‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా..’ ఓ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. అలాగే ‘ముళ్ల మొక్కే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. చాలా నష్టపోతాం’ ఇది తాజాగా ట్రెండ్ అవుతున్న మాట. చిరంజీవి చెప్పింది తులసిమొక్క గురించి అయితే.. ఇప్పుడు చెప్పుకునేది బ్రహ్మజెముడు లేదా నాగజెముడు మొక్క గురించి. పదునైన ముళ్లతో నిండి ఉండే బ్రహ్మజెముడు ఎడారి మొక్కగానే మనకు తెలుసు. కొందరు రైతులు దీన్ని తమ పంట పొలాలకు రక్షణ కోసం చుట్టూ గట్ల మీద కూడా పెంచుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కలు వాటికవే మొలిచి ఎదుగుతుంటాయి. నీటి ఎద్దడిని ఇది తట్టుకుంటుంది. నిజానికి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. తన కాండంలోనే నీటిని నిల్వ చేసుకుంటుంది. బ్రహ్మజెముడు ఆకులు, పండ్లలో ఎన్నెన్నో పోషకాలు నిక్షిప్తం అయి ఉంటాయి. క్రిమి కీటకాలు ఏమీ చేయలేనంత మొండిమొక్క బ్రహ్మజెముడు. ఇసుక నేలల్లో ఇది ఎక్కువగా ఉండి 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. బ్రహ్మజెముడు మొక్కను మిరాకిల్‌ ప్లాంట్ అని, పండును ఫ్రూట్ ఆఫ్ ఎర్త్‌ అంటారు.గులాబీ రంగులో ఉండే బ్రహ్మజెముడు ఔషధాల గని అంటే అతిశయోక్తి కాదు. ఈ పండ్లలో అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, బీటాలైన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధికంగా లభిస్తాయి. బ్రహ్మజెముడు పండ్లలోని ఆరోగ్య లాభాల గురించి తెలియకపోయినా.. ప్రకృతి మాత సహజంగా ప్రసాదించిన ఈ పండ్లను పల్లెటూళ్లలో పిల్లలు, పెద్దలు కూడా కోసుకొని ఇష్టంగా తింటారు. బ్రహ్మజెముడు పండ్లలో, ఆకుల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు మనలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. శరీర బరువును తగ్గిస్తాయి. లివర్‌ వ్యాధులు, క్యాన్సర్‌ నివారణకు ఇవి బాగా ఉపయోగపడతాయన పరిశోధనల్లో తేలింది. దీనిలోని కాల్షియం, పీచుపదార్థం, ఐరన్‌ డయాబెటిస్‌, ఊబకాయం గ్యాస్టిక్‌ లాంటి సమస్యలను తగ్గిస్తాయి. సంతానం లేని వారు బ్రహ్మజెముడు పండ్లను తింటే వీర్యకణాలు వృద్ధి అవుతాయంటారు. ఈ పండ్లలో బీ 12, ఏ, సీ విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.బ్రహ్మజెముడు పండ్లలోని గింజల నుంచి తీసు ఆయిల్‌కు క్యాన్సర్‌ నివారించే గుణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు .బ్రహ్మజెముడు జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అల్సర్లు కూడా తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.