగితే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం వస్తుంది. వాక్కాయ వాడితే దంత సమస్యలు నివారణ అవుతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి. శరీర బరువును తగ్గిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లను కరిగించే గుణం వాక్కాయలో ఉంది. వాక్కాయలో అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఉబ్బసానికి చికిత్స నుండి చర్మవ్యాధుల వరకు వాక్కాయతో అనేక ప్రయోజనాలున్నాయి. వాక్కాయ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాక్కాయ రసం తాగితే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండె సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. మెదడును వాక్కాయ సరం ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.సుగర్ వ్యాధిని నివారించే అనేక ఔషధ గుణాలు వాక్కాయలో ఉన్నాయని జర్మనీలోని డ్యుసెల్ డోర్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అనా రోడ్రిగ్స్ కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వాక్కాయ పంట అధికంగా లభిస్తుంది. కూరలలో పులుపు కోసం, పచ్చళ్లు పెట్టుకోవడానికి వాక్కాయలు వినియోగిస్తారు. నిజానికి అడవులలో వాక్కాయ మొక్కలు సహజసిద్దంగా పెరుగుతాయి. వాక్కాయలు వర్షాకాలంలో మాత్రమే కాస్తాయి. స్వీట్ పాన్‌కి టూత్ పిక్‌తో ఓ ఎర్రని పండును గుచ్చుతారు. దాన్ని మనం చెర్రీపండు అనుకుంటాం కానీ అవి వాక్కాయ అని అందరికీ తెలియకపోవచ్చు? వాక్కాయలను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేస్తారు. కేకుటు, సలాడ్ల అలంకరణలో వాక్కాలను వినియోగిస్తారు.వాక్కాయ మొక్కలను ఔత్సాహిక రైతులు ముందు ముందుగా వాణిజ్యపరంగా పెంచవద్దని ఈ పంటలో 24 ఏళ్ల అనుభవం ఉన్న ప్రకాశంజిల్లా మార్టూరు సమీపంలోని కొరిశపాడు రైతు కోటిరెడ్డి సూచించారు. వీటిని ముందుగా మనం వ్యవసాయ క్షేత్రం చుట్టూ బయో ఫెన్సింగ్‌లా వేసుకోమంటారాయన. వాక్కాయ మొక్కలకు ఉండే పెద్ద పెద్ద ముళ్లు క్షేత్రంలోని పశువులు, కోతులు లాంటి వాటిని రానివ్వకుండా నివారిస్తాయన్నారు. ఎకరం పొలానికి సిమెంట్ పోల్స్, ఐరన్ తీగలతో ఫెన్సింగ్ ్వేసుకుంటే సుమారు లక్ష రూపాయలు ఖర్చవుతుంది. అదే వాక్కాయ మొక్కల్ని ఫెన్సింగ్‌లా నాటుకుంటే కేవలం 15 లక్షల లోపే ఖర్చవుతుందన్నారు. పైగా సిమెంట్, ఐరన్ తీగలతో వేసిన ఫెన్సింగ్ కొన్నేళ్ల తర్వాత చెడిపోతుంది. వాటి నుంచి రైతుకు ప్రతిఫలం లభించదు. అదే వాక్కాయ మొక్కలైతే జీవితకాలం సహజసిద్ధ ఫెన్సింగ్‌లా ఉంటాయని, చెట్లు బతికి ఉన్నంతకాలం కాయలు కాస్తూనే ఉంటాయి, మనకు ఆదాయం ఇస్తాయని కోటిరెడ్డి తెలిపారు. తన వద్ద స్థానిక వ్యాపారులు వాక్కాయలను కిలో 30 రూపాయలకు కొంటారన్నారు. వ్యాపారులు కిలో 200 రూపాయల వరకు అమ్ముతుంటారన్నారు.