గ్రీన్‌ మెన్యూర్‌.. పచ్చిరొట్ట ఎరువు.. ఇదేమీ కొత్త మాట కాదు. పూర్వకాలపు రైతులకు తెలియనిదీ కాదు.. ప్రధాన పంటకు మంచి పోషకాలు అందించడంలో గ్రీన్‌ మెన్యూరే బెస్ట్‌ అంటారు ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ప్రయోగాలు చేస్తున్న కళ్లం శ్రీనివాస్‌రెడ్డి. కాకపోతే.. ఏ ప్రధాన పంటకు ఎలాంటి గ్రీన్‌ మెన్యూర్‌ కాంబినేషన్‌ సూటవుతుందో ఆలోచించి వేసుకోవాలన్నారాయన. ఉదాహరణకు అరటిని ప్రధాన పంటగా వేసిన పొలంలో ఒక బెడ్‌మీద ఎత్తు పెరిగే జనుము, జీలుగు, వరి, సజ్జ, గోధుమ పంట వేసుకోవాలంటారు. మరో బెడ్‌పై పెసర, పిల్లిపెసర, ఆవాలు, ఉలవలు లాంటి తక్కువ ఎత్తు పెరిగే పంటలు వేసుకోవచ్చన్నారు. ఈ అన్ని పైర్ల కాడ మెత్తగా ఉంటుందని, మూడు నెలల్లోపు అవి చచ్చిపోయి ప్రధాన పంటకు మంచి పోషకాలు అందిస్తాయని చెప్పారు. ఈ అంతరపంటల జీవిత కాలం అయిపోగానే నేలపై ఒరిగిపోయి. నేలకు ఆచ్ఛాదన అవుతాయి. వాటి ఆకులలోని పచ్చని రసం భూమికి చేరుతుంది. అంతర పంటల వేళ్లు భూమి లోపల కుళ్లిపోయి మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి పనికొస్తాయి. ఆ బ్యాక్టీరియాలు వేళ్లను తిని ప్రధాన పంటకు చక్కని ఆహారం అందిస్తాయన్నారు గుంటూరు జిల్లా నూతక్కి మండలం కొత్తపేటకు చెందిన ప్రకృతి వ్యవసాయంలో అనుభవం గడించిన శ్రీనివాస్‌రెడ్డి.పచ్చి ఆకుల్లోనే పోషకాలన్నీ ఉంటాయని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పచ్చిరొట్టను భూమిలో కుళ్లబెడితే పేడ కన్నా 100 రెట్ల ప్రయోజనం ఉంటుందన్నారు. పచ్చిరొట్టకు తోడుగా కొద్దిగా పేడ వేసుకుంటే పైరు పచ్చగా, బలంగా, ఏపుగా ఎదిగేందుకు పనికొస్తుందన్నారు. ఎందుకంటే పేడలోని బ్యాక్టీరియాలు గ్రీన్‌ మెన్యూర్‌లో మరింత ఎక్కువగా అభివృద్ధి చెంది పంటకు మేలు చేస్తాయన్నారు. అంటే బ్యాక్టీరియాకు కావాల్సిన ఆహారం పచ్చిరొట్ట వేళ్ల రూపంలో భూమిలో ఉంది కాబట్టి అది మరింతగా అభివృద్ధి చెందుతుందంటారు. సెనగపిండి, బెల్లం వేస్తే.. చాలా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. అయితే.. అది భూమి లోపల బతికేందుకు ఆహారం ఉండాలి కదా! ఆహారం లేకపోతే బ్యాక్టీరియా చచ్చిపోతుందని రైతులు గ్రహించాలన్నారు. భూమిలో పదార్థం ఉంటే బ్యాక్టీరియా దాన్ని పోషకంగా మార్చి మొక్కకు ఇస్తుందన్నారు. సాధారణంగా రైతులంతా పొలానికి పశువుల పేడ వేస్తే.. ఎంతో బలం అని నమ్ముతారు. కానీ.. పచ్చిమేత మేసిన పశువులు మేతలోని పచ్చని రసాన్ని జీర్ణించుకొని, పిప్పిని, కొన్ని బ్యాక్టీరియాలను మాత్రమే బయటికి వదులుతాయని శ్రీనివాస్‌రెడ్డి విశ్లేషించారు. అయితే.. పేడలో పీచుపదార్థం ఉంటుంది కాబట్టి నీటిని పీల్చుకొని కొద్ది రోజులు భూమిలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది.