శర్వానంద్ హీరోగా ఈ మధ్య ‘శ్రీకారం’ అనే సినిమా ఒకటి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఉమ్మడి వ్యసాయం చేసేందుకు కథానాయకుడు తన ఊరికి తిరిగి వెళ్లడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ సినిమా చూసినవారిలో చాలామందికి మన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఆలోచన మనసులో మెదిలే ఉంటుంది. మూవీ కథ మాటెలా ఉన్నా, నిజంగానే మీ కూరగాయలను మీరే సొంతంగా పండించుకోవచ్చు. అందుకు మీరు తప్పనిసరిగా ఎంతో కొంత భూమిని కలిగి ఉండవలసిన అవసరం కూడా లేదు. హోమ్‌క్రాప్ (Homecrop) అనే హైదరాబాద్ సంస్థ ఒకటి మీ ఇళ్ళు, బాల్కనీలు, డాబాలను మీకు నచ్చే రీతిలో పచ్చటి పొలాలుగా మార్చడానికి సహాయపడుతుంది.
2016లో స్థాపించిన హోమ్‌క్రాప్, అనేక మంది నగరవాసులు పట్టణ రైతులుగా మారడానికి ప్రేరణనిచ్చింది. కృష్ణారెడ్డి, మాన్వితా చెన్నూరు, షర్మిలా టెల్లీ, సాయి కృష్ణ అనే నలుగురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఆలోచనతో ఈ సంస్థ ప్రారంభమైంది. మార్కెట్లో లభించే కూరగాయల్లో రసాయన అవశేషాలు ఉంటున్నాయన్న భావన చాలా మందిలో ఉంది. అవి మన ఆరోగ్యానికి హానికరమౌతాయన్న ఆందోళనా ఉంది. ఈ నేపథ్యంలో సేంద్రియ విధానాలతో ఆరోగ్యకరమైన ఆహారం సమకూర్చుకునేందుకు ఒక చక్కని పరిష్కారం చూపుతుంది ఈ సంస్థ.
“ఇటీవలి కాలంలో ప్రజలు సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఏదేమైనా, బయట దొరికే సేంద్రియ కూరగాయలు కూడా ఎంత మేరకు విశ్వసనీయమైనవనేది సందేహాస్పదమే. ఈ సందేహాన్ని తొలగించడానికి, ‘మీరే మీ కూరగాయలను పండించుకోండి!’ అనే సూత్రంతో మేము ముందుకు వచ్చాము. ఈ పద్ధతిలో కూరగాయలు ఎలా పండుతాయో, అసలు మొక్కల ఎదుగుదల ఎలా జరుగుతుందో మీకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. మీరే మీ కూరగాయలను పండించుకున్నప్పుడు అవి ఆరోగ్యకరమన్న భరోసా కూడా మీకు కలుగుతుంది” అని హోమ్‌క్రాప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన మాన్విత అంటారు.
మన ఆరోగ్యం గురించి ఆలోచించడానికి మనకు కరోనా మహమ్మారి కాస్త తీరుబడినిచ్చింది. అలా సెలబ్రిటీలతో సహా చాలా మంది సొంతంగా కూరగాయలను పండించుకునేందుకు హోమ్‌క్రాప్ తలుపు తట్టారు. అక్కినేని నాగార్జున, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ హీరోలు ఈ మధ్యకాలంలో ఇంటిపంటలను ఎంచుకున్నారు. పాపులర్ హీరోయిన్ సమంత అయితే తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో హోమ్‌క్రాప్‌ సహాయంతో పండిస్తున్న ఇంటిపంటపై పోస్టులు కూడా పెట్టారు.

