వంగమొక్కలు, కాయలకు అతి ముఖ్యమైన బెడద ఏంటి? పురుగులు, పుచ్చులు, తెగుళ్లు. ఏపుగా ఎదిగిన వంగమొక్కలను చూసి మురిసిపోయే రైతుకు అది ఎంతో సమయం నిలబడదు. పురుగులు, తెగుళ్లు, ఆపైన కాయలకు పుచ్చులు వస్తాయి. దాంతో రైతు ఆదాయం తగ్గిపోతుంది. అతని ఆనందం ఆవిరైపోతుంది. ఈ బెడద నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. అయితే.. పురుగులు, తెగుళ్లు, పుచ్చుల నివారణకే కాకుండా మొక్కలు ఏపుగా ఎదిగేందుకు, చక్కగా పువ్వులు పూసి, ఎక్కువ కాయలు కాసేందుకు మన పూర్వీకులు వాడిన అతి ముఖ్యమైన పదార్థం గురించి చాలమందికి తెలియకపోవచ్చు. అదే ఇంగువ. ఇంగువ అంటే వంటల్లో వాడుకునే పౌడర్ ఇంగువ కాదు. ముద్ద ఇంగువ. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఇంగువ ద్రావణం వాడడం వల్ల మొక్కలకు కలుగుతుంది. ఈ ద్రావణాన్ని ఎలా తయారుచేయాలి.. ఏ విధంగా వాడాలి, వంగమొక్కలకు ఇంగువతో కలిగే ఉపయోగాలేంటో చూద్దాం.సస్యరక్షణలో ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువగా వస్తుందంటే ఏ రైతు అయినా ఎగిరి గంతేస్తారు! నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ఘనపురంలోని ఔత్సాహిక రైతు సోదరులు రామడుగు రాము, రామకృష్ణ అనుభవాలు తెలుసుకుందాం. ఈ బ్రదర్స్ రైతులే కాదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా. అమేయం ఫార్మ్స్ పేరిట వీరు సంప్రదాయ సాగు విధానంలో ఆరోగ్యవంతమైన పంటలు పండిస్తున్నారు. వారు వేసిన వంగతోట అధికశాతం నాశనం అయిపోయిన దశలో ఇంగువ ద్రావణం వాడారు. ఇక పనికిరావు, తీసేయాలనుకున్న వంగమొక్కలు ఇంగువ ద్రావణం వాడడంతో మంచి దిగుబడి ఇచ్చాయి.వినియోగదారులకు ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు అందించాలనే ఉద్దేశంతో ఉన్న రాము బ్రదర్స్ వంగమొక్కలు కూడా నాటారు. అయితే.. వంగమొక్కలకు తెగుళ్లు, పురుగులు, కాయలకు పుచ్చులు ఎక్కువ వస్తాయని, పురుగుమందులు చాలా ఎక్కువగా వాడాలని పలువురు నిరుత్సాహ పరిచారన్నారు. వంగమొక్కలు పెద్దవై, పూత దశలో గుళికలు వేయాలని పలువురు సూచించారన్నారు. గుళికల్లోని విషం పురుగులను చంపినా కాయలకు అది చేరుతుంది. వినియోగదారులకు చెడు ఫలితం ఇస్తుందని తాము వేయలేదన్నారు. దీంతో కాచిన కాయల్లో 50 శాతానికి పైగా పుచ్చులు వచ్చాయన్నారు. క్షేత్రంలో కలుపు తీసేందుకు వచ్చిన కొందరు కూలీలు ఇంగువ ద్రావణం వాడమని, తమ తాత ముత్తాతలు దీన్నే వాడేవారని చెప్పారన్నారు.