బయటి నుంచి తీసుకొచ్చి పశువుల పెంట వేస్తే.. సగమే ఉపయోగం ఉంటుంది. అదే.. ప్రధాన పైరు మధ్యనే గ్రీన్ పైరు పెంచితే.. ప్రయోజనం మరింత ఎక్కువ ఉంటుంది. మొక్కల వేళ్లు భూమిని గుల్లగా మారుస్తాయి. మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందేందుకు ఆహారంగా ఉపయోగపడతాయి. భూమిని వేళ్లు గుల్లగా మార్చినప్పుడు ప్రధాన పైరు వేళ్లు చాలా దూరం వెళతాయి. అంటే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. ఎంతదూరం వాటికి పోషకాలు అందుతాయో అంతదూరం అవి విస్తరిస్తాయి. ఉదాహరణకు అరటిచెట్టు వేళ్లు 30 అడుగుల దూరం వరకు వెళతాయని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.అరటి తోటలో సాళ్లు చేసుకొని, చెట్టుకు అటు రెండు సాళ్లు, ఇటు రెండు సాళ్లలో మొక్కకు మొక్కకు మధ్య రెండు అడుగుల దూరంలో పసుపు విత్తనాలు నాటారు శ్రీనివాస్‌రెడ్డి. అరటి చెట్ల వరసల మధ్య 16 అడుగుల దూరం పెట్టారు. పసుపు నాటిన రోజే అదే బెడ్‌పై పిల్లిపెసర విత్తనాలు కూడా పోసి, దానిపైన డ్రిప్ వేశారు. పసుపు నాటిన వెంటనే పిల్లిపెసర వేయకపోతే కలుపు ఎక్కువగా వస్తుంది. పిల్లిపెసర పోసినా కలుపు వస్తుంది కానీ అది బలంగా ఉండదు. పిల్లిపెసర నిలువుగా కాకుండా భూమికి సమాంతరంగా ఎదుగుతుంది కాబట్టి కలుపు బెడద చాలా వరకు తగ్గిపోతుంది. కొంచెం పెరిగితే పక్కకు పడుతుంది. కలుపును కూడా పక్కకు పడేస్తుంది. దీంతో కలుపు తీసే పనే ఉండదు. కాకపోతే ఏదైనా పిచ్చిమొక్క ఎత్తు పెరుగుతుంటే దాన్ని పీకేస్తే సరిపోతుంది. పిల్లిపెసర మొక్క 70 నుంచి 80 రోజులలో చనిపోతుంది. దాని ఆకుల సారం మొత్తం భూమికి అందుతుంది. దాని వేళ్లు మంచి బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. పసుపు మొక్క పైకి వచ్చే సరికే 70 నుంచి 80 రోజులు పడుతుంది. కాబట్టి భూసారాన్ని పిల్లిపెసర తీసేసుకుంటుందనే అనుమానమే అక్కర్లేదంటారు శ్రీనివాస్‌రెడ్డి. పసుపు మొక్క ఎదిగే సమయానికి పిల్లిపెసర మొక్కలు చనిపోయి వాటిలోని సారం పసుపుమొక్కలకు అందిస్తాయి. పైగా పసుపు మొక్క మొలిచిన కొద్ది రోజులు విత్తనం దుంపలోని పోషకాలే తీసుకుంటుంది. భూమి నుంచి పోషకాలను తీసుకోదు.