హాని లేని హెర్బల్‌ ఆల్కహాల్‌ తయారీకి బ్రహ్మజెముడు పండ్లను వాడతారు. బ్రహ్మజెముడు పండ్లను ఫ్రూట్‌ బార్‌, స్క్వాష్‌ల తయారీకి వినియోగిస్తారు. బ్రహ్మజెముడును కాక్టీ వంటకాల్లో వాడతారు. ఈ వంటకం పోషకాలకు ప్రసిద్ధి. పోషకాల కోసమే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటుందని దీన్ని వంటల్లో వాడుతున్న పలువురు చెఫ్‌లు. బ్రహ్మజెముడు ముళ్లు తీసేసి, గుజ్జుగా చేసుకొని.దాంతో జామ్‌, టీ, స్మూథీలు చేసుకోవచ్చు. చేపలు, రొయ్యలు లాంటి నాన్‌వెజ్‌ కూరల్లో బ్రహ్మజెముడు మంచి కాంబినేషన్ అంటారు ప్రముఖ చెఫ్‌లు.బ్రహ్మజెముడు వల్ల కేవలం మనుషులకేనా లాభాలు అంటే కచ్చితంగా అంతే కాదని, ఇది పశువులకు కూడా చక్కని ఆహారం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ముళ్లు పెద్దగా లేని నూగులా ఉండే బ్రహ్మజెముడు సాగు పలు చోట్ల చేస్తున్నారు రైతులు. నీటి సౌకర్యం అంతగా లేని కరువు పీడిత ప్రాంతాల్లో నూగుతో ఉండే బ్రహ్మజెముడును రైతులు పెంచి పశువులకు దాణాగా అందిస్తున్నారు. దీన్ని ఆహారంగా తీసుకున్న పశువుల పాల దిగుబడి పెరుగుతుంది. వెన్న రెండు శాతం దాకా పెరిగినట్లు గమనించారు. ఒక్కసారి దీన్ని నాటుకుంటే ఏళ్ల తరబడి నిత్యం పశువులకు దాణాగా ఉపయోగపడుతుంది. గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బ్రహ్మజెముడును ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రైతులకు ‘సెర్ఫ్‌’ సంస్థ పరిచయం చేసింది.ముళ్లు లేని బ్రహ్మజెముడు లేదా నాగజెముడు మొక్కను వర్షాలు పూర్తయిన అనంతరం అక్టోబర్‌ నుంచి మార్చి నెలల మధ్య కాలంలో నాటుకుంటే మంచిదని అనుభవజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. నీరు నిల్వ ఉండని తేలికపాటి నేలలు ఈ పంటకు అనుకూలం. ఇతర పంటలేవీ పండని నిస్సారమైన సాగు భూములు, బంజరు భూములు, రాళ్లతో నిండిన నేలలు, ఇసుక భూముల్లో ఈ పంట సాగు చేసుకోవచ్చు. అయితే.. చౌడు భూముల్లో మాత్రం ఇది పెరగదని గమనించాలి.ముళ్లు లేని అంటే నూగుతో ఉండే బ్రహ్మజెముడు ఆకును దాని కాండం పూర్తిగా భూమిలో ఉండేలా నాటుకోవాలి. కనీసం ఏడాది వయస్సు ఉన్న బ్రహ్మజెముడు మొక్క నుంచి కోసిన ఆకులే ఇందుకు వినియోగించాలి. రెండు అడుగుల వెడల్పు, అడుగు ఎత్తులో బెడ్స్‌ను తయారు చేసుకొని దీని ఆకులు నాటుకోవాలి. బెడ్‌కు బెడ్‌కు మధ్య దూరం 3 మీటర్లు, మొక్కల మధ్య రెండు మీటర్ల దూరం ఉండేలా నాటాలి. అలాగే నాటిన ఆకుపై ఎండ పూర్తిగా పడేలా తూర్పు వైపుగా దాన్ని నిటారుగా నాటుకోవాలి. ఎకరం భూమిలో బ్రహ్మజెముడు ఆకులు నాటే ముందు బాగా కుళ్లిన రెండు టన్నుల పశువుల ఎరువును భూమిలో వేయాలి. దానికి తోడు కొద్దిగా రసాయన ఎరువులు వేసుకున్నా పరవాలేదని అనుభవం ఉన్న రైతులు చెబుతున్నారు. అయితే..