పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా. తరతరాలుగా ప్రకృతిలోని వేలాది వడ్ల రకాలను మన పూర్వికులు కనుగొని వాటిని సాగు చేయడం వల్ల అవి మనకు అందుతూ వచ్చాయి. కానీ ఆధునిక వ్యవసాయం అమలులోకి వచ్చాక అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను మాత్రమే సాగు చేయడం మొదలైంది. కార్పొరేట్ విత్తన కంపెనీలు సిఫారసు చేసే వంగడాలను మాత్రమే సాగు చేస్తూ రావడం వల్ల వేలాది పాత వడ్ల రకాలు అంతరించిపోయాయి. దీనిపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ దేబల్ దేబ్ లోతుగా పరిశోధనలు చేశారు.
మన పూర్వికులు సాగు చేసిన వడ్ల రకాలు సుమారు 1,10,000 దాకా ఉంటాయనీ, వాటిల్లో కేవలం ఆరు వేల రకాలు మాత్రమే మనకు ఇవాళ మిగిలాయనీ ఆయన గుర్తించారు. అంటే లక్షకు పైగా పాత వరి వంగడాలు కాలగతిలో మన అశ్రద్ధ వల్ల, అవగాహన లేమి వల్ల అదృశ్యమైపోయాయన్న మాట. జరిగిన అనర్థాన్ని గుర్తించి ఆవేదనకు లోనైన దేబల్ దేబ్ కనీసం ఉన్నవాటినైనా బ్రతికించుకోవాలని హెచ్చరిక చేస్తున్నారు. తన వంతు ప్రయత్నంగా ఒడిశాలోని రాయగడ వద్ద ఆయన సంప్రదాయ వరి వంగడాల విత్తనభాండాగారాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రైతుల సహాయంతో వందలాది వరిధాన్యం రకాలను ఆయన భద్రపరిచారు. విత్తన పరంపర సజీవంగా ఉండాలంటే దాన్ని సాగు చేయడమొక్కటే మార్గం. అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు దేబల్ దేబ్. వరిధాన్యపు విత్తనాల రకాలను సేకరించడం కోసం దేబల్ దేబ్ దాదాపు దేశమంతటా పర్యటించారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేబల్ దేబ్ కోల్‌కతా యూనివర్సిటీ నుండి PhD చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ నుంచి ఆయన పోస్ట్ డాక్టరల్ డిగ్రీలు పొందారు. సంప్రదాయ వరి వంగడాలను కాపాడే బృహత్కార్యంలో భాగంగా వ్రీహి, బసుధ పేర్లతో ఆయన వరి విత్తన భాండాగారాలను (సీడ్ బ్యాంకులు) ఏర్పాటు చేశారు.

దేశీ వరి వంగడాల విశిష్టతను వివరిస్తున్న డాక్టర్ దేబల్ దేబ్

హరిత విప్లవం సృష్టించిన మహా విధ్వంసం

“1970 సంవత్సరం నాటికి భారతదేశంలో సుమారు 1,10,000 రకాలైన వరి వంగడాలు ఉండేవి. కానీ హరిత విప్లవం ప్రారంభమయ్యాక హైబ్రిడ్ వంగడాలకు ప్రాధాన్యం హెచ్చింది. దీంతో వైవిధ్యం అంతరించిపోయి కేవలం 6000 వరి విత్తనాలే మనకు మిగిలాయి. గ్రీన్ రివల్యూషన్ సృష్టించిన మహావిధ్వంసం ఇది” అని చెబుతారు దేబల్ దేబ్.
భారతదేశంలో 14,000 సంవత్సరాల కిందట వరిని కనుగొన్నారనీ, ఆ తర్వాత రైతులు తమ సాగు ప్రయోగాల ద్వారా అనేక వంగడాలను సృష్టించారనీ దేబల్ దేబ్ వివరిస్తారు. అలా 10 వేల సంవత్సరాల కాలవ్యవధిలో లక్షకు పైగా వరిధాన్యం రకాలు పుట్టుకురాగా, వాటిల్లో ఇవాళ మనకు మిగిలినవి ఆరు వేలేనన్నది దేబల్ దేబ్ మాటల సారాంశం.
మన దేశంలో వందల కోట్ల రూపాయలను వ్యవసాయ పరిశోధనలపై వెచ్చిస్తున్నా సంప్రదాయ వరి వంగడాల వైవిధ్యాన్ని కాపాడుకోవడంపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టిందే లేదు. అందుకే దేబల్ దేబ్ ఆ పనికి పూనుకున్నారు. దేబల్ దేబ్ వ్యవసాయక్షేత్రంలో ఇప్పుడు పలు సంప్రదాయ వరి ధాన్యపు రకాలున్నాయి. వాటిలో ‘జుగల్’ అన్నది ఒకరకం. దీన్ని ఐదు శతాబ్దాల కిందట బెంగాల్ రైతులు కనుగొన్నారు. ఇది డబుల్ గ్రెయిన్ రైస్. అలాగే త్రీ గ్రెయిన్ రైస్ వెరైటీ పేరు ‘సతీర్’. ఇదిప్పుడు అంతరించిపోయింది. కానీ దేబల్ దేబ్ వ్యవసాయక్షేత్రంలో మాత్రమే ఈ రకం వరి వంగడం భద్రపరచబడి ఉండడం విశేషం.

