ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మొలకలు రెండు అంగుళాలు ఎదిగేసరికి పడిపోవడం చాలా మంది ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య. మొక్కలు రెండు అంగుళాలు పెరిగిన తర్వాత ఎదుగుదల ఆగిపోవడం రెండో సమస్య. ఈ రెండు సమస్యలకు పరిష్కారం మనం తీసుకునే పాటింగ్‌ మిక్స్‌ మీద ఆధారపడి ఉంటుంది. పాటింగ్ మిక్స్‌ మిశ్రమాన్ని బట్టి మొక్క ఎదుగుదల, పడిపోకుండా ఉండడం ఆధారపడి ఉంటాయి. పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకుంటే మొక్కలు బాగా ఎదుగుతాయో తెలుసుకుందాం.వర్మీ కంపోస్టు 30 శాతం, మరో 30 శాతం మట్టికి ఇంకో పదిశాతం కోకోపిట్‌ కలిపిన మిశ్రమం, ఇసుక 30 శాతం, కొద్దిగా వేపపిండి తీసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. వర్షాకాలంలో ఆకు కూరలకు తెగుళ్లు రాకుండా నివారించుకోవడానికి వేపపిండి కలుపుకోవాల్సి ఉంటుంది. మనం ఆకు కూరలు పెంచేందుకు వాడే టబ్‌ అడుగు భాగంలో ఎక్కువ రంధ్రాలు చేసుకోవాలి. ఎక్కువ రంధ్రాలు చేస్తే కొన్ని మూసుకుపోయినా మనం పోసే నీరు కిందికి వెళ్లడానికి వీలుంటుంది. టబ్‌ లో మనం ముందుగా తయారు చేసుకున్న మట్టి మిశ్రమం నింపాలి. మట్టి మిశ్రమంలో కోకోపిట్ శాతం ఎక్కువ వేస్తే నీళ్లు పోసినప్పుడు మట్టి గుల్లబారి మొక్కలు పక్కకు పడిపోతాయి. అందుకే 10 శాతం కోకోపిట్‌ కలుపుకుంటే సరిపోతుంది. ముందు చెప్పుకున్న మోతాదులో మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్‌, కోకోపిట్‌ మిశ్రమాన్ని వాడినప్పుడు మొక్కలు పక్కకు పడిపోకుండా నిటారుగా ఎదుగుతాయి.మట్టి మిశ్రమంలో విత్తనాలు నాటుకునే పద్ధతిలో ఎప్పటిలా కాకుండా చిన్న మార్పు చేసుకుంటే ఫలితం సక్సెస్ ఫుల్‌ గా ఉంటుంది. అదెలాగో చూద్దాం.. ముందుగా సిద్ధం చేసుకున్న టబ్‌ లోని మట్టిని నీటితో తడుపుకోవాలి. టబ్‌ లో మట్టిని సాళ్లుగా చేసుకోవాలి. ఆ సాళ్లలో పొలంలో వేసినట్లే విత్తనాలు వేసుకోవాలి. తోటకూర, మెంతి విత్తనాలు కొద్దిగా వత్తుగా వేసుకుంటే మేలు. విత్తనాలు వత్తుగా వేసుకుంటే ఆకుకూరలు కింద పడే అవకాశం అస్సలు ఉండదు. విత్తనాలు సాళ్లలో వేసిన తర్వాత పైన మట్టితో కప్పుకోవాలి.విత్తనాలు వేసుకునే మరో విధానం ఉంది. టబ్‌ లోని కొంత మట్టిని కొద్దిగా పక్కకు తీసుకుని, కింది మట్టిలో గింజలు చల్లుకోవాలి. తర్వాత టబ్‌ ను కొద్దిగా కదపాలి. టబ్‌ ను కదపడం వల్ల మట్టిలో ఉండే ఖాళీలు పూడిపోయి గింజలు మట్టి కిందికి వెళ్లిపోకుండా ఉంటాయి. గింజలపైన ముందుగా పక్కకు తీసుకున్న మట్టిని చల్లుకోవాలి. ఆపైన నీళ్లు పోసుకోవాలి. విత్తనాలు చల్లుకున్న తర్వాత టబ్‌ ను ఎండలో పెట్టుకోవచ్చు. వర్షం ఎక్కువగా పడుతున్నప్పుడు దాన్ని నీడలో పెట్టుకోవాలి. నీడలో పెట్టుకుంటే ఎక్కువ వర్షం పడినప్పుడు మొలకలు పక్కకు పడిపోకుండా ఉంటాయి. లేదంటే విత్తనాలు చల్లిన టబ్‌ ను మొదటి నుంచీ కూడా సెమీ షేడ్‌ కింద పెట్టుకుంటే మంచిది.