మొక్కలకు తగినంత మోతాదులో కాల్షియం అందిస్తే.. అవి ఆక్సిజన్‌ను బాగా తీసుకోగలుగుతాయి. మొక్కల ఎదుగుదల చక్కగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు అవసరమైన పోషకాలు అందించి, చీమలు, దోమలను వాటి దరిచేరనివ్వని పెస్టిసైడ్‌, ఫంగిసైడ్‌ గురించి తెలుసుకుందాం.రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి తీసుకొని రెండు లీటర్ల నీటిలో కలపాలి. దానికి అర టీస్పూను పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు నుంచి ఐదు నిమిషాల పాటు స్టౌ మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు మరిగేటప్పపుడు దాల్చినచెక్క పొడిలోని సల్ఫర్‌, ఘాటు నీటిలోకి బాగా దిగుతుంది. నీళ్ల రంగు మారుతుంది. లిక్విడ్‌ ఘాటుగా తయారవుతుంది. మరిగిన ద్రావణం చల్లారిన తర్వాత పల్చని వస్త్రంలో పోసి వడకట్టుకోవాలి. వడకట్టిన లిక్విడ్‌ను స్ప్రే బాటిల్‌లోకి తీసుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవాలి.దాల్చినచెక్కపొడి, పసుపుతో మరిగించిన లిక్విడ్‌ను మొక్కలకు స్ప్రే చేస్తే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. ఈ లిక్విడ్‌ను అన్ని రకాల మొక్కలకు స్ప్రే చేయొచ్చు. దొండ, బీరపాదులకు దీన్ని స్ప్రే చేస్తే ఫలితం మరింత అధికంగా ఉంటుందని మిడ్డెతోట గార్డెనింగ్‌లో అనుభవజ్ఞురాలు అరుణ వెల్లడించారు. దాల్చినచెక్క పొడి ఘాటు కారణంగా మట్టిలో, తొట్టిలో, చెట్ల మీదకు పాకే చీమలు రాకుండా ఉంటాయి.చీమలు మరీ ఎక్కువగా ఉంటే ఒక స్పూన్‌ దాల్చినచెక్క పౌడర్‌ను మొక్క చుట్టూ నేరుగా వేసుకుంటే దాని ఘాగుకు అవి దరిదాపులకు కూడా రావు. దాల్చినచెక్కపొడిలో సల్ఫర్‌ ఎక్కువగా ఉంటుంది. దాల్చినచెక్క పొడి వేస్తే.. మొక్క వేళ్లు బాగా పెరుగుతాయి. మొక్క ఎదుగుదల బాగుంటుంది. చిగుళ్లు ఎక్కువగా వస్తాయి. చిగుళ్లు ఎక్కువ వచ్చాయంటే పూత కూడా బాగా వస్తుంది. మొక్కల మీద చీమలు ఉంటే తప్పకుండా మిల్లీబగ్స్‌ వస్తాయని అరుణ అన్నారు. మిల్లీ బగ్స్‌ వచ్చిన తర్వాత వాటి నివారణ కోసం తిప్పలు పడేకంటే.. అవి రాకుండా దాల్చినచెక్కపొడి చక్కగా పనిచేస్తుంది.మరో రకం ఫెర్టిలైజర్‌ గురించి తెలుసుకుందాం. అరటిపండు తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, ఒక డబ్బాలో వేసి, బియ్యం కడిగిన నీరు పోయాలి. దాంట్లో రెండు చెంచాల బెల్లం వేసుకోవాలి. చెక్కతో గానీ, ప్లాస్టిక్‌ పైపుతో కానీ బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టాలి. మరుసటి రోజు మళ్లీ బియ్యం కడిగిన నీళ్లను ఈ మిశ్రమంలో పోసుకోవాలి. మళ్లీ అరటిపళ్ల తొక్కల ముక్కల్ని కూడా కలపాలి. ఇలా మూడు రోజుల పాటు బియ్యం కడిగిన నీళ్లు, అరటిపళ్ల తొక్కల ముక్యలు, బెల్లం కలుపుకోవాలి. మూడు రోజుల తర్వాత వీటిని ఒకసారి బాగా కలాపాలి. తర్వాత పల్చని వస్త్రంతో కానీ, నెట్‌ బ్యాగ్‌తో కానీ వడకట్టుకోవాలి. వడకట్టిన ద్రావణానికి ఒక లీటర్‌కి రెండు లీటర్ల చొప్పున నీళ్లు జతచేయాలి. ఇలా తయారైన అరటితొక్కల మిశ్రమం ద్రావణంలో పొటాషియంతో పాటు మొక్కలకు ఎంతో అవసరమైన కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. మొక్క వేళ్లు బాగా పెరగడానికి, ఆక్సిజన్‌ సమృద్ధిగా లభించడానికి కాల్షియం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ద్రావణాన్ని మొక్కలకు వారానికి ఒకసారి కానీ, పది రోజులకు ఒకసారి గానీ వేసుకుంటే సరిపోతుంది.అరటితొక్కల మిశ్రమ ద్రావణం టమాటా మొక్కలకు వేస్తే మరింత ఆరోగ్యంగా ఎదుగుతాయి. అదే మోతాదులో దిగుబడి కూడా వస్తుంది. అరటితొక్కల ద్రావణాన్ని అన్ని రకాల కూరగాయ మొక్కలు, పూలు, పండ్ల మొక్కలకు వేస్తే చక్కని దిగుబడులు అందిస్తుంది. ఈ మిశ్రమ ద్రావణం ద్వారా మొక్కలకు మెగ్నీషియం బాగా అందుతుంది. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు, పండ్లు, కాయలు ఎదుగుతున్న సమయంలో ఈ లిక్విడ్ వేస్తే మరింత బలంగా, ఆరోగ్యంగా ఎదుగుతాయని అరుణ చెప్పారు. పూత రాలిపోకుండా నిలబడుతుంది. ఎక్కువ సంఖ్యలో పువ్వులు కాయలుగా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల్లో మెటబాలిజాన్ని బాగా పెంచుతుంది. మనం ఇచ్చే పోషకాలను నూరుశాతం తీసుకోవడానికి మెగ్నీషియం సహాయ పడుతుంది. అరటి తొక్కల మిశ్రమ ద్రావణంలో పొటాసియం, మెగ్నీషియం మాత్రమే కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి.కిచెన్‌ వేస్ట్‌, గార్డెన్ వేస్టేజ్‌తో కంపోస్ట్‌ ఎరువు తయారు చేసి, బ్యాగుల్లో నింపి, వాటిలో నాటిన మొక్కలకు పైన చెప్పిన రెండు రకాల మిశ్రమ ద్రావణాలు అందిస్తే.. ఫలితాలు బాగా ఎక్కువగా వస్తాయి. మిద్దెతోట ఎంతో ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఎదుగుతుంది. కూరగాయలు, పూలు, పండ్లు చక్కగా తయారవుతాయి. ఇలాంటి లిక్విడ్‌లను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మొక్కలకు ఇచ్చుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది.