మల్టీ లేయర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌తో అధిక ఆదాయం.. అత్యధిక ఆరోగ్యం.. ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్నాడో యువ రైతు.. ఈ విధానంలో ఆ యువరైతు సంవత్సరం పొడవునా వివిధ రకాల కాయగూరలు పండిస్తున్నాడు. విరివిగా లాభాలు కూడా ఆర్జిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ జిల్లాలో సాగర్‌ పట్టణానికి చెందిన ఆకాశ్‌ చౌరాసియా ఒక హెక్టార్‌ (2.5 ఎకరాలు) భూమిలో మల్టీ లేయర్ పంటలు పండిస్తున్నాడు. సహజసిద్ధ పంటలు పండిస్తున్న ఆకాశ్‌ చౌరాసియా మిలియనీర్‌ అయ్యాడు. తన కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలోనే ఆకాశ్‌ మల్టీ లేయర్‌ క్రాపింగ్ విధానం అవలంబిస్తున్నాడు. తన క్షేత్రంలో ఆకాశ్‌ పలు రకాల పంటలతో పాటుగా వర్మీ కంపోస్ట్‌ ఎరువు, బయో పెస్టిసైడ్స్‌ తయారు చేస్తున్నాడు. పంటలతో పాటు పాల ఉత్పత్తి కూడా పెద్దమొత్తంలో చేయగలుగుతున్నాడు. ఈ అన్ని ఉత్పత్తుల ద్వారా మన యువరైతు ఆకాశ్‌ ఏడాదికి కనీసం 15 లక్షల రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తున్నాడు.వాస్తవానికి బుందేల్‌ఖండం తక్కువ వర్షపాతం వల్ల అనావృష్టి ప్రాంతంగా మారిపోయింది. ఇలాంటి అనావృష్టి ప్రాంతంలో కూడా ఆకాశ్‌ తన వినూత్న వ్యవసాయ విధానంతో విజయవంతమైన రైతుగా పేరు ప్రసిద్ధి పొందాడు. ఈ 29 ఏళ్ల ఆకాశ్‌ చౌరాసియా కుటుంబం సాగర్ పట్టణ శివారు ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంపై పూర్తి నమ్మకం ఉన్న ఆకాశ్‌ తన క్షేత్రంలో మల్టీలేయర్‌ పద్ధతిలో పంటలు పండిస్తున్నాడు. వినూత్న, ఖర్చు ఇబ్బంది లేని విధానాల కారణంగా అతి తక్కువ ఖర్చుతోనే ఆకాశ్‌ తన వ్యవసాయోత్పత్తులు సాధించగలుగుతున్నాడు.మల్లీ లేయర్ క్రాపింగ్‌ విధానంలో కూరగాయలు, పండ్ల పంటల్ని ఆకాశ్‌ సాగుచేస్తున్నాడు. కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు కలిసి ఒకేసారి ఎదుగుతాయి. ఒకే క్షేత్రంలో ఆ మొక్కలు వివిధ ఎత్తుల్లో ఎదుగుతాయి. అయితే.. మల్టీ లేయర్ వ్యవసాయ విధానం బహిరంగంగా చేయకూడదు.. ఎందుకంటే ఈ విధానంలో చేసే వ్యవసాయానికి నీడ అవసరం. మొక్కలకు నీడ కోసం ఆకాశ్‌ పెద్దగా డబ్బు ఖర్చు లేకుండా స్థానికంగా లభించే వెదురుగెడలు, గడ్డితోనే షెడ్లు ఏర్పాటు చేశాడు. వెదురుగడలతో నిర్మించిన షెడ్డు మొక్కలకు నీడ ఇవ్వడమే కాకుండా తీగజాతి మొక్కలకు ఆసరాగా ఉంటుంది. తమ క్షేత్రంలో ఆకాశ్‌ వేసే అల్లం భూమి లోపల పండుతుంది. ఆకు కూరలో భూమికి కొంచెం ఎత్తులోనే ఉంటాయి. గోరింటాకు మొక్కలు వెదురుగెడల స్థాయికి ఎదుగుతాయి. ఇక బొప్పాయి మొక్కలను షెడ్డు కింది క్షేత్రంలో తగినంత దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది.ఈ విధానంలో ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో ప్రారంభించుకోవాలి. విత్తనాలు నాటిన రెండు మూడు వారాల్లోనే ఆకు కూరల పంట రావడం మొదలై మే- జూన్ నెలల వరకు చేతికి వస్తూనే ఉంటుంది. గోరింటాకు పంట ఏప్రిల్‌ నెలలో ప్రారంభమై అక్టోబర్‌- నవంబర్ నెలల వరకు వస్తూనే ఉంటుంది. ఇక అల్లం పంట ఆగస్టులు కోతకు వస్తుంది. బొప్పాయి పంట నవంబర్‌ నెలలో చేతికి వస్తుంది. మల్టీ లేయర్ విధానంలో వ్యవసాయం చేస్తే ఆదాయం ఏడాది పొడవునా అందుతూనే ఉంటుంది.మల్టీ లేయర్ విధాన వ్యవసాయంలో ఆకాశ్‌ కేవలం స్వదేశీ విత్తనాలను మాత్రమే వాడుకుంటాడు. స్వదేశీ విత్తనాల వేయడం వల్ల ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవస్థ కూడా తప్పిపోతుంది. పైగా స్వదేశీ విత్తనాలైతే మన ప్రాంత వాతావరణ స్థితిగతులను తట్టుకుంటాయి. అలాగే.. క్రిమి కీటకాల బెడద కూడా తక్కువగా ఉంటుంది. కూరగాయల సాగులో స్వదేశీ విత్తనాల వాడకం అతి ముఖ్యమైన అంశం. మల్లీ లేయర్‌ ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలో చేసే సాగులో మొక్కలకు నీటి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకేసారి నాలుగు రకాల పంటలు వేసినా నీటి వినియోగ అవసరం తక్కువగా ఉండడం ఈ విధానంలో అందరం తెలుసుకోవాల్సిన అంశం.మన దేశంలో 80 శాతం రైతులు 5 ఎకరాల లోపు భూములే సొంతంగా కలిగి ఉన్నారు. ఆహార కొరత ఎదుర్కొంటున్న మన దేశంలో ఈ మల్టీ లేయర్‌ వ్యవసాయ విధానం ఎంతే మేలైనదిగా చూడొచ్చు. తద్వారా రైతులు మరిన్ని లాభాలు కూడా ఆర్జించడానికి చక్కని అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here