బ్రహ్మజెముడు ఆకులను నాటే ముందు 15 రోజులు నీడలో ఉంచాలి. అంటే ఆకులో ఉన్న తేమ తగ్గిన తర్వాత నాటుకుంటేనే ఫలితం ఉంటుంది. నాటే ముందు ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలో ఆకులను ముంచితే శిలీంద్ర తెగుళ్లు రాకుండా ఉంటాయి.బ్రహ్మజెముడు ఆకు నాటిన సంవత్సరం తర్వాత నుంచి దాని ఆకులను పవువులకు దాణాగా వేసుకోవచ్చు. మొక్క కింది భాగంలో ఉండే రెండు మూడు ఆకులను ఉంచి, పైన పెరిగిన వాటిని మాత్రమే చాకుతో కోసుకోవాలి. బ్రహ్మజెముడు ఆకులను చిన్న ముక్కలు చేసి, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ఇతర పచ్చి మేతకు బదులుగా  వాడవచ్చు.అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామ రైతు అలవల వెంకటేశ్వరరెడ్డి ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట సాగు చేశారు. తమ డైరీలోని పశువులకు మేతగా వినియోగించేందుకు ఆయన ఈ పంట వేసి, మంచి ఫలితాలు సాధించారు. తమ పాడి పశువుల దాణాకు ఇబ్బందిగా ఉన్న సమయంలో డీఆర్‌డీఏ, వెలుగు, సెర్ఫ్‌ డిపార్ట్‌మెంట్ అధికారుల సలహాతో పుణె నుంచి నూగు బ్రహ్మజెముడు మొక్కలు తెప్పించి నాటినట్లు చెప్పారు. ఆకులు నాటిన తర్వాత ఒక ఏడాది నుంచి పశువులకు దాని ఆకులను దాణాగా వినియోగించనట్లు తెలిపారు. బ్రహ్మజెముడు ఆకులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. పశువులకు ఆహారంగా అలవాటు చేయడానికి దీని ఆకులను కత్తిరించి, రెండు మూడు రోజులు వేరే దాణాలో కలిపి ఇచ్చినట్లు వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. తర్వాత అవి నేరుగా బ్రహ్మజెముడు ఆకులను దాణాగా వేసినా తిన్నాయన్నారు. బాగా చిన్న ముక్కలుగా కత్తిరించి వేస్తే.. కోళ్లు కూడా తింటాయన్నారు.

బ్రహ్మజెముడు ఆకులు ఎకరం భూమిలో 6X6 అడుగుల విధానంలో నాటితే 1200 అవసరం అవుతాయి. అయితే.. 6X3 అడుగు దూరంలో నాటుకుంటే మంచిదన్నారు. ఎప్పటికప్పుడు ఆకులను కట్‌ చేసి, పశువులకు మేతగా వేస్తాం కాబట్టి 6X3 అడుగుల దూరం నాటుకోవచ్చన్నారు. 2018-19లో తాను తెచ్చినప్పుడు ఒక్కో ఆకు ఖరీదు రూ.50 పడిందన్నారు. బ్రహ్మజెముడు ఒక్కో మొక్కకు 20 వరకు కొమ్మలు వస్తాయి. లేత ఆకులకు కొద్దిగా నూగు ఉన్నా ముదిరిన తర్వాత అది ఉండదన్నారు. నాలుగైదు పశువులు ఉన్నవారు బ్రహ్మజెముడును పొలానికి సరిహద్దుగా వేసుకున్నా ఎండాకాలంలో వాటికి మేత కొరత ఉండదన్నారు. మొక్క నాటిన మూడే ఏట నుంచి కాయలు కాస్తాయి.

తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో బ్రహ్మజెముడు నాటుకుంటే మేలు. తాగునీరు లభించని ప్రాంతాల్లో పంటల సంగతి ఎలా ఉన్నా పశువులను పెంచే వారు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అటువంటి ప్రాంతాలలో పశుపోషకులకు బ్రహ్మ జెముడు వరం లాంటిది అని చెప్పవచ్చు.

ఇతర వివరాల కోసం వెంకటేశ్వరరెడ్డిని ఫోన్‌: 9000616717 లో సంప్రదించవచ్చు.