గ్యాక్‌ ఫ్రూట్‌ అంటే అడవి కాకర. ఎంతో ప్రాముఖ్య ఉన్న ఈ గ్యాక్ ఫ్రూట్‌ను వియత్నాం దేశంలో ‘హెవెన్‌ ఫ్రూట్‌’ అంటారు. వియత్నాం, మలేసియా, థాయ్‌లాండ్‌లో ఈ పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఇప్పుడిప్పుడే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో, కేరళలోని కాసర్‌గోడ్‌, కోజికోడ్‌, మంగళపురం జిల్లాల్లో కూడా పండిస్తున్నారు. గ్యాక్‌ పండులో ఉండే అనేక ఆరోగ్య రక్షణ అంశాల కారణంగా అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది. కిలో గ్యాక్‌ పండ్ల ధర సుమారు వెయ్యి రూపాయలు పలుకుతుంది. గ్యాక్ పండు పక్వానికి వచ్చే ముందు నాలుగు రంగుల్లోకి మారుతుంది. చక్కని ఎరుపురంగులోకి మారినప్పుడే ఈ పండును కోసుకోవాలి. గ్యాక్‌ పండు మొక్కల్లో ఆడ, మగ రకాలు ఉంటాయి. ఈ మొక్కలను పక్కపక్కనే నాటుకోవాలి. చేతితో పరాగ సంపర్కం చేసినప్పుడు మంచి దిగుబడి ఇస్తాయని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు. గ్యాక్‌ పండుకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? ఔషధ గుణాలేమిటి? దీన్ని ఎలా సాగుచేస్తారనే విషయాలు తెలుసుకుందాం.గ్యాక్‌ ఫ్రూట్‌లో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను మన దరికి చేరకుండా కాపాడుతుంది. దీంట్లో బీటా కెరోటిన్‌, లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మగవారిలో వచ్చే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. లైకోపీన్‌ వయస్సు సంబంధ మాక్కూలా డీజెనరేషన్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనుషుల చర్మాన్ని గట్టి పరిచి, యవ్వనాన్ని కాపాడుతుంది. దీంట్లో విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయి. గ్యాక్‌ఫ్రూట్‌లో ఏ, సీ, ఈ, బీ 6, ఫోలేట్‌, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ లాంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి. గ్యాక్ ఫ్రూట్‌లో ఉన్న సీ విటమిన్‌ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలోని ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గ్యాక్‌ ఫ్రూట్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తీసుకోవచ్చు. వియత్నాం, చైనా దేశాలలో సంప్రదాయ వైద్య విధానంలో గ్యాక్ ఫ్రూట్‌ జ్యూస్‌ను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని బ్యూటీ పార్లర్ల వారు క్రమం తప్పకుండా గ్యాక్‌ ఫ్రూట్‌ కొనుగోలు చేస్తున్నారని వెంకట్‌ చెప్పారు. దీని విలువ తెలిసిన వారు ఖరీదు ఎంతయినా కొంటున్నారన్నారు.రోజురోజుకూ కొత్త కొత్త ఆలోచనలతో పలువురు యువరైతులు వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు. విదేశాల్లో పండే పంటలను మన దేశానికి తీసుకొచ్చి విజయవంతం అవుతున్నారు. రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్యాక్‌ పంట సాగుకు పెద్దగా అవసరం లేదు. ఇంటి ఆవరణలో కాస్త ఖాళీ స్తలం ఉంటే చాలు లక్షలాది ఆదాయం పొందవచ్చు. ఖాళీ స్థలం లేకపోతే టెర్రస్‌పైన కూడా సులువుగా సాగు చేయొచ్చు. గ్యాక్‌ ఫ్రూట్‌ సాగుచేస్తున్న యువరైతు వెంకట్‌ ఏలూరు జిల్లా