కూలీల మాట ప్రకారం ఇంగువ ద్రావణాన్ని పరీక్షించే ఉద్దేశంతో ఒక వరుసలోని వంగమొక్కలకు వాడామన్నారు. వారం రోజుల తర్వాత వంకాయలు కోసినప్పుడు మిగతా మొక్కల కన్నా వీటిలో పుచ్చుల శాతం చాలా తక్కువ వచ్చాయని రాము తెలిపారు. వంగమొక్క కూడా చాలా బాగా పెరిగిందని, పూత ఎక్కువగా వచ్చిందన్నారు. తర్వాత మొక్కలకు ఉన్న మొత్తం పుచ్చు కాయలు తెంపేసి, మళ్లీ ఇంగువ ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోసినట్లు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన కాయల్లో పుచ్చులు 10 శాతానికి తగ్గిపోయాయని, కాయలు నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా ఉన్నాయని అన్నారు. అంతకు ముందు కాచిన ప్రతి వంకాయకు పుచ్చు ఉంది కాబట్టి మొత్తం వంగతోటనే తీసేయాలనుకున్నామన్నారు. ఇంగువ ద్రావణాన్ని ఆఖరి ప్రయత్నంగా వాడామని, ఫలితం బాగుందని చెప్పారు.ఇంగువ ద్రావణం మొక్కల మొదళ్లలో పోయడమే కాకుండా పూత ఎక్కువ రావాలని ఇంగువ ద్రావణానికి పులిసిన మజ్జిగ కలిపి మొక్కలపై స్ప్రే చేస్తున్నట్లు రాము చెప్పారు. దీంతో వంకాయల దిగుబడి మరింత పెరిగిందన్నారు. ఇంగువ ద్రావణం వాడక ముందు 90 శాతం ఉన్న పుచ్చులు దాన్ని వాడిన తర్వాత బాగా తగ్గిపోయాయన్నారు. పురుగు మందులు వాడకుండా కేవలం ఆర్గానిక్ విధానంలోనే తాము ఇంగువను వినియోగిస్తున్నామన్నారు.పావుకిలో ముద్ద ఇంగువ రిటెయిల్ మార్కెట్‌లో కన్నాహోల్‌సేల్ మార్కెట్‌లో తక్కువకు అంటే రూ.70కి, కిలో రూ.280కి దొరుకుతుంది. పావుకిలో ఇంగువను ఐదు లీటర్ల నీటిలో కలిపి వంగమొక్కల వేర్లకు పోసుకోవాలి. అదే మొక్కలపై స్ప్రే చేయడానికైతే పావు కిలో ఇంగువకు 100 లీటర్ల నీటిలో కలపాలని రాము తెలిపారు. ముద్ద ఇంగువను ముక్కలుగా విరగగొట్టి ముందుగా ఒక గిన్నెలో వేసి నీటిలో అరగంట సమయం నానబెట్టాలి. తర్వాత నీటిని గోరువెచ్చగా అయ్యేవరకు వేడిచేయాలి. గోరువెచ్చని నీటిలోని ఇంగువను పూర్తిగా పిసకాలి. ఇంగువ పిసికిన నీళ్లు పాలు మాదిరిగా తయారవుతాయి. ఇలా తయారైన ద్రావణాన్ని వేర్లకు పోసేందుకు ఐదు లీటర్లు, స్ప్రే చేసేందుకు 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇంగువ ద్రావణాన్ని 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు వేర్లకు పోసి, రెండుసార్లు స్ప్రేచేసినట్లు రాము తెలిపారు. మూడు నాలుగు ఎకరాల వంగపొలంలో ఇంగువ ద్రావణం వాడేందుకు కేవలం 2 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామన్నారు. కిలో ఇంగువతో తయారు చేసిన ద్రావణం 25 వంగమొక్కలకు సరిపోతుంది.వంగతోటను వాణిజ్యపరంగా ఎక్కువ పరిధిలో వేసుకున్న రైతులైనా. ఇంటి పెరటిలో, మిద్దె తోటపైన మొక్కలు పెంచుకునే ఔత్సాహికులైనా ఇంగువ ద్రావనం వినియోగించవచ్చు. పుచ్చులు లేని మంచి వంకాయలను, రుచిగా ఉండే వంకాయ కూరను ఆస్వాదించవచ్చు.