సంప్రదాయ వరి వంగడాల వ్యవసాయక్షేత్రంలో డా. దేబల్ దేబ్

వైద్య విలువలు కలిగిన దేశీ వరి వంగడాలు

హరిత విప్లవం వచ్చాక సంప్రదాయ వరి వంగడాలను తూష్ణీభావంతో చూశారు. అవి పెద్దగా దిగుబడినివ్వవని భావించారు. వాటిని సాగుచేయడం అనాగరికమని కూడా ప్రచారం చేశారు. కానీ సంప్రదాయ వరిధాన్యపు రకాల్లో ఐరన్, విటమిన్ బి లతో పాటు పుష్కలంగా ప్రొటీన్ ఉంటుందంటారు దేబల్ దేబ్.
తన విత్తన పరిశోధనలో భాగంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రల్లో పర్యటించినప్పుడు పలువులు రైతులు సంప్రదాయ వరి వంగడాలను కాపాడుకునేందుకు ముందుకురావడం దేబల్ దేబ్‌‍ను ఉత్సాహపరిచింది. రసాయన ఎరువుల వ్యవసాయం తాలూకు దుష్పరిణామాలను రైతులు గుర్తిస్తున్నారని ఆయనకు అర్థమైంది. అందుకే సంప్రదాయ వరిధాన్యపు రకాలను ఆసక్తికలిగిన రైతులకు అందించి, వారిచేతే సాగు చేయించి వాటిని సజీవంగా ఉంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాల వల్ల ఈ పని జరగే అవకాశాలు లేవు. అందుకే ఆయన రైతులపైనే ఆధారపడుతున్నారు.
“మూస రకం వరి వంగడాల వల్ల నానాటికీ వ్యవసాయ ఆదాయం తగ్గిపోతోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే వరి సాగులో వైవిధ్యం రావాలి. భిన్నరకాలైన వరి ధాన్యం రకాలను రైతులు సాగుచేయాలి. అప్పుడు ఒక రకం వరికి మార్కెట్ లేకపోతే మరో రకం వరిని పండించుకునే వెసులుబాటు ఉంటుంది” అని దేబల్ దేబ్ చెబుతారు.

Seed Warrior Dr Debal Deb

సంప్రదాయ వంగడాల సాగుకు ‘బసుధ’

డాక్టర్ దేబల్ దేబ్ మొదట పశ్చిమ బెంగాల్‌ బకుర జిల్లాలోని పాంచాల్ వద్ద అటవీ ప్రాంతంలో ‘బసుధ’ (వసుధ అంటే భూమి అని అర్థం. బెంగాల్‌ ఉచ్చారణలో వకారం బకారంగా మారుతుంది ) సంస్థను ఏర్పాటు చేశారు. దేశీ వరి వంగడాలను భద్రపరచి సజీవంగా ఉంచడం ‘బసుధ’ లక్ష్యం. 1997లో కేవలం 1.5 ఎకరాల విస్తీర్ణంలో సాదా సీదాగా ఆయన ‘బసుధ’ వ్యవసాయ క్షేత్రాన్ని నెలకొల్పారు. ఇక్కడ సుమారు 500 దేశీ వరివంగడాలను సాగు చేయడం మొదలుపెట్టారు. ఈ సాగు అంతా సేంద్రియ సంప్రదాయ పద్ధతుల్లో సాగుతుంది. స్థానిక రైతులు, వలంటీర్ల సహాయంతో ఆయన ఈ వ్యవసాయక్షేత్రాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఏటా ప్రపంచం నలుమూలల నుండి పలువురు సైంటిస్టులు, వ్యవసాయ నిపుణులు, ఔత్సాహిక రైతులు, వ్యవసాయ శాస్త్ర విద్యార్థులు, పరిశోధకులు ఈ వ్యవసాయక్షేత్రాన్ని సందర్శిస్తూ వచ్చారు. Worldwide Opportunities on Organic Farms (WWOOF) పేరుతో ఏర్పాటైన ఆర్గానిక్ వ్యవసాయ సమర్థకుల వేదిక ఒకటి ‘బసుధ’కు సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ వేదికలో 99 దేశాలకు చెందినవారు ఉండడం విశేషం.
1997లో డాక్టర్ దేబ్ సంప్రదాయ వడ్ల రకాలను సంరక్షించడం కోసం “వ్రీహి” (వ్రీహి అంటే సంస్కృతంలో వడ్లు లేదా ధాన్యం అని అర్థం) అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల పక్షాన దేశంలో ఏర్పాటైన తొలి సీడ్ బ్యాంక్ ఇదే. పశ్చిమ బెంగాల్‌లోని 18 జిల్లాల రైతులను కలుపుకుని డాక్టర్ దేబ్ “వ్రీహి” సంస్థ ద్వారా 600 సంప్రదాయ వరి వంగడాల భాండాగారాన్ని నిర్వహించారు. రైతులకు సంప్రదాయ వరి రకాల విత్తనాలను అందించడం, వారి చేత సాగు చేయించడం “వ్రీహి” ధ్యేయం.