పసుపు సీడ్‌ను మొదటి పూతవచ్చినప్పుడు అంటే జూన్ నెలలో తీసుకొని నాటాలి. జూన్ ఆఖరు జులై నెలలో సీడ్ తీసుకుంటే మొక్క తక్కువ ఎత్తు ఎదుతుందన్నారు. అప్పుడు కలుపు సమస్య ఎక్కువ అవుతుంది. పూత ముదిరిపోయిన తర్వాత చాలా మంది రైతులు విత్తనం తీసుకుంటారు కానీ అది తప్పు అంటారు శ్రీనివాస్‌రెడ్డి. జూన్‌లో పసుపు విత్తనం నాటుకుంటే మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. మొక్క ఎత్తుకు అనుగుణంగా పంట దిగుబడి కూడా పెరుగుతుంది. గ్రీన్‌ మెన్యూర్‌ ఉన్నంతవరకు పసుపుమొక్క యావరేజ్‌గా ఎదుగుతుంది. గ్రీన్ మెన్యూర్ మొక్కలు చనిపోవడం మొదలైనప్పటి నుంచీ పసుపు మొక్కల ఎదుగుదల బాగా వేగం పుంజుకుంటుంది.సాలుకు ఒకవైపు జీలుగ రెండో వైపున జనుము నాటుకుని 40 నుంచి 50 రోజుల్లో వాటికి కోసి, మొక్కల మొదట బెడ్‌పై పరుచుకుంటే గ్రీన్‌ మెన్యూర్‌ చాలా క్కువగా ప్రధాన పంటకు అందుతుంది. ఒకే భూమిలో ఎక్కువ పంటలు సాగు చేస్తే.. ఏ పంటకూ ఎలాంటి సమస్యా ఉండదు. భూమి నుంచి దేనికి కావలసిన పోషకాలను అది తీసుకుంటుంది. మొక్కలకు ఎలాంటి ఎరువులూ వేసే పని లేకుండా గ్రీన్ మెన్యూర్‌ చూసుకుంటుంది. గ్రీన్‌ మెన్యూర్ ఆకులు నాని, రసంలా వచ్చి, భూమికి ఎంతో బలాన్నిస్తాయి. గ్రీన్‌ మెన్యూర్ మొక్ల్కల వేళ్లు భూమిని గుల్లగా మారుస్తాయి. వాటి వేళ్లను వానపాములు తిని మొక్కలకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. తద్వారా ప్రధాన పంట మొక్కలు ఏపుగా, ఎత్తుగా, బలంగా ఎదుగుతాయి. ఏ గ్ఈన్‌ మెన్యూర్ మొక్కలు పెంచిన నేల అయినా కనీసం పది అంగుళాల లోతు వరకు భూమి ఎరువులా మారిపోతుంది.అందుకే ఇతర నేలల కన్నా గ్రీన్ మెన్యూర్‌ ఉన్న భూమిలో వర్షపునీరు చక్కగా భూమిలో ఇంకిపోతుంది. నాలుగైదు సెంటీమీటర్ల వరకూ నీరు ఇంకుతుంది. అంతకు మించి వర్షం కురిస్తే అది మాత్రమే భూమిపై పారుతుంది. దాంతో ఇంకుడు గుంతలు తీయాల్సిన అవసరమే గ్రీన్ మెన్యూర్ ఉన్న భూమికి రాదు. మామూలు భూముల్లో సెంటీమీటర్ వర్షం పడగానే పారుదల మొదలవుతుంది. అంటే గ్రీన్ మెన్యూర్ పెంచిన భూమికి, మిగతా భూమికి ఉన్న తేడా ఇక్కడే తెలిసిపోతుంది.