Homecrop Team

లాక్‌డౌన్ ఎత్తివేయగానే మాకు సమంత నుండి ఒక ఈమెయిల్ వచ్చింది. సొంతంగా ఇంటిపంట వేసుకోవడంలో సహాయం చేయగలరా అని ఆమె మమ్మల్ని అడిగారు. ఆమె ఇంట్లో వ్యవసాయ సెట్లను ఏర్పాటు చేయడానికి మేము ఆమెను కలిసినప్పుడు ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసింది. చాలా మంది ఇతర సినీ ప్రముఖుల మాదిరిగా కాకుండా, ఆమె తన ఇంటిపంట పనులు చూసుకోవటానికి అవుట్ సోర్సింగ్‌పై అసలు ఆధారపడరు. ఆమె తన పెరటి తోట పనంతా స్వయంగా తనే చేస్తారు” అని కృష్ణారెడ్డి చెప్పారు. మొత్తంమీద హోమ్‌క్రాప్ సంస్థ, హైడ్రోపోనిక్స్ కంపెనీ అయిన ‘అర్బన్ కిసాన్‌’తో కలిసి సమంత ఇంటిపంటకు ఒక రూపం ఇచ్చింది.
“హోమ్ క్రాప్ సాంకేతికత, హైడ్రోపోనిక్స్ రెండూ ఇంటిపంటల సాగులో మట్టిని ఉపయోగించవు. ‘హైడ్రో’ పేరుకు తగ్గట్టే, హైడ్రోపోనిక్స్ సాంకేతికత పూర్తిగా నీటి ఆధారితమైనది. కాగా, హోమ్‌క్రాప్ ఆవు పేడ, వర్మి కంపోస్ట్‌, ఇతర సహజ సేంద్రియ ఎరువుల మిశ్రమంతో కూడిన కోకోపీట్‌ను ఉపయోగిస్తుంది. ఈ రెండు సాంకేతిక పరిజ్ఞానాలు సురక్షితమే అయినప్పటికీ, హైడ్రోపోనిక్స్ ప్రధానంగా గ్రీన్ వెజిబటబుల్స్‌కు మాత్రమే పరిమితం. కానీ హోమ్‌క్రాప్‌ పద్ధతిలో, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైనంత వరకు భారతీయ భోజనంలో భాగమైన ఎలాంటి కూరగాయలనైనా పండించవచ్చు” అని కృష్ణారెడ్డి వివరిస్తారు.

అన్ని రకాల ఆకుకూరలు, టమాటా, బ్రాకోలీ, వంకాయ, క్యారెట్ వంటి పలు కూరగాయలు హోమ్‌క్రాప్ ఇంటిపంటలో భాగంగా ఉంటాయి. నగరవాసులు చాలా మందికి వ్యవసాయం కొత్త కావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి విభిన్నమైన విస్తీర్ణాలకు (ఆయా స్థలాలకు) సరిపడే విధంగా, వివిధ ధరల శ్రేణులతో మొక్కల గ్రోయింగ్ కిట్లను రూపొందించింది హోమ్ క్రాప్ సంస్థ. ఈ వస్తుసామగ్రిలో భాగంగా పాటింగ్ మిక్స్, బయో-ఎన్‌రిచర్స్, బయో-పెస్టిసైడ్స్‌లతో కూడిన స్మార్ట్ గ్రో బ్యాగ్‌లను, గ్రో బెడ్స్‌ను హోమ్ క్రాప్ సంస్థ అందిస్తుంది. ఈ సంస్థే వాటిని మన ఇంటిలో మనకి కావలసిన చోట ఏర్పాటు చేసి ఇస్తుంది. ప్రారంభకులకు ఇంటిపంటకు సంబంధించిన అభ్యాస వీడియోలు కూడా వీరి వద్ద ఉన్నాయి. అదనంగా, చిన్నపిల్లలు కూడా  మొక్కలు పెంచేందుకు వీలుగా ఈ సంస్థ ఇటీవల ఒక స్మార్ట్ గ్రో బ్యాగ్‌తో కూడిన DIY కిట్లను కూడా విడుదల చేసింది.
కాబట్టి, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక మీ చేతుల మీదుగా, నాలుగు గోడల మధ్య పెరిగే రుచికరమైన తాజా కూరగాయల తాలూకు ఇంటిపంటలను ఎంచుకోవడమే తరువాయి!
ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Homecrop
Phone: +91-8179982232
support@homecrop.in
http://www.homecrop.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here