వంకాయపైన, దాని కూర రుచిపైన ఎన్నో పాటలు, సామెతలు ఉన్నాయి. ‘గుత్తి వంకాయ కూరోయ్‌ బావా.. కోరి వండినానోయ్‌ బావా’ బసవరాజు అప్పారావు రాసిన ఈ పాట పూర్వకాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పక్కర్లేదు. ‘వంకాయ కూర’కు సాటి మరొకటి లేదని చెబుతుంటారు పెద్దలు. రుచితో పాటు ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, మనకు అవసరమైన ఎన్నో కీలక ఫైటో పోషకాలు వంకాయలో బాగా ఉంటాయి. వంకాయ యాంటీ ఆక్సిడెంట్‌ గా పనిచేస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ కణాలు దెబ్బతినకుండా నిరోధించి క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. ఛక్కెర వ్యాధి నివారణలో వైలెట్‌ రంగు వంకాయ ఎంతగానో పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే.. వంకాయ సాగుచేసి అధిక ఆదాయం, లాభాలు గడిస్తున్న రైతు గురించి, ఆయన వంగసాగు ఎలా చేస్తున్నాడో తెలుసుకుందాం. స్టీవెన్‌ రెడ్డి.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం శౌరిపూర్‌ లో విజయవంతమైన వంగ రైతుగా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు ఐదు ఎకరాల భూమిలో వంగసాగు చేస్తున్నారు. వంగ సాగులో అత్యద్భుతమైన ఫలితాలు సాధించే అతి కొద్ది మంది రైతుల్లో స్టీవెన్‌ రెడ్డి ఒకరు. వంగ సాగులో స్టీవెన్ రెడ్డి ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం ఆయన చేసిన ప్రయోగమే అంటారు. వంగ మొక్కల్ని అంటు కట్టడం స్టీవెన్‌ రెడ్డి చేసిన సక్సెస్‌ ఫుల్‌ ప్రయోగం. తద్వారా స్టీవెన్‌ రెడ్డి అత్యధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. స్టీవెన్‌ రెడ్డి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.ఐదు ఎకరాల పొలంలో స్టీవెన్‌ రెడ్డి మూడు రకాల వంగ పంటలు సాగుచేశారు. వంగసాగులో ఆధునిక పద్ధతి అనుసరించిన స్టీవెన్ రెడ్డి తొలి ప్రయత్నంలో 150 నుంచి 170 టన్నుల దాకా దిగిబడి రాబట్టారు. కిలో వంకాయలు సగటున 20 నుంచి 30 రూపాయలు ధర పలికినా సుమారు 40 లక్షల దాకా ఆదాయం వచ్చిందని రైతు చెప్పాడు. ఐదు ఎకరాల్లో వంకాయ సాగు కోసం 10 లక్షల దాకా ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. అంటే స్టీవెన్‌ రెడ్డికి ఖర్చులు పోగా 20 నుంచి 30 లక్షల దాకా లాభం వచ్చిందని అర్థం అవుతోంది.వ్యవసాయంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న స్టీవెన్ రెడ్డి ప్రతి మూడు నాలుగేళ్లకోసారి తప్పకుండా వంకాయ సాగు చేస్తున్నట్లు తెలిపాడు. ఛత్తీస్‌ గఢ్‌ లో వంగలో అంటుకట్టే విధానం చూసి తాను కూడా అదే విధానం అవలంబించినట్లు వెల్లడించాడు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వంగనారు తీసుకొచ్చినట్లు స్టీవెన్‌ రెడ్డి తెలిపాడు. పొడవుగా ఉండే వంకాయ అంకుర్‌ సంస్థ వారి ‘నితిష్‌’, ‘కీర్తి’, రాసి కంపెనీ వారి ‘నానో’ రకాలను తాను సాగుచేసినట్లు చెప్పాడు, జులై నెలలో వంగ విత్తనం నాటినట్లు స్టీవెన్ రెడ్డి తెలిపాడు.