గ్రీన్ మెన్యూర్‌ విధానానికి ముందు శ్రీనివాస్‌రెడ్డి కూడా పొలంలో ఆవు ఎరువు, జీవామృతం వేసేవారు. గ్రీన్ మెన్యూర్ విధానం మొదలెట్టిన మూడేళ్ల తర్వాత వాటిని ఆపేశారు. అయితే.. ప్రధాన పంట కాలంలో ఒక్కసారి కావాలనుకుంటే జీవామృతం వేసుకోవచ్చన్నారు. అది కూడా పచ్చిరొట్ట కోసిన తర్వాత దానిమీదే జీవామృతం వేసుకుంటే సరిపోతుందన్నారు. అది కూడా ఆవుపేడ, మూత్రం మాత్రమే సరిపోతాయన్నారు. గ్రీన్‌ మెన్యూర్ విధానంలో కేవలం డ్రిప్ మాత్రమే సరిపోదన్నారు శ్రీనివాస్‌రెడ్డి. ప్రధాన పంట మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు డ్రిప్‌ వాడవచ్చు. గ్రీన్‌ మెన్యూర్‌ మొక్కలు చనిపోయాక, లేక మొక్కల్ని కోసి ప్రధాన మొక్కల మధ్య పరిచిన తర్వాత మడి అంతా నెలకు ఒకసారి అయినా నీరు పారించాలి. ఇలా చేస్తే.. గ్రీన్ మెన్యూర్‌ మొక్కలు నానిపోయి, దానిలోని సారం అంతా భూమిలో కలుస్తుంది. ప్రధాన పంట మొక్కలకు విపరీతంగా పోషకాలు అందిస్తాయి. గ్రీన్‌ మెన్యూర్ ఆకులు ముదిరినప్పుడే ప్రయోజనం మరింత ఎక్కువ ఉంటుంది.అరటితోటలో శ్రీనివాస్‌రెడ్డి పసుపు, మధ్యలో చేమ పైర్లు సాగు చేశారు. ఆయన చేస్తున్న గ్రీన్ మెన్యూర్ విధానం కారణంగా పసుపు మొక్కలు సుమారు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు ఎదిగాయి.రసాయన ఎరువులు వాడి పసుపు సాగు చేస్తున్న రైతులతో సమానంగా లేదా.. అంతకన్నా ఎక్కువ దిగుబడి సాధిస్తానని ఆయన ధీమాగా చెప్పారు. పసుపు, చేమ రెండూ దుంప జాతులే అయినా అవి దేనికి కావాల్సిన పోషకాలు అదే తీసుకుంటుందన్నారు. పంటకు కావాల్సిన ఏ పోషకాలైనా పచ్చిరొట్ట ఎరువు ద్వారా సంపూర్తిగా అందించవచ్చు.

పందిరి కూరగాయల సాగులో కూడా ఇదే విధంగా పచ్చిరొట్ట అదే గ్రీన్ మెన్యూర్ ఉలవలు, పెసలు, పిల్లిపెసర లాంటివి పెంచుకోవచ్చు. తీగ.జాతి కూరగాయ పాదులు పైకి వెళ్లిపోతాయి. కింద ఉన్న గ్రీన్ మెన్యూర్‌ మొక్కలు వాటి జీవితకాలం అవగానే చనిపోయి, భూమికి సారాన్నిస్తాయి. దీంతో ప్రధాన పంటల దిగుబడులు బాగా పెరుగుతాయి. మొక్క కాండం చనిపోయినప్పుడు మెత్తగా అయ్యే ఏ గ్రీన్‌ మెన్యూర్‌ను అయినా నిర్భయంగా పెంచుకోవచ్చంటారు శ్రీనివాస్‌రెడ్డి. పచ్చిరొట్ట మొక్కలతో భూమిని కప్పి ఉంచితే.. మంచి బ్యాక్టీరియాలు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఎలాంటి నేలలో అయినా పచ్చిరొట్ట వేయొచ్చన్నారు. భూమికి సహజసిద్ధమైన ఆహారాన్ని అందిస్తే.. ఏ పంట వేసినా తెగుళ్ల బాధ ఉండదు.

మరిన్ని వివరాలు కావాలంటే శ్రీనివాస్‌రెడ్డిని 9866339832 నెంబర్‌లో సంప్రదించవచ్చు.