గ్రీన్‌ పీస్‌ అంటే పచ్చ బఠాణీ చాలా వేగంగా పెరిగే విజిటబుల్‌. కంటైనర్‌ గార్డెనింగ్‌ విధానంలో పచ్చ బఠాణీ సాగు చేయడం ఎంతో సులువు. పచ్చబఠాణీని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా పచ్చబఠానీ సాగు చేయొచ్చు. మధ్యధరా ప్రాంతానికి చెందిన పచ్చ బఠాణీలో అలర్జీలను నివారించే అంశాలు, ఖనిజాలు, ఆక్సీకరణను నిరోధించే పదార్థం పుష్కలంగా ఉంటాయి. పైగా పచ్చ బఠాణీ సాగు కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. సంక్లిష్టమైన వ్యవసాయ విధానాలు కూడా అవలంబించాల్సిన పనిలేదు.

పచ్చబఠాణీతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్న చిన్న పిల్లల్లో ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పచ్చబఠాణీ తీగల్ని టెర్రస్‌ పై పెంచితే వాటికి వచ్చే ఉదా, పసుపు, తెలుపు రంగు పూలతో అక్కడంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది.పచ్చబఠాణీల్లో రెండు రకాలు ఉన్నాయి. పొదలా గుబురుగా పెరిగేది ఒక రకం అయితే.. తీగలా పాకేది ఇంకో రకం. పొదలా పెరిగే పచ్చబఠాణీ మొక్కలు ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. తీగ బఠాణీకి అయితే.. కర్ర సాయంతో పైకి పాకుతాయి. పచ్చబఠాణీల్లో కాస్కాడియా రకం చాలా రుచిగా, కరకరలాడేలా ఉంటాయి. ఈ రకం బఠాణీ మొక్కలు వ్యాధినిరోధక శక్తిని బాగా కలిగి ఉంటాయి. మొక్క నాటిన 67 రోజులకు కాస్కాడియా బఠాణీ పంట వస్తుంది. ఇక సుగర్‌ డాడీ అనే చక్కని రుచిగల రకం పచ్చ బఠాణీ 68 రోజుల్లో సాగు పూర్తవుతుంది. సుగర్ స్నాప్‌ అనే రకం పచ్చ బఠాణీలు చాలా తియ్యగా ఉంటాయి. 57 రోజుల్లో దీని పంట వస్తుంది. తీగ జాతికి చెందిన ఈ రకం బఠానీ మిగతా రకాల కన్నా కొంచెం పొట్టిగా ఉంటాయి. స్నో లేదా మేన్‌ గెటౌట్స్‌ బఠాణీలు.. కంటెయినర్లలో పెంచుకోవడానికి బాగా వీలుగా ఉంటాయి.