అంటు కట్టడం వల్ల ఎలాంటి వర్షాలు, ఎక్కువ వర్షాలు కురిసినా వంగ మొక్క పెరుగుదలకు ఎలాంటి ఆటంకమూ ఉండదని, ఏపుగా ఎదుగుతుందని స్టీవెన్‌ రెడ్డి వివరించాడు. అదే సాధారణ రకం వంగ మొక్కలైతే.. వర్షాలను తట్టుకోలేవని, మొక్కలు కూడా చిన్నగా అయిపోయేవని, పూత రాలిపోయేదని, మొక్కలు కుళ్లిపోయేవని చెప్పాడు. అంటు కట్టడం ద్వారా ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని స్టీవెన్ రెడ్డి పేర్కొన్నాడు. మన ప్రాంతంలో ఏ వెరైటీ వంకాయలకు డిమాండ్‌ ఉందో చూసుకుని, ఆ విత్తనాలు అంటు కట్టుకోవాలన్నాడు. అడివి వంగ అనే చిన్న కాయలు ఉండే రకం చాలా రోజులు బ్రతుకుతుందని, దాని వేరుకు మనం ఎంపిక చేసుకున్న రకం మొక్కను అంటు కట్టాలని వెల్లడించాడు. మనం వంగతోట పెట్టాలనుకునే సమయానికి రెండు ముందుగా ఇలా అంటు కట్టుకోవాలన్నాడు. మనకు ఎన్ని మొక్కలు కావాలో చెప్పి అన్ని మొక్కలకు విత్తనాలు పంపించి, డబ్బులు వేస్తే.. కుప్పం రైతులు మనకు అంటుకట్టిన మొక్కల్ని అందజేస్తారని స్టీవెన్‌ రెడ్డి చెప్పాడు. ఒక్కో మొక్కను అంటు కట్టేందుకు కుప్పం రైతులు ఆరు రూపాయలు తీసుకుంటారని, రవాణా ఖర్చు రెండు రూపాయల వరకు అవుతుందన్నాడు. వంద రూపాయలకే సుమారు వెయ్యి విత్తనాలు ఉండే ఒక ప్యాకెట్‌ వస్తుందన్నాడు.ఒక ఎకరంలో రెండు వేల అంటు కట్టిన వంగ మొక్కలు నాటుకోవచ్చని స్టీవెన్ రెడ్డి తెలిపాడు. వంగతోటలో తీగ పందిరి వేసుకుంటే.. ప్రతి మొక్క కొమ్మను దారంతో పైకి లేపి కట్టుకుంటే.. క్రిమిసంహారకాలు స్ప్రే చేయడం, వంకాయలు కోసుకోవడం సులువుగా ఉంటుందని చెప్పాడు. దారం కట్టడం వల్ల పంట దిగుబడి కూడా ఎక్కువ ఉండే అవకాశాలున్నాయన్నాడు. వంగ మొక్కల్ని సాలుకు సాలుకు మధ్య తాము ఏడున్నర అడుగుల దూరం పెట్టినట్లు తెలిపాడు. మొక్కల మధ్య రెండు అడుగుల దూరం పెట్టామన్నాడు. ఎకరంలో రెండు మొక్కలు నాటుకుంటే ఒక్కో మొక్కకు అంటు కట్టడం నుంచి రవాణా వరకు 8 రూపాయల చొప్పున మొత్తం 16 వేలు ఖర్చవుతుందని స్టీవెన్ రెడ్డి చెప్పాడు. వంగ తోటలో మల్చింగ్‌ వేసుకుని, డ్రిప్‌ ఏర్పాటు చేసుకుంటే మేలని తెలిపాడు.