Vrihi Seed Bank

విత్తనాలు అందించే ‘వ్రీహి’

రైతులకు డాక్టర్ దేబ్ ఉచితంగానే విత్తనాలు ఇస్తారు. అయితే అందుకు బదులుగా రైతులు ఒక కిలో ఏదో ఒక కొత్త రకం వరి విత్తనాలను ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చేందుకు విత్తనాలేవీ లేకపోతే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి “వ్రీహి” నుండి తమకు కావలసిన విత్తనాలు తీసుకుపోవచ్చు. ఆర్గానిక్ పద్ధతుల్లో పండించాక రెండు కిలోల విత్తనాలు తెచ్చి తిరిగి “వ్రీహి” సంస్థకు అందించాలి. అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇచ్చేస్తారు. ఇదీ పద్ధతి. ఈ విధానం ద్వారా డాక్టర్ దేబ్ 600 రకాలకు పైగా దేశీ వరి వంగడాలకు తిరిగి ప్రాణం పోశారు.
రెండేళ్లు వరుసగా సాగు చేయకపోతే ఆ రకం వంగడం అంతరించి పోతుంది. అలా వేలాది వరి వంగడాలు దేశవ్యవసాయ యవనిక నుండి అదృశ్యమైపోయాయి. అందుకే తమ వద్ద ఉన్న వంగడాలను ఏటా పొలాల్లో సాగు చేయించాలని డాక్టర్ దేబ్ నిర్ణయించారు. మొత్తం ఆయన వద్ద ఇప్పుడు 1,410 దేశీ వరి రకాల విత్తనాలు భద్రపరచబడి ఉన్నాయి. వీటిల్లో వర్షాభావాన్ని, తెగుళ్లను, అతివృష్టినీ, వరదలను తట్టుకునే పలురకాల వరివంగడాలు ఉండడం విశేషం. ఆయన సంపాదించిన పలు వంగడాలకు ఆరోగ్యదాయకమైన వైద్యవిలువలూ ఉన్నాయి. ఇవన్నీ బారతీయ వ్యవసాయ వారతస్వ సంపదలో భాగం. మన తాతతండ్రులకు సంబంధించిన విలువైన ఆస్తి.
పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దాల పాటు పరిశోధనలు నిర్వహించిన డాక్టర్ దేబ్ ఇటీవల ఒడిశాలోని Niyamgiri hills లోయకు తరలి వెళ్లారు. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడంతో 1,340 రకాలైన దేశీ వరి వంగడాలను ఆయన సాగు చేస్తున్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన సుమారు 7000 మంది రైతులకు ఆయన వరి విత్తనాలను అందించారు. వీటిలో 70 నుండి 180 రోజుల్లో పంట చేతికి వచ్చే వంగడాలున్నాయి.
సంప్రదాయ వరి వంగడాలను మళ్లీ సాగుచేయడం మొదలుపెడితే దేశ ఆహారభద్రత ప్రమాదంలో పడుతుందంటూ కొందరు చేసే వాదనలో పస లేదంటారు దేబల్ దేబ్. హరిత విప్లవంలో భాగంగా సాగు చేస్తూ వచ్చిన హైబ్రీడ్ వంగడాలేవీ అనావృష్టిని తట్టుకోలేవని ఆయన చెబుతారు. నీరు లేకుండా, వర్షాధారంగా పండే వరివంగడాలేవీ ఆధునిక వ్యవసాయ వంగడాల్లో లేవంటారు. దేశంలోని వర్షాధార ప్రాంతాల్లో పండే పంటలు దేశీ వంగడాలేనని ఆయన గుర్తు చేస్తారు. అంటే ప్రధానంగా మనకు సమకూరుతున్న ఆహారధాన్యాలు హైబ్రిడి వంగడాల ద్వారా కాదన్న సంగతి గ్రహించాలని ఆయన చెబుతారు. దేశీ వంగడాలు సగటున ఎకరాకు 24 క్వింటాళ్లదాకా దిగుబడి ఇస్తుండగా, హైబ్రిడ్ వంగడాలు 15 క్వింటాళ్లు మాత్రమే ఇస్తున్నాయని ఆయన వాదిస్తారు. నిజానికి హరిత విప్లవానికి ముందు రోజుల్లోనే ఎక్కువ దిగుబడినిచ్చే వరి వంగడాల సాగు జరిగిందని ఆయన గణాంకాల ఆధారంగా వివరిస్తారు. పైగా హైబ్రిడ్ వరి వంగడాల సాగు కోసం దేశంలో 27 మిలియన్ల బోరు బావులను తవ్వారనీ, దాని వల్ల ఇప్పుడు భూగర్భజలాలు అడుగంటి పోయాయనీ డాక్టర్ దేబల్ దేబ్ జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కడతారు.