గింజలు దగ్గరగా వేసుకుంటే మెంతికూర, తోటకూర అస్సలు కిందపడిపోకుండా ఏపుగా పైకి ఎదుగుతాయి. ఇదే పద్ధతిలో మరే ఇతర ఆకు కూరలు వేసుకున్నా ఫలితం నూటికి నూరుశాతం వస్తుంది. మధ్యలో కొంచెం ఎక్కువ ఎత్తు పెరిగిన ఆకుకూరల మొక్కల్ని మధ్య మధ్యలో మనం తీసుకుంటే మిగతావి కూడా ఏపుగా ఎదుగుతాయి.ఏ ఆకుకూరల విత్తనాలైనా సరే టబ్‌లో వేసే ముందు పాటింగ్ మిక్స్‌ ను తప్పకుండా నీటితో తడపాలి. మిగతా కూరగాయల విత్తనాలకు గింజలు వేసిన తర్వాత నీరు పోసినా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ, ఆకుకూరల గింజలు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి వాటిని మట్టిలో వేయక ముందే నీరు చల్లుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఆకుకూరలకు కొద్దిగా అయినా ఎండ తగిలినప్పుడే మొక్కల ఎదుగుదల వేగంగా ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు మొక్కల టబ్ ను ఎండలో పెట్టుకోవాలి. కొద్దిసేపు మాత్రమే ఎండ తగిలినా ఆకుకూరల మొక్కల ఎదుగుదలలో ఇబ్బందేమీ ఉండదు. బాగా వర్షం కురుస్తున్నప్పుడు విత్తనాలు వేసిన టబ్‌ ను ఆరుబయట ఉంచకూడదు. మొలకలు కాస్త పైకి వచ్చిన తర్వాత కొద్దిగా బయట పెట్టుకున్నా పైన చెప్పిన విధానంలో పెంచినప్పుడు ఇబ్బందేమీ ఉండదు.మనం చెప్పుకున్న విధానంలో ఆకుకూరలు పెంచుకునేవారు పాటింగ్ మిక్స్‌ ను ఎప్పుడూ పూర్తిగా ఆరిపోనివ్వకుండా జాగ్రత్త పడాలి. మట్టి పూర్తిగా ఎండిపోయిన తర్వాత నీరు పోస్తే మొక్క వాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విధానంలో ఆకుకూరలు పెంచుకునేవారు మట్టి ఎప్పుడు తేమగా ఉండేలా చూసుకోవాలి.

టబ్‌ ల్లో ఆకుకూరలు సరిగా పెరగడం లేదనేది పలువురు ఎదుర్కొంటున్న సమస్య. మొక్కలు బాగా ఎదగాలంటే ఏ మందు వాడాలని పలువురు అడుగుతున్న ప్రశ్న. దానికి జవాబు కూడా ముందుగా మనం సిద్ధం చేసుకున్న పాటింగ్ మిక్స్ లోనే ఉంది. ఈ విధానంలో పెంచుకునే ఆకుకూరలకు ప్రత్యేకంగా ఎరువు వేయక్కర్లేదు. అయితే.. పాలకూర ఆకులను మధ్య మధ్యలో కోసేస్తాం కనుక పాలకూర మొక్కలకు వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, కిచెన్ కంపోస్టు వేసుకోవచ్చు. అయితే.. ఆకులు పాలిపోయినట్లు, పండిపోయినట్లు పసుపు రంగులోకి మారుతుంటే మాత్రం.. ఎప్పుడైనా ఒకసారి పది గ్రాముల ఎప్సస్ సాల్ట్‌ ను లీటర్ నీటిలో కలిపి మొక్కల మొదట వేసుకున్నా, స్ప్రే చేసుకున్నా ఆ సమస్య తొలగిపోతుంది.గార్డెన్ లోని మిగతా మొక్కలకు క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటే ఆకుకూరలకు నీటిని కొద్దిపాటు ఫోర్స్‌ తో కొట్టొచ్చు. లేదా ఆకుకూరలు సున్నితంగా ఉంటాయి కాబట్టి చేత్తో కీటకాలను తీసేయవచ్చు. అప్పటికీ అవి కంట్రోల్‌ కాకపోతే.. అవసరాన్ని బట్టి పది రోజులకోసారి వేపనూనెను స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరల పెంపకంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. మంచి ఫలితాలు వస్తాయి. సహజసిద్ధమైన ఆర్గానిక్ విధానంలో పెంచుకునే ఆకుకూరలు కనుక ఇంటిల్లిపాదీ సంతోషంగా వినియోగించవచ్చు.

‘ది తెలుగు హౌస్‌ వైఫ్‌’ సునీతగారి సౌజన్యంతో..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here