పోలవరం మండలం మామిదిగొంది గ్రామంలో ఆదర్శరైతుగా పేరుతెచ్చుకున్నారు. కేరళ నుంచి వెంకట్‌ 300 మొక్కలు తీసుకొచ్చి తమ ఇంటి ఆవరణలోని వెయ్యి గజాల స్థలంలో సాగుచేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గ్యాక్‌ ఫ్రూట్‌ తీగజాతి మొక్క కాబట్టి పందిరి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గ్యాక్‌ ఫ్రూట్‌ను తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా తొలిసారిగా వెంకట్‌ సాగుచేస్తున్నారు. ఇంతవరకు దీన్ని ఇంటి వినియోగం కోసం అక్కడక్కడా ఒకటి రెండు మొక్కలు పెంచుకుని ఉంటే ఉండవచ్చు. గ్యాక్‌ ఫ్రూట్‌ పచ్చిగా ఉన్నప్పుడు కూరగా కూడా వినియోగించవచ్చని వెంకట్‌ తెలిపారు. ఇది 365 రోజులూ కాపు వచ్చే పంట అన్నారు.వెంకట్‌ తండ్రి వ్యవసాయదారుడే. సాధారణ పంటల పండించిన ఆయనకు పెద్దగా ఆదాయం వచ్చింది లేదు. దీంతో కొత్తరకం పంట సాగుచేయాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు.  ఎగ్జోటిక్‌ ఫార్మింగ్‌ చేస్తే వాణిజ్య పరంగా ఫలితం ఉంటుందని గ్యాక్‌ ఫ్యూట్‌ సాగు ప్రారంభించినట్లు చెప్పారు. రెండు ఫిమేల్‌ మొక్కలకు ఒక మేల్‌ మొక్క నాటాలన్నారు.  తద్వారా పరపరాగ సంపర్కం సులువుగా ఉంటుందని వెంకట్ చెప్పారు. సహజసిద్ధంగా తేనెటీగలు, మిత్ర పురుగుల ద్వారా జరిగే పాలినేషన్‌ కన్నా చేతులతో పాలినేషన్ చేస్తే దిగుబడి మరింత ఎక్కువ వస్తున్నట్లు వివరించారు. గ్యాక్‌ ఫ్రూట్‌ కాయ కాస్త పెద్దదైన తర్వాత పందిరి నుంచి కిందికి వేలాడేలా చేసుకోవాలన్నారు. ఒక్కో ఫ్రూట్‌ అర కిలో నుంచి కిలో బరువు మధ్యలో ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా పాదు పాకే పందిరిని కాస్త బలిష్టంగా వేసుకోవాలని తెలిపారు. గ్యాక్‌ ఫ్రూట్ సాగు విధానాలు మలేసియా, థాయ్‌లాండ్‌ వాళ్ళు ఇంగ్లీషులో అనేక వీడియోలు పెట్టారని చెప్పారు.

ఒక్కో గ్యాక్‌ ఫ్రూట్ మొక్క ఖరీదు రూ.300 వందలు పడుతుంది. వెంకట్‌ తయారు చేసిన ఒక్కో మొక్కను రూ.200 కు ఇస్తున్నట్లు చెప్పారు. ఎకరం నేలలో 1000 మొక్కలు నాటుకోవచ్చన్నారు. మొక్కలు నాటిన రెండో సంవత్సరం నుంచి ఒక్కో మొక్క దాదాపు 100 నుంచి 200 కాయలు దిగుబడి ఇస్తుందన్నారు. గ్యాక్‌ ఫ్రూట్ ధర మార్కెట్‌లో కిలోకు వెయ్యి నుంచి రూ.1500 వరకు పలుకుతోందని చెప్పారు. రెండో ఏట నుంచి ఒక్కో మొక్క నుంచి కనీసం 10 వేలు ఆదాయం ఉంటుంది. ఎకరం భూమిలో వెయ్యి మొక్కలు నాటితే కోటి రూపాయలు ఆదాయం లభిస్తుందని వెంకట్‌ వెల్లడించారు. స్థానిక మార్కెట్‌లో తాను కిలో గ్యాక్ ఫ్రూట్‌ను రూ.500కే ఇస్తున్నానన్నారు.నాటిన నాలుగు లేదా ఐదో నెల నుంచి మేల్‌, ఫిమేల్‌ మొక్కల నుంచి పూత మొదలవుతుంది.  మేల్ ఫిమేల్ పువ్వులను చేతితో పాలినేషన్ చేస్తే వారం రోజుల్లో కాయ తయారవడం ప్రారంభం అవుతుంది. నెల రోజులకు కాయ పచ్చరంగులో తయారవుతుంది. తర్వాత అది పసుపు రంగులోకి ఆ తర్వాత ఆరెంజ్‌ కలర్‌లోకి మారుతుంది. ఆ తర్వాత రెండు నెలలకు గ్యాక్‌ ఫ్రూట్‌ పూర్తిగా ఎరుపురంగులోకి వచ్చి, ముగ్గినప్పుడు మామిడి పండు ఎలా మెత్తగా అవుతుందో అలా అవుతుంది. అప్పుడు గ్యాక్‌ ఫ్రూట్‌ కోసుకోవాలని వెంకట్‌ వివరించారు.