వాక్కాయ మొక్క నాటిన మూడేళ్ల నుంచి పంట కోతకు వస్తుంది. మెట్ట భూములు, ఇసుక నేతలు ఎక్కడైనా వాక్కాయ మొక్కలు పెరుగుతాయి. నీటి అవసరం అంతగా ఉండదు. క్రిమి కీటకాలు, బ్యాక్టీరియాలు, ఇతర రోగాలు పెద్దగా ఆశించవు. వర్షాకాలంలో వాక్కాయ మొక్కలకు నీరు సరఫరా చేయాల్సి అవసరం ఉండదు. ఎండాకాలంలో మాత్రం నేల పదును చూసుకుని నీరు అందిస్తే సరిపోతుంది.వాక్కాయలలో పింక్ అండ్ వైట్ రకం, గ్రీన్ అండ్ మెరూన్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. పింక్ అండ్ వైట్ వాక్కాయలను చెర్రీ ఫ్రూట్‌గా తయారు చేసేందుకు పరిశ్రమ యూనిట్లు కొనుగోలు చేస్తోంది. ఈ వాక్కాయలను ఎక్కువగా కోల్‌కతాకు చెందిన అనామిక సంస్థ కొనుగోలు చేస్తుంది. ఈ రకం వాక్కాయలో పులుపు కాస్త తక్కువ ఉంటుంది. చెర్రీ ఫ్రూట్‌గా తయారు చేసేందుకు వేసే రంగులను ఇది సులభంగా తీసుకుంటుంది. దీనికి మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. అదే గ్రీన్ అండ్ మెరూన్ రకం వాక్కాయలో విపరీతమైన పులుపు ఉంటుంది. కూరలు, పచ్చళ్లకు బాగా వినియోగిస్తారు. ఈ రెండు రకాల వాక్కాయలు ఒకే రకానికి చెందినవే. పంట దిగుబడిలో గ్రీన్ అండ్ మెరూన్‌రకం ఎక్కువ వస్తుందని కోటిరెడ్డి వివరించారు. పింక్ అండ్ వైట్ రకం మొక్క గుబురుగా పెరుగుతుంది. గ్రీన్ అండ్ మెరూన్ రకం మొక్క ఎత్తుగా పెరుగుతుంది. దీని కొమ్మలు చాలా పొడవుగా వస్తాయి. పింక్ అండ్ వైట్ రకం కన్నా గ్రీన్ అండ్ మెరూన్ వాక్కాయ ఎక్కువ దృఢంగా ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కూరగా, పచ్చడిగా లేదా చింతపండుకు బదులుగా ఈ రకం బాగా ఉపయోగపడుతుంది. కానీ చెర్రీ ఫ్రూట్ తయారీకి ఈ రకం పనికిరాదన్నారు.ఎకరం నేలలో 300 వాక్కాయ మొక్కలు నాటుకోవచ్చు. నర్సరీ నుంచి ఏడాదిన్నర వయసున్న మొక్కను కొనాలంటే 20 రూపాయలు ఉంటుంది. రెండు అడుగుల దూరంలో వాక్కాయ మొక్కలను అడుగు లోతు గుంత తీసి నాటుకుంటే సరిపోతుంది. అందుకు రూ.6 వేలు ఖర్చవుతుంది. వాక్కాయలను కోసేందుకు కూలీలు అవసరం అవుతారు. వాక్కాయ పంట వల్ల రైతుకు ఇబ్బంది ఉండదు. వ్యాపార పరంగా కష్టం రాదు. ఎక్కువ పెట్టుబడి లేదు. ఎక్కువ నీరు అవసరం రాదు. ఎక్కువ పురుగుమందు కొట్టే పనిలేదు. ఎరువుల అవసరం కూడా అంతగా ఉండదు. ఇతర హార్టీకల్చర్ పంటలతో వాక్కాయను పోల్చుకుంటే బెస్ట్ అంటారు రైతు కోటిరెడ్డి. పొలం చుట్టూ రక్షణ ఫెన్సింగ్‌లా వేసుకునే వాక్కాయ మొక్కలను ఒక్క ఏడాది పాటు కాపాడితే జీవితకాలం మన పంటలకు అది రక్షణగా ఉంటుందన్నారు. వ్యవసాయంలోకి కొత్తగా వచ్చే ఉత్సాహవంతులైన యువతీ యువకులు వాక్కాయ సాగును ఎలాంటి భయం లేకుండా చేసుకోవచ్చని కోటిరెడ్డి సలహా ఇచ్చారు. అయితే.. వాక్కాయ నుంచి కొత్తగా ఏదైనా మంచి బై ప్రోడక్ట్ తయారు చేస్తే.. మరింత లాభదాయకంగా ఉంటుందన్నారాయన. వాక్కాయ నుంచి జామ్ తయారు చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం వాక్కాయల ప్రాసెసింగ్ యూనిట్ ఆంధ్రరాష్ట్రంలో విజయవాడలో ఒక్కటే ఉందని అన్నారు.
ఇతర సమాచారం కోసం రైతు కోటిరెడ్డిని 9866359683లో సంప్రదించవచ్చు.