అంటుకట్టిన వంగ మొక్కలు నాటిన రెండు నెలల నుంచి పంట కోతకు వస్తుందని స్టీవెన్‌ రెడ్డి పేర్కొన్నాడు. అలా ఐదు నెలల పాటు ఐదు రోజులకు వకసారి వంగ దిగుబడి వస్తూనే ఉంటుందన్నాడు. జూన్‌ లో మొక్కలు నాటితే.. ఆగస్టు నుంచే కోత వచ్చిందన్నాడు. స్టీవెన్ రెడ్డి తన ఐదెకరాల వంగతోటలో రోజుకు సగటున మూడు టన్నుల పంట కోస్తున్నట్లు చెప్పాడు. మార్కెట్లో కిలో వంకాయలకు 25 రూపాయలు ధర పలుకుతోందన్నాడు. తక్కువ ధర అంటే కొద్ది రోజులు 8 రూపాయలకు, అత్యధికంగా 60 రూపాయలు కూడా అమ్మినట్లు తెలిపాడు. వంకాయలను హైదరాబాద్‌ బోయిన్‌ పట్టి హోల్‌ సేల్‌ మార్కెట్లోని రెండు దుకాణాలకు తాము విక్రయిస్తామని స్టీవెన్ రెడ్డి చెప్పాడు. తమ గ్రామం నుంచి కిలోకు ఒక రూపాయి చొప్పున రవాణా ఖర్చుగా తీసుకుంటారన్నాడు.అంతకు ముందు తాను సాధారణ వంకాయ సాగు చేసినప్పుడు 18 నుంచి 20 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చేదన్నాడు. వర్షాలు వస్తే ఆ మొక్కలు చచ్చి బతికేవన్నాడు. అదే అంటుకట్టి వంగ వల్ల దిగుబడి పెరిగిందని, క్వాలిటీ కూడా బాగా ఎక్కువైందన్నాడు. అంటుకట్టిన వంగమొక్క వేరు చాలా దూరం వెళ్తుందని, తద్వారా పోషకాలను బాగా తీసుకుందని, దాంతో మొక్క బలంగా.. ఏపుగా ఎదగడం వల్ల దిగుబడి ఎక్కువైందని చెప్పాడు. అంటు వంగ మొక్క నాటుకునే ప్రతిసారీ ముందుగా భూమిలో ఎరువుగా పేడ తప్పకుండా వాడతామని అన్నాడు. అంటు వంగమొక్కు కూడా సాధారణ వంగకు వచ్చిన తెగుళ్లు, దోమలు, పురుగులే వస్తాయన్నాడు. అంటు వంగతో మరో ప్రయోజనం కూడా ఉందని స్టీవెన్ రెడ్డి తెలిపాడు. ఒకవేళ వంకాయకు రేటు పడిపోతే.. మొక్కట్ని కట్‌ చేసేస్తే మళ్లీ చిగురించి కొత్తగా పంట ఇస్తాయన్నాడు. అంటే.. మళ్లీ విత్తనం పెట్టాల్సిన అవసరం ఉండదన్నాడు. అలా మూడు నాలుగు సార్లు కూడా మొక్కను కత్తిరించుకోవచ్చన్నాడు. కత్తిరించిన ప్రతిసారి స్ప్రే చేసుకుంటే మళ్లీ కొత్తగా పంట కుడా తొందరగా వస్తుందన్నాడు. వేరు వ్యవస్థ భూమిలోనే పటిష్టంగా ఉంది కాబట్టి నెలరోజుల్లోనే కొత్త పంట వచ్చేస్తుందన్నాడు. దాంతో పెట్టుబడి కూడా కొంత తగ్గిపోతుందని వివరించాడు. అంటు వంగ సాగులో తాను చూసినంత ఫలితం మరే ఇతర సాగులోనూ తాను పొందలేదని స్టీవెన్ రెడ్డి వెల్లడించాడు.అంటు వంగ సాగును చూసేందుకు ఆసక్తితో అనేక మంది రైతులు తమ క్షేత్రానికి వస్తున్నారని స్టీవెన్ రెడ్డి చెప్పాడు. వ్యవసాయ అధికారులు, రాజకీయ నేతలు కూడా వస్తుంటారన్నాడు. మాజీ మంత్రి ఆర్. దామోదర్‌ రెడ్డి తన సాగు విధానం చూసి తన పొలం 25 ఎకరాల్లో అంటుకట్టే వంగ సాగు చేశారన్నాడు. ఖర్చు ఎక్కువే అయినా ఆదాయం, లాభాలు బాగా ఉన్నందున తాను ఇకపై మొక్కల అంటుకట్టే సాగు విధానాన్నే అసుసరిస్తానని స్టీవెన్‌ రెడ్డి చెప్పాడు. ఎంతగా వర్షాలు కురిసినా.. ఎన్ని తుపానులు వచ్చినా తట్టుకునే శక్తి అంటు వంగలో ఉందని స్పష్టంచేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here