పచ్చ బఠాణీ సాగును కంటైనర్లలో ఎలా చేయాలో ఓసారి చూద్దాం…

పచ్చ బఠాణీల సాగును వివిధ రకాల కంటైనర్లలో చేసుకోవచ్చు. వీటిని సహజసిద్ధంగా లభించే అధిక పోషకాలున్న మట్టిలో చల్లని లేదా అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో కూడా పెంచుకోవచ్చు. దాంతో పాటుగా తగినంత నీరు, సూర్యరశ్మి ఉండే చోట బాగా పెరుగుతాయి. ముందుగా మొక్కల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. మరింత ఏపుగా… బలంగా పెరుగుతాయి. అలాగే అధిక దిగుబడులు కూడా ఇస్తాయి. అయితే.. నేలలో చేసే పచ్చ బఠాణీ సాగులో వచ్చే దిగుబడి కన్నా కంటైనర్లలో కాస్త తక్కువ వస్తుంది. మనం కంటైనర్లలో నాటుకునే విత్తనాలను బట్టి ఆ మొక్క లేదా తీగ ఎంత త్వరగా పుష్పిస్తుంది? ఎంత వేగంగా కోతకు వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మార్చి- ఏప్రిల్‌ నెలల మధ్యలో మనం పచ్చబఠాణీ విత్తనాలు నాటితే అవి ఆగస్టు- సెప్టెంబర్‌ మాసాల మధ్య దిగుబడి ఇస్తాయి.పచ్చబఠాణీ విత్తనాలు నాటే కంటైనర్లను ముందుగా బాగా శుభ్రం చేసి, బాగా ఆరబెట్టాలి. కంటైనర్ల నుంచి దుమ్ము రాకుండా, నీరు కారకుండా, మట్టిగడ్డలు ఏర్పడకుండా ఉండాలంటే వాటి అడుగున సోడా సీసాలు కానీ, కాస్త పెద్ద గ్ఆరావెల్‌ ముక్కలు గానీ అమర్చాలి. కంటైనర్లలో సగం వరకు పాట్ మిక్స్‌ తో నింపాలి. కంటైనర్‌ పైభాగంలో రెండు నుంచి మూడు అంగుళాల ఖాళీ ఉండేలా చూసుకోవాలి. కంటైనర్లలో నింపుకునే పాటింగ్‌ మిక్స్‌ ను బాగా ఆరేదాకా కలుపుకొని, 24 గంటల పాటు ఓ పక్కన ఉంచుకోవాలి. పచ్చ బఠాణీ విత్తనాలు బాగా మొలకెత్తాలంటే వాటిని నాటడానికి ముందు ఓ రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచాలి. అలా రాత్రంతా నానిన పచ్చ బఠాణీ విత్తనాలను మట్టిపై వేసి, ఒక్కో విత్తనం కనీసం రెండు అంగుళాల దూరం ఉండేలా వాటిని నెమ్మదిగా భూమిలోపలికి వెళ్లేలా నొక్కాలి. ఆ తర్వాత విత్తనాలను మట్టితో కప్పివేయాలి. అంతే కాని విత్తనాలపై మట్టిని పోయకూడదు. అదే.. తీగజాతి బఠాణీని సాగుచేస్తే.. తీగలకు ఆధారం కోసం విత్తనానికి దగ్గరగా వెదురు కర్రలు పాతితే మొక్కలు బాగా ఎదుగుతాయి.ఉష్ణ వాతావరణంలో పెరిగే పచ్చ బఠాణీ సాగుకు సూర్యరశ్మి చాలా ఎక్కువ అవసరం అవుతుంది. మొక్క మొలిచిన 3 నుంచి 4 వారాల వరకు రోజుకు 4 నుంచి 5 గంటల వరకు సూర్యరశ్మి కావాల్సి ఉంటుంది. నాలుగు వారాల తర్వాత వాటికి ప్రతిరోజూ 6 నుంచి 8 గంటల పాటు సూర్యరశ్మి నేరుగా పడేలా చూసుకోవాలి. సూర్యరశ్మి సరిపడినంతగా అందేలా చూసుకుంటే.. పచ్చ బఠాని మొక్కలకు రోగాల సమస్యలు తగ్గిపోతాయి. దాంతో పంట దిగుబడి కూడా మరింత అధికంగా వస్తుంది.

పచ్చబఠాణీ విత్తనాలను నాటే ముందు సరిపడినంత సేంద్రీయ ఎరువును అందిస్తే.. ఆ తర్వాత మొక్కలకు పెద్దగా ఎరువు వేయాల్సి అవసరం ఉండదు. పచ్చ బఠాణీ మొక్క ఎగుతున్న తొలి రోజుల్లో వారానికి రెండుసార్లు ఎరువు వేయాలి. పచ్చబఠానీ మొక్కలకు అందించే ఎరువులో నత్రజని తక్కువ ఉండాలి. అలాగే మనం వేసే ఎరువులో నత్రజని ఎంత ఉంటుందో అంతే మోతాదులో పొటాషియం, ఫాస్పరస్‌ ఉండేలా చూసుకోవాలి. ఎరువును ఎక్కువగా వాడితే.. పచ్చ బఠాణీ మొక్కలు పుష్పించకుండా అడ్డుపడుతుందని మరిచిపోవద్దు. పచ్చ బఠాణీ మొక్కలు ఎదుగుతున్న మట్టిలో పోషకాలు బాగా పెరగాలంటే వారానికి ఒకసారి కంపోస్ట్‌ ఎరువును కలుపుతూ ఉండాలి.

మనం ఎంచుకునే విత్తనం రకాన్ని బట్టి పచ్చ బఠాణీ 65 నుంచి 75 రోజుల్లో పంట వస్తుంది. పచ్చబఠాణీ కాయల్ని వాటి కాడ మొదటి నుంచి చాలా జాగ్రత్తగా చేతులతో మాత్రమే కోసుకోవాలి. అలాగే.. మొక్క నుంచి కాయలు కోసేటప్పుడు కాండం విరిగిపోకుండా జాగ్రత్త వహిస్తే.. మరింతగా పంట దిగుబడి వస్తుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here