గ్యాక్ ఫ్రూట్ జ్యూస్‌ చేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది. దీని రుచి కుకుంబర్‌- అవకాడో టేస్ట్‌లో ఉంటుంది. దీనికి నిమ్మరసం కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది. పండు లోపలి గుజ్జు మాత్రమే వినియోగించాలి. పైన తొక్కను వినియోగించకూడదు. పచ్చగా, పసుపు రంగుల్లో ఉన్నప్పుడు దీన్ని ఆగాకరకాయ కూర చేసుకున్నట్లే దీన్ని కూడా కూర వండుకుంటే రుచిగా ఉంటుంది. దీనికి చికెన్‌ గానీ, పచ్చి రొయ్యలు కూడా వేసుకుని వండుకోవచ్చన్నారు. విదేశాల్లో గ్యాక్‌ ఫ్రూట్‌ను ఐస్‌క్రీమ్‌లు, సబ్బులు, షాంపూల తయారీలో వాడుతున్నారు. గ్యాక్ ఫ్రూట్ నుంచి తయారుచేసే ఆయిల్‌ తయారు చేస్తున్నారు. బ్యూటీ పార్లర్లలో ఫేషియల్ కోసం వినియోగిస్తున్నారు. గ్యాక్ ఫ్రూట్‌ బై ప్రోడక్ట్స్‌ మన దేశంలో ఇంకా తయారు చేయడం లేదు కాబట్టి పండించిన రైతులు దీన్ని పండుగా మాత్రమే అమ్ముకోవాల్సి ఉంటుంది. బై ప్రోడక్ట్స్‌ మొదలైతే దీనికి మరింత డిమాండ్ పెరుగుతుంది.తెలుగు రాష్ట్రాల వాతావరణం గ్యాక్ ఫ్రూట్‌ సాగుకు అనుకూలం అన్నారు వెంకట్‌. వర్షాకాంలో దీనికి నీటి సరఫరా అవసరం ఉండదని, శీతాకాలంలో మాత్రం వారానికి రెండు సార్లు, ఎండాకాలంలో రోజు విడిచి రోజు నీరు అందించాలన్నారు. గ్యాక్ ఫ్రూట్ మొక్కలను వర్షాకాలం, శీతాకాలంలో నాటుకుంటే ఎండాకాలం వచ్చేసరికి సర్వైవ్‌ అవుతుందన్నారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు గ్యాక్‌ ఫ్రూట్ మొక్క తట్టుకోగలుగుతుంది. అంతకు మించి ఉష్ణోగ్రత ఎక్కువ అయితే.. ఫ్రూట్ పైభాగంలో పందిరిపై ఆచ్ఛాదన వేసుకుంటే సరిపోతుందన్నారు.మొక్కకు మొక్కకు మధ్య 4 అడుగుల దూరం పెట్టుకోవాలి. అయితే.. తానుహై డెన్సిటీ విధానంలో మూడు అడుగుల దూరంలో మొక్కలు నాటినట్లు వెంకట్‌ చెప్పారు. ఒకసారి గ్యాక్‌ ఫ్రూట్ మొక్క నాటితే 25 నుంచి 30 సంవత్సరాలు బతికే ఉంటుంది. ఏడాది పొడవునా దిగుబడి ఇస్తూనే ఉంటుంది. మొక్క పెరిగిపోతున్న ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే పందిరి మాత్రం శాశ్వతంగా ఉండేలా బలిష్టంగా వేయాలన్నారు. గ్యాక్ ఫ్రూట్ ఫ్లవర్‌ను హ్యాండ్ పాలినేషన్ చేయడానికి ఒక వ్యక్తి సరిపోతారన్నారు. ఒకరు రోజుకు 50 పువ్వులకు పాలినేషన్ చేయొచ్చన్నారు. చాలా వరకు తేనెటీగలు, మిత్రపురుగులే పాలినేషన్ చేస్తాయన్నారు. ఎకరం గ్యాక్‌ ఫ్రూట్ తోటలో రెండు తేనెటీగల బాక్సులు పెట్టుకుంటే సరిపోతుందన్నారు. వెంకట్‌ అయితే.. గ్యాక్‌ ఫ్రూట్ సాగును సహజసిద్ధంగా అంటే ఆర్గానిక్‌ విధానంలో చేస్తున్నారు. మొక్క మొదళ్లలో నెలకు రెండుసార్లు వర్మీ కంపోస్ట్ వేస్తే సరిపోతుందన్నారు. ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే ఆర్గానిక్‌ విధానంలో తయారు చేసిన ద్రావణాలు స్ప్రే చేయొచ్చన్నారు. శీతాకాలంలో గ్యాక్ ఫ్రూట్‌కు కాస్త గాలి కూడా వెళ్లేలా నెట్ సంచి వేసుకోవాలి. ఫ్రూట్‌కు గాలి ఆడకపోతే చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. నెట్‌ సంచి తొడగకపోతే పురుగులు పాకే, పక్షులు పాడుచేసి అవకాశం ఉంటుందన్నారు. శీతాకాలంలో గ్యాక్‌ ఫ్రూట్ మొక్కకు పురుగు వచ్చే అవకాశం ఉంటుందని, ఆర్గానిక్ ద్రావణం స్ప్రేచేస్తే చాలన్నారు.