దేశీ వరి వంగడాల సాగుపై డాక్టర్ దేబల్ దేబ్ శిక్షణ

సీడ్ కంపెనీల బెడద

రైతులు మనదేశంలో హైబ్రిడ్ వెరైటీలను సాగు చేస్తుంటే, కార్పొరేట్ సీడ్ కంపెనీలు మాత్రం చాపకింద నీరులా దేశీవిత్తనాల అన్వేషణ సాగిస్తున్నాయి. వాటికి జన్యు మార్పిడి చేసి మార్కెట్ చేసుకోవాలని ఆబగా చూస్తున్నాయి. అలాంటి బడా సీడ్ కంపెనీల కబంధ హస్తాల నుండి మన వరి వంగడాలను కాపాడుకోవడం తేలికేమీ కాదు. అది దేశీయ ఆహార సార్వభౌమత్వం కోసం సాగుతున్న ఒక యుద్ధం. డాక్టర్ దేబ్ ఆ యుద్ధంలో హోరాహోరీగా పోరాడుతున్నారు. అంతరిస్తున్న వంగడాలకు తిరిగి జీవం పోయాలని తపన పడుతున్నారు. పాతిక సంవత్సరాలుగా ఆయన ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా 70 వరకు పరిశోధన గ్రంథాలు వెలువరించారు. దేశీ వంగడాలను సంరక్షించే పనిలో ఉన్న ప్రముఖ ఆహార సార్వభౌమత్వ ఉద్యమ కార్యకర్త వందనా శివ కూడా ఆయనకు తోడుగా నిలిచారు. వందనా శివ స్వదేశీ విత్తనాల సంరక్షణ కోసం ‘నవధాన్య’ సంస్థను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా నేషనల్ బయో డైవర్సిటీ రిజిస్టర్‌లో భారతీయ వరి వంగడాల వివరాలను నమోదు చేయించాలన్నది డాక్టర్ దేబ్ ఆలోచన. ప్రభుత్వం చేత రిజిస్టర్ అయితే దేశీ వరి వంగడాలను సీడ్ కంపెనీలు తస్కరించే అవకాశం ఉండదన్నది ఆయన అభిప్రాయం. ఇలా స్వదేశీ విత్తనాలను కాపాడేందుకు రాజీలేని సమరం సాగిస్తున్న యోద్ధ డాక్టర్ దేబల్ దేబ్. ఈ సీడ్ వారియర్‌కు అండగా నిలవడం సంప్రదాయ వ్యవసాయాన్ని కోరుకునేవారందరి విధి. అది భారతదేశంలో సుస్థిర వ్యవసాయం జరగాలని ఆకాంక్షించేవారందరి కర్తవ్యం.
ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
1. Dr Debal Deb
cintdis@hotmail.com (+91) 94326 74377, 098538 61558
2. Basudha Trust Coordinator
basudha2010@hotmail.com, (+91) 91639 28528
3. Laboratory , basudha2010@hotmail.com, (+91-33) 4065 5396, 096350 16675

‘బసుధ’ గురించి డాక్టర్ దేబల్ దేబ్ పరిచయం

హైదరాబాద్ పర్యటన సమయంలో డాక్టర్ దేబల్ దేబ్ ప్రసంగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here